AUCHITHYAM | Volume-5 | Issue-7 | June 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
6. ‘విముక్త’కథలు: స్త్రీవాద దృక్పథం

డా. ఢిల్లీశ్వరరావు సనపల
తెలుగు అధ్యాపకులు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పురుషులు), శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
సెల్: +91 9441944208, Email: eswar.dilli820@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
ఆధునిక తెలుగు సాహిత్యంలో తన రచనల ద్వారా జాతీయ స్థాయిలో తనకంటూ స్థానాన్ని సంపాదించుకున్న రచయిత్రి ఓల్గా. విముక్త పేరుతో ఓల్గా రాసిన కథలు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందడం ఈ కథా సంపుటి ప్రత్యేకత కాగా పురాణ పాత్రలను స్త్రీవాద దృక్పథంతో మలిచి కొత్త కోణాన్ని ఆవిష్కరించడం మరో విశేషం. ఓల్గా రాసిన విముక్త కథల్లో స్త్రీవాద దృక్పథం పరిశీలన ఈ వ్యాసం ముఖ్యోద్దేశం. కథల్లోని సంఘటనలు, సంవాదాలు, సందర్భాలు ఆధారంగానూ, పూర్వ రచనా పరిశీలన, విశ్లేషణ, విమర్శా విమర్శనం, శాస్త్రీయ అనువర్తనాలు ఆధారంగా కథలను పరిశీలించడం వ్యాసం ప్రధానాంశం.
Keywords: విముక్త కథలు, స్త్రీ స్వేచ్ఛ, సూర్పణఖ, అహల్య, రాడికల్ ఫెమినిజం, మార్క్సిస్టు ఫెమినిజం, పురుషస్వామ్యం, అస్తిత్వం, స్త్రీవాద దృక్పథం
1. రచయిత్రి పరిచయం:
ఆధునిక తెలుగు సాహిత్యంలో తన రచనల ద్వారా ఒక ప్రత్యేక గుర్తింపును పొందారు ఓల్గాగా ప్రసిద్ధి పొందిన పోపూరు లలితకుమారి. ఓల్గా రచనలు ఒక కొత్త ఆలోచనకు, నూతన మార్గానికి నాందిగా నిలుస్తాయనడానికి ఆమె రచనల్లోని అనేక సంఘటనలు, సంభాషణలు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తాయి. సహజ, స్వేచ్ఛా, మానవి, కన్నీటి కెరటాల వెన్నెల, ఆకాశంలో సగం, గులాబీలు, గమనమే గమ్యం వంటి నవలలు, రాజకీయ కథలు, ప్రయోగం, భిన్న సందర్భాలు, విముక్త, మృణ్మయనాదం, పెళ్లి ఇతర కథలు, అన్వేషి వంటి కథా సంకలనాలు, యుద్ధము-శాంతి, లక్ష్మణ రేఖ, ద్రౌపది వంటి నృత్య రూపకాలతో పాటు కవిత్వం, విమర్శ వ్యాసాలు, అనువాద రచనలు చేసి తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నారు ఓల్గా.
2. "విముక్త" కథలు - భూమిక:
ఆధునిక కాలంలో తెలుగు సాహిత్యంలో వచ్చిన అనేక ఉద్యమాల్లో స్త్రీవాద సాహిత్యోద్యమం ఒకటి. ఆధునిక తెలుగు సాహిత్యంలో స్త్రీ సమస్య చిత్రన అనేక రచనల్లో అగుపిస్తున్నప్పటికీ బలమైన వస్తువు, నేపథ్యంతో ప్రత్యేకమైన ఉద్యమంగా రూపుదిద్దుకున్నది మాత్రం 1980 దశకంలోనే. ఓల్గా రాసిన విముక్త కథలు స్త్రీవాద నేపథ్యంలో బలమైన వస్తువుతో వెలువడ్డాయి. "స్త్రీల మధ్య సహకారం నాకు చాలా ప్రియమైన భావన. ఆ భావనలో పూర్తిగా లీనమై రాసిన కథలివి. ఈ కథల్లో వర్తమాన సమాజంలో స్త్రీల వేదనకు ప్రాతినిధ్యం వహించే కథలు కూడా. ఇవాల్టి సమాజంలో అనేక ఆంక్షలకూ అవమానాలకూ హింసలకూ గురై వాటినదిగామించి లేస్తున్న స్త్రీలు కొందరైతే, వాటిలోనే కూరుకుపోయి వాటిని దాటలేక, దాటాలని తెలియక నానాయాతనలు పడుతున్న స్త్రీలు ఎందరో. ఆ స్త్రీల కోసమే ఈ కథలు. మనల్ని మనమే అనే నమ్మకాన్ని ఈ కథలు మనకి కలిగిస్తాయని నా ఆశ" (విముక్త కథలు నా మాట పేజి 9,10) అని పలకడంలోనే తన అభిమతాన్ని స్పష్టపరిచారు రచయిత్రి. పురాణకథలను, పురాణం పాత్రలను కొత్త కోణం నుంచి తిరగరాస్తూ స్త్రీవాద దృక్పథంతో ఆలోచించి మలిచిన కథలు విముక్త కథలు. స్త్రీవాద ఉద్యమానికి ప్రధాన భూమికైన అస్తిత్వ నిరూపణం, పితృస్వామ్య వ్యవస్థ ఖండన, సంకెళ్ల బంధ విముక్తి, స్త్రీ సహజ ప్రకృతి ఆరాధన చిత్రణ, స్త్రీలపై రుద్దపడిన ఏకశిలా సదృశ్యమైన అంశాల తృణీకరణ, హేతు నిరూపణ, స్త్రీ మనస్తత్వ చిత్రన వంటి అంశాలను ప్రధానంగా చర్చిస్తూ వచ్చిన కథలివి. సంక్షోభం, సంఘర్షణ, చైతన్యం, ప్రయోగం విముక్త కథల్లో అడుగడుగునా అగుపిస్తాయి.
