AUCHITHYAM | Volume-5 | Issue-11 | October 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
7. వరకవి సిద్ధప్ప: తత్త్వకవిత

సంగెం పరమేశ
తెలుగు అధ్యాపకులు,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఏలూరు,
ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9705167356, Email: paramesha11dlt@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 20.09.2024 ఎంపిక (D.O.A): 30.09.2024 ప్రచురణ (D.O.P): 01.10.2024
వ్యాససంగ్రహం:
తెలుగులో చాలాకాలంపాటు తత్త్వసాహిత్యం అంటరానిదిగానే ఉండిపోయింది. సాహిత్యచరిత్రకారులు 1775 నుండి 1875 వరకుగల కాలాన్ని క్షీణయుగం అని, చీకటియుగం అని పిలిచారు. మార్గకవిత్వం లేదా లిఖిత సాహిత్యాన్ని మాత్రమే మనవాళ్ళు సాహిత్యంగా పరిగణించారు. అందుకే వేమన తరువాత మన సాహిత్యకారులు గురజాడనే కవిగా గుర్తించారు. వీరిరువురి మధ్య విస్తరించిన కాలమంతా చీకటేనా? ఈ మధ్యకాలంలో వెలువడిన నోటి సాహిత్యం, మౌఖికసాహిత్యం మాటేమిటి? తత్త్వకవులు మతం, కులం, విగ్రహారాధనను నిరసించారు. అంతకు ముందరి కావ్య, ప్రబంధయుగంలో కనిపించని సామాజిక సంబంధాలు, కులవృత్తులు, శ్రమజీవన సౌందర్యం మొదటిసారిగా ఈ తత్త్వ సంప్రదాయంలో కనిపించింది. ప్రజల సాంఘిక జీవితాన్ని చిత్రించిన మొదటి సాహిత్యం తత్త్వసాహిత్యమేనంటే అతిశయోక్తికాదు. కీర్తనలు, భజనలు, పదాలు, ద్విపదలు, కందార్థాలు... ఎన్నో రూపాలలో ఆయా కాలాల ప్రజాజీవితం ఆవిష్కృతమైంది. ఈ కాలంలో కవి రాజాస్థానాలను విడిచిపెట్టి ప్రజలలో ఒకడిగానే జీవించాడు. తన కులవృత్తిని తాను చేసుకుంటూనే జీవన తత్త్వాలను పాడి ప్రజలను చైతన్యపరిచాడు. తత్త్వకవులు పరాన్నజీవులు కాదు. స్వతంత్రకవులు. శ్రమ విలువ తెలిసినవారు. ఈ కోవలో తెలంగాణలో ‘దాస’ సాహిత్యం అంటే దున్న ఇద్దాసు, జొన్న ఎల్లదాసు, వేపూరి హనుమద్దాసులాంటివారి సాహిత్యంతోపాటు రామసింహకవి, వరకవి సిద్ధప్పలాంటి తత్త్వకవులు ఆనాటి సమాజ చిత్రాన్ని తమ సాహిత్యంలో ప్రతిబింబింపజేశారు. వారిలో ఆకాశమంత పేరెన్నికగన్న తాత్త్విక కవి ‘వరకవి సిద్ధప్ప’. నిజాం కాలంలో ఊరూర వెలసిన భజన మండళ్లలో సిద్ధప్ప కవి పద్యాలు, కీర్తనలు, భక్తిపాటలు మారుమ్రోగేవి. మన తాతాల కాలంనాటి ప్రజల జీవనసరళి, ఆలోచనారీతి, జీవిత తాత్త్వికతకు సిద్ధప్ప కవి అక్షరాల ప్రతినిధి. ‘వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప/కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప’ మకుటంతో నాలుగు భాగాలలో ‘జ్ఞానబోధిని’ రాశాడు. వారి కవిత్వంలోని తాత్త్వికతను పరిచయం చేయడమే ఈ వ్యాస ఉద్దేశ్యం. ఈ వ్యాసంలో 1. ఉపోద్ఘాతం 2. జ్ఞానబోధన 3. కాల భవిష్యత్ 4. వైరాగ్యబోధన 5. నిజాం ప్రశంస 6. భజన కీర్తనలు మొదలైన ఉపశీర్షిలుంటాయి. ఇందులో విశ్లేషణ పద్ధతిని పాటించడం జరిగింది. ఈ వ్యాసంలో 1. ఉపోద్ఘాతం 2. జ్ఞానబోధన 3. కాలభవిష్యత్ 4. వైరాగ్యబోధన 5. నిజాం ప్రశంస 6. భజన కీర్తనలు 7. దేశభక్తి మొదలైన ఉపశీర్షిలుంటాయి. ఇందులో విశ్లేషణ పద్ధతిని పాటించడం జరిగింది.
Keywords: ణయుగం, లిఖిత సాహిత్యం, నోటి సాహిత్యం, వరకవి సిద్ధప్ప, తాత్త్వికత, జ్ఞానబోధ, వైరాగ్యం, భజనలు, కాలజ్ఞానం, ప్రజాజీవితం.
