AUCHITHYAM | Volume-5 | Issue-7 | June 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
4. మహాభారతం: దమయంతి పాత్రచిత్రణ

డా. ఎం. లక్ష్మయ్య
తెలుగు ఉపన్యాసకులు
సి.ఎస్.ఎస్.ఆర్ & ఎస్.ఆర్.ఆర్.ఎం. డిగ్రీ & పి.జి కళాశాల,
కమలాపురం, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్
సెల్: +91 9492495437, Email: manjurilakshmaiah@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
నన్నయ మహాభారతం-అరణ్యపర్వంలోని ద్వితీయాశ్వాసంలో దమయంతి కథ ఉంది. ఆమె ప్రేమ, పాతివ్రత్యం, పడిన కష్టాలను గురించి విశ్లేషణాత్మక, చారిత్రక పరిశోధనాపద్దతిలో పరిశీలించి నేటి సమాజానికి తెలియజేయడమే ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశ్యం. ఈ వ్యాసంలో భార్య, భర్తల మధ్య ఉండే అన్యోన్యత, ప్రేమ ప్రస్పూటంగా కన్పిస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు మానవుడు ఎలాంటి బాధలకు తలొగ్గకుండా ధైర్యంగా ముందుకు నడవాలని నలుని వల్ల తెలుసుకోవచ్చు. అదేవిధంగా కష్టాలలో కూడా భర్త తన దగ్గర లేకున్నప్పుడు అతనినే నిరంతరం స్మరించేది దమయంతి. ప్రతిరోజు కూడా తన భర్త త్వరగా కనిపించేటట్లు చేయమని దేవున్ని వేడుకునేది. నేటి సమాజంలో కుటుంబం అస్తవ్యస్తం కావడానికి ముఖ్యకారణం భార్య, భర్తల మధ్య సఖ్యత లేకపోవడం. సమాజంలో భర్త సంసారం కోసం అప్పులు చేసి కష్టాలు పడుతుంటే భర్తను వదిలివెళ్లిన భార్యలను చాలా మందిని చూస్తుంటాం. ఇలాంటి వారికి దమయంతి ఎంతో ఆదర్శమూర్తి అని చెప్పవచ్చు. పతినే దైవంగా భావించిన పరమ పతివ్రత. తన పాతివ్రత్య మహిమ వల్లనే అడవులలో తనను తాను రక్షించుకున్న పుణ్యశీలి దమయంతి. కష్టసుఖాలు వస్తుంటాయి, పోతుంటాయి. వాటికి అతీతంగా నలదమయంతులలాగా నిలవగలగాలని ఈనాటి సమాజానికి ఈ కథ అనుసరణీయమైనదిగా భావిస్తున్నాను.
Keywords: దమయంతి, నలుడు, కలిపురుషుడు, భీమరాజు, పుష్కరుడు, సుబాహుడు, కర్కోటకుడు, ఋతుపర్ణుడు, పర్ణాదుడు.
1. ఉపోద్ఘాతం:
మహాభారతంలో అరణ్యపర్వంలోని ద్వితీయాస్వాసంలో దమయంతి యొక్క ప్రేమ గురించి, ఆమె పాతివ్రత్యం గురించి, దమయంతి పడిన కష్టాలను గురించి విశ్లేషణాత్మక చారిత్రక పరిశోధనా పద్దతిలో పరిశీలించి నేటి సమాజానికి తెలియజేయడమే ఈ వ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
విదర్భను పరిపాలిస్తున్న రాజు భీముడు. అతనికి పెళ్లై చాలా సంవత్సరాలు గడిచిపోయినా సంతానం కలగలేదు. భీముని భార్య ఒక సారి ధమనుడనే రుషిని ఆరాధించింది. ధమనుని ఆశీర్వాదం వల్ల వారికి ఒక కూతురు, ముగ్గురు కుమారులు పుట్టారు. ఆ కూతురు పేరే దమయంతి. దమయంతి గొప్ప సౌందర్యవతి, అపురూప సుగుణాలరాశి, అందానికి మారుపేరు దమయంతి అని చెప్పవచ్చు.
దమయంతి నలుడుని చూడకుండానే మనసుపడింది. అతడు మంచి పరాక్రమ వంతుడు. నిషధ దేశాధిపతి. ‘‘ఆరోగ్యేబ్రాజ:పటర:పతంగ జ్యోతిస్టోమం సమహామేరుర్ణపుహతి’’ నలుడు చుంద్రుని కంటే అందగాడని వ్యాఖ్యాత చక్రవర్తి మల్లినాథసూరి (నైష.వ్యాఖ్యానం,పుట.163) తెలియజేశాడు.