3. విముక్త కథలు - స్త్రీవాదదృక్పథం:
వర్ణవ్యవస్థలో ఉన్న రుగ్మతలు దళితవాదానికి దారి చూపితే కుటుంబ వ్యవస్థలోని పురుషస్వామ్యపు కాఠిన్యత స్త్రీవాదానికి దారి చూపింది. (తెలుగు సాహిత్య ప్రక్రియలు - ధోరణులు: ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు 15. 10. స్త్రీవాదం- పేజీ 291) పితృస్వామ్య వ్యవస్థలోని అనాగరిక ధోరణిని ధిక్కరించడం, వివాహవ్యవస్థ, హింస, లైంగిక హింస, మతం, సంప్రదాయాలపేరుతో జరుపుతున్న వివక్ష ప్రధాన అంశాలుగా స్త్రీవాదం రూపుదిద్దుకొని ఉద్యమ రూపందాల్చింది. స్త్రీవాద సిద్ధాంతాల్లో లిబరల్ ఫెమినిజం, రాడికల్ ఫిమేనిజం, మార్క్సిస్టు ఫెమినిజం, సోషలిస్టు ఫెమినిజం, కల్చరల్ ఫెమినిజం, హ్యూమనిస్ట్ ఫెమినిజం, డెమోక్రటిక్ ఫెమినిజం అనే భిన్న రూపాలు కలవు. అందులోని మార్క్సిస్ట్ స్త్రీవాదం, రాడికల్ స్త్రీవాదం ప్రస్తావించిన సమసమాజ స్థాపన, పితృస్వామ్యం, ఉత్పత్తి విధానాల మార్పు, పురుషాధిక్యం వంటి విషయాలను ప్రధానంగా చర్చికి పెట్టడం విముక్త కథల ప్రధానోద్దేశ్యం. పితృస్వామ్య వ్యవస్థకు మూలాధారం ఆర్య సంస్కృతి, ఆర్య సామ్రాజ్య విస్తరణ. దాని మూలంగా ఆడవారు పావులైన విధానం గూర్చి రచయిత్రి విముక్త కథల్లో వివరించిన తీరు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. ధర్మ సంఘర్షణ యధాస్థితి వాదం అయితే న్యాయపోరాటం ప్రగతిశీల తిరుగుబాటు. శరీరం, రాజకీయాలు, సౌందర్యత్మకహింస, వేదనలు, బృణహత్యలు, వంటివి స్త్రీని, స్త్రీవాద ఉద్యమాన్ని ఆలోచింపజేసే అంశాలు
3.1 పురుషాధిక్య ఖండనం :
సెక్స్ వేరు జెండర్ వేరు. సెక్స్ అనేది శరీర నిర్మాణం, అవయువాలకు సంబంధించినది కాగా జెండర్ అనేది వ్యవస్థగతమైందిగా ఉంది. పురుషస్వామ్యం, పురుషాధిక్యత అనేది జెండర్ ను సూచిస్తుంది. సమాగమం కథలో స్త్రీ - పురుషుల బంధం ఎలా ఉండాలో తెలియజేస్తారు రచయిత్రి. స్త్రీ పురుషులు అన్యోన్య సంబంధంగా ఉండాలే గానీ ఆదిపత్య ప్రదర్శనగా ఉండరాదనే విషయాన్ని చెప్పకనే తెలియజేస్తుంది సూర్పణఖ - సుధీరుడుల బంధం. సూర్పణఖ, సీతకు బదులు పలుకుతూ
"నాకొక పురుషుని సహచర్యం దొరికింది. నా చేతుల్లోంచి ప్రకృతిలోకి ప్రవహించే సౌందర్యాన్ని కొద్దిసేపు తనది చేసుకొని తనను నాకర్పించుకునే అదృష్టవంతుడు ఉన్నాడు" (సమాగమం కథ పేజి 25 ) అని పలికిన సూర్పణఖ మాటల్లో స్త్రీ, పురుష బాంధవ్యం ఎలా ఉండాలో తెలియ వస్తుంది.
స్త్రీ జీవిత సాఫల్యానికి పురుషుడి సహచర్యం అవసరమా? అనే ప్రశ్నకు జవాబు అన్నట్లుగా "సాఫల్యానికి అర్థం పురుషుని సహచర్యంలో లేదని గ్రహించాను. అది తెలిసాకే నాకు ఈ పురుష సహచర్యం కలిగింది.( సమాగమం కథ పేజి- 26) అని సూర్పణఖ పలికిన మాటల్లో స్త్రీవాదం ఆశించిన స్త్రీ, పురుష సమానత్వం తెలియజేశారు రచయిత్రి. పురుషుడు చేసిన తప్పుకు స్త్రీ బలికావడం, స్త్రీని శిక్షించడం ఏ సమాజ నీతి? ఏ సంస్కృతిలోని సంస్కారం? అని ప్రశ్నించే కథ మృణ్మయనాదం. తప్పు పురుషుడు చేస్తే శిక్ష స్త్రీ అనుభవించడం ఏమిటి? అని ప్రశ్నించే కథ ఇది. పురుషుడు తప్పు చేస్తే స్త్రీకి శిక్ష విధించడమేనా నాగరికత? అనేది ఈ కథలో చర్చకు వస్తుంది. " ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిప్పుడు! దాచేస్తే దాగని సత్యం" (మహాప్రస్థానం దేశచరిత్రలు పేజి- 76) అని పలికిన శ్రీశ్రీ మాటల్లోగల సత్యాన్వేషణ ఈ కథల్లో దర్శనమిస్తుంది.
3.2 ప్రగతిశీల దృక్పథం:
స్త్రీ జీవిత పరమార్ధం ఏమిటి? అనే ప్రశ్నకు అనాదికాలం నుండి వస్తున్న సమాధానం భర్తకు భార్యగా ఉండడం, బిడ్డలను కనడం, తల్లిగా మాతృత్వం పంచడం ఇవే నిజమైన సార్ధకతగా సంప్రదాయ బద్దం చేయబడింది. కానీ ఇందులో గల సంక్లిష్టతను మాత్రం సంప్రదాయ శక్తుల దృష్టి కోణంలో స్థానం పొందలేదు. స్త్రీవాదం ఆ హేతువునే ప్రశ్నిస్తుంది. సంక్లిష్టతను వ్యక్త పరుస్తుంది. దాన్ని చర్చకు పెడుతుంది. తద్వారా నిజనిర్ధారణా ప్రయత్నం చేస్తుంది. జీవిత సార్ధకతపై సంప్రదాయ శక్తుల దృష్టి కోణం ఒకవిధంగా ఉంటే ప్రగతిశీల శక్తుల దృష్టి కోణం మరో విధంగా ఉంటుంది. ఇక్కడ ఎవరి వాదనలు వారివి. కానీ ప్రశ్నకి నిలవగలిగేది మాత్రం ప్రగతిశీల దృష్టి కోనమే అనేది వాస్తవం. సమాగమం కథలో ప్రగతిశీల శక్తులకి ప్రతీక సూర్పనఖ కాగా సంప్రదాయ శక్తుల కబంధ హస్తాలను సడలించుకుంటూ ప్రగతిశీలత వైపు మార్పు చెందుతూ వాస్తవాన్ని గుర్తెరిగి అటువైపుగా ప్రయాణించే పాత్రకు సీత ప్రతీక. అయితే సంప్రదాయం ప్రగతిశీలంగా మార్పు చెందడం అంత సులువు కాదు. అది కాలపరిణామం, విషయ పరిణామంగా ప్రతిఫలిస్తుంది. మార్పు అనివార్యం కనుక ప్రగతిశీలం సంప్రదాయాన్ని తనలోకి చేర్చుకుంటూ సాగిపోతుంది. ఈ కథలో సీతస్థితి ఇటువంటి పరిణామాన్ని ప్రదర్శిస్తుంది.