1. ఉపోద్ఘాతం:
వరకవి సిద్ధప్పగా ప్రసిద్ధిగాంచిన అనంతవరం సిద్ధప్ప తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా, కోహెడ మండలంలోని గుండారెడ్డిపల్లి అనే చిన్న గ్రామంలో కుమ్మరి కులానికి చెందిన అనంతవరం లక్ష్మమ్మ, పెదరాజయ్యలకు 1903లో జన్మించారు. నైజాం కాలంలో ఉర్దూ మీడియంలో సాత్విజమాత్ (7వ తరగతి) వరకు చదువుకున్నారు. వీరికి ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్ భాషలు తెలుసు. కొంతకాలం సేద్యం చేశారు. తన కులవృత్తి అయిన కుమ్మరి వృత్తిని మాత్రం విడిచిపెట్టలేదు. వాస్తుశాస్త్రము, నాడీ లక్షణము, జలస్తంభనలాంటి విద్యలను సాధించారు. యోగ విద్యను అభ్యసించారు. పలు ఆసనాలన వేసేవారు. శనిగరం చెరువులో ఒక సంవత్సరం పాటు జలస్తంభన చేశారు. ఆయుర్వేద మందులు కూడా తయారు చేసేవారు. రోగులకు ఉచితంగా వైద్యం చేసేవారు. జ్యోతిష్యంతో పరిచయం ఉండడం వలన పలు శుభకార్యాలకు ముహూర్తాలు నిర్ణయించేవారు. సామాన్య ప్రజల్లో ఉండే మానసిక ఆందోళలనలను తొలగించడానికి నాలుగు మంచి మాటలు చెప్పి ప్రజలకు సాంత్వన కలిగించేవారు. నైజాం ప్రభుత్వంలో ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులుగా చింతకుంట, ఎలగందుల, చెన్నూరు, ధర్మపురి వంటి గ్రామల్లో సుమారు 25 సంవత్సరాలు పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. వీరు ఉద్యోగంలో ఉన్న కాలంలోనే తెలంగాణలో గాంధేయ స్వాతంత్య్రోద్యమ వాయువులు వీచడం మొదలైంది. హిందూ ముస్లిం వివాదాలు కూడా ప్రారంభమయ్యాయి. రూమీ టోపి ధరించి ఉద్యోగం చేస్తోన్న వీరు గాంధీ టోపి ధరించి ఉద్యోగం చేసినందుకు పలు ఇబ్బందులు ఎదుర్కున్నారు. అయినా వీరు స్వాతంత్య్రోద్యమాన్ని, గాంధేయ సిద్ధాంతాన్ని బలపరుస్తూ ఉద్యోగ జీవితాన్ని కొనసాగించారు.
వరకవి సిద్ధప్ప తన 15వ ఏటనే ‘జ్ఞానబోధిని’ పేరుతో నాలుగు భాగాలు సీస పద్యాలు రచించడం విశేషమే. జ్ఞానబోధిని మొదటి భాగo 1918లో వెలువడింది. వీరు సుమారు 23 గ్రంథాలను రచించారు. అవి. 1. సిద్ధప్ప వరకవి జ్ఞానబోధిని (నాలుగు భాగాలు) 2. శ్రీ జీవనరేంద్ర (నాటకం) 3. శ్రీగాంధీ మహాత్మ (యక్షగానం) 4. కాకిహంసోపాఖ్యానం 5. ఆత్మ ప్రపంచ విలక్షణం 6. శ్రీప్రసిద్ధ బోధిని 7. శ్రీబిక్కనవోలు కందార్థాలు 8. శ్రీశివస్తుతి (రెండు భాగాలు) 9. శ్రీభక్తాంజనేయ (వర్ణమాల) 10. శ్రీరామ భజనావళి (వర్ణమాల) 11. శ్రీలక్ష్మీనరసింహస్వామి (వర్ణమాల) 12. శ్రీవిష్ణుస్తుతి 13. శ్రీభారతీ నక్షత్రమాల 14. బాలభక్త శిక్ష 15. శ్రీరాధాక్రిష్ణ సంభాషణము 16. ఆర్యకుల సుబోధిని (రెండు భాగాలు) 17. యుగ పంచాంగము 18. జ్యోతిష్యఫల ప్రబోధిని (నక్షత్రమాల) 19. శ్రీమత్తడి పోచమ్మ స్తవము 20. కలియుగ వర్తమాన కందార్థములు 21. గోవ్యాఘ్ర సంభాషణము 22. శ్రీరాజరాజేశ్వర నక్షత్రమాల 23. శ్రీశివస్తుతి (వర్ణమాల).
ఆనాటి కాలంలో వీధి బడులలో సిద్ధప్ప పద్యాలు విద్యార్థులకు పాఠ్యాంశాలుగా ఉండేవి. పిల్లలంతా వీరి పద్యాలను వల్లె వేసేవారు. వేమన, సుమతి, ధర్మపురి శేషప్ప పద్యాలు కoఠస్థం చేసినట్లుగానే వీరి పద్యాలు కూడా కoఠస్థం చేసేవారు. వీరి పద్యాలకు ఆ స్థాయి వ్యాప్తి ఉండేది. రాత్రుల్లో జరిగే భజనలలో కూడా విరివిగా వీరి పద్యాలు, యక్షగానాలు పాడేవారు. 1934లో సురవరం ప్రతాపరెడ్డి వెలువరించిన గోలకొండ కవుల సంచికలో వీరి పద్యాలు ప్రచురింపబడ్డాయి. అందులో సురవరం ప్రతాపరెడ్డి సిద్ధప్ప గురించి వ్రాస్తూ ‘‘బ్రహ్మంగారి వంటి గురువు - సిద్ధప్ప వంటి శిష్యుడు లేరు”1 అని ఆయన పరిచయంలో రాశారు. 1967లో లాల్ బహుద్దూర్ శాస్త్రి కుమ్మరి సిద్ధప్ప గురించి ఇలా వ్రాశారు. ‘‘ఈనాడు భారతీయ భాషలలో ముఖ్యంగా తెలుగులో విశ్వేశ్వరకవి, చిత్రకవిపెద్దన, తిమ్మన వంటి కవులేగాక వేదాంతులలో వటమూలుడు, నామయోగి, సిద్ధప్ప వరకవి రాజయోగి, పరమానందతీర్థులు వేదాంతంలోనూ ఇటు రసవంతమైన కవితలను వెలయించడంలోను వెల్లడిoచిన భావాలు అపూర్వమైనవి”2 (తెలుగులో తత్త్వకవులు, పుట. 92) అని కొనియాడారు.
