AUCHITHYAM | Volume-5 | Issue-7 | June 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
7. తెలంగాణ రచయిత్రుల కథలు: ఇతివృత్త వైవిధ్యం
పరుచూరి మౌనిక
పరిశోధక విద్యార్థిని, తెలుగు శాఖ,
శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం,
తిరుపతి, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9866200318, Email: mouniparuchuri123@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
తెలంగాణ కథాసంకలనాలపై పరిశోధనలు చాలా తక్కువగా వెలువడినాయి. 2012లో డా. ఎం. దేవేంద్ర “తెలంగాణ కథ- వర్తమాన జీవన చిత్రణం [1990-2010] పరిశోధనాంశంలో 20 ఏళ్ల తెలంగాణ కథానికలలో ప్రపంచీకరణ ప్రభావాలు, స్త్రీ, దళిత, బహుజన, ముస్లిం, తెలంగాణ ఆస్తిత్వవాదాలు ఎలా ప్రతిబింబిస్తున్నాయో తెలియజేశారు. కందుల శ్రీను “నల్గొండ జిల్లా కథలు- ఉద్యమ చిత్రణ [1901-2005] పరిశోధన అంశంలో నల్గొండ ప్రాంతం ఉద్యమ అంశాలు వివరించారు. 2012లో ఆకునూరి విద్యాదేవి “ఉత్తరతెలంగాణ మూడు దశాబ్దాల కథలు” అనే పరిశోధనలో గ్రామీణజీవితాలు, ప్రజల జీవన పోరాటం, ఉద్యమాలు, దళితసమస్యలు, నల్గొండ జిల్లా ఆర్థిక, రాజకీయ, సామాజికమార్పులు, స్త్రీజీవితం ప్రధానాంశాలుగా వివరించారు. ఈ పరిశోధనవ్యాసం తెలంగాణ సంకలనాలలో ఎంతవరకు రచయిత్రులకు ప్రాధాన్యం ఉంది? వారి కథలు కథాసంకలనాల్లో ఎన్ని ప్రచురింపబడుతున్నాయి? రచయిత్రులు ఏ ఏ ఇతివృత్తాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు? మొదలైన అంశాలను చర్చిస్తుంది. ఆయా రచయిత్రుల కథలలో ఇతివృత్తవైవిధ్యాన్ని పరిచయం చేయడం ఈ వ్యాస ఉద్దేశం. ఈ పరిశోధనవ్యాసానికి కావాల్సిన సమాచారం కొరకు వివిధ విశ్వవిద్యాలయాల గ్రంథాలయాలను సందర్శించి, రచయిత్రులతో చర్చించడమైనది. ఈ వ్యాసం విశ్లేషణాత్మక పద్ధతిలో రూపుదిద్దుకుంది.
Keywords: కథ, ఆధునిక సాహిత్యం, తెలంగాణ కథలు, ఓరుగల్లు కథలు, తెలుగు కథ స్త్రీ చైతన్యం - సాహిత్యం, తెలుగు నాట మహిళ ఉద్యమం.
1. ఉపోద్ఘాతం:
ఆధునిక వచన రచన ప్రక్రియలో ప్రముఖమైనది కథ. ‘‘మానవుని ఊహ ఏనాడు రెక్క విప్పుకొన్నదో ఆనాడే పుట్టింది కథ’’1 అని పేర్కొన్నారు. కథ విస్తృత ప్రచారాన్ని, విశేష పాఠకుల ఆదరణ పొందింది. కథ విస్తృత ప్రచారాన్ని, విశేష పాఠకుల ఆదరణ పొందింది. సంక్షిప్తత, సమగ్రత, పఠనా సౌలభ్యం, తక్షణానుభూతి మొదలైనవి కథకు ఉన్నటువంటి అనుకూలాంశాలు.
ఒక రచయిత రాసిన కథలు ఒక పుస్తకంగా ముద్రిస్తే కథా సంపుటి. వివిధ రచయితలు రాసిన కథలు ఒకే పుస్తకంలో ముద్రిస్తే కథా సంకలనం అని అంటారు. ఇప్పటి వరకు చాలా రకాల కథా సంకలనాలు వచ్చాయి. వాటి కొన్ని విభాగాలుగా చూస్తే అభ్యుదయోద్యమ కథలు, దళిత కథలు, స్త్రీవాద కథలు, విప్లవోద్యమ కథలు, ప్రాంతీయ కథలు కనిపిస్తాయి. కేంద్రసాహిత్య అకాడమీ, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, విశాలాంధ్ర వంటి ప్రచురణ సంస్థలు, వివిధ జిల్లాలోని రచయితలు కథా సంపుటాలు, కథా సంకలనాలు వెలువరిస్తున్నారు. కథకు శాశ్వతత్వాన్ని కల్పించడానికి కథా సంపుటాలు, కథా సంకలనాలు ఉపయోగపడుతున్నాయి.