3.3 స్త్రీ స్వేచ్ఛ:
సమాజంలో ఉన్న అసమానతలు, స్త్రీలపై జరిగే ఇంటా బయట దాడులు వంటి కారణాల నేపథ్యంలో నేడు స్త్రీవాదం స్త్రీ స్వేచ్ఛను గూర్చి బలంగా తన గొంతు వినిపిస్తుంది. విముక్త కథల్లో స్త్రీ స్వేచ్ఛను గూర్చి బలంగా పేర్కొన్నారు రచయిత్రి. సీతా నీ జీవితాన్ని ఎలా సార్ధకం చేసుకుంటావు? అని సూర్పణఖ అడిగిన ప్రశ్నకు "కుమారుల పెంపకంలో నా జీవితం సార్ధకమవుతుంది"(సమాగమం కథ పేజి 26) అని బదులు పలికిన సీతకు అదే నీ జీవిత ఆదర్శమా? అని ప్రశ్నరూపంలో హెచ్చరిస్తుంది సూర్పణఖ. ఎన్నడూ రాజ్యంలో ఉండకపోయినా నీ జీవితం రాజ్యంతో ఎలా ముడిపడిపోయిందో కదా సీత అని సూర్పణఖ పలికిన మాటలు బంధాలు, బాధ్యతలు సగటు స్త్రీ చుట్టూ ఎలా బిగుసుకుని ఉన్నాయో చెప్పకనే తెలుస్తోంది. అరణ్య విహారంలో హాయి మరెక్కడా దొరకదు సీత అని పలికిన సూర్పణఖ మాటల్లో నాకరిక జీవితం అనబడే సామాజిక జీవితం అవసరం లేకున్నా వ్యక్తిని బంధాల పేరుతో బలహీనపరిచి వ్యవస్థ అనే ముడిని బిగిస్తుంది. ఇక్కడ అరణ్యం అనేది స్వేచ్ఛకు ప్రతీక. స్వేచ్ఛ అనే పదాన్ని నిశితంగా పరిశీలించాల్సిన సందర్భం. ఇక్కడ స్వేచ్ఛ పదానికి విశృంఖలత అని అర్థం కాదు. అక్కరలేని బంధాలలో పడి బలి కాకపోవడం మాత్రమే. ఇందులో అరణ్యం సహజ స్థితికి ప్రతీక కాగా నగరం కృత్రిమత్వానికి ప్రతీక. స్త్రీ ప్రపంచం, పరిధి విస్తృతం కావాలని చెబుతూ- "ఈ ప్రకృతిని, సకల జీవరాశి పరిణామ క్రమాన్ని పరిశీలించాను. అందులో నిరంతరం జరిగే మార్పులను గమనించాను. ఈ మొత్తం ప్రపంచంలో నువ్వున్నావు ఒక్క రామునికే కాదు" (మృణ్మయనాదం కథ పేజి43) అని అహల్య సీతతో పలికిన మాటల్లో స్త్రీ తనని తాను బంధాలకు అతీతంగా తన పరిధిని విస్తృతి పరుచుకోవాలనే వాస్తవాన్ని తెలియజేస్తుంది.
3.4 సామాజిక సమానత్వం :
స్త్రీవాదం చర్చకు లేవనేత్తే అంశాల్లో సామాజిక సమానత్వం ఒకటి. విముక్త కథల్లో స్త్రీకి సామాజిక సమానత్వ అవసరాన్ని ప్రస్తావనకు తెచ్చారు రచయిత్రి. స్త్రీలకు సంబంధించి సామాజిక సమానత్వం నేటికీ ప్రశ్నార్థకంగానే ఉందనేది అంగీకరించాల్సన అంశమే. స్త్రీలను భోగవస్తవుగా చూస్తున్న సంస్కృతి ఈ సమాజంలో ఉందని దాన్ని రూపుమాపాల్సిన పరిస్థితి రావాలని చెబుతూ "ఏముంది తల్లీ. అందమైన స్త్రీలను భోగవస్తువులనుకుంటారు కదా పురుషులు. ఇంద్రుడు అనే వానికి ఆమె మీద కోరిక కలిగింది."(మృణ్మయనాదం కథ పేజి -31) అంటూ పలికిన కౌసల్య మాటలు నేటి సమాజస్థితికి అద్దం పడుతున్నాయి.
చెయ్యని తప్పుకు దోషిగా నిలవాల్సిన పరిస్థితి అడుగడుగునా స్త్రీలకు ఎదురవుతున్నాయి. విముక్త కథల్లో అహల్య, రేణుకలు అసమానతలకు , వివక్షకు గురై వారు చేయని తప్పుకి, వారి ప్రమేయంతో నిమిత్తం లేని సందర్భానికి వారిని బాధ్యులను చేసి విచారణకు నిలబెడుతుందనే విషయం అంతర్లీనంగా నడుస్తుంది.
3.5 అస్తిత్వ ప్రకటన:
మగవాడు పుడతాడు ఆడది తయారు చేయబడుతుంది అనే మాటల్లోనే స్త్రీ అస్తిత్వం ఏమిటో అర్థమవుతుంది. సూర్పణఖను కలవడానికి వెళ్లిన సీతను చూసిన సూర్పణఖ ఈమె సీతా! శ్రీరాముడి భార్య సీతేనా? అని పలికిన మాటలకు సీత బదులు పలుకుతూ "నేను సీతను, జనకుని కుమార్తెను, జానకిని, భూపుత్రిని అంది అభిమానంతో" (సమాగమం కథ పేజి - 22) అనే మాటల్లో సీత తన స్వతంత్రతను, అస్తిత్వాన్ని చాటుకునే ప్రయత్నం వ్యక్తమవుతుంది. స్త్రీవాదం కాంక్షించే స్త్రీ అస్తిత్త్వ నిరూపన కాంక్ష సీత మాటల్లో చెప్పబడింది. స్త్రీలు తమపై తాము సంపూర్ణ అధికారాన్ని కలిగి ఉండాలి తప్ప ఏ బంధాలకో బాధ్యతలకో కట్టుబాట్లుకో తలొగ్గి తమ అస్తిత్వాన్ని కోల్పోరాదేనే విషయాన్ని అహల్య, సీతల సంవాదం ద్వారా వ్యక్తపరుస్తారు రచయిత్రి. మీపై అధికారం భర్త అయిన గౌతమ మహర్షికి కూడా లేదా? అని ప్రశ్నించిన సీతకు "లోకం ఆయనకా అధికారం ఇచ్చింది. నేను ఇవ్వలేదు. నేను ఇవ్వనంతవరకు నా అధికారాన్ని పొందలేరు" (సమాగమం కథ పేజి 35) అని అహల్య అనడంలోనే తన అస్తిత్వ ప్రకటన తెలుస్తోంది. ఇన్నాళ్లు నేను ఈ విశ్వంలో నా అస్తిత్వాన్ని గురించి ఆలోచిస్తున్నాను. అంటూ అహల్య మాట్లాడిన మాటలు సగటు స్త్రీ తమ అస్తిత్వాన్ని గూర్చి తెలుసుకోవాలని చెబుతున్న మాటలుగా అనిపిస్తాయి. "ఎన్నడూ విచారణకు అంగీకరించకు సీతా. అధికారానికి లొంగకు" అని అహల్య , సీతను హెచ్చరిస్తుంది. ఇక్కడ విచారణకు అంగీకరించడం అంటే తన ప్రమేయం లేకుండా జరిగిన దానికి కూడా బాధ్యత వహించడమే. ఫలితంతో నిమిత్తం లేకుండా జరిగిన దానిని అంగీకరించడమే. నేడు అనేక సందర్భాల్లో సమాజం స్త్రీని నిందించి చేయని తప్పుకు బాధ్యత వహించేలా చేస్తున్న సంఘటనలు అనేకం వున్నాయి. స్త్రీ ఎన్నటికీ అలాంటి స్థితికి గురికారాదనే విషయాన్ని బలంగా వినిపించారు రచయిత్రి.
నేడు స్త్రీవాదం దీన్నే కోరుకుంటుంది. సత్యాసత్యాలు, ధర్మాధర్మాల నిర్ణయం అనేది కాలానుకూలంగా మార్పు చెందుతుంది. ఇవి ప్రవాహశీలం. కావున ఎవరి సత్యం వారిదే గాని ఒకరి సత్య నిరూపణను మరొకరు చేయడం ఏమిటి అని ప్రశ్నిస్తుంది స్త్రీ వాదం. భర్త, పిల్లలు లేకపోతే నువ్వేమవుతావనే రాముడి ప్రశ్నకు సీత బదులు పలుకుతూ "నేను భూపుత్రిని రామా! నన్ను నేను తెలుసుకున్నాను. ఈ విశ్వమంతా నాదే. నాకు లేనిదేమీ లేదు. నేను భూపుత్రిని"( సమాగమం కథ పేజి- 44) అని పలుకుతుంది. సీతలో కలిగిన ఈ విధమైన స్పృహ ప్రతి స్త్రీలోనూ రావాలని రచయిత్రి చెప్పకనే చెబుతారు. అలాంటి మార్పు కలిగిననాడే మెరుగైన సమాజ నిర్మాణం జరుగుతుంది. దాన్ని సాధించడంలో సీత వలె ప్రతి స్త్రీ తనను తాను మరింత నిశితంగా పరిశీలించుకోవాలి, మరింత విశాల దృక్పథం ఏర్పరచుకోవాలి అనే భావన రచయిత్రి వ్యక్తపరుస్తారు.
3.6 సహానుభూతి:
సంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు పేరుతో కుటుంబంలోనూ సమాజంలోనూ స్త్రీ చుట్టూ అనేక అంశాలు ముడివేసి నేపథ్యంలో స్త్రీ తన పరిధిని విస్తృత పరుచుకోవడం, కాలు అనుకూలంగా సామాజిక అవసరాల దృష్ట్యా స్త్రీ నూతనత్వం సంతరించుకోవాల్సిన అవసరాన్ని రచయిత్రి విముక్త కథల్లో చక్కగా పేర్కొన్నారు. సమాగమం కథ సీత, శూర్పణఖల సంభాషణలు నేపథ్యంలో నడిచే కథ. సూర్పణఖ తన అనుభవాలను సీతకు వ్యక్తపరుస్తూ హెచ్చరిక వంటి సూచనలు చేస్తుంది. సూర్పణఖను మొదటిసారి అరణ్యంలో చూసిన సందర్భాన్ని గురించి సీత ఆలోచిస్తూ "ఎంత అందమైన మనిషో రామలక్ష్మణుల క్రూరమైన పరిహాసానికి పాపం కురూపి అయిపోయింది" (సమాగమం కథ పేజి -19) అంటూ తన విచారాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ సందర్భంలో సహజంగా స్త్రీలో గల కారుణ్యం, ప్రేమతత్వం, సహానుభూతి చెప్పకనే సీతలో వ్యక్తమవుతాయి. సైకత కుంభం కథా శీర్షిక ఉత్సుకతను, ఆలోచనను కలిగించేదిగా ఉండడంతో పాటు తన ప్రమేయం లేకుండా జరిగే అంశాలకు సంబంధించి వేదన పొందడం ఎండమావిలో నీరు వెతికే ప్రయత్నమే అవుతుందని చెప్పుకునే చెబుతారు రచయిత్రి. కథలో ప్రధాన ఇతివృత్తం ఇసుక కుండ వంటి స్త్రీ పాతివ్రత్యం గురించి తెలియజేసే ప్రయత్నం. స్త్రీ చుట్టూ నిర్మించిన పాతివ్రత్యం, మాతృత్వం, కుటుంబ వ్యవస్థ, పితృస్వామ్యం వంటి నియమాలు అడుగడుగునా స్త్రీని బంధిస్తూ బలహీనపరుస్తూ ఉన్నాయి. ప్రయత్నా పూర్వకంగా కానీ అప్రయత్నంగా కానీ వాటిలో ఏ ఒక్కటైనా ఏ కారణం చేతనైనా సడలినపుడు అవి స్త్రీ జీవితాన్ని ఇసుకతో చేసిన కుండ మాదిరి విచ్చిన్నం చేస్తున్నాయనే కఠోర సత్యాన్ని ఈ కథలో రచయిత్రి వ్యక్తపరుస్తారు.
"అనాదిగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాల పేరిట స్త్రీని ఎన్ని రకాలుగా అణచివేయవచ్చో మన ధర్మ శాస్త్రాలలో, వేదాలలో ఎన్నో అంశాలు చరిత్రలో లిఖించారు. కానీ ఎవరైనా సరే స్వతంత్రంగా తమ ఆలోచనలకు తగ్గట్లుగా ఎవరి కట్టుబాట్లకు లొంగకుండా బ్రతకాలి అని అహల్యతో చెప్పించి సమస్త మానవ లోకానికి అహల్యను ఒక మంచి స్నేహితురాలిని చేశారు రచయిత్రి ఓల్గా గారు" (విముక్త కథలు – ఎ. శ్రీలత, భూమికి పత్రికలో వ్యాసం, నవంబర్ 6, 2018 )
అని పలికిన మాటలు అక్షర సత్యాలు. సవాళ్ళను అధిగమించి స్త్రీ తనను తాను నిరూపించుకుంటూ తన పరిధిని విశాలం చేసుకుని మాజిక, ఆర్థిక, రాజకీయ పరమైన చైతన్యాన్ని స్త్రీ కలిగిననాడు తన పరిధి విస్తృతం చేసేందుకు వీలుగా ఉంటుంది అని రచయిత్రి తెలియజేశారు. స్త్రీకి పాతివ్రత్యం అనే భావన ఎంతటి బలహీనమైన అంశమో తెలియజేస్తూ తన ప్రమేయం లేకపోయినా దాన్ని పోగొట్టుకున్న దోషిగా పరీక్షకు నిలబడాల్సి వస్తుందని చెబుతూ అటువంటి స్థితిని అధిగమించాలని రేణుకాదేవి, సీతల సంభాషణ ద్వారా వ్యక్తపరిచారు రచయిత్రి. ఇదిగో ఇది నీకు ప్రత్యేకంగా ఇస్తున్నాను. ఇది ఇసుకతో చేసిన కుండ. సైకత కుంభం. అంటూ అందమైన కుండను సీతకు అందిస్తూ ప్రతి స్త్రీదగ్గర ఇది ఉండాలి అంటుంది రేణుక. ఎందుకు అని ప్రశ్నించిన సీతతో -"తమ పాతివ్రత్యాలు ఈ సైకత కుంభాలు వంటివేనని తెలుసుకుంటే వాళ్ళు నిశ్చింతగా బతకగలగుతారు" (సైకత కుంభం కథ పేజి 51) అంటుంది. కావున స్త్రీలు అటువంటి అస్థిరమైన సంకుచితమైన ఊబిలో చిక్కుకుపోయి గొప్పదైన స్త్రీ సహజత్వాన్ని కోల్పోరాదని పేర్కొంటున్న మాటలు నేటి సమాజంలో సగటు స్త్రీకి వర్తించే మాటలు.
3.7 స్త్రీ సాధికారత :
భర్త, పిల్లలు అనేవి స్త్రీ జీవితంలో మజిలీలుగా మాత్రమే చూడాలని, వాటితోనే ఆగిపోరాదని అక్కడతోనే స్త్రీ అస్తిత్వం పూర్తవలేదని తనను తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితులు ఎప్పుడైనా ఎదురైతే వాటిని ఎదుర్కొనే మానసిక, శారీరక దృఢత్వం కలిగి ఉండాలని తెలియజేస్తుంది సైకత కుంభం కథలోని రేణుకాదేవి మాటలు. రేణుక సీతకు హితవు పలుకుతూ ఇలా అంటుంది "భర్త తప్ప వేరే ప్రపంచం లేదనుకుంటారు స్త్రీలు. నిజమే కానీ ఏదో ఒక రోజు భర్త తన ప్రపంచంలో నీకు చోటు లేదంటాడు. అప్పుడు మనకు ఏం ఆధారం ఉంది" (సైకత కుంభం కథ పేజి 52)అనే మాటల్లో కఠోరమైన వాస్తవికత వ్యక్తమౌతుంది. అంతేకాకుండా బిడ్డల గురించి పేర్కొంటూ- "పుత్రులకు జన్మనివ్వటమే జీవితం అనుకుంటాం. ఆ పుత్రులు పురుష వంశాంకురాలై మనం గ్రహించే లోపే చేయి వదిలి తండ్రి అధీనంలోకి వెళతారు. లేదా వారే మన జీవితాలకు శాసన కర్తలవుతారు" (సైకత కుంభం కథ పేజి 52) అంటూ రేణుకచేత పలికించిన మాటలు సావిత్రి బందిపోట్లు కవితలోని "మనం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తుంది" (బందిపోట్లు కవిత) అనే మాటలను గుర్తుకు తెస్తాయి. శాసనకర్తలు కావటం అంటే సంపూర్ణ అధికారాన్ని చేపట్టడమే. అది పోవాలంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలలో స్త్రీ బలంగా ఉండాలి . అలా లేనినాడు ఇంటా బయటా ప్రతిచోట అసమానతలకు అవహేళనలకు గురికాక తప్పది రచయిత్రి తెలియజేశారు. స్త్రీలు తమను తాను అర్థం చేసుకుంటూ తమ బంధాలు అధిగమించి పరిధిని విస్తృతి పరుచుకోవాలనే వాస్తవాన్ని పై మాటలు ఎరుక పరుస్తాయి. ఇక్కడ మరో విషయాన్ని గమనించాలి బంధాలను అధిగమించడమంటే విశృంఖలం, బరతెగింపు కాదనే విషయాన్ని కూడా గ్రహించాలి. "వివాహ బంధం లేకపోతే సృష్టే ఆగిపోదా? మానవులు, పశువుల్లా అనాగరికంగా బతకాలా? మీ మాటలు నాకు అర్థం కావడం లేదు. అవి స్త్రీలకు హాని చేస్తాయనిపిస్తుంది" అంటూ సీత పలికిన మాటలకు వివరణ అన్నట్లు రేణుకచేత పలికించే మాటలు సగటు వ్యక్తులకు కనువిప్పు కలిగిస్తుంది.
"మనం ఎవరికో ఒకరికి భార్యగా, తల్లిగా, కూతురిలాగా మాత్రమే కాక మనం మనలా బ్రతకాలి” అని చెప్పించడంలో స్త్రీ సాధికారతను ఎంత బలంగా వక్కాణించారో అర్థం చేసుకోవచ్చు (విముక్త కథలు – ఎ.శ్రీలత, భూమికి పత్రికలో వ్యాసం, నవంబర్ 6, 2018 ) మాటలు పరిశీలించదగినవి.
ఎన్నో ఏళ్లుగా కాపురం చేసి తన సమస్తాన్ని కట్టుకున్నవాడికి, కన్నబిడ్డలకు అర్పించినా అనివార్యంగా అనాధలుగా మిగిలిన స్త్రీ ఉదాంతాలు అనేకం నేడు అగుపిస్తాయి. అటువంటి స్థితికి గురైన స్త్రీ సంగతేమిటి? అనే విషయాన్ని చర్చకు తీసుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పకనే చెబుతోంది. "సీతా నీపై అధికారం భర్త అయిన గౌతమ మహర్షికి కూడా లేదా? అని ప్రశ్నించిన సీతకు "లోకం ఆయనకా అధికారం ఇచ్చింది. నేను ఇవ్వలేదు. నేను ఇవ్వనంతవరకు నా అధికారాన్ని పొందలేరు" ( సమాగమం కథ పేజి 35) అని అహల్య అనడంలోనే తన అస్తిత్వ ప్రకటన తెలుస్తోంది.