1945లో కాశీయాత్ర చేసిన సిద్ధప్ప గాంధీ మహాత్ముని ప్రచార సభలకు వెళ్లి గాంధీజీ బోధనలు ఆధ్యాత్మికమైనవిగా భావించి ఆనందించారు. పండిత జవహర్‌లాల్ నెహ్రూను సందర్శించి ఆయన జాతక చక్రాన్ని వేసి నెహ్రూ చేత ‘భూషణ’సన్మానం పొందారు. అంతకు ముందు నైజాం స్టేట్‌లో కిషన్ ప్రసాద్, పీర్‌పాషా, తారాచంద్ ప్రసాద్, బూర్గుల రామకృష్ణారావు వంటి ప్రముఖుల చేత సన్మానాలు పొందారు.
2. జ్ఞానబోధ:
లోకం నిత్యం ఏదో అజ్ఞానపు దారుల వెంట పరుగెత్తుతుంటుంది. తత్త్వవేత్తలు ఆ అజ్ఞానపు మూలాల్ని శోధించి చెప్పినా లోకుల చెవికెక్కదు. మతo, కులం, ఎక్కువ, తక్కువ అంటూ ఎన్నెన్నో గోడలు కట్టుకుంటారు. పూట గడవడానికి వేసే వేషాలే ఇవన్నీ అని గ్రహించినవాడే జ్ఞాని.
“జంధ్యంబు లేకున్న జరుగదా శివపూజ పుట్టు జంధ్యముగాదు పూజ్యులార
నామముల్ లేకున్న నడవదా హరిభక్తి సూకరంబుకు లేద శూద్రులార
గడ్డంబు లేకున్న గానరాడ గురువు మేకపోతుకు లేద మాన్యులార
లింగంబు లేకున్న గానరాడ గురువు దొంగ గేదెకు లేద దుడ్డు మెడకు
వేషములు నన్ని లోకుల కెరుక కొరకె
తత్వ మెరిగిన వారికి తనువులేల
వినుడి మాయప్ప శిద్దప్ప విహితుడప్ప
కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప” (వరకవి సిద్ధప్ప తత్త్వకవిత, పుట. 98)
అన్నీ విడిచి పెట్టినవానికి ఏ వూరు లేదు, ఏ పేరూ లేదు. భోగపు స్త్రీకి డబ్బు ఉన్నోడే పెనిమిటి. పేదవానికి ఆశయమే ధనం. జనమందరి అనుభవము నుంచి నేర్చుకున్నవాడే జ్ఞాని. పైసా పైసా నీవేం చేస్తావంటే ప్రాణ స్నేహితులను విడదీస్తాను అందట. ఈ తెలివిడి లేకనే సగటు మనిషి ఈ ప్రపంచంతో ఇంకా ఏదో సంబంధం పెట్టుకొని తనను తాను మభ్య పెట్టుకుంటున్నాడు.
“సన్యాసి నీ వూరు స్థలమెక్కడని యంటె నలుదిక్కులకు నేనె యనుచు బలికె
భోగపుస్త్రీ నిన్ను బొందువాడెవడంటె పైస గోటిన గొట్టి పరగ బల్కె
పేదవానికి పెరగలేదనియంటె ఆశయ నధికమౌచున్న దనియె
జ్ఞానుడ నీమది జ్ఞాపకం బేమంటె సర్వజనులకు వందనములు సలిపె
పైస నీవెచెట కేగెదవు పలుకుమంటె
ప్రాణమిత్రుల పగజేతు ననుచు బలికె
వినుడి మాయప్ప శిద్దప్ప విహితుడప్ప
కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప” (వరకవి సిద్ధప్ప తత్త్వకవిత, పుట. 99)
పైపై మెరుగులు చూసి లోకంలో చాలా మంది ఖాళీ విస్తరి లాగ ఎగిరెగిరి పడుతుంటారు. కాని కాలం ఎప్పుడూ సరళరేఖ మీద నడవదు. ఇవాళ నడమంత్రపు సిరిని చూసి మిడిసి పడుతారు. ఎంత ఏనుగు అయినా ఒకనాటికి కూలిపోక తప్పదు. బలమైన సర్పం కూడా చలిచీమల చేత చంపబడుతుంది. పొడవు, లావు, ఎర్రగా ఉన్న చెట్టు అయినా గొడ్డలికి బలి కావాల్సిందే. బలీయమైన విధి శక్తి తెలిసిన జ్ఞానులెవరూ పది మందిలో తమ ప్రజ్ఞను ప్రదర్శిoపరు. ఒదిగి ఉంటారు.
