AUCHITHYAM | Volume-5 | Issue-7 | June 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
3. కె.వి. నరేందర్ ‘శిథిలస్వర్గం’ నవల: ముంపు గ్రామాల సజీవచిత్రణ

డా. తాడూరి రవీందర్
ప్రిన్సిపాల్,
ప్రభుత్వ బి.సి. గురుకుల కళాశాల,
సైదాపూర్, కరీంనగర్, తెలంగాణ.
సెల్: +91 9949946607, Email: ravinder.thaduri@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
సుప్రసిద్ధ కథారచయిత అయిన కె.వి.నరేందర్ కథలే కాకుండా నాలుగు గొప్పనవలలు రచించారు. వీరి నవలలు కూడా కథల్లాగే విజువలైజ్డ్ గా ఉంటాయి. వీరు రచించిన “శిథిలస్వర్గం” నవల ముంపు గ్రామాల బాధితుల జీవితాలను కళ్లకు కట్లినట్టు చూపిస్తుంది. అభివృద్ధి ఎంతో అవసరమయిన ఈ సమకాలీనతరుణంలో, దానికోసం తమ జీవనప్రమాణాలు కోల్పోయి, ఉనికిని త్యాగం చేసే ఎన్నో గ్రామాల ప్రజల వ్యథలను ఈ నవల దృశ్యమానం చేసింది. అందుకే ఈ నవలకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ నవల పురస్కారం వరించింది. ఈ నవల ఇతివృత్తాన్ని పరిచయం చేయడం, ఇందులో పాత్రలను చిత్రించిన విధానంను తెలియచేయడం, ఆయా పాత్రల వ్యక్తిత్వంను విశ్లేషించడం, సామాజిక విశ్లేషణలో భాగంగా నీటిపారుదల ప్రాజెక్టులు వాటి ఆవశ్యకతను,ముంపు గ్రామాల సమస్యలు, శిథిలమవుతున్న ఆ బాధితుల వెతలు, కనుమరుగవుతున్న చారిత్రక, పురావస్తు సంపద, ప్రపంచీకరణవ్యతిరేకత, స్త్రీజీవనచిత్రణను సోదాహరణంగా వివరించడం, అదేవిధంగా నరేందర్ ముంపు గ్రామాల బాధితుల పక్షాన వారి బాధలను, గాథలను నవలగా మలిచి ప్రభుత్వానికి, ప్రజలకు ఎరుకపరిచే బాధ్యతను భుజానికెత్తుకున్న విధానంను వివరించడం ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం.శిథిల స్వర్గం నవలను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేసిన అనంతరం ప్రాజెక్టులు ,నీటి వనరుల కు సంబంధించిన కొన్ని ప్రామాణిక గ్రంథాల సహాయం తో ముఖ్యంగా ఆర్.విద్యాసాగర్ రావు ,సారంపల్లి మల్లారెడ్డి గారు రచించిన పుస్తకాల సహాయం తో ఈ నవలలోని ప్రధాన విషయాన్ని విశ్లేషించే ప్రయత్నం చేశాను. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ప్రముఖ జలవనరుల నిపుణులు,మేధావుల ఇంటర్వ్యూలు కూడా ఈ వ్యాసానికి బలమైన ఆధారాలు గా ఉపయోగించుకుంటూ వ్యాసాన్ని విశ్లేషణాత్మకంగా వివరించాను.
Keywords: ముంపు, ప్రాజెక్టులు, పరిహారం, ప్రపంచీకరణ, సాధికారత, పురావస్తు ఆధారాలు, శిథిలావస్థ.
1. ఉపోద్ఘాతం:
తెలుగులో నవలా రచనతో సాహిత్యం నూతన పుంతలు తొక్కింది. కవిత్వం, నాటకాల కంటే భిన్నమైన వచన రచనా రూపంలో అన్ని తరగతుల పాఠకులను అలరించిన ప్రక్రియ నవల. 1872లో నవల ఆవిర్భావం జరిగినప్పటికీ, 1910 వరకు ఉన్నత స్థానాన్ని అలంకరించిందనేది విమర్శకుల అభిప్రాయం. చారిత్రక నవలలు, సాంఘిక నవలలు మొదటి దశలో ప్రాచుర్యాన్ని పొందుతూ వచ్చినప్పటికీ విజ్ఞాన శాస్త్ర నవలా రచనతో తెలుగు సాహిత్యంలో నూతన ధోరణులు పుట్టుక వచ్చాయి.
“నవల అంటే ఇట్లా వుండాలి అని నిర్వచించి చెప్పడం సాధ్యం కాదు. రచయిత తన ఇష్టం వచ్చిన రీతిలో నవలను రచించవచ్చును. ఇద మితమని నవలకు లక్షణాలను నిర్ణయించి, స్వరూపాన్ని నిర్వచించి చెప్పలేము, నవలా రచనలో రచయిత విశృంఖలుడు, నవలకు నియమాలు ఏవీ లేకున్నా ప్రతి నవలలో పాటింప దగిన కొన్ని విషయాలు వున్నవి. నవల అనగానే దానిలో కథ ఆ కథను చెప్పే పద్ధతి అంటే కథాకథనం వుంటుంది. కథే గాక పాత్రలు, సంభాషణలు శైలి వంటివి వుంటవి. ఇదే గాక ఇంకా నవలేతివృత్తం కాలం నాటి వాతావరణ చిత్రణతో కూడిన వర్ణనాదులు వుంటవి”1 అంటారు ముదిగంటి సుజాతారెడ్డి.
తెలంగాణ ప్రాంతంలో నవలా వికాసాన్ని పరిశీలిస్తే తెలంగాణ నవలపై తెలంగాణ సంఘం, అభ్యుదయ రచయితల సంఘం, విరసం, జాతీయ సాహిత్య పరిషత్తు, నవ్య సాహితీ సాధన సాహితీ, దరకమే ఐక్య వేదిక వంటి సంస్థల కృషి ఎంతో ఉంది. ఇప్పటి వరకు తెలంగాణ లో వందల సంఖ్యలో నవలలు వెలువడ్డాయి. ఇంకా వెలువడుతూనే ఉన్నాయి. యుగసంధి, ప్రజ చిల్లర దేవుళ్ళు, గంగు, ఊరు, కొలిమి అంటుకున్నది, ఓనమాలు, తిరుగుబాటు, అంపశయ్య, కాలరేఖలు, జగడం, జాతర, బతుకుపోరు, భూమి పుత్రుడు, బతుకు, జీవన సమరం, భిన్నదృవాలు, చండీప్రియ, జిగిరి, దాడి, అడవి తల్లి, బతుకుతాడు, కక్క, మలుపు తిరిగిన రథచక్రాలు వంటి అనేక గొప్ప గొప్ప నవలలు తెలంగాణ నుండి వెలువడినవి. ఆ క్రమంలో వెలువడిన మరొక గొప్ప నవల “శిథిలస్వర్గం”. ముంపు గ్రామాలు అనే మునుపెన్నడూ ఎవరూ తీసుకోని వస్తువును స్వీకరించి, నరేందర్ అందుకు సరిపోయే పాత్రలు, కథాగమనం ద్వారా పరిపుష్టిని చేకూర్చారు.
2. శిథిలస్వర్గం – ఇతివృత్తం:
ఈ శిథిలస్వర్గం నవలలో కథానాయకుడు దీపక్. దీపక్ మూడేండ్ల బాలుడిగా ఉన్నప్పుడు అతని తల్లితండ్రులు ఇద్దరు పుష్కరగోదావరి లో మునిగి చనిపోతారు. ఒడ్డున ఉన్న ఆ గ్రామ ప్రజలే అతనిని చేరదీసి, పెంచి పెద్ద చేసి, విద్యాబుద్ధులు చెప్పిస్తారు. అతన్ని ఉన్నత చదువులు చదివిస్తారు.దీపక్ పెద్ద ఉద్యోగం రావడంతో అమెరికా వెళ్తాడు. అతనికి ఊరంటే ప్రాణం.అక్కడి పచ్చదనం, పాడిపంటలు, బడిలోనికటయ్యసారు, పూజారిరామశర్మ, బాబయ్య, నారాయణ, శ్యామల, రుక్మిణి, రాజేందర్, మోహన్, పరమేశ్వరయ్య... ఇలా ఊళ్ళో తనను సొంత బిడ్డలాగా చూసుకున్న ఆ మనుషులంటే ఎంతో ఇష్టం.కొన్నేళ్ల తరువాత తన పెళ్లికి తన ఊరి వాళ్ళను ఆహ్వానించాలని అమెరికా నుండి ఊరికి బయల్దేరతాడు. పత్రికలు తీసుకొని ఊరి గురించి, ఊర్లోని మిత్రులు, పెద్దల గురించి అనేకానేక జ్ఞాపకాలతో గ్రామంలో అడుగుపెడతాడు. తీరా ఊరును చేరే సరికి అంతా తలకిందులు, అస్తవ్యస్తం, పచ్చని వాతావరణం అంతా ఎడారిని తలపిస్తుంది. ఇక్కడ రచయిత గొప్ప వస్తువును అతి గొప్ప శిల్ప చాతుర్యంతో చెపుతాడు.
ఆ ఊరు, మనుషులు, పరిసరాలు అన్నీ విధ్వంసమవడానికి మూలం ఎల్లంపల్లి ప్రాజెక్టులో దీపక్ ఊరు ముంపు గ్రామం కావడమే. దీపక్ తన పెళ్ళి పత్రికలు ఎవరెవరికి ఇవ్వాలని ఊరికి ఎంతో ఉదాత్త భాదవనలతో వస్తాడో, ఒక్కొక్క జీవిత వాస్తవాల వెనుకనున్న కఠోర సత్యాల చిన్నాభిన్న దృశ్యాలను చూసి, విని, తిరిగి అమెరికాకు వెళ్ళడంతో నవల ముగుస్తుంది.ఎంతో పచ్చగా కళకళ లాడిన ఊరు కళదప్పి వెల వేల బోతుంది.ప్రాజెక్టులో మునుగుతుంది అని ప్రకటించినప్పటినుండి ఎనిమిదేండ్ల వరకు పరిహారం రాదు.మునిగిపోయే ఊరుకు వసతులు ఎందుకని ప్రభుత్వ పథకాలు కూడా అమలు కావు.చాలా మంది వలస వెళ్లి పోతారు.ఉన్న పది, ఇరవై ఇండ్ల ప్రజలు గోడలు కూలి,శిథిలమై ఉన్న ఊరిలో బతుకు వెళ్లదీస్తూ ఉంటారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఊరిలోకి అడుగుపెట్టిన దీపక్ తన గతాన్ని,ప్రస్తుత దుస్థితిని తలుచుకుంటూ ఒక్కొక్కరి జీవితాల గురించి హృద్యంగా, ఆవేదనగా తలుచుకుంటూ వెళ్లే కథాగమనం పాఠకుడికి ఒక గంభీరస్థితిలోకి నెట్టివేస్తుంది ఇలా ఒక్క రోజులోనే ఇన్ని గాధలు, బాధలు, కన్నీళ్ళు, కష్టాలు చూసిన దీపక్ అక్కడ ఉండలేకపోతాడు. తన సర్వస్వం అనుకున్న ఊరు, స్మశానంలా అయిందని వెక్కి వెక్కి ఏడుస్తాడు. నెలరోజులు ఉందామని వచ్చినవాడు రెండు రోజులు కూడా ఉండలేకపోతాడు. బాబయ్యను గుండెలకు హత్తుకుని చిన్న పిల్లవాడిలాగా బిగ్గరగా ఏడుస్తాడు. చివరకు బరువెక్కిన హృదయం తో తిరుగు పయనమవుతూ తన ఉన్నతికి కారణమయ్యి ప్రస్తుతం దీనస్థితిలో ఉన్నబాబయ్య, శ్యామల ,నారాయణ, రాజేందర్ లకు,అట్లాగే గోదావరి ఒడ్డున ఉన్న ఆలయ అభివృద్ధికి కలిపి యాభై లక్షలు చెక్కు రాసి కన్నీటి తో తిరిగి అమెరికా పయనం అవుతాడు.
ఈ నవల గురించి ప్రముఖకవి, రచయిత జూకంటి జగన్నాథం ముందు మాట రాస్తూ "ఈ నవలతో కె.వి. నరేందర్ తన సమకాలీన నవలా రచయితల కంటే నాలుగు అడుగులు ముందు నిలిచాడు. ఎందుకంటే, నవలను నడిపించిన శిల్పం అద్భుతమైనది. ఇంటిగోడలు, తెరుచుకోని తలుపులు, చేదబాయి, చేతికర్ర, ఇనుపనిచ్చెన, గుడ్డి దీపం మరియు కరపత్రం వంటి వాటి ద్వారా కథా కథనాన్ని నరేందర్ నిర్మించిన తీరు అసామాన్యమైంది. అందుకే నరేందర్ తన కాలపు నవలాకారులందరి కన్నా నాలుగు అడుగులు ముందున్నాడని అన్నాను"2 అని అనడాన్ని బట్టి ఈ నవల గొప్పదనం అర్ధం చేసుకోవచ్చు.
3. పాత్రచిత్రణ:
ఒక నవలలో ఇతివృత్తానికి ఆలంబనంగా నిలిచేది పాత్రలు. రచయిత తన భావాలను అభివ్యక్తం చేయడానికి, తాను నిర్వహించే కథా గమనానికి పాత్ర చిత్రణను సాధనంగా చేసుకుంటాడు. నవలకు ప్రాణం పోసేవి పాత్రలు, పాఠకుల్లో సానుభూతిని రేకెత్తించి, రసానుభూతిని నవల ప్రారంభం నుండి ముగింపు వరకు స్థిరంగా నిలిచి ఉండేవి పాత్రలు.
"జీవితమంటే సుఖదు:ఖాలు, ఒక మనిషి జీవితంలో అవి ఎలా సంప్రాప్తిస్తున్నది ఆయా సందర్భాలలో ఆ మనిషి ఎలా ప్రవర్తిస్తున్నాడు? ఈ రెండు విషయాల్ని బట్టి మనిషిలో వ్యక్తి వైశిష్ట్యం గోచరమవుతుంది. జీవితాన్ని కథగా మలిచే ప్రక్రియ అయిన నవలలో, అలా నిరూపించబడే వ్యక్తి వైశిష్ట్యాన్నే పాత్ర చిత్రణం అంటారు"3 అని ఆర్.యస్. సుదర్శనం పాత్రచిత్రణ స్వరూపాన్ని విశదీకరించారు.
ఈ విధంగా నవలలోని పాత్రలే మనను నవల ఎంత పెద్దదైనా, చిన్నదైనా తమతో పాటు చివరిదాకా నడిపించి, అనందానుభూతులను లేదా విషాద సాక్షాత్కారాన్ని కలిగిస్తాయి. నవలాకారుడు తన పాత్రల్ని సృష్టించేటపుడు తాను తన వ్యక్తిగత జీవితంలో చూసిన వ్యక్తులు, వారి వ్యక్తిత్వం ఆధారంగానే తన పాత్రల్ని సృజియించి కథా గమనాకి పరిపుష్ఠతను చేకూర్చుతాడు. కె.వి. సరేందర్ శిథిల స్వర్గము నవలను చదువుతున్నపుడు, ముంపు గ్రామాల బాధితులైన ప్రతీ మనిషి ఆ పాత్రల్లో తనను, తన వారిని చూసుకొని కన్నీరు కార్చక మానడు.
3.1 దీపక్:
ఈ నవలలో కథానాయకుడు దీపక్. అతను రెండేళ్ళ వయసులో ఉన్నపుడు, తల్లిదండ్రులిద్దరూ, గోదావరిలో మునిగి చనిపోతే, తనను కాపాడి, పెంచి, పెద్ద చేసి, విద్యాబుద్ధులు నేర్పించి, ఆమెరికాకు పంపించిన తన గ్రామం ముత్తునూరును గుండెల్లో పెట్టుకొని, తన మాతృభూమిని, అక్కడి ప్రేమలను, అనురాగాలను మరిచిపోని భూమి పుత్రుడు దీపక్.
తనను కన్నకొడుకులా సాకిన ఊరుకు ఎంతో ప్రయోజనం చేకూర్చి ఋణం తీర్చుకోవాలనే గొప్ప ఆశయంతో, తన వారందరినీ కలిసి వారి ప్రేమను, మమకారాన్ని, ఊరి వాతావరణాన్ని మనసారా ఆస్వాదించాలని అమెరికా నుండి బయలు దేరుతాడు. ఎంత ఆధునిక యుగంలో ఉన్నా పల్లె వాతావరణాన్ని, పల్లె సంస్కృతినే ప్రాణంగా ఇష్టపడే తత్వం ఇక్కడ దీపక్లో కనిపిస్తుంది. తన చిన్ననాటి జీవితంలో తనకు సహాయపడిన, కాపాడుకున్న ప్రతి ఒక్కరినీ పేరు పేరునా గుర్తుంచుకోవడం అతని లోని కృతజ్ఞతాభావాన్ని, మేలు మరిచిపోని గుణాన్ని ప్రతిబింబిస్తుంది. తన స్నేహితులు రాజేందర్ చనిపోవడం, రుక్మిణి ఆత్మహత్య చేసుకోవడం, మనోహర్ మంచం పట్టడం, మోహన్ జైలు పాలవడం, నీరటి వెంకన్న పిచ్చి వాడవడం, పరమేశ్వరయ్య బిచ్చగాడవ్వడం, వెంకటయ్య సారు కనిపించకుండా పోవడం, శ్యామల ఆకలికి ఒళ్లమ్ముకొనే స్థితికి రావడం చూసి నిలువునా కునారిల్లి పోవడం అతనిలోని సున్నితమైన హృదయానికి నిదర్శనం.
తాను చిన్నపుడు చదివిన బడి, ఆడిన వాగు, నీళ్ళు తాగిన చేదబావి, కథలు చూసిన వేదిక, తనకు అన్నం పెట్టి, ఆదరించి సొంత కొడుకులా చూసుకున్న ప్రతీ ఇంటినీ, వాటి శిథిలావస్థను చూసి కన్నీరు కారుస్తాడు.
"కారుకు అలవాటు పడినా... ఏ.సి.కి లొంగిపోయినా తనువు ఈ గాలిని గుర్తుకు తెచ్చేది నా వూరు నెమలీకలా అలాగే వుందమనుకున్నాను. అక్కడ ప్లైఓవర్లని చూసినప్పుడల్లా, ఇక్కడి ఇంద్రనస్సులు గుర్తొచ్చేవి. సయాగరా జలపాతాన్ని చూసినప్పుడల్లా, రుక్మిణి నవ్వులు గుర్తొచ్చేవి. అక్కడి రైమ్స్ కన్నా...... ఇక్కడి గౌస్ బాబా తేలు మంత్రం లయబద్ధంగా, అర్థవంతంగా అనిపించేది. అక్కడి పాప్ సంగీతం కన్నా.... మన జాజిరి పాటతో మనసంతా కోలాటం ఆడేది. జడలు విరబోసుకొని వూగే అక్కడి డ్యాన్స్లు చూస్తే..... ఇక్కడి మంగలి నాగమ్మకి వచ్చే పూనకంలో నిజాయితీ వుందనిపించేది. అక్కడి సాహిత్యం చదువుతుంటే, ఇక్కడి రామశర్మ హరికథల పద్యాలు ఉత్తమంగా, ఉన్నతంగా తోచేవి. మాన మర్యాదలు లేని ప్రేమలు, వావి వరసలు లేని కాపురాలు చూస్తుంటే మా వూరి పంచాయితీ పెద్దలు ఇక్కడుంటే బావుండేది అనిపించేది, ఈ ఊరు విడిచితే ప్రపంచ జ్ఞానం కలిగిందేమో కాని బాబయ్య......... పచ్చి బాలింతలా జ్ఞాపకాలు ఇంకా తీపిగానే వున్నాయి. ఇంకా తట్టుకునే శక్తి ఈ గుండెకు లేదు బాబన్నా..... నన్ను వెళ్లిపోనీ.... నన్ను పారిపోనీ.. (పుట 72) అని దీపక్ ఆవేదనతో అన్న మాటలు పల్లెపై అతనికి గల గౌరవం, ఆ పల్లె శిథిలమైనపుడు అతని మనసు పడిన ఆవేదనను తెలియజేస్తున్నాయి.నెల రోజులు ఉండి వెళ్లామనుకున్న దీపక్, పల్లెను ఆ స్థితిలో చూడలేక రెండు రోజులకే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయే ముందు శ్యామలకు, మనోహర్కు, శంకరయ్యకు, బాబయ్యకు ఐదులక్షల రూపాయలిస్తాడు. వెంకటయ్య సారు పేరు మీద గుడి చుట్టూ గోడ కట్టించమని ఇరవై లక్షల రూపాయల చెక్కు రాసి ఇస్తాడు. దీంతో అతనిలోని గొప్ప హృదయ సంస్కారం కనిపిస్తుంది. ఏదో ఒక రూపంలో తన వారికి, తన ఊరికి అండగా నిలవాలన్న అతని ఆదర్శ వ్యక్తిత్వం కనిపిస్తుంది. తోడ బుట్టిన వాళ్ళను, కన్న వాళ్ళను, మేలు చేసిన వాళ్ళను మరిచిపోయే ఈ రోజుల్లో, ఇలా స్నేహితుల కోసం, ఊరి కోసం దీపక్ పడే తపన ఎంతో మందికి కనువిప్పు కలిగేలా చిత్రించారు రచయిత.
3.2 వెంకటయ్య సారు:
వెంకటయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఊరిలోని పాఠశాలలో పాఠాలు చెప్పడమే కాకుండా, ఊరి బాగోగుల గురించి, ప్రజా సమస్యల గురించి పట్టించుకునే వాడు. ఊరి ప్రజలకు ఏవైనా సమస్యలు వచ్చినపుడు, పరిష్కారం కోసం సలహాలు ఇచ్చేవాడు. ఉద్యోగమే కాకుండా, సమాజం పట్ల బాధ్యత, సామాజిక స్పృహ కలిగినవాడు. ఊరు మునిగిపోతుందన్న విషయం పట్ల ప్రజల్లో గందరగోళం నెలకొన్నప్పుడు, అసలు ముంపు అంటే ఏమిటి? అందువల్ల వచ్చే సమస్యలు ఏంటి? ఊరు ఎదుర్కోబోయే ఉపద్రవాలు ఏమిటి? అనేది వివరంగా చెబుతాడు. ఊరి వాళ్ళందరూ ఆస్తులు, ఇండ్లు, మునిగిపోతున్నాయి అని బాధపడుతుంటే, వెంకటయ్య సారు మాత్రం చారిత్రాత్మక కో గ్రామం మునిగిపోతుందనే తీవ్రంగా ఆవేదన చెందుతాడు. శాతవాహనుల తొలి రాజధాని, తపస్సు చేసుకున్న మునుల గుట్ట, బౌద్ధ స్తూపం, కోటేశ్వర, సిద్ధేశ్వర ఆలయాలు మునిగిపోవడం అనే విషయాన్నే తట్టుకోలేకపోతాడు. వెంకటయ్య సారు ఎంతటి మేధావో, అంతటి చారిత్రక స్పృహ ఉన్న వ్యక్తి కూడాను. అంతే పట్టుదల ఉన్న వ్యక్తి. అందుకే ఆ చరిత్ర మునిగిపోకుండా కాకపోడమే తన లక్ష్యంగా, అధికారుల చుట్టూ, నాయకుల చుట్టూ అనేక అప్లికేషన్లు పట్టుకొని తిరుగుతాడు. చివరకు అవి మునుగకుండా డిజైన్లలో మార్పులు చేసి, సలహాలు ఇస్తాడు అంతటి ప్రజ్ఞావంతుడుఆయన.
”ఆధునిక దేవాలయాలొచ్చి పురాతన దేవాలయాల్ని పూడ్చి పెడుతున్నందుకు కుమిలిపోతున్నాను. గతం తెలుసుకోలేని వాళ్లకి భవిష్యత్తు వుండదు. వర్తమానం ఎప్పుడూ శాశ్వతం కాదు. భవిష్యత్తుకి ఎన్నడూ రూపం లేదు. గతమొక్కటే శాశ్వతం. గతం అంటే చరిత్ర...చరిత్రంటే మన సంస్కృతి... మన సంప్రదాయం... చరిత్రలేని మనిషికి మనుగడ లేదు. ప్రపంచ దేశాలన్ని చీమలు పెట్టిన పుట్టల్ని కూడా పదిలంగా కాపాడుకుంటున్నాయి. పురాతన కట్టడాల్ని తమ వారసత్వ సంపదగా ప్రేమిస్తున్నాయి. చరిత్ర ఒక దేశానికి వంశాంకురం... చరిత్ర ఒక దేశానికి తల్లి వేరు. చరిత్ర ఒక దేశానికి బొడ్డుపేగు...ఈ కాగితాలన్నీ అధికార్లకు నేనిచ్చిన వినతిపత్రాలు... విన్నపాలు.. నివేదనలు...ఒక చారిత్రక కట్టడం మునిగిపోకుండా ప్రాజెక్టుని డిజైన్ చేయమని... ఎలా డిజైన్ చేయవచ్చునో కూడా చేసిన సూచనలు, సలహాలు...కానీ నావిన్నపాలన్ని... నీటిపాలయ్యాయి” (పుట:108)
అనే మాటలను బట్టి మాస్టారు అవేదన అర్థం అవుతుంది.అధికార్లు తన బాధను పట్టించుకోవడం లేదని, తానే మూడు రోజులు సెలవు పెట్టి, మహబూబ్ నగర్ జిల్లా ఆలంపురం వెళ్ళి అక్కడ ఆలయాల చుట్టూ రిటైనింగ్ గోడ కట్టి గుడిని రక్షించిన విషయం తెలుసుకొని వస్తాడు. దీన్ని బట్టి ఆయన చిత్తశుద్ధి ఏమిటి అనేది మనము అర్థం చేసుకోవచ్చు.
తన రిటైర్మెంట్ రోజున తనకు వచ్చే ఇరవై రెండు లక్షల రూపాయలు, కోట చుట్టూ రిటైనింగ్ గోడ కట్టడానికి ఇస్తానని చెప్పిన గొప్ప దానకర్త. త్యాగశీలి. ఆ ముదిమి వయసులో తనకు, తన కుటుంబానికి ఎంతో అవసరమయ్యే ఆ డబ్బును అలా ఊరి బాగు కోసం ఖర్చు చేయాలనుకోవడం ఎంతో ధైర్యంతో కూడిన నిర్ణయం. ఈ విషయంలో ఇంట్లో ఎంతో పెద్ద గొడవ జరిగినా కూడా తన నిర్ణయం నుండి ప్రక్కకు తప్పుకోడు. ఈ విషయంలో ఏం జరిగినా సరే భరించేంతటి మొండివాడు ఆయన అని అనిపిస్తుంది. తన కొడుకు చరిత్ర గురించి హేళనగా తక్కువ చేసి మాట్లాడితే, అతనితో కఠినంగా మాట్లాడుతాడు. కొడుకు అతని మెడపై ఇనుపరాడ్తో కొట్టి, గదిలో బంధించినపుడు, తన చుట్టూ ఉన్న వాళ్ళు అంతా నటిస్తున్నవారే తప్ప, నిజమైన ప్రేమలు లేవని అనుకుంటాడు. కుటుంబం, బంధాలు, బాధ్యతలు అన్నింటిపై అతనికి విరక్తి కలుగుతుంది. రాత్రికి రాత్రే దూరంగా వెళ్ళిపోతాడు. ఇక కనిపించకుండా పోతాడు.
3.3 రాజేందర్ :
రాజేందర్ దీపక్ కి చిన్ననాటి స్నేహితుడు. మల్లేశం, అనసూయ అతని తల్లిదండ్రులు. చిన్నప్పటి నుండి రాజేందర్ కష్టజీవి, చదువుకుంటూనే తన తల్లిదండ్రులకు పనుల్లో చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఐ.టి.ఐ.లో ప్రవేశం పొంది కూడా, ఊర్లోని వ్యవసాయ మోటార్లు, మంచినీటి రిపేర్లు చేస్తూ, డబ్బులు సంపాదిస్తాడు. దీనిని బట్టి తను స్వయంకృషితో ఎదగాలని, తల్లిదండ్రులకు భారం కాకుండా, వారికి చేదోడువాదోడుగా ఉండాలనే అతని ఆత్మగౌరవం, కష్టపడే తత్వం మనం అవగతం చేసుకోవచ్చు. రాజేందర్ మోటార్ల రిపేరు పనిలో తీరిక లేకుండా ఉన్నాకానీ, చదువును నిర్లక్ష్యం చేయలేదు. ఐ.టి.ఐ. పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో పాసయ్యి ఊరి వాళ్ళందరికీ ఆదర్శంగా నిలుస్తాడు. దీనిని బట్టి అతనికి చదువు అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు. పెళ్ళి సంబంధం కుదిరి, వరపూజ జరిగి, చివరికి ముహూర్తాలు పెట్టుకునే రోజున, ఆడపెళ్ళి వారు సంబంధం వద్దని చెప్పినపుడు చాలా బాధపడుతాడు. తన అమ్మా నాన్న, చుట్టాలు వారిని మాటలన్నా కూడా, రాజేందర్ పల్లెత్తు మాట కూడా మాట్లాడడు. దీన్ని బట్టి తనకు బాధ కలిగినా, ఇంకొకరితో గొడవకు దిగే తత్వం కాదు అతనిది అని భావించవచ్చు. ఏం మాట్లాడకుండా వాళ్ల డబ్బులన్నీ వాళ్ళకిచ్చి పంపించండి అని తల్లిండ్రులతో చెప్పిన సందర్భంలో అతనిలోని నిరహంకారిని చూడవచ్చు. ఊర్లో ఉండి అందరి ముందు, తిరుగలేకపోతాడు. ఇంట్లో ఉండి, అమ్మానాన్నలను బాధపెట్టడం నచ్చక, స్నేహితులతో కలిసి మస్కట్ పోతాడు. ఎలాగైనా సంపాదించి, అందరి ముందు గర్వంగా బతకాలని వెళ్తాడు. ఇంత పట్టుదల ఉన్న రాజేందర్, అర్ధాంతరంగా విద్యుత్ షాక్ తో చనిపోతాడు.
3.4 రుక్మిణి :
రుక్మిణి దీపక్ చిన్ననాటి స్నేహితురాలు. గుంటుకుల మల్లారెడ్డి, శాంతమ్మల ఏకైక కూతురు. చిన్నప్పటి నుండే ఎంతో చలాకీగా, ధైర్యంగా ఉండేది. రెండు జడలతో ఎంతో చూడచక్కగా కనిపించేది. చిన్నప్పుడు తన స్నేహితులతో ఆడుకునే వయసులో కూడా ధైర్య సాహసాలు ప్రదర్శించేది. ఎలాంటి గొంగడి లేకుండా, తేనెటీగలు లేవకుండా తేనెను చెట్టెక్కి తీసేది. పొలాల గట్లల్లోని బొరియల్లో ధైర్యంగా చేయి పెట్టి పీతలను బయటకు తీసేది. ఇంటర్ దాక చదువుకుంది. ఇంటి పనులు, పొలం పనులు అన్నింటిలోను నేర్పరి, బీడీలు చేయడానికి కూర్చుంటే ఒక్క పూటలో పదిహేను వందల బీడీలు చేసేంతటి నైపుణ్యం తనది. ఇవన్నీ గాక కుట్టుమిషన్ ద్వారా కూడ డబ్బులు సంపాదించేది. అందరితో కలుపుగోలుగా ఉంటూ, ఊరందరి చేత తెలివైన పిల్ల, సుగుణాల రాశి అని మెప్పు పొందింది.
తల్లిదండ్రుల ఇష్టం మేరకు పరంధాములును ఇల్లరికం అల్లుడిగా తెచ్చి, రుక్మిణితో పెళ్ళి చేస్తే మనసారా స్వీకరిస్తుంది. తల్లిదండ్రులకు తెలియకుండానే, తాను కష్టపడి సంపాదించిన డబ్బుతో పరంధాములుకు కొత్త బట్టలు కుట్టించేది. పరంధాములు తాగి ఇంటికి వచ్చినా, ఏ ఒక్క రోజ ఆ విషయం బయటకు తెలియనివ్వదు. పరంధాములు ఏ పని చేయకుండా ఖాళీగా, బద్దకంగా ఉన్నా కూడా అతని గౌరవానికి భంగం కలగకుండా చూసుకొనేది. అటువంటి రుక్మిణితో విడాకులు కావాలని పరంధాములు పంచాయితీ పెట్టినపుడు-
"థూ... బట్టెబాజోడా... గోవసోంటోనివనుకున్న... గిట్ల పైసకు పియ్యి తింటవనుకోలే... నీకేం తక్కువ చేసిన... నువ్వెప్పుడస్తవోనని బీడీలు చేసుకుంట గలుమల కూసుండేదాన్ని... నీకిష్టమని రోజు కోడిగుడ్ల పులుసు చేసేదాన్ని, నా బీడీలకచ్చిన పైసలతోని చీరెలు, రైకలు కొనుక్కోలే... నీకు డ్రెస్సులు కుట్టిచ్చిన... గింత తక్లీబోనివనుకోలే... కట్టమో నిట్టూరమో సంసారం చేసిన... దొంగతనంచెయ్యలే... రంకుతనం చెయ్యలే... నువ్వు తాగచ్చినా నా అవ్వయ్యకు చెప్పుకోలె... నువ్వు సత్తెనాశనం సావటికొట్టమైతవ్..." (పుట:68)
అని పుల్లిరిసి అయిదు దోసిల్ల మన్నువోస్తుంది.పెద్ద మనుషులు, రుక్మిణి తల్లిదండ్రులు పరంధాములుకు ఎన్ని చెప్పినా వినకపోయేసరికి, తన మనసు విరిచేసుకొని, పరంధాములు ముఖం మీద ఉమ్మేసి, శాపనార్థాలు పెట్టేసి, ఏడుస్తూ వెళ్ళి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. అంతటి ధైర్యం గల రుక్మిణి, ఆత్మహత్య చేసుకొనేంత పిరికిదయ్యిందంటే, ఆమె ఎంత క్షోభను అనుభవించిందో మనం అర్థం చేసుకోవచ్చు.
3.5 మోహన్:
మోహన్ దీపక్ చిన్ననాటి స్నేహితుడు. గ్రూప్స్ ప్రిలిమినరీ పరీక్ష పాసయ్యి, మెయిన్స్కు సిద్దమవుతూ ఇంటి దగ్గరే చదువుతుంటాడు. తెలివిగల వాడు మాత్రమే కాదు, అభ్యుదయభావాలు కలవాడు. ఊరు ప్రాజెక్టులో మునిగిపోతుందన్న వార్తలు వచ్చిన సమయంలో మోహన్ ఎంతో బాధపడతాడు. అయినా తన పరీక్షల చదువుకు ఏ మాత్రం ఆటంకం కలుగకుండా చదవాలని నిశ్చయించుకుంటాడు. కానీ పరిహారం ఇచ్చే లిస్టులో తమ పేరు లేకపోవడంతో ఆ అన్యాయాన్ని సహించలేకపోతాడు. అధికారులను నిలదీయడానికి వెళతాడు. కానీ అసలు అక్కడ అంతా లంచాల మాయాజాలం నడుస్తుందని అర్థం చేసుకుంటాడు. ఎలాగైనా తమ కుటుంబానికి న్యాయం జరిగేలా చేయాలని సంకల్పించుకుంటాడు.
ప్రాజెక్టు శంకుస్థాపనకు మంత్రి వస్తున్నాడన్న నేపధ్యంలో ఊరి ప్రజలందరి కోరిక మేరకు భూ నిర్వాసితుల పక్షాన పోరాటానికి నాయకత్వం వహిస్తాడు. ఎన్ని ఇబ్బందులు, అడ్డంకులు ఎదురైనా వెనుకడుగు వేయడు. మంత్రిని ప్రజలందరి సమక్షంలో నిలదీస్తాడు. తమ న్యాయమైన డిమాండ్లను తీరుస్తామనే దాక ప్రాజెక్టును మొదలుకానివ్వమని హెచ్చరిస్తాడు. వేల సంఖ్యలో ఉన్న ప్రజలు అందరూ మోహన్ మాటకు కట్టుబడి ఉన్నారంటే, అంత చిన్న వయసులోనే అతనిలో గొప్ప నాయకత్వ లక్షణాలున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు.
"లేదు... మాకు ముందు న్యాయం జరగాలి... ఇవన్నీ అమలయిన తర్వాతే మీరు సభావేదికనెక్కాలి. అప్పుడే భూమి పూజ చేయాలి...”(పుట:52) అంటూ ఎదిరిస్తాడు. మంత్రి గడ్డపారను భూమిలోకి దించే సమయంలో తాను ఆ గునపానికి ఎదురుగా నేలపై పడుకుంటాడు అంటే తనను నమ్మిన ప్రజల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడే నాయకత్వం అని అనవచ్చు. చివరకు ప్రజల పక్షాన పోరాడి, తన స్వంత లక్ష్యానికి దూరమైపోతాడు. మంత్రి కుట్రలకు బలయ్యి, పోలీసు అక్రమ కేసుల్లో అరెస్టయి జైలుపాలవుతాడు.
3.6 పరమేశ్వరయ్య :
పరమేశ్వరయ్య ఊరిలో ఆర్థికబలం, ఆత్మీయ బలం కలిగిన వాడు. ఒకప్పుడు ఊరంతా కన్నుసన్నల్లోనే ఉండేది. అతడి ఆజ్ఞ లేకుండా వూర్లో ఎవరింట్లోను, ఏ కార్యక్రమం జరిగేది కాదు. అందరికీ ఆర్థికంగా అండగా నిలబడేవాడు. అందుకే ఊర్లో అందరూ పరమేశ్వరయ్యను పరమాత్ముడని పిలిచేవారు. పరమేశ్వరయ్య నలుగురు కొడుకులు, కోడళ్లూ అతడి నిర్ణయం విని విరుచుకుపడతాడు. ముంపులో ఊరు మునుగుతుంది, తమతో పాటు హైద్రాబాద్ తీసుకెళ్తామని వాళ్ళంటే నేను రాను, చచ్చేదాక ఇక్కడే ఉంటాను" అని తెగేసి చెబుతాడు. వాళ్ళు ఎంత బతిమాలినా తన నిర్ణయం మార్చుకోడు.
పరమేశ్వరయ్యకు ఊరంటే ప్రాణం. ఊరి ప్రేమాభిమానాలే లోకం. కొడుకులు వరి కోత మిషన్, నాటు వేసే మిషన్ తెప్పిస్తే వారిని తిట్టి మరీ ఆ యంత్రాలను వెనక్కిపంపిస్తాడు. ఇక్కడ పరమేశ్వరయ్య ప్రపంచీకరణకు, యాంత్రీకరణకు వ్యతిరేకి అని స్పష్టంగా తెలుస్తుంది. ఆ యంత్రాలు వస్తే కూలీల బతుకులే కాదు, పర్యావరణం దెబ్బతింటుందని, బురదపాములు, ఎండ్రకాయలు, కొంగలు కనుమరుగయి పోతాయని వాళ్ళతో వాదన పెట్టుకుంటాడు. ఆడవాళ్ళు నడుం వంచి నాట్లేస్తూ పాడే వందలాది జానపదాలు మాయమైపోతాయని గొడవ పెట్టుకుంటాడు. అంటే తనే కాకుండా తనతో పాటు పదుగురు పచ్చగా బతకాలనే సదాకాంక్ష కలిగినవాడు పరమేశ్వరయ్య.
“ఓరేయ్ చంటీ.. మనవాల్లు నలుగురు బతకాలి గాని....... వాళ్ల నోటి దగ్గరి కూడుని ఎత్తుకెళ్లి పోవద్దురా...... సువ్వీ యంత్రాన్ని పొలాల్లో నాట్లు వేయడానికి, కోతలు కోయడానికి తెచ్చావు ఈ వూర్లో ఆరేడు వందల మంది ఆడ కూలీలున్నారు. వాళ్లందరి గతి ఏం కావాలె.... పని దొరక్కపోతే వాళ్ళ బతుకులేంగావాలె..... ఆ పాపం మనకెందుకు బిడ్డా"... (ఇట: 38) అనే పరమేశ్వరయ్య మాటలు అతనిలోని ప్రపంచీకరణవ్యతిరేకతను సూచిస్తున్నాయి.
చివరకు ఊరే తనను కన్నతల్లిగా చూసుకుంటుంది. ఊరి ప్రజలే తలో ముద్ద పడేస్తారని, పట్నం వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పి ఒక్కడే ఊర్లో ఉండిపోయిన మట్టి మనిషి వరమే శ్వరయ్య. ఊరంతా ఖాళీ అవుతున్నా, తాను మాత్రం ఊళ్లోనే ఉన్న ఇండ్లల్లో అన్నం అడుక్కుంటూ ఒక బిచ్చగాడిగా బతుకుతున్న పచ్చదనపు హృదయం గల మచ్చలేని మనిషి.
3.7 శ్యామల :
దీపక్ చిన్నతనంలో ఆరోగ్యం బాగా లేకపోతే, ఎన్నో తంటాలు పడి అతన్ని బతికింపజేసిన స్త్రీ మూర్తి శ్యామల. తన భర్త నారాయణ బాగా తాగుడుకు అలవాటుపడితే, అష్టకష్టాలు పడి, అన్నీ ఓర్చుకొని క్రమ క్రమంగా అతనికి తాగుడు మాన్పించిన సహన శీలి. తన భర్తను మార్చడంతో పాటు, ఎంతో పొదుపు చేసి, డబ్బును సక్రమంగా ఖర్చు చేస్తూ కుటుంబాన్ని ఒక మంచిస్థితిలో నడిపిన నేర్పరి శ్యామల.
ముంపు ద్వారా వచ్చిన డబ్బులన్నీ భర్త నారాయణ తాగడానికి, జల్సాలకు ఖర్చు పెళ్లి బిడ్డ భవిష్యత్తుకు, పెళ్ళికి డబ్బులు లేకుండా వృథా చేస్తున్నాడని ఆక్రోశిస్తుంది. అతని కాళ్ళావెళ్ళా బతిమాలుతుంది. ఎన్నో రకాలుగా, ఎంతో ఓర్పుగా అతన్ని మార్చడానికి ప్రయత్నిస్తుంది. ఇక్కడశ్యామలను పరిశీలిస్తే ఒక స్త్రీ సహజంగా తన కుటుంబం బాగు కోసం ఎంత పరితపిస్తుందని తెలుసుకోవచ్చు. చివరకు నారాయణ తనను చంపేయబోతుంటే, ఊపిరాడక ప్రాణాలు కోల్పోతున్నాననే తరుణంలో, అతన్ని నెట్టివేయడంతో అతను దెబ్బ తాకి చనిపోవడం సంభవిస్తే, సమాజం, ