AUCHITHYAM | Volume-5 | Issue-11 | October 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
1. వైద్యజ్యోతిషం: మెదడు సంబంధవ్యాధుల పరిశీలన

డా. రాంభట్ల వేంకటరాయశర్మ
తెలుగు పరిశోధకులు, జ్యోతిష్కులు
ప్రధానసలహాదారు, ఔచిత్యమ్- పరిశోధనమాసపత్రిక,
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 7989110805, Email: rvr87sarma@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 20.09.2024 ఎంపిక (D.O.A): 29.09.2024 ప్రచురణ (D.O.P): 01.10.2024
వ్యాససంగ్రహం:
భారతీయజ్యోతిషపద్ధతుల్లో వైద్యజ్యోతిషానికి ప్రముఖస్థానం ఉంది. జాతకం చూసి ఆరోగ్యవిషయాలు చెప్పడం ఒకపద్ధతైతే, ప్రశ్నలగ్నం, నాడీప్రశ్న బట్టి ఆరోగ్యవిషయాలు కచ్చితంగా చెప్పగలగడం భారతీయజ్యోతిషవిధానంలోనే పేరుపొందిన విధానం. ఏ గ్రహదశలో, ఏ గ్రహ అంతర్దశలో జాతకుని శరీరంలోకలిగే మార్పులు ఎలా ఉంటాయో సులభంగా చెప్పడమూ, చికిత్సావిధానాన్ని తెలియజెప్పడమే వైద్యజ్యోతిషం. ఈ పరిశోధనకు వైద్యజ్యోతిషానికి సంబంధించిన గ్రంథాలు ప్రాథమిక ఆకరాలు. వ్యాధినిర్ధారణలో వైద్యజ్యోతిషపాత్ర, నవమాసాధిపతుల నిర్ణయం, ద్వాదశరాసులు- వ్యాధులు, గ్రహాలు-వ్యాధులు, మెదడు సంబంధ వ్యాధులు – గ్రహాది ప్రభావం, జ్యోతిష శాస్త్రరీత్యా రోగపరిహారిక క్రియలు, పరిహారాలు, నివారణలు మొదలైన అంశాలుగా ఈ వ్యాసం రూపుదిద్దుకుంది. బృహజ్జాతకము., బృహత్పరాశర హోరాశాస్త్రము, సర్వార్ధచన్ద్రిక మొదలైన ప్రాచీనగ్రంథాలలో ఈ పరిశోధనకు మూలాలు కనిపిస్తున్నాయి. శాస్త్రీయవైద్యజ్యోతిష్యరత్నావళి వంటివి ఈ పరిశోధనాంశానికి బలాన్నిచేకూర్చే గ్రంథాలు. మస్తిష్కసంబంధవ్యాధులు, ప్రభావాలను శాస్త్రీయదృక్కోణంలో ఈ పరిశోధనవ్యాసం చర్చిస్తుంది.
Keywords: వైద్యజ్యోతిషం, గ్రహాలు, ద్వాదశరాసులు, వ్యాధినిర్ధారణ, రోగపరిహారకక్రియ
1. వ్యాధినిర్ధారణలో వైద్యజ్యోతిషపాత్ర:
జ్యోతిషశాస్త్రం సర్వజన ఉపయోగార్థం అన్నిశాస్త్రాలతోను సంబంధం కలిగి ఉంది. అటువంటి వాటిల్లో వైద్య శాస్త్రానికి ఉన్న సంబంధం ఒకటి. పూర్వకాలపు వైద్యజ్యోతిషం అనే ప్రత్యేకభాగం లేకపోయినప్పటికీ కొన్ని వ్యాధులు ఏయే గ్రహాల యోగాలతో సంప్రాప్తిస్తాయో వ్రాశారు. వైద్యరంగంలో ఎన్నో మార్పులు వచ్చి అభివృద్ధి సాధించడం జరిగింది. అయితే రోగం వచ్చాక తెలుసుకుని దానిని నివారించే కన్నా, ముందుగా తెలుసుకోగలిగితే చికిత్స చేయటమే కాకుండా జాగ్రత్తపడడం కూడా సులభమౌతుంది. గ్రహాలు ముందుగానే రోగ నిర్ధారణకు ఉపయోగపడతాయి.
మానవుని శరీరంలో అయస్కాంత క్షేత్రాలు ఉన్నట్లు పరిశోధనల వల్ల తెలిసిన విషయాన్ని ఆల్బర్డ్ రాడ్డేవిస్ మరియు ఎ.కె. భట్టాచార్యులు తమ మాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ హీలింగ్ బై మాగ్నెట్ అనే గ్రంథంలో వ్రాశారు.1 (ఎం.ఏ జ్యోతిషం కరెస్పాండెన్స్ కోర్సు రెండవ సంవత్సరం పేపరు 4 - సంహితలు పుట 60).