“విత్తంబు గలవారి కిత్తురే కుర్చీలు పేదవారకివరు పీటచెక్క
కాలంబు నొకరీతి గడవ దెల్లప్పుడును యేనుగు యెత్తబడద
నేనే బలియుడని నిక్కుచునుంటేమి చలిచీమలు ఫణుల జంపలేద
నిడివి పొడవు దొడ్డు నెఱ్ఱగ నుంటేమి గొడ్డలిచే మ్రాను కోలుపోద
బుద్ధిమంతులు పుణ్య పురుషార్థులైన
వారు పదిమందిలో ప్రజ్ఞ బలుకబోరు
వినుడి మాయప్ప శిద్దప్ప విహితుడప్ప
కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప” (వరకవి సిద్ధప్ప తత్త్వకవిత, పుట. 99)
నేల మీద సకల జీవ రాశులకు అన్నం పెట్టే తిండి గింజలు ఎక్కడ పుట్టాయి? చెట్టు ఎప్పుడు పుట్టింది? విశ్వం, వాయువు, భూమి, కాంతి, అగ్ని, చీకటి, జలము, జగతి.. ఇవన్నీ ఎప్పడు పుట్టాయి. మన కన్న ఏడు తరాల ముందు పుట్టిన వాడెవడు? ఈ విజ్ఞానాన్ని తెలుసుకోవడానికి మన జీవితం సరిపోదు. అంటే సృష్టి రహస్యం ఎవరికీ తెలియదని అర్థం. చక్రనేమి క్రమoలో మనిషి పుడుతున్నాడు. గిడుతున్నాడు.
“విత్తు నెక్కడబుట్టె విశ్వమెప్పుడు బుట్టె చెట్టు యెపుడుబుట్టె చెప్పరయ్య
వాయువెప్పుడు బుట్టె వసుధ యెప్పుడుబుట్టె కాంతి యెప్పుడు బుట్టె కానరయ్య
అగ్ని యెపుడుబుట్టె అవని యెపుడు బుట్టె చీకటెపుడు బుట్టె చెప్పరయ్య
జలమునెక్కడబుట్టె జగతి యెప్పుడు బుట్టె నెలవుగా నాకాశ మెపుడు బుట్టె
నేను బుట్టకముందిల నెవడు బుట్టె
తాసుబుట్టిన వెనుక తను వెటుల బుట్టె
వినుడి మాయప్ప శిద్దప్ప విహితుడప్ప
కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప” (వరకవి సిద్ధప్ప తత్త్వకవిత, పుట. 116)
3. కాలభవిష్యత్:
పోతులూరి వీర బ్రహ్మం చెప్పిన కాలజ్ఞానం ప్రసిద్ధిగాంచింది. వరకవి సిద్ధప్ప కూడా ఎంతో కాలజ్ఞానాన్ని బోధించాడు. వీరబ్రహ్మం చెప్పని ఎన్నో సంగతులు సిద్ధప్ప కాలజ్ఞానంలో కనిపించి ఆశ్చర్యపరుస్తాయి. సిద్ధప్ప తాను చెప్పిన కాలాజ్ఞానానికి ‘కాల భవిష్యత్’ అని పేరు పెట్టాడు.
“విద్యలధికంబాయె విరహాగ్ని పైకెక్కె తాపముల్ అధికమై ధర్మముడిగె
నాణ్యముల్ వేరాయె నగవులధికంబాయె సతి పుర్ష ధర్మంబు సమసిపోయె
క్షీరపానము సకల జీవుల కరుదాయె తపజపాదులు పూర్వ స్థలముల కేగె
కులగోత్ర నామముల్ కూడి వారడికేగె గోమాత భూమాత కొరత నొందె” (వరకవి సిద్ధప్ప తత్త్వకవిత, పుటలు. 249, 250)
జగమంతా తారుమారు అయిన స్థితిని తన కాలభవిష్యత్ లో ఎంతో లోతుగా పరిశీలించి చెప్పాడు సిద్ధప్ప. చదువులు పెరిగినా కొలది ప్రేమలు ఎక్కువైన పరిస్థితిని రోజూ చూస్తూనే ఉన్నాం. రోజు రోజుకు ధర్మం నశించి పోతుంది. ప్రతి వస్తువులో నాణ్యత కొరవడింది. ఎక్కడ చూసినా అంతా నవ్వులాటగా మారిపోయింది. ఏదీ సీరియస్ గా సాగడం లేదు. లోకం మీద నిజమైన పాలు, నీళ్ళు కూడా దొరకని స్థితి వచ్చింది. స్త్రీ, పురుషుల ధర్మాలు కిందుమీదయ్యాయి. కులగోత్రాల ప్రసక్తి లేదు. గోవులు క్రమంగా నశించి పోతున్నాయి. భూమి మరింత అందుబాటులో లేకుండా పోతోంది. ఇంకా ఎన్నో చిత్రాలు మన వర్తమాన కాలంలో అనుభవిస్తున్నాం.
“అంతట పాపములధికములాయెను. అంతులేని కలహంబులు రేగెను. అధిక నిద్రాహారంబుల చేతను అల్ప బుద్ధులై అణగిపోయిరి.” (వరకవి సిద్ధప్ప తత్త్వకవిత, పుట. 251) అన్నమాట ఎంత నిజమవుతున్నదో మనం చూస్తూనే ఉన్నాము.