అడుగడుగునా బలహీనపరిచి అవసరంలో అక్కరకురాని బంధాలను కొనసాగించాలా లేదా వాటిని దాటి బలంగా నిలబడి ప్రతి సందర్భంలోనూ ఎదురొడ్డి నిలవగలిగే ధైర్యంగా నిలవగలిగే ఆత్మస్థైర్యం కావాలా అనే సంఘటిత స్థితి ఏర్పడినపుడు సమస్యని ఎదుర్కొనే తెగువ అవసరమనేది నేటి స్త్రీకి ఎంతో ఉపయుక్తం. వ్యవస్థలోని సన్నని గీతకు ఇరువైపులా రెండు వేర్వేరు భావజాలాలు, భిన్నమైన పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని నిశితంగా విశ్లేషించి వాటిని కాలా అనుకూలంగా సందర్భానికి అనుసరించి మసలుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యక్తపరిచిన తీరు రచయిత్రి నిశిత పరిశీలనకు గీటురాయి.
3.8 స్త్రీ సౌందర్య వ్యాపారం :
సౌందర్యం అంటే ఏమిటి? సౌందర్యానికి నిర్వచనం కేవలం శారీరక పరమైన దేనా? శారీరక సొగసు మాత్రమే సౌందర్యమా? అంతకు మించిన అర్థం ఏమైనా ఉందా? అనే విషయాన్ని స్త్రీవాదం లేవనెత్తిన విషయాల్లో ఒకటి. స్త్రీ సౌందర్యం వ్యాపార వస్తువులుగా, అంగడి సరుకుగా మారిపోతున్న తరుణంలో సౌందర్యం అంటే కేవలం శారీరక సంబంధం మాత్రమే కాదని సౌందర్యం పరిధి విస్తృతమైందని వయక్తిక, సామాజిక, సాంస్కృతిక, ప్రాకృతిక సంబంధంతో కలగలిపిన సృజనాత్మకత సౌందర్యం అనే విషయాన్ని సమాగమం కథలో శూర్పణఖ మాటలు ద్వారా వ్యక్తపరిచారు రచయిత్రి.
సౌందర్య కాంక్షగల స్త్రీలు తమ శారీరక సౌందర్యానికి విఘాతం కలిగితే కుమిలిపోతూ ఉండిపోకుండా మనోధైర్యంతో ముందుకు సాగాలనే విషయాన్ని తెలియజేస్తూ "నీ కురుపితనాన్ని నువ్వు భరించగలవా? భరించలేక ఏ అఘాయిత్యం చేసుకున్నావో? అని బాధపడేదాన్ని అని పలికిన సీత మాటలకు సూర్పణఖ బదులు చెబుతూ జీవితాన్ని ఎదుర్కోవడంలోనే రాటుతేలాను. అందానికి అర్థం తెలుసుకోవడంలోనే ఆనందాన్ని పొందగలిగాను" (సమాగమం కథ పేజి 25) అంటుంది. జీవితంలో ఎదురైన సమస్యలపై పోరాడి గెలిచి నిలవాలనే సత్యం సూర్పణఖ మాటల్లో వ్యక్తమౌతుంది. అందమంటే 24, 36, 26 కొలతలు కాదని, అందమంటే బయటకు కనిపించే శారీరక సౌందర్యం మాత్రమే కాదని అంతకుమించిన సౌందర్యం మానసిక సౌందర్యం అనే స్పృహను పై మాటలు ఎరుక పరుస్తాయి. సూర్పణఖ పెంచుకున్న పూలతోటను సౌందర్యానికి ప్రతీకగా భావించిన సీత నీవు చాలా అందంగా ఉన్నావు అని శూర్పణఖతో పలికిన సందర్భంలో "పది సంవత్సరాల కఠోర దీక్ష, శ్రమ ఫలించాక ఈ తోటను పెంచడం మొదలుపెట్టాను అంటూ తన జీవనయాన సత్య సౌందర్యాన్ని సీత ముందు పరిచింది సూర్పణఖ" (సమాగమం కథ పేజి 25).
ఈ మాటల్లో సత్య సౌందర్యం అనే పదప్రయోగం సౌందర్యం యొక్క సమస్త స్థితిని తెలియపరుస్తుంది. సౌందర్యం అంటే కేవలం శారీరక సంబంధమైనది మాత్రమే కాదని సృజనాత్మకత కలిగిన ప్రతిదీ సౌందర్యమే అనే విశాల దృక్పథాన్ని వ్యక్తపరుస్తారు రచయిత్రి.
"ప్రకృతికి రూప కురూపి అనే తేడా లేదని గ్రహించడానికి చాలా కష్టపడ్డాను. ఈ శోధనలో నా కళ్ళే మారిపోయాయి. నా కంటికి ప్రతిదే అందంగానే కనిపించింది" (సమాగమం కథ పేజి25) అనే మాటలు సౌందర్యానికి అసలైన నిర్వచనంగా నిలుస్తాయి.
4. విముక్త కథల్లో నూతనత్వం :
ఇతిహాసపు అట్టడుగు పొరల్లో ఉన్న కోణాలను వెలికితీసి చర్చకు నిలిపిన తీరు నూతనత్వం. ఓల్గాగారి కంటే ముందు కందుకూరి వీరేశలింగం, త్రిపురనేని రామస్వామి చౌదరి, చలం, కొడవటిగంటి కుటుంబరావు, నార్ల వెంకటేశ్వరరావు వంటి వారు పురాణ, ఇతిహాస పాత్రల్లోని అహేతుకంశాలను ప్రస్తావించి చర్చకు నిలిపారు. ఇతిహాస పాత్రల ఔన్నత్యం చెడకుండా, వ్యతిరేక భావన కలిగించకుండా మనస్తత్వ చిత్రణ ద్వారా పాత్రలను విశ్లేషించిన తీరు ఈ కథల్లో కనిపించే నూతనత్వం. ఇతిహాస పాత్రను వక్రీకరించడం, వికృత భాష్యం చెప్పడం, అహేతుకం అంటూ రచ్చ చేయడం వంటివి కాకుండా నేటి సమాజానికి అవసరమైన అంశాలను లేవనెత్తి పాత్ర పరిశీలనలో చేయాల్సిన కొత్త కోణాన్ని ఈ కథల్లో ఆవిష్కరించారు. సామాన్యుల ఆలోచనల్లో సైతం అందిరాని అంశాలను ఇతిహాస పాత్రల్లో దర్శంపచేసి వాటి మనస్తత్వ విశ్లేషణతో ఆయా పాత్రల ఔన్నత్యాన్ని మరింత పెరిగేటట్లు చేయడం గొప్ప నూతనత్వం. రామాయణ కథలోని సాధారణ స్త్రీలుగా కనిపించే అహల్య, రేణుక, ఊర్మిళ, సీతలు విముక్త కథల్లో సామాజిక, సాంస్కృతిక, ప్రాకృతిక పరిణామాన్ని అవగతం చేసుకొని సమస్యలను అధిగమించి నిలవడం నిత్య నూతనత్వానికి సంకేతం.