ఈ అయస్కాంత శక్తికి నిలయమైన మానవశరీరం వివిధ గ్రహాల నుండి వస్తున్న విద్యుదయస్కాంత తరంగాలకు, వైబ్రేషనులకు అనుగుణంగా మార్పు చెందుతున్నది. ఆహార విహారాల మార్పు భౌగోళిక కాలమాన పరిస్థితులలో, వాతావరణంలో వచ్చే మార్పులు శరీరంలో కూడా మార్పులు తెచ్చేందుకు గ్రహాలే కారణం. శుక్రుని వల్ల మూత్ర పిండాలు ప్రభావితం అవుతాయని మన పూర్వీకులు చెప్పారు. మన పెద్దలు చెప్పిన విధంగా పౌర్ణమినాడు పిచ్చి ఎక్కువైందని, అమావాస్యకు తగ్గిందని చెప్పేవారు; పైత్యరసం పసుపురంగులో ఉండడం గురు గ్రహ ప్రభావమని, చంద్రుడు గర్భాశయంపైనా, ప్రసవంపైనా ప్రభావం కలిగి ఉన్నాడనే విషయాలు ఇంతకు ముందే జ్యోతిషశాస్త్రానికి తెలుసు. ఇనుమును కలిగి ఉన్న శరీరంలోని ద్రవ మరియు పార్షిక ద్రవపదార్థాలు అన్నీ పౌర్ణమి. అమావాస్యలనాడు చంద్రునిచే ఆకర్షింపబడుతున్నాయి. అట్టి చర్యల వల్ల మానసిక భావోద్రేక సమస్యలకు మనిషి లోనవుతున్నాడని శాస్త్రజ్ఞులు నిర్ణయించారు.
బృహజ్జాతకాది గ్రంథాలో గర్భస్థ శిశువు పిండం దశ నుండి ప్రసవం వరకు ఏ గ్రహాల వల్ల ఏయే అవయవాలు ఏర్పడతాయో వివరించారు. బృహజ్జాతకం, నిషేకాధ్యాయములో ఈ క్రింది విధంగా వివరించారు.
2. గర్భధారణాదిగ నవమాసాధిపతుల నిర్ణయము:
శ్లో॥ కలలఘ నాంకు రాస్థి చర్మాంగజ చేతనతాః
సితకుజజీవ సూర్యచంద్రార్కి బుధాః పరతః |
ఉదయప చంద్ర సూర్యనాథాః క్రమశో గదితా
భవతిశుభాశుభంచ మాసాధిపతేః సదృశమ్ || (బృహజ్జాతకము, నిషేకాధ్యాయము శ్లోకము 16, పుట 57,58)
గర్భధారణ మొదటిమాసమున సంయోగిత శుక్లశోణితములు బుద్బుదాకారముగా యుండును. ఆ మొదటిమాసమునకు శుక్రుడు అధిపతి. ద్వితీయమాసమున యా బుద్బుదరూప శుక్లశోణితములు ఘనరూపమై మాంసమయమగును. ఆ రెండవ మాసమునకు కుజుడు అధిపతి. మూడవనెలయందు అంకురము యేర్పడును. ఈ నెలకు బృహస్పతి యఃపతి నాల్గవ నెలయందు యెముకలు యేర్పడును. ఆనెలకు రవి యధిపతి. అయిదవనెలయందు చర్మము యేర్పడును. ఆ అయిదవ నెలకు చంద్రుడధిపతి. రోమాకృతులు మోసులెత్తునని కొందరు, శరీరావయవములు లెస్సగా యేర్పడునని మరికొందరూ వచించుచున్న అట్టి యా యారవనెలకు శని యధిపతి. ఏడవమాసమున జ్ఞానేంద్రియముల జ్ఞాన మేర్పడును. అట్టి యేడవమాన మునకు బుధుడు యధిపతి. తదుపరి యెనిమిది, తొమ్మిది, పది మాసములకు క్రమముగా గర్భాధాన లగ్నాధిపతి, చంద్రుడు, రవి యధిపతులగుచున్నారు.
ఇదే విషయాన్ని సర్వార్థ చన్ద్రిక మొదటిభాగంలో పట్టిక రూపంలో వివరించారు. (సర్వార్థ చన్ద్రిక పార్టు 1 పుట 126). ఆ కాలంలో వైద్యులకు కూడా జ్యోతిషం తెలుసు. రోగం కనపడిన రోజు నాటి నక్షత్రాన్ని బట్టి ఆ రోగం ఎన్ని రోజులకు తగ్గుతుందనేది లెక్కలు కట్టి తెలుసుకునే వారు.(సర్వార్థ చన్ద్రిక పార్టు 1 పుట 459) ప్రస్తుతం బాగా ప్రగతి సాధించిన అమెరికా వంటి దేశాలలో వైద్యులకు జ్యోతిషం తెలుసుకుంటున్నారు. రోగనిర్ధారణకు వారు జ్యోతిషాన్ని ఉపయోగిస్తున్నారు.