ఒక సారి నలుడు దమయంతి నివసించే నగరానికి వస్తాడు. అక్కడ అతని దగ్గరకు ఆకాశం నుండి హంసలు వచ్చి వాలుతాయి. కొద్దిసేపటికి అవి తిరిగి ఆకాశానికి ఎగిరిపోతాయి. కాని వాటిలోని ఒక హంసను నలుడు పట్టుకుంటాడు. ఎక్కడ తనను చంపుతాడోనని ఆ హంస దమయంతి నలమహారాజును ఇష్టపడుతోందని చెబుతుంది. అప్పుడు రాజు మరికొన్ని విషయాలను దమయంతికి చేరవేస్తాను తనను వదిలెయ్యమని హంస విన్నవించుకుంటుంది. నలుని అందాన్ని, శరీర సౌష్టవాన్ని గురించి,అతని పరాక్రమాన్ని గురించి హంస దమయంతి దగ్గరకు వెళ్ళి ఆమెకు చెబుతుంది.
దరణీశ వినుము విదర్భపురంబు
కరమర్థి జగతి ప్రఖ్యాతమై యుండు
నా పురదీశ్వరుడవాలమునసుడు
భూపాల చంద్రుడు పూర్వవర్తనుడు (నలచరిత్ర, పుట.125)
హంస తిరిగి నిషధ దేశానికి వెళ్ళి దమయంతి గుణగణాలను నలమహారాజుకు చెప్పింది. అప్పుడు నలదమయంతులిద్దరికి ఒకరినొకరు చూడకపోయినా, ఒకరంటే మరొకరికి ఇష్టం ఎక్కువౌతుంది. ఈ విషయాన్ని దమయంతి చెలికత్తెల ద్వారా భీమరాజు తెలుసుకుని తన కుమార్తెకు స్వయంవరం ఏర్పాటు చేస్తాడు. ఆ స్వయంవరానికి వివిద దేశాల రాజులతో పాటు దేవలోకం నుండి దేవేంద్రుడు, దిక్పాలకులు, నారదమహర్షితో కలసి అక్కడకు చేరుకుంటారు. నల మహారాజు కూడా అక్కడకు చేరుకునే సమయంలో ఇంద్రుడు తన దూతగా దమయంతి దగ్గరకు వెళ్ళి తమ గురించి చెప్పమంటాడు. కాని నలుడు తాను కూడా అదే పనిమీద వచ్చానని చెబుతాడు. కాని ఇంద్రుడు అతని మాటలను వినడు. తాను దేవాధిపతిని కాబట్టి నీవు మా పని చేసిపెట్టాలని చెప్పాడు. చేసేదిలేక నలుడు దమయంతి దగ్గరకు వెళ్తాడు.
2. దమయంతి - లావణ్యవైభవం:
సాధారణంగా వధువు వరుడుని ఎన్నుకొనే హిందూ సాంప్రదాయం ప్రాచీన కాలం నుండి ఆచరిస్తున్నదే.ఇక్కడ దమయంతి కూడా తనకు నచ్చిన వరున్ని ఎన్నుకునే అవకాశాన్ని తన తండ్రి కల్పించినట్లు తెలుస్తుంది. మొదటిసారి దమయంతి, నలుడు ఒకరినొకరు చూసుకుంటారు. దమయంతి గురించి హంస చెప్పిన దానికంటే మరింత ప్రకాశవంతంగా, అందంగా ఉంది. అప్పుడు మహారాజ ఎవరు మీరు? ఇక్కడకు రావడానికి ఎవరికి ప్రవేశం లేదు. అలాంటిది ఎంతో మంది సైనికులను కాదని నా గదిలోకి వచ్చారని నలున్ని ప్రశ్నిస్తుంది. అప్పుడు నలుడు తాను కూడా స్వయంవరానికి వచ్చానని కాని ఇంద్రదేవుడు నన్ను చూసి తన దూతగా నీ దగ్గరకు వెళ్ళి వారి సందేశాన్ని తెలియజేయమని పంపించారని చెబుతాడు. తాను నలున్ని మాత్రమే ఇష్టపడుతున్నదని ఇంద్రేవునికి చెప్పమని చెబుతుంది. ఆ విషయాన్ని నలుడు ఇంద్రునికి తెలియజేస్తాడు. కోపంతో స్వయంవరం సభలోకి ఇంద్రుడు, దిక్పాలకులు నలుని రూపంతో ప్రవేశిస్తారు. దేశదేశాలనుండే కాకుండా దేవలోకం నుండి దేవతలు కూడా ఆ స్వయంవరానికి వచ్చారంటే దమయంతి ఎంత అందగత్తో మనకు అర్థమవుతుంది.