తెలంగాణ ప్రాంతం నుండి ఓరుగల్లు కథలు, నల్గొండ కథలు, వరంగల్ జిల్లా కథా సర్వస్వము, హనుమకొండ కథలు, కరీంనగర్ జిల్లా ఆధునిక కథా సర్సిత్సాగరం, తెలంగాణ కథా సంకలనాలు వెలువడినాయి. ఇల్లిందుల సరస్వతిదేవి తలెత్తని కస్తూరి, యశోధారెడ్డి రాసిన నిశ్చితార్థ కథ, నందగిరి ఇందిరాదేవి రాసిన పందెం కథ, గోగుల శ్యామల రాసిన రడం కథ, జాజులగౌరి రాసిన మన్ను బువ్వ, నీళ్ళబాయి కథ, పొల్కంపల్లి శాంతాదేవి రాసిన మానవత కథ, ముదిగంటి సుజాతారెడ్డి రాసిన జహంరీ బేబి కథ, హక్కు కథలలో స్త్రీ జీవితం, మానవ సంబంధాలు, కరువు, కుటుంబ సంబంధాలు మొదలైన అంశాలు ప్రధానంగా ఉన్నాయి. వరంగల్ జిల్లా కథా సర్వస్వము, ఓరుగల్లు కథ. యస్.శ్రీదేవి రాసిన (గుండెల్లో ముల్లు కథ), నెల్లుట్ల రమాదేవి రాసిన (కాంతిరేఖ కాలం కథ), కె.పద్మలత రాసిన (బుచ్చిగాడు - బిడ్జి స్కూల్) కథలలో నైతిక విలువలు, స్త్రీ వంచన, స్త్రీ చైతన్యం, స్త్రీ ఆర్థిక స్వాతంత్య్రం ఇతివృత్తాలు అంశాలను తెలియజేశారు. అదే విధంగా వరంగల్ జిల్లా కథా సర్వస్వములో బండారి సుజాత రాసిన మనమే చేస్తే కథ, ఏరుకొండ శశిరేఖ రాసిన కాసుల వేటలో కానరాని బంధాలు కథలలో సామాజిక స్పృహ, స్వార్థపూరిత కథ ప్రధాన అంశాలుగా వివరించారు.
2. తెలంగాణా కథ:
తెలంగాణలో తెలుగు కథ పుట్టేనాటికి తెలుగు సామాజిక పరిస్థితులే కాదు. భాషా పరిస్థితులు కూడా అగమ్యగోచరంగా ఉన్నాయి. తెలంగాణ విద్యాపరంగా వెనుకబడిపోయి ఉండడం అనేది ఆనాటి దుర్భరపరిస్థితులకు తార్కాణం. ఆ తర్వాత తెలంగాణ ప్రజల్లో స్వాభిమానం, స్వభాషాభిమానం, తెలంగాణ విద్యావంతుల్లో సాంస్కృతికవికాసాన్ని పెంపొందించుకునే మార్గాన్వేషణ మొదలైంది. ఫలితంగా తెలంగాణ గడ్డపై భాగ్యనగర్, సుల్తాన్ బజార్లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం, వరంగల్లో రాజరాజనరేంద్ర భాషా నిలయం, సింకింద్రాబాద్లో ఆంధ్రసంవర్ధిని గ్రంథాలయం, విజ్ఞాన చంద్రిక గ్రంథమాల స్థాపించబడి భాషా వికాసానికి తోడ్పడ్డాయి. తెలుగు సాహిత్యంలో ‘తెలంగాణ కథ’ తరతరాల సామాజిక, రాజకీయ చరిత్రలకు జీవనది. సంస్కారం నుండి ఆరంభమైన సమరందాకా సాగిన తెలంగాణ కథాగమనం జనఘోషకు జీవనాడి. అస్తిత్వం కోసం, భూమి కోసం, భుక్తికోసం దాస్యశృంఖలాల విముక్తి కోసం తెలంగాణ కథ వీరోచితంగా పోరాడింది.
3. తెలంగాణా కథ - ఇతివృత్తం:
నిజాం నిరంకుశ ప్రభుత్వం విధానంలో భాగమైన తెలుగుపై ఉర్దూ ఆధిపత్యాన్ని నిరసిస్తూ వెలుగు చూసిన ఆంధ్రోద్యమం, గ్రంథాలయోద్యమం సామాజిక బాధ్యతలో పనిచేయగా ఎంతోమంది తెలుగు ఔత్సాహికులు సాహితీసేద్యం చేపట్టారు. ఈ క్రమంలో పరిశీలించినప్పుడు మొదటగా తెలంగాణ నుండి ‘సంఘసంస్కరణ’ దిశలో కథలు రచింపబడ్డాయి. స్త్రీవిద్య మూఢనమ్మకాల నిరసన, అంటరానితనం, వేశాసమస్యలు ఈ కథల్లో ఇతివృత్తాలు. ఈ విధంగా తెలంగాణ సమాజంలో రాజకీయ దుర్దకతను, సామాజిక వెనుకబాటుతనాన్ని స్పృశిస్తూ ఉదయించిన ఆనాటి కథా సాహిత్యం వాదనకు, వేదనలకు వేదిక నిలిచిపోయిందని చెప్పవచ్చు.
4. తెలంగాణ కథా సంకలనాలు: రచయిత్రులు:
4.1 పద్మలత :
పద్మలత కరీంనగర్‌లో జన్మించారు. 2016 సంవత్సరంలో బతుకమ్మ కథా సంపుటిని వెలువరించారు. ఓరుగల్లు కథలో వీరి కథ బుచ్చిగాడు- బ్రిడ్జిస్కూలు.