3. ద్రేక్కాణాలననుసరించి అవయవవిభజన:
బృహత్పరాశరహోరా శాస్త్రం తనుభావాధ్యాయంలో వ్రణాది చిహ్నాలను గురించి చెప్తూ పరాశరమహర్షి జన్మలగ్న ద్రేక్కాణాలనుబట్టి శరీర అవయవ విభజన ఈ విధంగా చేశారు.
శిరోనేత్రే తథా కర్ణౌ నాసికే చ కపోలకౌ|
హనూ ముఖంచ లగ్నాద్యా తనా వాద్యదృగాణకే॥ -బృ. ప. హో. శా. తనుభావాధ్యాయం శ్లో12
జన్మలగ్న ప్రథమ ద్రేక్కాణ మందు ( రాశి యొక్క మొదటి 10 భాగాలలోపున) జన్మించినపుడు లగ్నం శిరస్సు 2, 12 భావాలు నేత్రాలు 3, 11 భావాలు కర్ణములు 4, 10 భావాలు నాసికాలు, 5, 9 భావాలు కపోలాలు 6, 8 భావాలు హనువులు 7వ భావం ముఖం అని చెప్పారు.
4. రాసులు- వ్యాధులు:
మేషం:- తలనొప్పి, వాపులు వచ్చే వ్యాధులు, బ్రెయినుకు సంబంధించిన రోగాలు, మెదడువాపు వ్యాధి, స్పృహతప్పుట, నిద్రపట్టని వ్యాధి, సెరిబ్రల్ మలేరియా, మేషం 5వ డిగ్రీ సెరిబ్రల్ హేమరేజ్ అనగా మెదడులో రక్తనాళాలు పగులుట, 10 నుండి 11 డిగ్రీ మెదడులో కురుపులు అనగా బ్రెయిన్ ట్యూమర్, 29వ డిగ్రీ కూడా రక్తనాళాల వ్యాధి, 23, 24 డిగ్రీలు బ్రెయిన్లోని రక్తనాళాల వ్యాధి, 23, 24 డిగ్రీలలో బ్రెయినులోని రక్తనాళాలలో అడ్లు, అవరోధాలు, 30వ డిగ్రీ వలన కోమా, 27వ డిగ్రీ వలన మెదడులో జబ్బు కారణంగా అధిక జ్వరం. మేషరాశి కోపాన్ని, తొందరపాటును పట్టుదలను, దుడుకు చర్యలను సూచిస్తుంది. వీరికి మాంసాహారం ఎక్కువగా పడదు. వీరు కోపాన్ని ఉద్రేకాన్ని కంట్రోలు చేసుకోవాలి.
5. గ్రహాలు -వ్యాధులు:
బుధుడు:
నరాల జబ్బులు, చర్మవ్యాధులు, స్వరపేటికకు జబ్బులు, చెముడు, మూగతనం, పోలియో, మెదడుకు సంబంధించిన అన్ని రకాల జబ్బులు, నాలుక మీద పుండ్లు, నరాల టెన్సన్, నరాల అజీర్ణం, నరాల బలహీనత, మెదడు సరిగా పనిచేయక పోవుట, సరియైన ఎదుగుదల లేక పరిసరాలను గుర్తించలేకపోవుట, మాటలు రాకపోవుట, చాల ఆలస్యంగా మాటలు వచ్చుట, మెదడు దెబ్బతినుట వలన అవయవాలు కదల్చలేకపోవుట, ఆవిధంగా అన్ని రకాలైన మెదడుకు సంబం ధించిన సర్వరోగాలు, మూర్చ రోగం, ఫిట్సు, చంద్రునితో కలసి మానసిక వ్యాధి. పిచ్చి. బ్రెయిన్ డిరేంజ్మెంట్ అనబడు మెదడువ్యాధి, హిఫ్టీరియా, అధికంగా మాట్లాడుట, స్పృహతరచుగా కోల్పోవుట, కోమా, శనితో కలసి అప్పటికప్పుడు నిద్రపోయేవ్యాధి, గురునితో కలసి మెదడువాపు వ్యాధి, కుజునితో కలసి బ్రెయిన్కాన్సర్, మనస్తత్వానికి సంబంధించిన అన్ని రకాల వింత జబ్బులన్నీ బుధుని వలన వచ్చేవే.