జాతిజాతికొక జగడం పుడుతుంది. ఉత్తర దేశంలో గాంధీ పుడుతాడు. అమితమైన యుద్ధాలు జరుగుతాయి. లోకంలో కొందరు బూటక మతులు బయలుదేరుతారు. తండ్రి కొడుకులకు తగవులు హెచ్చుగా వస్తాయి. దండి వారు గూండాలై పాలిస్తారు. కుల పద్ధతులన్నీ రద్దు అవుతాయి. ధరణి రక్తపాతంతో తడిసిపోతుంది. తిరుమలేశుని మందిరమున మహిమలు జెల్లును. నరులందరు భయముల పాలై అడవుల పాలవుదురు. ఆకలికి తాళలేక ఆకులు మేస్తారు. రేగటి మట్టి భుజింతురు. అర్ధరాత్రి రాకాసి మూకలు అరచి గంతులాడుతాయి. తీరని దుఃఖములనుభవింతురు.... ఇలాంటి ఎన్నో కాలజ్ఞాన విషయాలను సిద్ధప్ప దశాబ్దాల ముందే చెప్పడం గమనార్హం.
4. వైరాగ్యబోధన:
"మృత్యువు వశపరచుకొన్నది. దినమో శవాన్ని మోసీ ఈ దేహము మరో దినం మరో దేహం దీన్ని మోసుక పోకమానదు. ఎక్కడనో ఏ సమయంలోనో తనకు తెలియకుండా వీడిపోయే ఈ దేహము పట్ల మోహం పెంచుకొనడం తప్పని ఈ దేహాన్ని అనేక ఉపమాన ద్రన్యాలతో ఇట్లా పోల్చినారు వరకవి సిద్ధప్ప. 1. గాలిలోని దీపకళిక 2. పండుబారిన ఆకు 3. పండిన పండు 4. నీటిమీది బుడగ 5. నూనె కుండమీది వ్రాత 6. తృణము 7. జలకణము 8. వడిగా విసిరే సుడిగాలి 9. తిరిగే బొంగరము 10. మెరిసేమెరపు వలె ఈ దేహము అస్థిరతను చాటుతున్నది. చర్మ, రక్త, అస్థి, మేధోమాంస మూత్రపురీష సంకలితమైన దేహం కన్నా నరకం వేరే ఉందా? అని ప్రశ్నగా చెప్పినాడు. ఎన్నడో ఒకనాడు కాకులకో, గద్దలకో, నక్కలకో, ఉపయోగపడే ఈ దేహము బొంది ఉన్నంత సేపే విభవాలు పొందునని తత్త్వాన్నివిచారించి నిశ్చయ జ్ఞానం పొందక పోయిన నరులకు దేహాభిమానంతో ఇహపరాలకు దూరమవుతారని ఉభయ భ్రష్టులుగా వారిని కొనియాడారు.”4 (తెలుగులో తత్త్వ కవులు పుట. 94)
“కరికి మకరికి గల్గు కర్మమిదీ
తరియించి చూచితే నరులకది సంసార బంధమిది.
ధరణి లోపల ఋషిగణాదులు దత్వమతులై
తపమొనర్చియు తారకా ధ్యానంబు చేతను
పరమ పదవికి పతితులయ్యిరి.” (వరకవి సిద్ధప్ప తత్త్వకవిత, పుట. 268)
సంసారబంధంలో చిక్కుకున్న నరులది ఏనుగు, మొసలి మధ్య జరిగే పోరాటమే అంటాడు. ఋషులు, సన్యాసులు కొన్నిసార్లు లోక తత్త్వం తెల్సుకొని తపస్సు చేసినా ముక్తిని పొందలేకపోతున్నారు.
“వినర నరుల నమ్మగరాదు. భడవాతనము
నీకెందుకుర మూర్ఖతన మిడువలేవా?
ధనము ధనమని దినదినంబున
శునకముల వలె మిణుకుచుందువు.
తినక మృతికరులైరి కొందరు.
తిరిగి తిరిగి పుట్టెడు వారె వీరలు” (వరకవి సిద్ధప్ప తత్త్వకవిత ,పుట. 271)
మనుషులను నమ్మరాదు. మూర్ఖత్వాన్ని విడవని మూఢత్వం నీకెందుకు? ప్రతి రొజూ కుక్కలాగా ధనం ధనం అని మిడుకుతుంటావు. సంపాదించిన ధనం తాము తినక కొందరు చనిపోయారు. ఆ ధనం మీద ఆశ చావక వాళ్ళు మళ్ళీ మళ్ళీ పుడుతున్నారు. ఈ సూక్ష్మాన్ని గ్రహించాలంటాడు కవి.
“పరుల నేరములెన్నుచుంటిగదా!
పరబామలనుగని భాషణంబులుగాంచి చెడితిగదా!
స్థిరము లేకను జ్యోతి దెగ్గెర దిరిగి మడచిన
మిడుత రీతిగ దిరిగి సంసారాబ్ది నందున
చిక్కబడి దీనత్వ మొందితి.” (వరకవి సిద్ధప్ప తత్త్వకవిత, పుట. 277)
మానవ నైజాన్ని పూర్తిగా బట్టబయలు చేసిన దర్వు ఇది. ప్రతి మనిషి ఎప్పుడూ నేరం తనది కాదు పరులదనే భావనలోనే ఉంటాడు. దీపం చుట్టూ పురుగు తిరినట్టూ పర స్త్రీల చుట్టూ తిరిగి చెడుతున్నాడు. ఇలా సంసార సాగరంలో చిక్కిపోతున్నాడు. ఇదే మనిషి అసలైన దీనత్వమంటాడు.