స్వయంవరంలో దమయంతి నలున్ని కనుక్కోవడం కష్టంగా ఉంది. ఎందుకంటే దేవతలు కూడా నలుని రూపంలో ఉన్నారు. దమయంతి దేవతలతో తాను నలమహారాజును ఇష్టపడుతున్నాను కాబట్టి మీరు మీ నిజరూపాలతో దర్శనం ఇవ్వగలరని విన్నవంచుకుంటుంది. అప్పుడు దేవతలు దమయంతి మొరవిని కరుణించారు. దేవతలు చూస్తుండగా దమయంతి తన పూలదండను నలుని మెడలో వేస్తుంది. ఇంద్రుడు, ఇతర దిక్పాలకులు తమ స్వ స్వరూపాలతో నలదమయంతులను ఆశీర్వదించారు. నలుడు చేసే యజ్ఞాలలో ప్రత్యక్షంగా పాల్గొంటానని వరమిచ్చాడు. అగ్నిదేవుడు, వరుణదేవుళ్ళు కూడా నలుడు కోరిన చోట నీరు, నిప్పు లభించేటట్లు వరాలిచ్చారు. యమధర్మరాజు నలుడి మనస్సు ధర్మంపైనే నిలబడేటట్లు వరం ప్రసాదించాడు. దేవతలు స్వర్గానికి వెలుతుండగా మార్గంమధ్యలో వారికి ద్వాపర పురుషుడితో పాటు కలి పురుషుడు కనిపించాడు. అప్పుడు దేవతలు కలిని ఎక్కడికి వెళుతున్నావని అడుగుతారు. తాను దమయంతి స్వయంవరంకు వెళ్తున్నానని కలి పురుషుడు చెబుతాడు. కలి మాటలు విన్న దేవతలు నవ్వుతారు. దమయంతి స్వయంవరంలో నలమహారాజును వరించిందని, తాము అక్కడినుండే వస్తున్నామని తెలియజేస్తారు.
అప్పుడు కలిపురుషుడు కోపంతో నలదమయంతులకు వియోగాన్ని కల్పించడానికి ప్రయత్నించడం జరుగుతుంది. ఒక రోజు నలుడు మూత్రవిసర్జన చేసిన తర్వాత పాదాలను శుభ్రపర్చడం మరిచిపోయి సంధ్యావందనం చేస్తాడు. అప్పుడు ఆ అశుచిత్వాన్ని ఆధారం చేసుకొని కలి నలుడిలో ప్రవేశించాడు. తర్వాత కలిపురుషుడు పుష్కరుడనే రాజు దగ్గరకు వెళ్లి తనను తాను పరిచయం చేసుకొని నలుడితో జూదమాడి నలుడిరాజ్యాన్ని, అతని సంపదలను గెలుచుకొమ్మని తెలియజేస్తాడు. పుష్కరుడు కలి మాటలు విని సరేనని చెబుతాడు. కలి బ్రాహ్మణుని వేశంలో పాచికలను తన చేతిలో పట్టుకొంటాడు.
3. దమయంతి - అసహాయత:
నలునికి జూదం అడడమంటే మహాయిష్టం. అందుకే పుష్కరుడు నలున్ని జూదమడటానికి ఆహ్వానించడం జరుతుంది. నలుడు జూదం ఆడడం మొదలుపెట్టాడు. తన సంపదలన్నింటిని పణంగా పెట్టి నలుడు జూదమడుతున్నాడు. ఒక్కొక్కటి పోగొట్టుకుంటున్నాడు. తరగిపోతున్న రాజ్య సంపదలను చూసి కుల బ్రాహ్మణులు, వేద పండితులు, నలుని మంత్రివర్గం నలుని దగ్గరకు వచ్చి రాజ్యం గురించి ఒక్కసారి ఆలోచించి ఆటను విరమించమని తెలియజేశారు. కాని కలి ప్రభావంతో నలుడు వారి మాటలు వినలేదు. చివరకు దమయంతి కూడా అక్కడకు వచ్చి నలున్ని చూసి బాధపడుతుంది. తన మాట కూడా వినడని తెలిసి ముందుగా తన కుమారుడు, కుమార్తెను తన తండ్రిగారి దగ్గరకు పంపించింది. నలుడు జూదంలో సర్వస్వాన్ని కోల్పోయాడు. ఎంతో బాధతో దమయంతిని వెంటపెట్టుకొని రాజధాని నుండి బయటకు వెళ్లాడు.