మానసికంగా క్రుంగిపోవటం (చంద్రునితో కలిస్తే) తొందరపాటు, దుడుకు తనం, ఎక్కువ ఆలోచించడం నరాలు చిట్లి పోవడం ఇవన్నీ కుజునితో కలసి ఇస్తాడు. బుధ. రాహువులు కలిస్తే వచ్చే వ్యాధులు చాలా ప్రమాదకరమైనవి. ఆలోచనా విధానమే రివర్స్ ఉంటుంది. విషప్రయోగం వలన మెదడు పాడవుతుంది. నెప్ట్యూన్తో కలసి క్షుద్రవిద్యలు నేర్వటం, క్షుద్రమంత్రాలు అభ్యసించడం, 'పేరాసైకలాజికల్ సర్వర్షన్' అనబడే వింత వ్యాధి కలగడం జరుగుతాయి. విటమిన్ బి కాంప్లెక్స్ లోపం, బెరిబెరి వ్యాధి. అన్నిరకాలైన న్యూరో సమస్యలకు బుధుడే కారణం.
6. గ్రహాలు- ధాతువులు:
మనం తినే ఆహారంలో శరీరానికి కావలసిన అన్ని రకాల ధాతువులు విట మినులు ఉండేట్లు చూసుకోవాలి. ధాతువుల లోపం వలన వ్యాధులు సంభవిస్తాయి. కాబట్టి ఆ ధాతులోపాన్ని జాతకం చూసి చెప్పవచ్చు. తద్వారా తీసుకునే జాగ్రత్తలలో కొన్ని వ్యాధులను నివారించవచ్చు.
మన శరీరానికి కావలసిన సమతుల్యాహారాన్ని అది చేయు పనులను బట్టి 8 విధాలుగా విభజించవచ్చు. 1. పొట్ట - తిన్న ఆహారం అంతా జీర్ణం కాదు. అలా జీర్ణం కాని దానిని శరీరం నుండి పైకి పంపించు మల విసర్జనా కార్యం సక్రమంగా జరగాలంటే ఆహారంలో కొంత పొట్టును మనం విధిగా తినాలి. ఆహారంలో పొట్టు లోపిస్తే మలబద్దకం వస్తుంది. ఈ పొట్టును తినడం వలన శరీరానికి “సెల్యులోస్” అనే పదార్థం లభించి సులభ మలవిసర్జన సాధ్యమవుతుంది. ఇది ఇప్పుడు తీయని ధాన్యంలోను, క్యాబేజి, తోటకూర, బచ్చలి వంటి ఆకుకూరలలోను, నారగల అన్ని కూరలలోను ఉంటుంది. దీనిని బుధ గ్రహం సూచిస్తుంది. బుధుడు శనితో సంబంధం కలిగినా లేదా శని నక్షత్రాలలో ఉన్నా లేదా బుధుడు నీచ రాశిలో ఉన్నా లేక వేరే విధంగా బలహీనుడై ఉన్నా సెల్యులోస్ లోపం కలుగుతుంది. అలాంటప్పుడుమలబద్దకం కలిగి అది ఇతర వ్యాధులకు దారి తీస్తుంది.
శరీరానికి 1) కాల్షియం 2) పొటాషియం 3) భాస్వరం 4. అయోడిన్ 5) ఇనుము. 6) గంధకం 7) రాగి 8) మెగ్నీషియం 9) కర్బనం వంటి లోహాలు అవసరం.
కాల్షియం: మానవుని శరీరం బరువులో 2 శాతం బరువు కాల్షియం వలన కలుగుతుంది. తక్కువ కాల్షియం ఉంటే కాళ్ళు, చేతులు లాగడం. కీళ్ళు చుట్టుకుని పోయే నొప్పులు, పిల్లలకు చంటిబిడ్డ రోగం ప్రాప్తిస్తాయి. కాల్షియాన్ని శుక్రుడు సూచిస్తే ఎముకలను శని సూచిస్తాడు. శుక్రుడు నీచలో ఉన్నా లేదా ఏ విధంగానైనా శని సంబంధం కలిగినా సరే కాల్షియం లోపం కలుగుతుంది. విశేషించి శని మేషరాశిలో యుండగా అతని నక్షత్రంలో శుక్రుడుంటే పై లోపం కలుగుతుంది.
పొటాషియం: శరీరంలోని కణాలలోను మెత్తని టిష్యూలలోను కండరాలలోను, పొటాషియం, పొటాషియం పాస్ఫేటు రూపంలో ఉంటుంది. రక్తంలోని ఎర్ర కణాలను పెంచుటకు, కండరాలను పెంచుటకు పొటాషియం అవసరం. శాకాహారాన్నింటిలోను పొటాషియం ఉంది. పొటాషియాన్ని బుధుడు సూచిస్తాడు. ఈ బుధుడు మీనంలో లేక శని సంబంధం కలిగినా పొటాషియం లోపం ఏర్పడుతుంది.