“ఇనుము ఒక్కటే పనిముట్లు ఆయుధాలు వేరు. వస్తువు ఒక్కటే రూప నామాలువేరు. జీవుడు లేదా [ఆత్మ] ఒక్కటే దేహములనoతములు. ఈ దేహము ఒక ఇంద్రజాలికమని భావించకపోతే సత్యమని భ్రమిస్తే నిత్యము దుఃఖములనుభవించక తప్పదని రూఢిగా చెప్పినారు. సిద్ధప్పకేర్పడిన జ్ఞానము అపూర్వమైనది. సమస్త పదార్ధాలలో కాలమొక్కటే అమూల్యమైనదని ఆ కాలాన్ని వ్యర్ధంచేసుకొనేవాడే అజ్ఞాని అని వారే వ్యర్థులని ప్రబోధించినారు. కాలం గడుస్తున్నాకొద్ది ఆయువు క్షీణిస్తున్న, మృత్యువుకుబలిగాని ధీరులు లేరని, యథార్థ జ్ఞానం సంపాదించుకొనుటకుపయోగపడే ఆయువును వ్యర్థవిషయాలలో పోగొట్టుకోరాదని, లోకవ్యవహారాలలో దేహేంద్రియ మనస్తాపాది వికారాలలో, చాపల్యాలలో దుఃఖాలు అతిశయించునే గాని ఉపశమనము లేదని దుష్టచింతనతో భూమికి భారంగా బతకరాదని, వారి వలన ఎవరికీ ప్రయోజనం లేదని, చెట్లు, రాళ్లు ఉపయోగపడతాయికాని దుష్టులు ఇతరులకు కాక తమకు తాము కూడా కష్టాలు కూర్చుకొనే రీతులలో మదాంధులయి వ్యవహరిస్తారని చెప్పినారు. మరణమన్నపదము పెద్దపులివలె మనస్సునకు ఉలుకు పుట్టిస్తుస్నది గుండెను వ్రక్కలుచేస్తున్నది. జననము మరణకారకమైనదిగా గుర్తించి బ్రహ్మజ్ఞానము సమార్జించవలెనని. భగవదనుగ్రహం వల్లనే జన్మ కడతేరుతుందని సద్గురువును పొంది తీరాలని ప్రబోధించినారు.”5 (తెలుగులో తత్త్వకవులు, పుట. 95)
5. నిజాం ప్రశంస:
1930లో తెలంగాణ వ్యాప్తంగా ఉర్దూ, తెలుగు మీడియం పాఠశాలలు స్థాపించిన సందర్భంలో ఆఖరి నిజాం రాజు మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ ను స్తుతిస్తూ సిద్ధప్ప వరకవి గొప్ప పద్యాలు రాశాడు.
“నరులార వినరయ్య నైజాము రాష్ట్రంబు
బాలించుచున్నట్టి ప్రభువుగారు
వరుసగా బాలురకు పాఠశాలలు బెట్టి
విద్య నేర్పించిరి విశదముగను
కృషిజేయుటకు చెర్వు కుంటలు వేయించి
పేదసాదలమీద ప్రేమగాంచి
ధర్మశాలలు యన్నదానముల్ వస్త్రముల్
యిచ్చిరక్షించిరి వివిధముగను
........................................
హిందువుల కాలయము లింపైన మజ్జిదుల్
ప్రతిగ్రామమందు నేర్పరచినారు
జనసౌఖ్యమునకయి జయప్రదంబయినట్టి
వైద్యశాలలు నిర్ణయించినారు
టప్పాఖానలు మొదలు టంకశాలలు
ఇంక ప్రతిజిల్లాయందధిపతులనుంచి
న్యాయమన్యాయముల్ ననవుగా గమనించి
దుష్టశిక్షణ శిష్టపాలనంబు
జేయుచుండిన మహరాజు జాతియందఱ
నెల్లకాలంబు నైజాము నేలు ప్రభువు క్షేమముగ నుండవలెనంచు
జగముగోరి దైవప్రార్ధన జేయుడీ తండ్రులార!” (వరకవి సిద్ధప్ప తత్త్వకవిత, పుటలు. 335)
తెలంగాణాలో ఆధునికతకు బీజాలు వేసినవారు చివరి రాజైన మీర్ ఉస్మాన్ అలిఖానే అని చెప్పాలి. తారు రోడ్లు, ఇంటింటికి నల్లాలు, టెలిఫోన్లు, మోటారు బైక్లు మొదలైన ఎన్నో సౌకర్యాలు ఈయన కాలoలో వచ్చాయి. అదే సమయంలో 1947లో హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత్ లో విలీనం చేయడానికి నిరాకరించి గ్రామాల మీదికి రజాకార్లను పంపి హింసాఖాండను జరిపించిన నిజాం కూడా ఉస్మాన్ అలిఖానే.
6. భజన కీర్తనలు:
తెలంగాణ ప్రాంతంలోనే కాదు దేశంలోని తెలుగు వారు నివసించే ప్రదేశాలన్నింటిలో ఒకప్పుడు భజనలు మారుమ్రోగేవి. అవే ఆనాటి ప్రజల వినోద, విజ్ఞాన కేంద్రాలు. వాటిలో పాడే పద్యాలు, కీర్తనలు, ఆధ్యాత్మిక గేయాలు, దరువులు ఎన్నో వరకవి సిద్ధప్ప రాసినవే ఉండేవి.
“హరి నీదరి జేరుట కొరకై
తపమాచరించవలెనా
హరిఓం శివఓం యనుచు బల్కవలెనా
ప్రార్థన బలము గాంచవలెనా ॥ హరి॥
పారమార్థికము వెదుకుదునా
భావర్థములపొడ గాంచుదునా
ఈ ధరలోగల దివ్యయాత్రలు దిరిగియు
ధర్మముగోరి తరించుదునా
భగవద్గీతలు చదువుదునా
పంచీకరణము శోధించుదునా
యుగ సామ్రాజ్యము జేరియాగముల
నూరడించి నుతికెక్కుదునా ॥ హ॥
హఠయోగంబులు జేయుదునా
అద్వైతాచార్యుల గోరుదునా
ప్రకటితముగ శృతి భాష భాగముల
పాల్గొని శృతుల కృతించుదునా ॥ హ॥ (వరకవి సిద్ధప్ప తత్త్వకవిత, పుట. 282)
ఆ భగవంతుని చేరుటకు ఈ మానవ మాత్రుడు ఏ మార్గంలో పయనించాలి? అర్చకత్వమా? అచల గ్రంథాలు చదవాలా? శిలలలను పూజించాలా? నీట మునగాలా? అని ఆ దేవదేవుని ప్రశ్నిస్తాడు. యాగాలు చేయాలా? ఆశ్రమాలు తిరగాలా? ఆగమ శాస్త్రాలు వల్లించాలా? జాగరణం చేయాలా? కౌపీనం ధరించాలా? కాషాయ వస్త్రాలు ధరించాలా? జపమాలలు తిప్పాలా? జుట్టు జడలు కట్టేలా తపస్సు చేయాలా? ఏ మార్గంలో నిన్ను చేరుకోవాలి అని ప్రశ్నిస్తాడు. “ఎవ్వరు నీ కులమేదని యడిగితే ఏమని చెప్పుదు నా కులమూ” అని మానవులు ఏర్పరచుకున్న కుల సంకెలలను తీసి పారేస్తాడు మరో కీర్తనలో.
7. దేశభక్తి:
సిద్ధప్ప వరకవి ప్రత్యక్షంగా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనకున్నా తన దేశభక్తి కీర్తనల ద్వారా తెలంగాణ ప్రజల్లో వలసినంత స్వతంత్ర కాంక్షను పాదుకొల్పాడు. స్వాతంత్ర్య పోరాటంలో నాయక స్తుతి కూడా ఒకటి. కాబట్టి సిద్ధప్ప గాంధీజీని, ఆయన పోరాట శైలిని కొనియాడుతూ కొన్ని కీర్తనలు రాశాడు.
“మనగాంధి జీవరక్షకుడాయెను
కల్లు సారాయి మత్తుగావించు
ద్రవ్యములగరిమెతో విడువుమనెను
మనగాంధి క్రమముతో నుండుమనెను
తల్లిదండ్రులు ఆత్మదైవమే దేవుడని
తత్వార్థములు దెల్పెను మనగాంధి
తగవులను బోకార్చెను
ఖాది గుడ్డలు గట్టిగాదల్లెను మరచి
గర్వములు విడువుమనెను మన గాంధి
జ్ఞానులైయుండుమనెను సాధువృత్తులనెల్ల
సవరించుకొని బ్రతికి సామ్రాజ్యపదవి గనెను
మన గాంధి సంతోషమతుడయ్యెను
జీవహింసలు జేయు జీవులకు
పిడుగునని జిద్దుచె దెలిపినాడు మన గాంధి
జీవరక్షకుడాయె సుజనులై
వెల్గుతా ప్రజలకును తండ్రియై” (వరకవి సిద్ధప్ప తత్త్వకవిత, పుట. 316)
మహాత్మా గాంధీ స్వాతంత్ర్యపోరాటాన్ని తన కీర్తనలలో ఆవిష్కరిస్తూనే ఆయన బోధించిన బోధనలను కీర్తించాడు సిద్ధప్ప. ద్వేషములు వీడి దేశ ప్రజలందరినీ కలిసి మెలసి ఉండుమన్నాడు గాంధీజీ. భేదములు వీడి, పేదలను రక్షించి, ఆనాటి ఆంగ్లేయులను మెప్పించాలని చెప్పాడు. రాట్నం తిప్పి, నూలు వడికి, నేత బట్టలు ధరించుమని గాంధీజీ చేసిన స్వదేశీ ఉద్యమాన్ని కొనియాడాడు.
వరకవి సిద్ధప్ప ప్రజల మధ్య జీవిస్తూ, ప్రజలతో మమేకమవుతూ ప్రజలను సంస్కరించే ప్రయత్నము చేశాడు. ఒకవైపు ఆధ్యాత్మికత, దేశభక్తి, మత, కుల నిరసనము చేసి మార్గదర్శకంగా నిలబడ్డాడు. “సిద్ధప్ప దేనినైనా నిజాయితీతో ప్రశ్నించే గుండె దిటవు కల్గిన వ్యక్తీ.”6 (వరకవి సిద్ధప్ప తత్త్వకవిత, పుట. 22) అందుకే ఆయన తత్వాలు చదివినపుడు ఆయన సమకాలికుడైన కాళోజీ గుర్తుకు వస్తాడు. “తెలంగాణ సాయుధ పోరాటానికి ముందే కవితా యుద్ధం చేసి నిజాం ప్రభుత్వం కూలిపోనున్నదని ప్రకటించాడు” (వరకవి సిద్ధప్ప తత్త్వకవిత, పుట. 22). సిద్ధప్ప వరకవి ఆ రోజుల్లోనే ప్రజల్లో సంస్కరణ భావాలు నాటాడు. తెలంగాణ అంతటా తిరిగి వివిధ వర్గాలలో సంస్కరణ భావజాల వ్యాప్తికి కృషి చేశాడు. ఇప్పటికీ సిద్ధప్ప అచల శిష్యులు తెలంగాణ, షోలాపూర్, భీవండి, ముంబై, సూరత్, సిరిసిల్ల లాంటి ప్రాంతాలలో ఉన్నారు. ప్రతి ఏట వారి స్వగ్రామమైన గుండారెడ్డి పల్లెలో కార్తీక పౌర్ణమి రోజున రాజయోగి సిద్ధప్ప కవి జన్మదిన వేడుకలను ఆయన భక్తులు ఘనంగా నిర్వహిస్తారు. వరకవి సిద్ధప్ప 23 మార్చి 1984న కీర్తిశేషులయ్యారు.
8. ముగింపు:
తెలుగులో వేమన, పోతులూరి వీరబ్రహ్మం, అహమదొద్దీన్ లాంటి తత్త్వకవులు చాలా మంది ఉన్నా వీరిలో వరకవి సిద్ధప్పది విలక్షణ స్వరం. ఎన్నో సామాజిక సమస్యలను తమ సాహిత్యం ద్వారా చర్చించి ప్రజాసముదాయానికి దారి చూపిన తత్త్వకవి సిద్ధప్ప. ప్రధానంగా క్రింది విషయాలకు ప్రాధాన్యతనిచ్చారు.
- సకల జంతుజాలం నుంచి వేరు జరిగిన మనిషి ఎంత జ్ఞానంతో మెలిగితే అంత మెరుగైన సమాజం నిర్మాణమవుతుందని సిద్ధప్ప జ్ఞానబోధిని చదివితే తెలుస్తుంది.
- ఇతర తత్త్వకవులు చెప్పినట్లుగానే సిద్ధప్ప కూడా మూఢ విశ్వాసాలను విడనాడాలని, విగ్రహారాధన, కర్మకాండ కూడదని చెప్పారు.
- కుల, మత, వర్గ విచక్షణ లేని సమ సమాజం రూపొందాలని ఆకాంక్షించారు.
- గొప్ప సంఘసంస్కరణ దిశగా సిద్ధప్ప సాహిత్య ధోరణి నడిచింది.
- ఐహిక జీవితం పట్ల విముఖత కలిగేలా, భోగలాలసతను విడనాడేలా, నిరాడంబర జీవితాన్ని అలవర్చుకునేలా సిద్ధప్ప సాహిత్యం మానవజాతికి ఒక దీపదారి.
9. పాదసూచికలు:
- జగన్ రెడ్డి, సామిది, వరకవి సిద్ధప్ప తత్త్వకవిత, 22
- జంగయ్య, నీలా, తెలుగులో తత్త్వకవులు, పుట. 93
- ప్రతాపరెడ్డి సురవరం, గోల్కొండ కవుల సంచిక, పుట. 92
- పైదే. పుట. 94
- పైదే. పుట. 95
- పైదే. పుట. 22
10. ఉపయుక్తగ్రంథసూచి:
- గౌరీ శంకర్, జూలూరు. (2022), తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్ర, తెలంగాణ సాహిత్య అకాడెమి, హైదరాబాద్
- జగన్ రెడ్డి, సామిడి. (2016), వరకవి సిద్ధప్ప తత్త్వకవిత, తెలంగాణ బుక్ ట్రస్ట్, హైదరాబాద్
- జంగయ్య, నీలా. (1986), తెలుగులో తత్త్వకవులు, స్వీయ ప్రచురణ, హైదరాబాద్
- నారాయణ రెడ్డి, సుంకిరెడ్డి. గనుమ (2010), తెలంగాణ సాహితి పబ్లికేషన్స్, హైదరాబాద్ – వరంగల్
- నారాయణ రెడ్డి, సుంకిరెడ్డి. (2016), ముంగిలి – తెలంగాణ ప్రాచీన సాహిత్య చరిత్ర, తెలుగు అకాడెమి, హైదరాబాద్
- ప్రతాపరెడ్డి, సురవరం. (2009) గోలకొండ కవుల సంచిక, తెలంగాణ జాగృతి, హైదరాబాద్
- భూమయ్య, అనుమాండ్ల. (2023), తెలంగాణ కవితా వైభవం (పాల్కురికి నుండి గద్దర్ వరకు), మనస్విని ప్రచురణలు, హైదరాబాద్
- మలయశ్రీ, (1997), కరీంనగర్ జిల్లా తెలుగు సాహిత్యచరిత్ర, నవ్యసాహిత్యపరిషత్, కరీంనగర్.
- శ్రీనివాస్, సంగిశెట్టి. (2018), దుర్బిణి, తెలుగు అకాడెమి, హైదరాబాద్
- శ్రీహరి, రవ్వా. (సం. 2016), తెలంగాణ ఆధునిక సాహిత్యచరిత్ర, తెలుగుఅకాడెమి, హైదరాబాద్
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "May-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-April-2025
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "MAY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి
బాధ్యత వహించరు.