4.2 అనిశెట్టి రజిత :
అనిశెట్టి రజిత వరంగల్‌లో జన్మించారు. 1992 సంవత్సరంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో సినియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేశారు. 1977 సంవత్సరంలో కాళోజి పరిచయంతో అనేక సాహిత్య మెలుకువలు నేర్చుకున్నారు. 500 పైగ కవితలు, 100 వ్యాసాలు, 30 పాటలు రాశారు. గులాబీలు జలిస్తున్నాయి. నేనొకనల్ల మబ్బునవుత, చెమటచెట్టు, ఉసురు, దీర్ఘకవితలు, గోరంతదీపాలు, నానీలు, దీస్తఖత్ హైకులు, మట్టిబంధం కథా సంపుటి, ఆకాశపుష్పం, ముసఫర్ నగర్, అగ్నిశిఖ, పొలవరం- ప్రాణాంతక ప్రమాదం పుస్తకాలు వీరి సంపాదకత్వంలో ముద్రించారు. సావిత్రి బాయి పూలే చారిటబుల్ ట్రస్ట్ చీఫ్ అడ్వయిజర్‌గా, జవహర్ లాల్ మెమోరియల్ ట్రస్ట్ న్యూఢీల్లీ పురస్కారం, వరంగల్ జిల్లా ఆల్‌ఫ్రెండ్స్ అసోసియేషన్ పంచరత్న సాహిత్య పురస్కారం, భారతీయ దళిత సాహిత్య అకాడమి వీరాంగన సావిత్రి బాయిపూలే ఫెలోషిప్ పురస్కారం పొందారు. వరంగల్ జిల్లా కథా సర్వస్వంలో వీరి కథ ‘మట్టిబంధం’.
4.3 నెల్లుట్ల రమాదేవి :
నెల్లుట్ల రమాదేవి హైదరాబాద్‌లో జన్మించారు. కార్టునిస్టుగా వెయ్యి కార్టూన్లు ప్రచురించారు. అరవై కథలు వరకు ప్రచురించబడినవి. మనసు మనసుకు మధ్య కథా సంపుటి, రమణీయం కార్టూన్ల పుస్తకాన్నీ, మనసు భాష కవితా సంపుటిని ప్రచురించారు. వరంగల్ జిల్లా కథా సర్వస్వం వీరు రాసిన కథ కాలం మారిన, ఓరుగల్లు కథలో కాంతిరేఖ కథలు రాశారు.
5. తెలంగాణ కథాసంకలనాల రచయిత్రుల కథల్లో ఇతివృత్త వైవిధ్యం:
తెలంగాణ కథాసంకలనాల రచయిత్రుల కథల్లో స్త్రీజీవితం, సామాజిక స్పృహ, సామాజిక చైతన్యం, స్వార్థపూరిత కథలు, వలసలు, మానవ సంబంధాలు, ప్రపంచీకరణ కథలు ప్రధానాంశాలుగా ఉన్నాయి.
5.1 స్త్రీ జీవితం:
“స్త్రీ అంటే ప్రకృతి. ప్రకృతి ప్రతిరూపమే స్త్రీ. ఆకాశంలో సగం స్త్రీ సమాజంలో సగం స్త్రీ, ఏ సమాజానికైనా మూలస్త్రీనే”2.
స్త్రీలేని సమాజాన్ని ఊహించలేము. ఆదిమకాలంలో స్త్రీలు స్వేచ్ఛగా, గౌరవంగా జీవించారు. నాగరికతో క్రమంలో స్త్రీకి స్థానం క్రమంగా కృశించిపోతుంది.
సమాజంలో స్త్రీలు అనేకసమస్యలు ఎదుర్కొంటున్నారు. వివక్షకు గురవుతున్నారు. కుటుంబంలో బానిసలుగా బతుకుతున్నారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేస్తున్నప్పటికి ఆర్థికస్వేచ్ఛలేని స్త్రీలు ఎంతోమంది నేటికీ ఉన్నారు. చాలా సందర్భాల్లో స్త్రీలు తమకు జరిగిన అన్యాయాన్ని కూడా బహిరంగంగా బయటకు చెప్పుకోలేని పరిస్థితిని అనుభవిస్తున్నారు. స్త్రీలపట్ల ఎన్నో ఆంక్షలు, వివక్ష నేటి సమాజంలో కనిపిస్తున్నాయి. వీటిన్నింటిని ఎదిరించి తమకు తాము నిర్మించుకోవడానికి స్త్రీలు ఎన్నో సంవత్సరాలుగా సమాజంలో సంఘర్షణకు గురవుతున్నారు. ఇటువంటి అనేక స్త్రీల సమస్యలను కథావస్తువుగా తీసుకొని రచయిత్రులు కథలు రచించారు. స్త్రీల సమస్యలతోపాటు స్త్రీపురోభివృద్ధికి సంబంధించిన కథలు ఉండడం గమనించదగిన విషయం.
తెలంగాణ రచయిత్రుల కథల్లో స్త్రీ జీవితానికి సంబంధించిన కథలలో ప్రధానంగా స్త్రీ వంచన, స్త్రీ ఆర్థిక స్వాతంత్య్రం, అత్తవారి ఇంటి వేధింపులకు సంబంధించి కథలు.
1. గుండెల్లో ముల్లు (లింగవివక్షత)
2. కాంతిరేఖ (వంచన)
3. కాలం మారిన (స్త్రీ ఆర్థిక స్వాతంత్య్రం)
5.1.1 గుండెల్లో ముల్లు (లింగవివక్షత):
ఓరుగల్లు కథాసంకలనంలో యస్. శ్రీదేవి రాసిన ‘గుండెల్లో ముల్లు’ కథలో ఆడపిల్ల పట్ల వివక్షత ప్రధానాంశంగా ఉంది.
రాఘవ, కళ్యాణికి ఇద్దరు ఆడపిల్లలు. కళ్యాణి కడుపుతో ఉంది. మూడోసారైన మగపిల్లాడు పుట్టాలని, వంశానికి పేరు తేవాలని కలలు కంటూ ఉంటాడు రాఘవ. “మగపిల్లాడు పుట్టకపోతే మరో పెళ్లి చేసుకుంటానని భార్యను బెదిరిస్తాడు”3.
మూడో కాన్పు కూడా ఆడపిల్ల పుట్టడంతో వేరే వారి ఉయ్యాల్లో తన పాపను ఉంచి వాళ్ళ బాబును దొంగతనంగా తీసుకొని వచ్చి తన కొడుకుగా పెంచుకుంటుంది. కొడుకు పుట్టినందుకు సంతోషిస్తాడు రాఘవ. వాడికి చైతన్య అని పేరు పెట్టుకున్నా ఇద్దరు ఆడపిల్లల ఆలనపాలన సరిగా చూసుకోకుండా కొడుకునే ఉన్నత చదువులు చదివిస్తాడు. పెద్దకూతురు తనూజతోపాటు ఆమె చెల్లిలు కూడా చిన్న ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులకు ఆసరా నిలిచేది. ఓసారి చైతన్య క్రికెట్ ఆడి ఇంటికి వస్తుండగా ఒకతను పరిచయవుతాడు. అతడు రాఘవ, కళ్యాణిలు నీ సొంత తల్లిదండ్రులు కాదని, మీ అమ్మ నిన్నుదొంగ తనం చేసిందని చెప్పగా చైతన్య ఆశ్చర్యపోతాడు. తన సొంత తండ్రి వెంటనే వెళ్ళిపోతాడు. కళ్యాణి తాను వదిలేసిన తన మూడో బిడ్డను వెతకడానికి వెళ్లబోతుంటే రాఘవ పశ్చాత్తాపడి తన బిడ్డన తానే వెతికి తీసుకువస్తానని చెప్పి వెళ్తాడు.
ఆడపిల్లను కనిపించినవాళ్ళే ఎంత నిర్లక్ష్యంగా చూస్తున్నారో, ఆడపిల్లపుడితే వంశానికి మచ్చ అనుకునే వాళ్ళకు గుణపాఠంలాగా ఉంది ఈ కథ.
5.1.2 కాంతిరేఖ (వంచన):
వరంగల్ జిల్లా కథాసర్వస్వంలో నెల్లుట్ల రమాదేవి రాసిన ‘కాంతిరేఖ’ కథలో పుట్టింటికి, మెట్టినింటికి దూరమై ఒంటరిగా బతుకుతున్న అమ్మాయి ఆత్మవిశ్వాసంతో ఎలా జీవితాన్ని గెలిచిందో తెలియజేశారు.
కరుణ అణుకువగా పెరిగిన అమ్మాయి. తండ్రి చిన్న తనంలోని చనిపోయినా తల్లి అన్నయ్యలు ఉన్నంతంలో మంచి సంబంధం చూసి కరుణ పెళ్ళిచేశాడు. కరుణభర్త నరేశ్ దుబాయిలోని ఓ ఆయిల్ కంపెనీలో సూపర్ వైజర్గా ఉద్యోగం చేస్తాడు. పెళ్ళైన పదిరోజులకే నరేశ్ ఒక్కడే ఉద్యోగం కోసం దుబాయికి వెళ్ళిపోతాడు.
"ప్రమోషన్ వచ్చాక విడిగా ఇల్లు తీసుకుందామని చెప్పి కరుణను ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయాడు”4. ఆరునెలలైందో లేదో అతనికి హెచ్.ఐ.వి.సోకుతుంది. పుట్టినింటివాళ్ళు, అత్తింటివాళ్ళు ఆమెను వెలివేస్తారు. తన స్నేహితురాలు, సువర్చల సహాయంలో డాక్టర్ రేఖ ప్రకాశ్ దంపతులు ప్రోత్సాహంతో ఆమె ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. ఆమెకు పుట్టిన బిడ్డకు కాంతిరేఖ అనిపేరు పెట్టుకుంటుంది. తనను అవమానించిన వారందరికి సరైన గుణపాఠం చెప్పాలని జీవితాన్ని ఒక సవాల్గా తీసుకొని తన ప్రశ్నకు తానే సమాధానాన్ని వెతుకుంటుంది. చివరికి తన తప్పుని తెలుసుకుని ఆమె అత్తమామలు తిరిగి వచ్చినా పెద్ద మనస్సుతో క్షమిస్తుంది కరుణ. నిరాశలో కృంగిపోకుండా ఆశావాదంలో జీవితాన్ని ఎలా గెలవాలో తనను తిరస్కరించిన వాళ్లను క్షమించి, ధైర్యంతో తన జీవితాన్ని కొనసాగించింది.
5.1.3 కాలం మారిన (స్త్రీ ఆర్థిక స్వాతంత్య్రం):
వరంగల్ జిల్లా కథా సర్వస్వంలో నెల్లుట్ల రమాదేవి రాసిన ‘కాలంమారిన’ కథలో చదువుకొని ఉద్యోగం చేస్తున్నప్పటికి స్త్రీలు ఆర్థిక స్వాతంత్య్రాన్ని కోల్పోతున్నారని, వారికి సమాజంలో గౌరవం లభించడం లేదని తెలియజేశారు.
ఒక మహిళ ఆత్మవిశ్వాసంలో తన గ్రామంలో బట్టల తయారీ పరిశ్రమ స్థాపించి చుట్టు ప్రక్కల ఊళ్ళల్లో ఉండే ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది. అందరికి ఆదర్శప్రాయమైంది. ఆమెకు ఆ ఊరిలో గొప్పపేరు ప్రతిష్ఠలు దక్కుతాయి. ఒక కాలేజీకి మహిళ దినోత్సవానికి అతిథిగా కూడా వెళ్తుంది. సమావేశంలో చాలామంది అమ్మాయిలు మహిళ ప్రగతి గురించి మాట్లాడుతారు. మహిళా అభ్యున్నతి గురించి అద్భుతమైన తన ప్రసంగంతో సమావేశంలో మాట్లాడిన జ్యోతిర్మియి అనే అమ్మాయికి ప్రథమ బహుమతి లభిస్తుంది. తిరిగి వచ్చేటప్పుడు ఆ మహిళకు దారిలో లేడి కండెక్టర్ కనబడుతుంది. ఇక అంతలోనే ఆమెను తీసుకెళ్ళడానికి వచ్చిన కండెక్టర్ భర్త తన భార్యను నానా మాటలు తిట్టి ఇష్టం వచ్చినట్లు బెదిరిస్తాడు. అది విన్న ఆ మహిళ ఎంత కష్టపడి ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్న స్త్రీలకు ఆర్థిక స్వేచ్ఛలేదని ఆలోచిస్తూ బాధపడుతుంది. తన ఇంటి పని మనిషి లక్ష్మీ భర్త వీరయ్య మద్యానికి బానిసై విచ్చల విడిగా తిరుగుతున్న కానీ లక్ష్మీ తన తెలివితేటలు చాకచక్యంతో వీరయ్య తాగుడు మాన్పించి హోటల్ పెట్టుకుని వ్యాపారం చేస్తూ అత్మ విశ్వాసంతో కుటుంబాన్ని పోషించుకుంటుంది. అదే ఆత్మ విశ్వాసం ఆ లేడి కండెక్టర్కి ఉంటే బాగుంటుందనుకుంటుంది ఆ మహిళ.
గౌరవం మర్యాద లేకుండా స్త్రీలు సమాజంలో ఎలా చులకనైపోతున్నారో, ఉద్యోగం స్త్రీలకు ఒక ఆర్థిక స్వాతంత్య్రానిస్తుందన్న విషయాన్ని కూడా తెలుపుతుంది ఈ కథ.
5.2 తెలంగాణ కథాసంకలనాల రచయిత్రుల కథలు- ప్రాంతీయత :
“ప్రాంతీయవాద ప్రభావం కథా సాహిత్యంపై ఉంది. ప్రాంతీయస్పృహతో మాండలికభాషలో రాసిన కథలు ఎన్నో వచ్చాయి”5. ఇటువంటి కథల్లో ఆయా ప్రాంతాలలోని వెనుకుబాటుతనం, నిరక్షరాస్యత, వలస, కరువు, పరాధీనత, వరకట్నం, ఆకల, గ్రామ రాజకీయం, దారిద్య్రం, మధ్యతరగతి బాధలు కనిపిస్తాయి. ప్రాంతాల వారిగా, జిల్లాల వారిగా కథా సంకలనాలు వస్తున్నాయి. విదేశాలలో స్థిరపడిన ప్రవాసాంధ్రులు సైతం అక్కడి విషయాలలో కథలు రాస్తూ సంకలనాలు వెలువరిస్తున్నారు.
5.2.1 మట్టి బంధం:
వరంగల్ జిల్లా కథా సర్వస్వంలో అనిశెట్టి రజిత రాసిన ‘మట్టిబంధం’ కథలో పల్లెని వదిలిపెట్టి పొట్టకూటి కోసం పట్నానికి వలస వెళ్ళిపోయిన పేదవారి బతుకుల గురించి తెలియజేశారు.
అనంతమ్మ, మొగిలయ్య పల్లెనే నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటూ బతుకు గడుపుతున్న వాళ్ళు, వాళ్ళకి నలుగురు పిల్లలు. లక్ష్మీ, పుష్ప, రాముడు, రాజు. మొగిలయ్య తాపీ పనిచేస్తూ, హఠాత్తుగా చనిపోయాడు. రాముడు పరిస్థితి బాలేక పదో తరగతికే చదువు ఆపేశాడు. తమ్ముడు రాజు పొరుగురు వెళ్ళి, బాగా చదివి పది పాసయ్యాడు. రాముడు ప్రోత్సాహంతో రాజు పట్నం వెళ్ళి అక్కడే తాపీ పని చేస్తూ వచ్చిన డబ్బుతో చదువుకుంటాడు. రాజు ఆర్థిక పరిస్థితి బాగా లేక పట్నానికి వలస వెళ్ళిపోదామని నిర్ణయించుకుని పొలాన్ని కూడా అమ్మేశారు.
తల్లిలాంటి పల్లెని వదిలి వెళ్ళిపోతున్నందుకు ఎంతో బాధపడ్డారు. పొలం అమ్మితే వచ్చిన డబ్బుతో పట్నంలో చిన్న ఇల్లు తీసుకున్నారు. అనంతమ్మ, రాముడు అతని భార్య, రాజు అతని భార్య అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉన్నారు. తన మేనత్త అనంతమ్మ వాళ్ళు పడుతున్న కష్టాన్ని చూస్తూ మేనకొడలు సమత ఎంతో బాధపడింది. రాముడు కుట్టుమిషను పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తే, రాజు తాపీ పని చేస్తూ చదువుకుంటూ కుటుంబాన్ని పోషిస్తారు. పల్లె వాతావరణానికి పట్నంలో వాతావరణానికి ఉన్న తేడాలను తలచుకుంటూ అనంతమ్మ కుటుంబ జీవితాన్ని భారంగా మోస్తుంది.
అనుబంధాలు, మాయకారాలన్ని పల్లెలని వదిలి పట్నానికి వలస వెళ్ళిపోయిన పేదవారి బతుకులను, పట్నంలో ఉన్న స్వచ్ఛతలేని జీవన విధానాన్ని వివరిస్తుంది.
5.3 తెలంగాణ కథాసంకలనాల రచయిత్రుల కథల్లో సామాజిక జీవితం:
“తెలంగాణప్రాంతం విభిన్నసామాజిక, సాంస్కృతిక అంశాల సమ్మేళనం”. ఇక్కడి సమాజంపైన భౌగళిక, ఆర్థిక, రాజకీయ అంశాలు. తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. తెలంగాణ రచయిత్రల కథల్లో డబ్బుమైకంలో పడి మానవ సంబంధాలు మరిచిన కథ, మధ్య తరగతి వాళ్ళ మనస్తత్వాన్ని, ప్రపంచీకరణ కథలు, సంప్రదాయాలు, తినడానికి తిండిలేని అనాథ పిల్లల జీవితాలను తెలియజేశారు.
1. మనమే చేస్తే (సామాజిక స్పృహ)
2. బుచ్చిగాడు - బ్రిడ్జ్జి స్కూల్ (సామాజిక చైతన్యం)
3. కాసులవేటలో కానరాలి బంధాలు (స్వార్థపూరితకథ)
5.3.1 మనమే చేస్తే (సామాజిక స్పృహ):
వరంగల్ జిల్లా కథా సర్వస్వంలో బండారి సుజాత రాసిన ‘మనమే చేస్తే’ కథలో తన గురించి తాను ఆలోచించకుండా ఇతరుల కోసం పాటుపడే మనిషి మానవత్వాన్ని అతని నిస్వార్థ హృదయాన్ని తెలియజేశాయి.
నవీన్ అనే వ్యక్తి రోడ్డు మీద వెళుతుంటే భయంకరమైన యాక్సిడెంట్ జరిగిన దృశ్యాన్ని కళ్లారా చూస్తాడు. యాక్సిడెంట్ జరిగిన వ్యక్తి అక్కడిక్కడే ప్రాణాలు వదిలివేయడం. నవీన్ని ఎంతో బాధకు గురిచేసింది. రోజంతా అదే దృశ్యం అతన్ని ఏ పని చేసుకోనివ్వలేదు. ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా అదే ధ్యాస, ఇంటికి వెళ్ళినా పరధ్యానంలో ఉన్నాడు నవీన్. భార్య వసుంధర పిలిచినా పట్టించుకోవడం లేదు.
రోజు రోజుకూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయని, ఎంతోమంది అమాయకుల ప్రాణాలు కోల్పోతున్నారని, దీనికి పరిష్కారం ఏమిటా అన్న ఆలోచనల్లో ఉన్నారని తన భార్యకి జరిగినదంతా వివరిస్తాడు. భర్త ప్రమాదంలో చనిపోతే భార్యభర్తలు రోడ్డున పడ్డ దు:స్థితిని గురించి తన భార్యకు చెబుతున్నాడు నవీన్, రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రయాణికులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంలో రోడ్డుకి, ఇరువైపులా నిలచి ఉన్న నీటిని తొలగించడం, స్ట్రీట్ లైట్స్ వేయడం, చెత్తాచెదారం తీయించడం, చెట్లను పెంచడం, కష్టాల్లో ఉన్న వారికి సహాయం అందించడం మొదలైన పనులు చేశాడు నవీన్. ఇతరుల నుండి కూడా తద్వారా సహాయం అందింది.
ఎవరో వస్తారని ఎదురు చూడకుండా మన కళ్లముందు జరుగుతున్న సమస్యని మనమే పరిష్కరించుకోవాలని సందేశాన్నిస్తుంది కథ. పరోపకారంలో మనిషి మొదలవునని తెలియజేస్తుంది ఈ కథ.
5.3.2 బుచ్చిగాడు - బ్రిడ్జి స్కూల్ (సామాజిక చైతన్యం):
ఓరుగల్లు కథా సంకలనంలో కె. పద్మలత రాసిన ‘బుచ్చిగాడు - బ్రిడ్జిస్కూల్’ కథలో ఆనాథ పిల్లవాడి బతుకు ఎంతదీనంగా ఉందో, తిండి కరువై వారి జీవితంలో ఎలా రోడ్డున పడిందో హృదయ విచారకంగా తెలియజేశారు.
ఈశ్వర్ హైదరాబాద్లో పనిచేసే ఉద్యోగి. తన మిత్రుడు ప్రసాద్ కలిసి ప్రతిరోజు రైలులో వెళ్ళి ఉద్యోగం చేస్తూ, సాయంత్రానికి తిరిగి వచ్చేవాడు. “ఈశ్వర్ భార్య గిరిజ సమయానికి అన్ని సౌకర్యాలు అందించి ఈశ్వర్ అడుగుజాడలో నడిచే ఇల్లాలు”6. తన పిల్లల్ని ఊళ్లో ఉన్న పాఠశాలలో చదివించుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. ఈ రోజు ఈశ్వర్కి రైలులో ఓ కుర్రవాడు బిచ్చమడుగుతూ కనిపిస్తాడు. ఈశ్వర్ ఆ బిచ్చగాడి వేషధారణ, అలవాట్లు గమనిస్తూ రోజు అతని దగ్గరై పోయాడు. అతన్ని బుచ్చిగా ఉంటారని, రైల్వేస్టేషన్ దగ్గర్లో ఉన్న గుడిసెలో ఓ ముసల్దాని దగ్గర ఉంటాడని తెలుసుకున్నారు. అతనికి తల్లిదండ్రులెవరూ లేరని, ఆనాథ అని తెలిసి అతన్ని బాగా చదివించాలని బ్రిడ్జి స్కూల్కి పంపించాలని అనుకుంటాడు. మొదట్లో బుచ్చిగాడు చదువుకోవడానికి ఇష్టంలేకపోయినా తర్వాత కొన్ని రోజులకు చదువుపై శ్రద్ధ కలిగి బ్రిడ్జిస్కూల్లో జాయిన్ చేయమని ఈశ్వర్ని అడుగుతాడు. ఈశ్వర్ సరేనంటాడు. ఈశ్వర్ ఓ పని మీద బెంగళూరు వెళ్ళివచ్చేసరికి బుచ్చిగాడు రైలు పట్టాలమీద పడి చనిపోయాడని, బుచ్చిగాడి స్నేహితుడు వెంకటేశ్ ద్వారా తెలుసుకొని ఎంతో దు:ఖిస్తాడు.
ఆదుకునేవాళ్ళు కరవై, ఆనాథ పిల్లల జీవితం ఎలా ముగిసిపోతుందో తెలియజేస్తుంది కథ. ఆకలికి తట్టుకోలేక, చదువుకునే వయస్సుల్లో బిచ్చమెత్తుకుంటున్న పిల్లలను గురించి వివరిస్తుంది ఈ కథ.
5.3.3 కాసులవేటలో కానరాలి బంధాలు (స్వార్థపూరితకథ):
వరంగల్ జిల్లా కథా సర్వస్వంలో ఏరుకొండ శశిరేఖ రాసిన ‘కాసుల వేటలో కానరాలి బంధాలు’ కథలో డబ్బుపై ఉన్న వ్యామోహంలో తల్లిదండ్రులను కూడా లెక్క చేయని కొడుకులు గురించి తెలియజేశారు.
సత్యనారాయణకు, సావిత్రల ఒక్కగానొక్క కొడుకు విజయ్ అంటే ఎంతో ప్రేమ, అమెరికా వెళ్తానని, ఉద్యోగం చేస్తానని అరచి గోలచేస్తే ఉన్నపొలం అమ్మి.. నగలు తాకట్టుపెట్టి వచ్చిన డబ్బులో అమెరికా పంపిస్తాడు. కొంతకాలం గడిచిపోతుంది. కొడుకును చూడాలన్న కోరికతో సావిత్రి మంచాన పడుతుంది. ఎన్నిసార్లు కబురు చేసిన అతడురాడు. ఆ బాధలోనే ఆమె చనిపోతుంది. పక్కింటి విశ్వనాథం మాష్టారు విజయ్కి ఈ విషయాన్ని తెలియజేసినా అతడు సమయం లేదని, బిజీగా ఉన్నాడని ఫోన్ పెట్టేస్తాడు. చివరికి కర్మకాండలు కూడా సత్యనారాయణ, విశ్వనాథమే చేస్తారు. సావిత్రి పెంచుకున్న కుక్కు పిల్ల వంటి మూగజీవులు కూడా ఎంతో బాధపడుతూ శ్మశానానికి వస్తాయి. కాని రక్తం పంచుకున్న కొడుకి మాత్రం డబ్బు మైకంలో పడి తల్లిదండ్రి గుర్తుకురారు. బుజ్జి అని సావిత్రి ముద్దుగా పిలుచుకునే పిల్లి ఏడుస్తూ చనిపోతుంది. కొన్ని రోజుల తర్వాత విశ్వనాథం విజయ్కి ఫోన్ చేసి మీ నాన్నను నీతో తీసుకువెళ్ళు అని చెప్పినా, ఉన్న ఇల్లుని అమ్మి డబ్బు నాకు అకౌంట్లోకి వేసి, మా నాన్నను వృద్ధాశ్రమంలో చేర్పించండి అంటాడు విజయ్.
మన కడుపున పుట్టిన కొడుకుల కంటే మనం పెంచుకున్న మూగ జంతువులే నయమనే సందేశిస్తున్న కథ, డబ్బు మోజులోపడి ప్రేమను బంధాలను మరిచిపోయిన కొడుకుల గురించి తెలియజేస్తుంది కథ.
6. ముగింపు:
- తెలంగాణ కథా సంకలనాల రచయిత్రుల కథల్లో ప్రాంతీయ ప్రభావం కథా సాహిత్యంపై ఉంది.
- ఒకే వస్తువుకు సంబంధించిన కథల్లో రచయిత్రుల వివిధ అభిప్రాయాలు, దృక్పథాలు తెలుసుకోవచ్చు.
- వివిధ ప్రాంతాల రచయిత్రుల కథల ద్వారా మాండలిక భాష, యాసలు తెలుసుకోవచ్చు.
- తెలంగాణ రచయిత్రల కథలో స్త్రీ వివక్షత, వంచన, స్త్రీ ఆర్థిక స్వాతంత్య్రం, లైంగిక వేధింపులు, స్త్రీ చైతన్యం, ఆకలి, దారిద్య్రం, సామాజిక స్పృహ, మానవ సంబంధాలకు సంబంధించిన ప్రధాన అంశాలను ఈ కథలలో వివరించారు.
- తెలంగాణ రచయిత్రుల కథలో ప్రాంతీయతకు సంబంధించిన కథలు తక్కువ ఉన్నాయి.
- తెలంగాణ ప్రాంతంలో, ఆయా కాలంలో వచ్చిన ఉద్యమాలు, నిజాం పరిపాలనకు, తెలంగాణపై సరిహద్దుల రాష్ట్రాల భాష ప్రభావం మొదలైన అంశాలను గురించి వివరించారు.
7. పాదసూచికలు:
- తెలుగు కథానిక, వేదగిరి రాంబాబు, పుట.2
- మహిళలు - సోషలిజం, ఆగష్ట్ బెబెల్, పుట.9
- ఓరుగల్లు కథలు, అరసం, పుట.49
- ఓరుగల్లు కథలు, అరసం, పుట.139
- తెలుగు కథ ప్రాంతీయ అస్థిత్వం, పుట.21
- సామాజిక మానవ శాస్త్రం - ప్రాథమిక సూత్రాలు, వి.సత్యనారాయణ, బి.చక్రపాణి, పుట.56
- ఓరుగల్లు కథలు, అరసం, పుట.52
8. ఉపయుక్తగ్రంథసూచి:
- అభ్యుదయ రచయిత సంఘం, వరంగల్ జిల్లా, (ఆల్ ఇండియా రేడియో), 2010
- దేవేంద్ర, ఎం. తెలంగాణకథ- వర్తమాన జీవితచిత్రణ (1990-2010), శ్రీచందన మారోజు పబ్లికేషన్, హైదరాబాద్, 2021
- నారాయరెడ్డి, సుంకిరెడ్డి - సురేంద్ర రాజ, అంబటి (సం) మత్తిడి (తెలంగాణకయిత) తెలంగాణ సాంస్కృత వేదిక, హైదరాబాద్, 2002
- రంగానాథాచార్యులు, కె.కె., తొలినాటి తెలుగు కథానికలు, మాడభూషి రంగాచార్య స్మారక సంఘం, హైదరాబాద్, 2008
- రజిత, అనిశెట్టి (సం) ఓగర్ (తెలంగాణ విశిష్ట కవితా సంకలనం) రుద్రమ ప్రచురణలు, వరంగల్, 2013
- రజిత, అనిశెట్టి (సం) సుజాతరెడ్డి ముదిగంటి (పర్యవేక్షణ), నవచేతన పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్
- వెంకట సుబ్బయ్య, వల్లంపాటి, కథాశిల్పం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, ప్రచురణ, 1995
- శ్రీధర్, వెల్దండి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కవిత్వం, తెలంగాణ సాహిత్య అకాడమీ, హైదరాబాద్. 2017
- శ్రీరంగస్వామి, టి. (సం.) - వరంగల్ జిల్లా కథా సర్వస్వం (1927-2015), శ్రీ లేఖ సాహిత్య సాంస్కృతిక సంస్థ, వరంగల్
- శ్రీరామమూర్తి, కోడూరి, కథలెస్తారు, వ్యాస సంకలనం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "May-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-April-2025
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "MAY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి
బాధ్యత వహించరు.