సోడియం: మన రక్తంలోను ఇతర శరీర ద్రవాలలోను సోడియం 3 రూపాలలో ఉంటుంది. 1) సోడియం క్లోరైడు 2) సోడియం కార్బనేటు 3) సోడియం ఫాస్ఫేటు. జీర్ణకోశంలో సోడియం క్లోరైడు వలన హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఏర్పడి జీర్ణ క్రియకు దోహదం చేస్తుంది. సోడియం క్లోరైడు లేదా ఉప్పును చంద్రుడు సూచించును. చంద్రుడు వషభంలో ఉన్నా లేదా గురుని సంబంధం కల్గినా అట్టివాడు ఉప్పు ఎక్కువగా తిని ఆమ్లత్వం, రక్తపోటు రోగాలను తెచ్చుకుంటాడు. అధిక ఆమ్లత్వం కలుగుటకు గురు చంద్రుల సంయోగం లేదా చంద్ర కుజుల సంయోగం కారణం.
7. మెదడు, నాడీమండలం:
కాలపురుషాంగరాశి మేషము
కాలపురుషాంగస్థానము మొదటిభావము
ప్రధాన కారకులు రవి, చంద్రుడు
ఏర్పడే ప్రధాన రోగములు:
పిచ్చి, ఉన్మాదము, వెర్రి. Insanity
మెదడుకుసంబంధించిన వ్యాధులు. Brain Diseases
పీనసగ్రంథి వ్యాధులు. Pituitory Gland Diseases
హిస్టీరియా. Epilepsy, Newrasthenia and Hyster
పక్షవాతం పోలియో. Paralysis and Poliomyelitis
శిరోవేదనలు. Headaches
పిచ్చి, ఉన్మాదము, వెర్రి Insanity:-
సూచనాస్థానములు గ్రహములు
ఆరోగ్యకారకుడు : రవి
మానసికస్థితికి కారకుడు : చంద్రుడు
మెదడును సూచించే స్థానము : లగ్నము
తెలివితేటలను సూచించేవి : గురుడు, 5వ స్థానము
నాడులు సూచించే గ్రహము : బుధుడు
నైసర్గిక రోగస్థానము :షష్ఠము, కన్య
"చంద్రమా మనసోజాతః" అనే పురుషసూక్తంలో వాక్యము అనుసరించి మనస్సుకు కారకుడు చంద్రుడు అవుతాడు. పిచ్చి, ఉన్మాదములపై చంద్రుని ప్రభావము ఎక్కువుగానే ఉంటుందని చెప్పవచ్చును. పైన సూచించిన స్థానములు, భావములు పాపగ్రహములతో కలసినా లేదా చూడబడినా మానసిక స్థితిలో మార్పువచ్చే అవకాశం ఎక్కువుగా ఉంటుంది. ఈ రకమైన మానసిక స్థితివల్ల జ్ఞాపకశక్తిని కోల్పోవడం, పిచ్చెక్కడం జరుగుతుంది. చంద్రుడు బుధుడు పాడైతే చాలు బలహీనమైన మెదడు, బలహీనమైన మానసికస్థితి, నరాలబలహీనతలు ఉంటాయి. కాలపురుషాంగములో శిరోభాగాన్ని సూచించే మేషమును చూడవలసి ఉంటుంది. అలాగే దీర్ఘరోగములకు కారకుడైన రాహువుకు పై స్థానములు మరియు గ్రహములతో సంబంధములు, దృష్టి వీక్షణలున్నపుడు అది దీర్ఘకాలము ఇబ్బందిని కలుగచేస్తుంది. అలాగే వీరిపై గురుడు లేదా ఇతర శుభగ్రహముల ప్రభావము రోగనివారణను సూచిస్తుంది. షష్ఠాధి పతితో వీరికిగల సంబంధాలు, ఏర్పడే యోగములు ఈ రోగాన్ని ప్రభావితం చేస్తాయి.
> లగ్నంలో రవి, సప్తమంలో కుజుడు
> లగ్నంలో శని 5,7,9లలో ఎందైనా కుజుడు
> ధనూరాశి ప్రారంభం లగ్నమై, రవిచంద్రులు కేంద్రములో, గురుడు కేంద్రములలో లేదా తృతీయములో ఉన్నను
> బలహీనుడైన చంద్రుడు శనితో కలసి 12లో ఉన్నను,
> చంద్రశనులు ఒకేరాశిలో ఉండి కుజుని దృష్టి పొందినను,
> గురుడు లగ్నములో కుజ శనులలో ఎవరైనా 7లోను,
> చంద్రుడు బలయుతుడై శని లేదా రాహు వీక్షణ పొందినా
>కుజుడు 4లో ఉండి శనిచే చూడబడినను
> శని 4లో ఉండి గురునిచే చూడబడినను
> శని 4లో ఉండి రాహువు లేదా కేతువు తో కలసినా,
> చంద్రుడు పాపగ్రహములతో కలసిఉండగా, రాహువు 5, 8, 12 లలో ఎందైనా,
> పాపత్వం పొందిన బుధ, చంద్రులు కేంద్రాలలో, పాపనవాంశలలో
> శని,చంద్ర,కుజులు కేంద్రములలో ఉన్నను,
> షష్ఠాధిపతి, శని లగ్నములో ఉన్నను,
> కుజుడు 6లేదా 8లో ఉండి బలయుతుడైన బుధునిచే చూడబడినా
> కుజుడు 3లో పాపగ్రహములతో కలసినా,
> కన్య మీన లగ్నములవారికి శని, రాహువు కన్య ప్రారంభంలో ఉన్నను పిచ్చి ఉన్మాదము, వెర్రి ఉంటాయి.
8. మెదడుకు సంబంధించిన వ్యాధులు (Brain Diseases):
మానవ మేధస్సుకు కారణమైనది అతని మెదడు. ఇది అత్యంతసున్నితమైన ప్రదేశము. అందుకే ఇది కేంద్రనాడీ మండలంలోని పుర్రెలో ఉంటుంది. ఇది పెద్ద, మధ్య, చిన్న మెదడు అనే మూడు భాగాలుగా ఉంటుంది. ఈ మెదడుకు వచ్చే అనారోగ్యములలో ముఖ్యమైనవి. మెదడుకు నీరుపట్టడం, మెదడువాపువ్యాధి, కంతులు ఏర్పడుట, రక్తనాళములో అడ్డంకులు, పార్కిన్సన్వ్యాధి, బిపోలర్ సిండ్రోమ్, స్కిజో ఫెర్నియా, మెదడుకు రక్తసరఫరా తగ్గడం ADHD(Attention deficit hyper- activity disorder) ఇంకా అనేకరకములైన రోగములు చెప్పబడిన వీటన్నిటికి కేంద్రస్థానము మెదడు కనుక దీనిని గురించి పరిశీలించవలసి ఉంటుంది.
9. సూచనాస్థానములు గ్రహములు:
ఆరోగ్యకారకుడు - రవి
మెదడును సూచించే స్థానము- లగ్నము
శిరోరోగములకు కారకుడు- కుజుడు
నైసర్గిక రోగ స్థానము - కన్య/షష్ఠస్థానము
ఇతరములు - షష్ఠాధిపతిని బట్టి రోగము
ఈ రోగములను పరిశీలించడానికి పైనసూచించిన స్థానములను, గ్రహములను ప్రధానంగా పరిశీలించవలసి ఉంటుంది. వీటితో పాటు ఆయా రోగసూచక గ్రహములను పరిగణనలోకి తీసుకుని పరిశీలించవలసి ఉంటుంది.
10. నివారణలు:
పూర్వజన్మార్జితం పాపం వ్యాధిరూపేణ బాధతే
తచ్ఛాంతి రౌషధైర్దానై జప హెూమ క్రియాదిభిః
పూర్వజన్మలో చేసిన పాపములకు ఫలితములు వ్యాధుల రూపంలో బాధిస్తాయి. ఈ వచ్చిన వ్యాధులను ఔషధాలు, దానాలు, జపాలు మొదలైన క్రియలద్వారా శాంతింప చేసుకోవచ్చును.
రోగ నివారణ అనేది కేవలం మందుల వల్లనే కాక కొన్ని సంధర్భాల్లో వాతావరణం మార్పు. నీటి మార్పుల వల్ల కూడా నయం కావచ్చు. రోగి జాతకాన్ని సూక్ష్మంగా పరిశీలించి భావాల ద్వారా రోగాలు కనుక్కోవడం ద్వారా నివారణోపాయాలు అన్వేషించాలి.
రోగ నివారణలో కేవలం మందులే కాక సూర్య కిరణాల ద్వారా వైద్యం చేయడం కూడా ఆచరణలోకి వచ్చింది. దాంతో పాటు రంగుల ద్వారా కూడా వైద్యం చేయడం సులభం. శాంతి పరిహార ప్రక్రియలో అన్నిటికన్నా ఉత్తమమైనది "ఆదిత్య హృదయం" అనే సూర్యస్తోత్రపారాయణం. ప్రతిరోజు సూర్యోదయం తరువాత సూర్యాస్తమయానికి ముందు సూర్యునికి ఎదురుగా నిలబడి చదివితే చాలామంచి ఆరోగ్యం చేకూరుతుంది.
6వ భావం రోగాలను చూపుతుంది. 5వ భావం దానికి వ్యయం కాబట్టి రోగాన్ని వ్యయపరుస్తుంది. అంటే నివారిస్తుంది. కాబట్టి రోగనివారణ 5వ భావం ఇస్తుంది. మేషాదిగా రవి 5వ రాశి అయిన సింహ రాశికి అధిపతి కనుక రోగ నివారణ చేస్తాడు.
స్వే క్షేత్రే అనమీవ విరాజ । అథర్వవేదం 11.1.22
వేదములలో రోగనివారణ మూడు రకములైన పద్ధతులలో ఉంటాయని చెప్పబడింది
1. ఆసురి చికిత్స -శల్యక్రియ(శస్త్రచికిత్సలు)
2. మానుషీ చికిత్స -ఔషధక్రియలు
3. దైవీ చికిత్స -ప్రాణాయామ,హవన,జప,అనుష్ఠానములు
11. జ్యోతిష శాస్త్రరీత్యా రోగపరిహారిక క్రియలు:
గ్రహాల వల్ల సంప్రాప్తించే దుష్ఫలితాలకు ఎదురీది ఆ దుష్ఫలితాలను పోగొట్ట గల లేదా తగ్గించగల ప్రతీకారచర్యను పరిహారం అనవచ్చు. దోషబలాన్ని బట్టి పరిహార క్రియను ఎన్నుకోవాలి. అందులో ఎగుడుదిగుడు ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వదు. ఈ పరిహరిక క్రియలు తంత్రశాస్త్రానికి సంబంధించినవి. దీనిలో జయాప జయాలు తంత్రక్రియలలో ఉపయోగించే వస్తువుల పైన, ఆ వస్తువులతో ఆచరించే తంత్రవిధానంపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి సరియైన, బలమైన పరిహారిక క్రియను ఎన్నుకొని దాన్ని ఖచ్చితంగా, పద్ధతి ప్రకారంగా, ఆత్మసమర్పణతో ఆచరిస్తే ఆయా గ్రహాలవల్ల సంప్రాప్తించిన రోగబాధ నుండి విముక్తి పొందవచ్చు.
ఈ పరిహారిక క్రియలను గురించి ప్రశ్నమార్గ, భృగుసంహిత, ఫలదీపిక (నిస్సంతువులకు) బృహత్పరాశరాహోరాది గ్రంథాలలో వివరించడం జరిగింది. ఆధర్వవేదం, పురాణాలు, యంత్ర చింతామణి, మంత్ర మహార్ణవ, మంత్ర మహోదధి వంటి గ్రంథాలు కూడ ఈ పరిహారిక క్రియలను గురించి వివరించాయి. సుందరాకాండ పారాయణం కొన్ని రోగాలను తగ్గిస్తుందనేది అందరికి తెలిసిందే. "పురాకృతపాపం వ్యాధి రూపేణ పీడితా" అని శాస్త్ర వచనం. కాబట్టి ఆ పురాకృత పాపాన్ని తెలియజేసే జాతకాన్ని పరిశీలించి పరిహారాలతో వ్యాధి నివారణ చేసుకొనవచ్చు. అమెరికా, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశస్థులు కూడా ఈ పరిహారిక క్రియలను నమ్మి వారి ఆరోగ్య సమస్యలకే కాక ఇతర వ్యాపార సమస్యలకు కూడా భారతీయ శాస్త్రాలను సంప్రదిస్తు న్నారు. జ్యోతిష, వాస్తు, ఆగమ, యంత్ర, మంత్ర, తంత్ర గ్రంథాలు ఎన్నో ఇంగ్లీషులోకి అనువదింపబడ్డాయంటే వారికి మనశాస్త్రాలపైన, పద్దతులపైనా ఉన్న గౌరవం నమ్మకం ఎంతటిదో గ్రహించవచ్చు. అంటే పరిహారిక క్రియలలో నమ్మకం ఎంతో అవసరం. అపనమ్మకం, నిర్లక్ష్యం, అహంకారం ఉన్నట్లయితే పరిహారిక క్రియలు పనిచేయవు. దైవారాధన, యంత్రాలు, రత్నధారణ, దానం, తంత్రం యింక ఇతర ప్రత్యేక పద్ధతులలో వ్యాధి నివారణ చేసుకొనవచ్చును.
ఏ ఏ గ్రహాల వల్ల రోగాలు సంప్రాప్తించాయో వాటి ప్రీత్యర్థం ఆయా గ్రహాలకు శాస్త్రాలలో సూచించిన మంత్రాలను జప, అర్చన, తర్పణ, హోమ, దానాది విధానాల ద్వారా ఆచరించి రోగాలను పరిహారించుకోవాలి. లేదా జాతకంలో పంచమాన్ని పంచమాధిపతిని, పంచమాధిపతి స్ధితిని పరిశీలించి ఆయా గ్రహాలకు సూచించబడిన దేవతారాధన ద్వారా కూడా సంప్రాప్త విపత్తును పరిష్కరించుకొనవచ్చు. ఆ యా గ్రహాలకు సూచించిన రత్నాలను ధరించి మరియు ఆయా రత్నాల నుండి వెలువరించే కిరణ ప్రసారం ద్వారా కూడా శుభ ఫలితాలను పొందవచ్చు. ఏ గ్రహం దశలో వ్యాధి ప్రారంభమైనదో ఏ గ్రహం అశుభగ్రహమో దాని యంత్రాన్ని తాయెత్తుగా ధరించి వ్యాధినివారణ చేసుకొనవచ్చు. అదే విధంగా కొన్ని ప్రత్యేక ప్రక్రియల ద్వారా కూడా రోగ నివారణ చేసుకోవచ్చు. అటువంటి వాటిలో పిరమిడ్ థెరపీ, కాస్మిక్ కిరణ థెరపీ, సూర్యకిరణ చికిత్స, రంగుల చికిత్స, రుద్రాక్ష ధారణ వంటివి ప్రత్యేక పాత్రను పొందాయి.
12. ముగింపు:
- జ్యోతిష శాస్త్రాన్ని సరిగ్గా అధ్యయనం చేస్తే మనం డాక్టర్ కంటె ముందుగానే మనిషికి ఉన్న జబ్బు ఏమిటో నిర్ణయించుకోవచ్చు. ఆ ప్రకారంగా సరైన సలహాలు ఇవ్వగలం.
- మొత్తం రాశిచక్రంలో 12 రాసులున్నాయి. ప్రతిరాశి ప్రమాణం 30 డిగ్రీలు - కొన్ని గ్రహాలకు ఇతర రాసులపై ఆధిపత్యం, ఉచ్చస్థితి కలిగి ఉన్నాయి. 12 రాసులను మానవ శరీరంలో విభజించాలి. దీని ప్రకారంగా మనిషి శరీర భాగాలు ఆయా రాసుల కిందకు రాగలవు. సాయన పద్ధతి ద్వారా ఇది చాలా కచ్చితంగా తెలుస్తుంది. జ్యోతిషం ద్వారా వైద్యం, ఆరోగ్యం గురించి ఊహించి చెప్పే ముందు సాయన పద్ధతి క్షేమకరం.
- మావన జీవితంలో రుగ్మతలు రావడం సర్వ సాధారణం. వాటికి ఆ యా రాశి అధిపతులు, లగ్నాధిపతులు కూడా కారణం అవుతారు. అందువల్ల రాశితత్వం, గ్రహ కారకత్వం ద్వారా రోగ నిర్ధారణ చేయడానికి ఉపకరించేది వైద్య జ్యోతిషం.
13. ఉపయుక్తగ్రంథసూచి:
- ఎం. ఏ జ్యోతిష్యం కరస్పాండెంట్ కోర్సు పాఠ్య సామాగ్రి. రెండవ సంవత్సరం పేపర్ 4. సంహితలు. దూరవిద్యా కేంద్రం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. 2013
- కామేశ్వరరావు, ఉపద్రష్ట. శ్రీ వరాహ మిహిరాచార్య విరచిత బృహజ్జాతకము (భట్టోత్పల వ్యాఖ్యానుగుణముగా ఆంధ్రానువాదము). గొల్లపూడి వీరాస్వామి సన్స్, రాజమండ్రి, 1989.
- దక్షిణామూర్తి, వేమూరి. శాస్త్రీయవైద్యజ్యోతిష్యరత్నావళి. మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి, 2006
- రామగోపాల కృష్ణమూర్తి, కంభంపాటి. (ఆంధ్ర తాత్పర్య కర్త). పరాశరమహర్షి ప్రణీత బృహత్పరాశర హోరాశాస్త్రము. గొల్లపూడి వీరాస్వామి సన్స్, రాజమండ్రి, 1990.
- లీలాకృష్ణమూర్తి, ముళ్ళపూడి. సర్వార్ధచన్ద్రిక, పార్ట్ 1. 12వ ముద్రణ, స్వీయ ప్రచురణ, గుంటూరు, 2012
- లీలాకృష్ణమూర్తి, ముళ్ళపూడి. సర్వార్ధచన్ద్రిక, పార్ట్ 2. 6వ ముద్రణ, స్వీయ ప్రచురణ, గుంటూరు, 2012.
- వాసుదేవ శాస్త్రి, ఆలూరు. (తాత్పర్యకర్త) శ్రీ వరాహ మిహిరాచార్య విరచిత బృహజ్జాతకము. వావిళ్ల ప్రతి. మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి, 2009
- శ్రీనివాసరావు, పుచ్చా. (అను.) & బి. వి. రామన్ (మూలం). 40 రోజుల్లో వైద్యజ్యోతిష్యము నేర్చుకోండి. మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "May-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-April-2025
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "MAY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి
బాధ్యత వహించరు.