"రామాయణంలోని స్త్రీ పాత్రలకు జీవం పోసి నేటి కాలానికి అనువైన పరిస్థితులను కల్పించి పరిష్కార మార్గాలనూ చూపించారు" (విముక్త కథలు – ఎ.శ్రీలత, భూమికి పత్రికలో వ్యాసం, నవంబర్ 6, 2018) అనే మాటలు పరిశీలించదగినవి.సంక్షోభం, సంఘర్షణ, చైతన్యం, ప్రయోగం ఇవే ఓల్గా ఆవిష్కరించిన ఇతిహాసపు వెలుతురు కోణాలు (ఇతిహాసపు వెలుతురు కోణాలు, డాక్టర్ యు.వింధ్య, డాక్టర్ యు. సుధాకర్, విముక్త కథలు, పేజి 15) అని పేర్కొన్న మాటలు గమనించదగినవి.
5. విముక్త కథలు పై విమర్శ ప్రతి విమర్శ :
విముక్త కథలపై విమర్శ ప్రతి విమర్శలు అనేకం వెల్లువెత్తాయి. పురాణ పాత్రలతో కొత్త కోణాలను ఆవిష్కరించిన కథలని కొందరు కొనియాడగా పురాణ పాత్రలను కాలం స్పృహ లేకుండా వక్రీకరించారనే అభిప్రాయాల్ని వ్యక్తపరిచారు.
- "విముక్త కథల్లో శూర్పణఖను చూపించిన విధానం ఎంత అద్భుతంగా ఉందో మాటల్లో చెప్పలేము. ఒక అలౌకిక ఆనందం చదువరులకు కలుగక మానదు. ఇలా ఆలోచన చేయగలగడం ఒక్క ఓల్గా గారికే సాధ్యం, రామాయణంలోని స్త్రీ పాత్రలకు జీవం పోసి నేటి కాలానికి అనువైన పరిస్థితులను కల్పించి పరిష్కార మార్గాలనూ చూపించారు" (విముక్త కథలు– ఎ.శ్రీలత November 6, 2018 భూమిక) అని కొనియాడారు.
- ‘విముక్త’ కథలిచ్చే సందేశమేమిటి? అనే వ్యాసంలో S.G.Jignasa విముక్త కథలను కొత్త దృక్కోణం’ అనడంకంటే ఆయా రచయితల ‘స్వీయ దృక్కోణం’ అని పిలవడం సబబుగా వుంటుందని, కల్పిత పురాణ పాత్రలను తిరిగి వ్యాఖ్యానిస్తూ నేటి నిజ జీవిత ప్రతిబింబాలకు రచయిత్రి ఇచ్చే సందేశం లేదా రచయిత్రి స్వయంగా చెప్పిన ‘సహకారం’ ఏమిటనేది ప్రధాన ప్రశ్న, వాదవివాదాలకు కేంద్ర బిందువు” అని పేర్కొన్నారు (వ్యథార్త స్త్రీ జీవితాలకు ‘విముక్త’ కథలిచ్చే సందేశమేమిటి? వ్యాసం వాకిలి పత్రిక 2016)
- చంద్రిక తన వ్యాసంలో రామాయణాన్ని సరిగ్గా అర్ధం చేసుకున్న స్త్రీలకి ఈ కథలు అవసరం లేదని, అమ్మాయిలని అటువంటి చోట్లకి చేర్చి ఆనందించే బ్రోకర్ లకి రామాయణం లోని శూర్పణఖ పాత్రకి తేడా ఏమన్నా ఉందా?( వాకిలి సాహిత్య పత్రిక వ్యాసం, చంద్రిక, మార్చి 2, 2016 ) అంటూ విమర్శలు చేశారు.
6. ముగింపు:
- "నిత్యజీవితంలో తటస్థపడే సన్నివేశాలని ఒక తాత్విక వేత్తలా పరిశీలించి ఆ సంఘటనలకు తన భావనాబలాన్ని చేర్చి కొద్ది పాత్రల సాయంతో అనువైన, పరిమితమైన పదాలతో మొదటి నుండి చివరదాకా జిగీబిగీ ఉండేలాగా చెప్పుకుపోతూ జీవితానికి సంబంధించిన మహత్తరమైన సత్యాన్ని స్ఫురించే కళాత్మకమైన చిన్న రచనా ప్రయత్నం" (తెలుగు కథానిక, పేజి-2)అని కథానికకు సంబంధించి పేర్కొన్న నిర్వచనం ఓల్గా విముక్త కథలకు సరిగ్గా సరిపోతాయి.
- విముక్త కథలు స్త్రీవాదంలోని రాడికల్ ఫెమినిజం, మార్క్సిస్టు ఫెమినిజం నేపథ్యంలో ఇతిహాసపు అధ్యయనంలో నూతన కోణాన్ని ఆవిష్కరించిన కథలుగా చెప్పొచ్చు.
- ఇతరులపై అధికారాన్ని నేరపటం అంటే నీపై నీకుండే అధికారాన్ని కోల్పోవడమే అనే వాస్తవాన్ని వ్యక్తపరచడం ఈ కథల్లో ప్రస్తావనకు వస్తుంది. స్వేచ్ఛ అంటే విశృంఖలత్వం కాదు అనే విషయాన్ని అంతర్లీనంగా వ్యక్తపరుస్తూనే బంధాల బందిఖానాలో స్త్రీ బలికాకుండా తనదైన శైలిలో తన సమస్త శక్తిని వినియోగించి తన ప్రపంచాన్ని విస్తృతి పరుచుకోవాలంటారు రచయిత్రి.
- స్త్రీకి పాతివ్రత్యం, పిల్లలు పెంపకం, కుటుంబానికి పరిమితం కావడం, ప్రతి అవసరంలోనూ పురుషుడి మీద ఆధారపడటం, చేయని తప్పుకు దోషిగా నిలవడం వంటి అనేక అంశాలను కేంద్రంగా చేసుకుని స్త్రీవాదం ఆశించిన, ఆకాంక్షించిన విషయాన్ని స్త్రీకోణం నుండి దర్శింపజేసిన తీరు విముక్త కథల్లో పరిశీలించదగిన అంశాలు.
- సమాగమం, మృణ్మయనాదం, సైకత కుంభం, విముక్త... ఈ నాలుగు కథలలో శూర్పణఖ నుండి శ్రమైక సౌందర్యానందం, అహల్య నుండి అధికార స్వభావం, రేణుక నుండి విద్యావశ్యకత, ఊర్మిళ నుంచి బంధ విముక్తం... నేర్చుకొన్న సీత.. తన బంధాల నుండి విముక్తం కావడం కోసం తనతో తాను పోరాటం చేస్తుంది" (విముక్త - కథా సంపుటి" రివ్యూ, సంపంగెలు బ్లాగ్) అనే మాటలు విముక్త కథల అంతరాత్మను, స్త్రీవాద ఆకాంక్షను తెలియజేస్తుంది. స్త్రీకి స్వేచ్ఛ నుండి విరామం, విరామం నుండి స్వాతంత్ర్యం, స్వాతంత్ర్యం నుండి సమానత్వం అవసరమని విముక్త కథలు ద్వారా రచయిత్రి తెలియజేశారు.
- "ఈ కథలలో ఎక్కడా పురుష ధ్వేషం కనబడదు. స్త్రీవాదం అంటే పురుషవ్యతిరేకత కాదు... స్త్రీల అస్తిత్వ అన్వేషణ మాత్రమే" "మహిళల మానసిక సంఘర్షణకు సజీవ రూపాలు ఈ కథాసంపుటిలోని ఓల్గా పాత్రలు" (విముక్త - కథా సంపుటి" రివ్యూ, సంపంగెలు బ్లాగ్) అనే మాటలు ఈ కథల్లో వ్యక్తమయ్యే స్త్రీవాద దృక్పథం తెలియజేస్తుంది.
- "మూల గ్రంథాలలోని పురాణ పాత్రలు సజీవాలుగా ఉంటూ నేటి సమాజంలోని సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలను అందిస్తూ ఆదర్శప్రాయంగా ఉంటాయనడానికి నిదర్శనంగా విముక్త కథలు కనబడతాయి. ఈ కథల పుస్తకం మహిళా లోకానికే కాక సమస్త ప్రజానీకానికీ చక్కని మార్గాన్ని సూచించే స్నేహితులను సృష్టించింది. ఓల్గా గారి మేధస్కు మనస్ఫూర్తిగా శతకోటి వందనాలు” అంటారు ఎం. శ్రీలత. (విముక్త కథలు– ఎ.శ్రీలత, భూమికి పత్రికలో వ్యాసం, నవంబర్ 6, 2018)
- కథ అనేది మొదట్లో కుతూహలాన్ని, చివర్లో ఆలోచనల్ని కలిగించాలని ఆరుద్రగారు పేర్కొన్న కథానిక నిర్వచనం ఓల్గా విముక్త కథలుపట్ల అక్షర సత్యాలు.
7. పాదసూచికలు:
- విముక్త కథలు, ఓల్గా, నా మాట పేజి 9,10
- తెలుగు సాహిత్య ప్రక్రియలు - ధోరణులు: ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు 15. 10. స్త్రీవాదం- పేజీ 291
- విముక్త కథలు, ఓల్గా, సమాగమం కథ పేజి -25
- విముక్త కథలు, ఓల్గా, సమాగమం కథ పేజి -26
- మహాప్రస్థానం, దేశచరిత్రలు, శ్రీ శ్రీ, పేజి- 76
- విముక్త కథలు, లోతుగా, మృణ్మయనాదం కథ పేజి43
- విముక్త కథలు, ఓల్గా, మృణ్మయనాదం కథ పేజి -31
- విముక్త కథలు, ఓల్గా, సమాగమం కథ పేజి - 22
- విముక్త కథలు, ఓల్గా, సమాగమం కథ పేజి 35
- విముక్త కథలు, ఓల్గా, సమాగమం కథ పేజి 44
- విముక్త కథలు – ఎ.శ్రీలత, భూమికి పత్రికలో వ్యాసం, నవంబర్ 6, 2018 )
- విముక్త కథలు, ఓల్గా, సైకత కుంభం కథ పేజి 51
- విముక్త కథలు, ఓల్గా, సైకత కుంభం కథ పేజి 52
- బందిపోట్లు కవిత, సావిత్రి, పేజి 16
- తెలుగు కథానిక, తెలుగు సాహిత్య సమీక్ష రెండవ సంపుటి, నాగయ్య జి, పేజి-2
- విముక్త - కథా సంపుటి" రివ్యూ, సంపంగెలు బ్లాగ్
- వ్యథార్త స్త్రీ జీవితాలకు ‘విముక్త’ కథలిచ్చే సందేశమేమిటి? S.G.Jignasa, వ్యాసం వాకిలి పత్రిక 2016.
- వ్యథార్త స్త్రీ జీవితాలకు ‘విముక్త’ కథలిచ్చే సందేశమేమిటి? వాకిలి సాహిత్య పత్రిక వ్యాసం, చంద్రిక, మార్చి 2, 2016.
8. ఉపయుక్తగ్రంథసూచి:
- ఓల్గా. (డిసెంబర్ 2016) విముక్త కథలు, స్వేచ్ఛా ప్రచురణలు: హైదరాబాద్.
- చంద్రిక. (2016) వ్యథార్త స్త్రీ జీవితాలకు ‘విముక్త’ కథలిచ్చే సందేశమేమిటి? (పాఠకస్పందన), వాకిలి పత్రిక వ్యాసం.
- జిజ్ఞాస, ఎస్.జి. (2016), వ్యథార్త స్త్రీ జీవితాలకు ‘విముక్త’ కథలిచ్చే సందేశమేమిటి?, వాకిలి పత్రిక వ్యాసం.
- తెలుగులో కవిత్పోద్యమాలు. (2015) తెలుగు అకాడమీ ప్రచురణ: హైదరాబాద్.
- తెలుగులో ప్రక్రియావైవిధ్యం, నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభల ప్రచురణ, తెలుగు అకాడమీ: హైదరాబాద్.
- నాగయ్య. జి. (2009) తెలుగు సాహిత్య సమీక్ష రెండవ సంపుటము, సి.ఎన్. ప్రింటర్స్, ప్రకాశం రోడ్డు: తిరుపతి.
- మాధవీలత, రామరాజు. (సెప్టెంబర్, 2023) “విముక్త” కథలో ‘ఊర్మిళ’ పాత్రచిత్రణ: విశ్లేషణ. ఔచిత్యమ్ మాసపత్రిక, సంపుటి-4, సంచిక-10.
- లోతుగా. (2015) రాజకీయ కథలు, స్వేచ్ఛా ప్రచురణలు: హైదరాబాద్.
- వెంకటసుబ్బయ్య వల్లంపాటి. (1996) కథా శిల్పం, విశాలాంధ్ర పబ్లిసింగ్ హౌస్: విజయవాడ.
- వెంకటేశ్వర్లు. బూదాటి. (2012) తెలుగు సాహిత్య ప్రక్రియలు - ధోరణులు, హిమకర్ పబ్లికేషన్స్: హైదరాబాద్.
- శ్రీలత, ఎ. (నవంబర్ 6, 2018), భూమిక స్త్రీవాద అంతర్జాల పత్రిక వ్యాసం.
- శ్రీశ్రీ. (2011) మహాప్రస్థానం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్: హైదరాబాద్.
- సంపంగెలు బ్లాగ్, విముక్త కథాసంపుటి- రివ్యూ
- సత్యనారాయణ పోలప్రగడ.(2005) తెలుగు కథానిక, తెలుగు అకాడమీ ప్రచురణ: హైదరాబాద్.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "May-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-April-2025
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "MAY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి
బాధ్యత వహించరు.