పురమువె మూడహోరాత్రములు వసించి
యున్న నలుపాలి కెవ్వరు నోడి రరుగ
జనవిభుండైన పుష్కరుశాసనమున
గలికృత ద్యూతవిద్వేష కారణమున (భా,అర.ద్వి. 66)
దమయంతితో కలసి నలుడు నగరం బయట మూడు రోజులు నివసించారు. ఆ నగరంలోని ప్రజలెవ్వరు కూడా అప్పుడు రాజును గౌరవించలేదు. నలదమయంతులు కేవలం నీటిని మాత్రమే స్వీకరించి ఆకలిని తట్టుకోలేకపోతున్నారు. వారికి సమీపంలో బంగారు పక్షులు విహరిస్తున్నాయి. నలుడు వాటిని చంపి ఆహారంగా తినాలి తలచి వాటిమీదకు తను కట్టుకొన్న వస్త్రాన్ని విసిరాడు. ఆ పక్షులు నలుని వస్త్రంతో పాటు ఆకాశంలోకి ఎగురుతూ ఇలా అన్నాయి. ఓ రాజా! నీ సంపద పోవడానికి కారణమైన పాచికలం మేము. పక్షుల రూపంలో నిన్ను మోసగించి చివరకు నీవు కట్టిన వస్త్రాన్ని కూడా అపహరించామని నవ్వుతూ వెళ్లిపోయాయి. ఆ దృశ్యాన్ని చూసిన నలుడు ఆశ్చర్యపోయి బాధపడ్డాడు. నగరంలోని నాలుగు కూడళ్లలో ఏ మార్గం ద్వారా వెళ్దామని దమయంతిని అడుగుతాడు. ఆమె అడవులకు వెల్ధామని చెబుతుంది. కొంత దూరం వెళ్లాకు బాగా అలసిపోయారు. దమయంతి నలునితో నాథా! విదర్భకు వెళ్లితే అక్కడ తన తండ్రి బాగా చూసుకుంటారని చెబుతుంది. కాని నలుడు పూర్వం రాజులాగా బతికి ఇప్పుడు ఈ పరిస్థితులలో మీ నాన్న గారి దగ్గరకు వెళితే అక్కడ మనకు సరైన గౌరవ మర్యాదలు జరుగవని సమాధానమిస్తాడు. కాని నలుడు దమయంతిని మాత్రమే భీమరాజు గారి దగ్గరకు వెళ్లమని చెబుతాడు.
నలుడు దమయంతిని విదర్భకు వెళ్లమని ఎంత చెప్పిన ఆమె వినదు. మీ వెంటే నేనుంటానంటుంది. కోమలమైన ఆమె ముఖం ఎండ తీవ్రతకు నల్లబడింది. ఒక చెట్టు కింద నీరు తాగి ఇద్దరూ సేదతీరుతున్నారు. తన వల్ల దమయంతి కష్టపడకూడదని నలుడు భావించాడు. తనని వదలి దమయంతి వారి తండ్రిగారింటికి వెళ్లలేదని. తాను ఇక్కడే ఆమెను వదిలివెళ్లితే అప్పుడైనా తండ్రి దగ్గరకు వెలుతుందని నిద్రిస్తున్న దమయంతిని విడిచి ఉండలేక బాధతో నలుడు కలిప్రభావం చేత అరణ్యంలోకి వెళ్లిపోయాడు. దమయంతి నిద్రలేచి చూడగా తన భర్త పక్కన లేడు. భయంతో, దు:ఖంతో అనేక విధాలుగా నలున్ని పరితపిస్తూ ఏడుస్తూ, బాధపడుతూ ఉంది. తన భర్తను అడవిలో తలస్తూ, క్రూరమృగాల అరుపులకు భయపడుతూ ఎక్కడికి పోలేకపోయింది. అడవిలో వెలుతున్న దమయంతిని చూసి ఆకలితో ఉన్న కొండచిలువ దమయంతిని పట్టుకుంది.
4. దమయంతి - పాతివ్రత్యమహిమ
ఇకనైన తనను కాపాడమని దమయంతి పెద్ద కేకలు వేస్తూ, అరుస్తుంది. అమె అరుపులు విని ఒక బోయవాడు ఆమె దగ్గరకు వచ్చి, కొండచిలువ నుండి ఆమెను రక్షించాడు. కాని అతడు ఆమె అందాలను చూసి పరవశుడయ్యాడు. దమయంతిని పట్టుకోబోయాడు. అప్పుడామె ‘‘నేను పతివ్రతనైతే ఈ దుష్టుడు ఇక్కడే చనిపోవుగాక’’ (సంపూర్ణ మహాభారతం , పురాణపండ శ్రీ చిత్ర, మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి, 2012. పుట.227) అని శపించింది. వెంటనే కిరాతుడు చనిపోయాడు. దమయంతి అక్కడి నుండి ముందుకు వెళ్లింది కొంత దూరం వెళ్లగానే మునుల ఆశ్రమం కనిపించింది. ఆమె అక్కడికి వెళ్లింది. మునీశ్వరులకు నమస్కారం చేసి, తన బాధను గురించి వారికి తెలియజేసింది. మునీశ్వరులు ఇలా తెలిపారు.
వనజాయతాక్షి! కతిపయ
దినముల జూడంగ గాంతు తివిరి నలుని భూ
జననుతు నెప్పటియట్టుల
తన పురమున రాజ్యలఅల దనరెడివానిన్. (భా, అర, ద్వి, 101)
ఓ దమయంతి నీ భర్తను నీవు పూర్వం ఏవిధంగానైతే రాజ్యవైభవంతో వెలుగుతున్నాడో అదేవిధంగా వుండే వైభవాన్ని నీవు కొన్ని రోజుల్లో చూస్తావు కాబట్టి నీవు బాధపడకని చెబుతారు. ఆ ఋషీశ్వరులు కొద్దిదూరం పోయాక మాయమయ్యారు. అంతలో ఒక వర్తకుల గుంపును దమయంతి చూసి, వారి వెంట వెలుతుంది. వారిలో శుచి అనే వర్తకుడు నీవెవరమ్మా? ఎందుకు ఇక్కడ ఉన్నావని ప్రశ్నిస్తాడు. దమయంతి అప్పుడు తన భర్త నల మహారాజని ఈ అడవులలో తన నాథుడు కనిపించకుండాపోయాడని చెబుతుంది. తాము సుబాహువు యొక్క రాజధానికి వెలుతున్నామని నీవు కూడా అక్కడకు రమ్మని దమయంతిని కూడా అక్కడకు తీసుకుపోవడం జరిగింది.
దమయంతి సుబాహుని భార్యతో అమ్మా! నా పతి పరాక్రమవంతుడు. ఆయన జూదమాడి ఓడిపోయి, రాజ్యాన్ని పోగొట్టుకుని అడవులలో వెలుతుంటే ఒక చోట నిద్రించి, విధివశాన నన్ను వదలి వెళ్లిపోయాడని చెబుతుంది. రాజమాత దమయంతిని ఓదార్చి నీ భర్తను వెదకుటకు తన మంత్రిమండలిలోని బ్రాహ్మణోత్తములను అడవులకు పంపిస్తానని మాటయిస్తుంది. అప్పుడు దమయంతి ఇక్కడ తాను ఎంగిలి తిననని, కాళ్లు పిసకటం వంటి పనులు చేయనని, తన భర్తను వెదకటానికి వెళ్ళే వారితోనే మాట్లాడతానని ఆ విధంగా నీవంగీకరిస్తేనే ఉంటానని రాజమాతతో దమయంతి విన్నవించుకుంటుంది. నీకు ఎలా ఉండాలనుకుంటే అదేవిధంగ ఉండమని దమయంతితో రాజమాత చెబుతుంది. తర్వాత సునందను పిలిచి ఆమెను చూసుకునే బాధ్యత నీదేనంటుంది. రోజులు గడుస్తున్నాయి. దమయంతి భర్త మీద ప్రేమతో ఎన్నో నోములు, వ్రతాలు చేస్తు భర్తనే హృదయంలో తలస్తూ ఉంది.
5. దమయంతి - ధైర్యగుణం:
నలుడు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి మారు వేశంలో ఉంటాడని దమయంతి విదేశాలకు వెళ్లే వారితో చెప్పింది. నలున్ని వెతకడం కోసం భీమరాజు విదేశాలకు చాలా మందిని పంపాడు. అలా పంపిన వారిలో అయోధ్యకు పర్ణాదుడు అనే విప్రుడు వెళ్లాడు. అక్కడ అయోధ్యలోని ఋతుపర్ణుని దగ్గర దమయంతి గురించి చెబుతుంటే వంటవానిగా, గుర్రాల శిక్షకుడిగా ఉన్న బాహుకుడు ఆ మాటలు వింటాడు. తర్వాత వంటరిగా పర్ణాదున్ని బాహుకుడు కలిసి దమయంతి గురించి అడుగుతాడు. అక్కడ పర్ణాదునికి అనుమానం వస్తుంది. ఇతడు కురూపి, నలమహారాజు ఎలా అవుతాడు? అనుకున్నాడు. పర్ణాదుడు విదర్భకు వెళ్లి అక్కడ జరిగిన విషయాన్ని దమయంతికి తెలియజేస్తాడు. అప్పుడు భీమరాజు సుదేవున్ని పిలిపించి అయోధ్యలో ఋతుపర్ణుని దగ్గరకు వెళ్లి దమయంతికి ద్వితీయ స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తున్నారని తెలుపమంటాడు. ఋతుపర్ణుడు అయోధ్యకు వెళ్లడానికి ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది. ఋతుపర్ణుడు తన దగ్గర ఉన్న బాహుకున్ని పిలిచి మనం ఒక రోజులో అయోధ్యకు వెళ్లగలమా? అని అడుగుతాడు. అక్కడ దమయంతి స్వయంవరం చూడాలని ఉందంటాడు. బాహుకుడు రాజుతో తాను పొద్దుకుంకే లోపలే అక్కడకు చేరుస్తానని చెబుతాడు.
ఈతండు శాలిహొత్రుండొ! మాతలియో! నలుడొ! యొరులు మానవులు జవో
పేతముగనిట్లు రథహయనీతి యెరుంగుదురె? ధారుణీ వలయమునన్. 2-172.
(కథాభారతం - అరణ్యపర్వం, పుట. 63)
ఋతుపర్ణుడు రథం ఎక్కాడు బాహుకుడు రథం తోలుతున్నాడు. కళ్ళు మబ్బులు వచ్చేంత వేగంతో గుర్రాలు వెలుతున్నాయి. బుతుపర్ణుడు బాహుకున్ని చూసి ఇతడు అశ్వశాస్త్రాన్ని రాసిన శాలిహోత్రుడు కాదు, దేవతల గురువైన దేవేంద్రుని రథసారది మాతలి కాదు. నల మహారాజు కాదు. ఇంత వేగంతో గుర్రాలను ఎలా తోలుతున్నాడని ఆశ్చర్యపోయాడు. దారిలో వెలుతూ ఒక చోట తాండ్రచెట్టు (విభీతక వృక్షం) దగ్గర ఋతుపర్ణుడు నిలబడి ఆ చెట్టుకు ఉన్న కొమ్మలు, పూలు,పండ్లు ఎన్ని ఉన్నాయో? చెబుతాడు. బాహుకుడు రథాన్ని ఆపి ఆ చెట్టు కొమ్మలను,పూలను, పండ్లను లెక్కిస్తాడు అవి మహారాజు ఎన్ని చెప్పాడో అన్నే ఉన్నాయి. ఇది ఎలా సాధ్యం అని రాజును అడగగా అది అక్షహృదయం అనే గణిత విద్య అని తెలియజేశాడు. అది తనకు నేర్పిస్తే తాను అశ్వహృదయాన్ని నేర్పిస్తానని చెబుతాడు. ఆ విధంగా దారిలోనే అక్షహృదయం అనే విద్యను బాహుకుడు నేర్చుకోవడం జరిగింది. అశ్వహృదయాన్ని రాజుకు నేర్పిస్తానని బాహుకుడు చెబితే తాను అవసరం వచ్చినప్పుడు నేర్చుకుంటానంటాడు. తర్వాత కలి బాహాకుడి రూపంలో ఉన్న నలుడి నుండి బయటకు వచ్చి తనను క్షమించమని కోరుతాడు. కాని నలుడు శపించడానికి పూనుకుంటాడు. తాను కర్కోటకుడి విషాన్ని తాగి సగం నశించానని తనను శపించవద్దని నిన్ను, నీ భార్యను ఎవరైతే ధ్యానిస్తారో వారికి కలిబాధలు ఉండకుండా చేస్తానని వేడుకుంటాడు. అప్పుడు నలుడు కలిని వదిలేస్తాడు. కలి విభీతక వృక్షంలోకి ఆవహించాడు (వెళ్లాడు). అందుకే ఆనాటి నుండి ప్రజలు విభీతక వృక్షం మంచిది కాదని నమ్మేవారు.
కర్కోటోకస్య నాగస్య దమయంత్యనలస్యచ
ఋతుపర్ణస్య రాజర్షే:కీర్తన: కలినాశనమ్
(మహాభారతంలో పాత్రల విశ్లేషణ, పుట.80)
ఋతుపర్ణుడు భీమరాజు యొక్క రాజధానియైన విదర్భకు సాయంత్రానికే చేరుకున్నాడు. దమయంతి నలుడు వచ్చాడు చూడమని తన చెలికత్తెను పంపిస్తుంది. ఆమె ఋతుపర్ణ మహారాజు, అతని రథసారధి వచ్చారని తెలియజేస్తుంది. ఆ రథసారధి వంటలలో మంచి నేర్పరని దమయంతి తెలుసుకుంటుంది. ఒకసారి అతడి వంటను రుచి చూడాలని తన చెలికత్తెను బాహుకుని దగ్గరకు పంపుతుంది. బాహుకుడు చేసిన వంటలను దమయంతి దగ్గరకు చెలెకత్తె తీసుకొనివస్తుంది. ఆ రుచి నలుడి చేసిన రుచే అని గ్రహించి. అతడే నలుడని తెలుసుకుని తన అమ్మకు దమయంతి ఆ విషయాన్ని తెలియజేస్తుంది. దమయంతి తల్లి భీమరాజు అనుమతితో భాహుకున్ని వారి మందిరానికి ఆహ్వానిస్తారు. అప్పుడు బాహుకున్ని చూసిన దమయంతి అతనితో మహాసాధ్వినైన నన్ను ఆరోజు ఎందుకు విడిచిపెట్టిపోయారు. పతినే పరమేశ్వరుడిగా భావించే నేను నీకు ఏమి అపకారం చేశానని ప్రశ్నిస్తుంది. దమయంతిని చూసిన బాహుకుడు ఆ రోజు దమయంతి ఏ చీరతో ఉందో నేడు అదే మాసిన చీరతో ఉంది. అప్పటి నుండి ఆమె కటిక నేలపైనే నిద్రించేది. ఆమె కురులు ముడులుకట్టాయి. కాని నలుడు కోపంతో తన మీద ప్రేమ ఉంటే ఇప్పుడు మళ్ళీ స్వయంవరం ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నిస్తాడు. భీమరాజు నలున్ని కనుగొనుటకు పంపినవారిలో పర్ణాదుడు మీ ప్రాంతానికి వచ్చాడు. నిన్ను ఇక్కడకు రప్పించడానికి ఇలా చేయాల్సి వచ్చిందని దమయంతి తెలియజేస్తుంది. ఒక్క రోజులో అయోధ్య నుండి ఇక్కడకు రావడానికి వంద యోజనాలు దూరం ఉంది. ఒక్క రోజులో అది సాధ్యమయ్యే పని కాదు అలా రాగలిగిన వారు నలుడు ఒక్కడే అని దమయంతి చెప్పింది. దమయంతి మాటలు విన్న నలుడు ఉప్పొంగిపోయాడు. తాను కలి ప్రభావం వల్ల జూదంలో రాజ్యాన్ని పోగొట్టుకోవలసి వచ్చిందని, ఇప్పుడు కలి తనలో నుండి వెళ్లిపోయాడని నలుడు చెబుతాడు. అప్పుడు నలుడు కర్కోటకున్ని ధ్యానించి దుప్పటిని కప్పుకుంటే తన శరీరం పూర్వ స్థితిని పొందింది. అందరు సంతోషంగా కలసిపోయారు. ఋతుపర్ణుడు నలునిచేత అశ్వహృదయం అనే విద్యను నేర్చుకుని తిరిగి అయోధ్యకు వెళ్లిపోతాడు.
నలుడు ఒక నెల రోజులు మామగారి ఇంట్లో ఉండి తర్వాత నిషద రాజ్యాన్ని పరిపాలిస్నున్న పుష్కరుడి దగ్గరకు వస్తాడు. నీవు నాతో జూదమాడుతావా లేక యుద్ధం చేస్తావా అని పుష్కరుడితో నలుడు చెబుతాడు. తనతో జూదమాడితే దమయంతిని పణంగా పెట్టి జూదమాడుతానంటాడు నలుడు. గతంలో జూదమాడి నలున్ని ఒడించిన పుష్కరుడు ఇప్పుడు కూడా ఓడించి దమయంతిని స్వీకరించవచ్చునని భావిస్తాడు. కాబట్టి నలునితో జూదం ఆడదామంటాడు. ఆ జూదంలో నలుడు పుష్కరున్ని ఓడించి తన రాజ్యాన్ని తిరిగి పొందడం జరుగుతుంది. ఈ విషయాన్ని దమయంతి తెలుసుకొని వారి పిల్లలతో కలసి నిషధ రాజ్యానికి రావడం జరుగుతుంది.
6. ముగింపు:
- ఇందులో ప్రధానంగా భార్య,భర్తల మధ్య ఉండే అన్యోన్యత,ప్రేమ ప్రస్పూటంగా కన్పిస్తుంది. ఉదాహరణకు నలదమయంతులు ఒకరినొకరు చూడకుండానే ప్రేమలో పడడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయంగా చెప్పవచు.
- కష్టాలు వచ్చినప్పుడు మానవుడు ఎలాంటి బాధలకు తలొగ్గకుండా ధైర్యంగా ముందుకు నడవాలని దమయంతి పాతివ్రత్యం వల్ల వెల్లడౌతోంది.
- దమయంతిని అడవులలో ఒక బోయవాడు పట్టుకోబోతే తన పతివ్రతామ తల్లి శక్తి అంటే ఎందో నేటి సమాజానికి తెలియజేసిందని చెప్పవచ్చు. తన పాతివ్రత్య మహిమ వల్లనే అడవులలో తనను తాను రక్షించుకున్న పుణ్యశీలి దమయంతి. కష్టాలలో కూడా భర్త తన దగ్గర లేకున్నప్పుడు అతనినే నిరంతరం స్మరించేది దమయంతి. ప్రతి రోజు కూడా తన భర్త త్వరగా కనిపించేటట్లు చేయమని దేవున్ని వేడుకునేది.
- నేటి సమాజంలో కుటుంబం అస్తవ్యస్తం కావడానికి ముఖ్యకారణం భార్య,భర్తల మధ్య సఖ్యత లేకపోవడం. సమాజంలో భర్త సంసారం కోసం అప్పులు చేసి కష్టాలు పడుతుంటే భర్తను వదిలివెళ్లిన భార్యలను చాలా మందిని చూస్తుంటాం. ఇలాంటి వారికి దమయంతి ఎంతో ఆదర్శమూర్తి అని చెప్పవచ్చు. పతినే దైవంగా భావించిన పరమ పతివ్రత. దమయంతి తన భర్త అడవుల పాలయ్యాడు కాబట్టి ప్రతిరోజు కూడా కర్కోటకున్ని, ఋతుపర్ణున్ని, వేడుకున్నట్లు మనకు అవగతమవుతుంది.
- కష్టసుఖాలు వస్తుంటాయి, పోతుంటాయి. వాటికి అతీతంగా నలదమయంతుల లాగా నిలవగలగాలని ఈనాటి సమాజానికి ఈ కథ అనుసరణీయమైనదిగా భావిస్తున్నాను.
7. పాదసూచికలు:
- కథాభారతం, పుత్తా పుల్లారెడ్డి, అరణ్యపర్వం, పుట. 63
- నలచరిత్ర, రాఘవాచారి చక్రపురి, పుట.125
- నైషదం వ్యాఖ్యానం ,పుట.163
- మహాభారతంలో పాత్రల విశ్లేషణ, పుట.80
- శ్రీమదాంధ్రమహాభారతం, అరణ్యపర్వం, ద్వితీయాస్వాసం, పుట.212. పద్యం.66
శ్రీమదాంధ్రమహాభారతం, అరణ్యపర్వం, ద్వితీయాస్వాసం, పుట.227. పద్యం.101 - శ్రీమదాంధ్రమహాభారతం, అరణ్యపర్వం, ద్వితీయాస్వాసం, పద్యం.101, పుట.227.
శ్రీమదాంధ్రమహాభారతం, అరణ్యపర్వం, ద్వితీయాస్వాసం, పద్యం.149, పుట.250. - సంపూర్ణ మహాభారతం, పురాణపండ, పుట. 227
8. ఉపయుక్తగ్రంథసూచి:
- గుండప్ప డి.వి. 1975. మహాభారతంలో పాత్రలు, డి.వి.జి.ప్రచురణలు, మద్రాసు.
- పుల్లారెడ్డి పుత్తా, 2009. కథాభారతం- అరణ్యపర్వం, పుత్తాపుల్లారెడ్డి ప్రచురణలు, కడప.
- మాధవశర్మ పాటిబండ. 1970. ఆంధ్రమహాభారతం (అరణ్యపర్వం), , ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రచురణలు, హైదరాబాదు.
- మల్లినాథసూరి. నైషధం వ్యాఖ్యానం, పుట.163.
- రాఘవాచారి, చక్రపురి. 1915. నలచరిత్ర, ఎన్.వి.గోపాల్ అండ్ కో, మద్రాసు.
- లక్ష్మీనారాయణశాస్త్రి, మంత్రి. 1956. శ్రీ మహాభారతం వచనం అరణ్యపర్వం, కొండపల్లి వీరయ్య & సస్స్ ప్రచురణలు, రాజమండ్రి .
- శ్రీచిత్ర పురాణపండ. 2012. సంపూర్ణ మహాభారతం (వచన కావ్యం), మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి.
- సుబ్రహ్మణ్యం, జి.వి. (సం.) 2013. శ్రీమదాంధ్ర మహాభారతం (సరళవ్యాఖ్యానం) సంపుటం1, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణలు, తిరుపతి.
- హనుమజ్జానకీరామశర్మ పోలూరి. 1988. ఆంధ్రమహాభారత పూరణము, , విమలానంద బారతి పత్రిక ప్రచురణలు, నెల్లూరు.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "May-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-April-2025
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "MAY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి
బాధ్యత వహించరు.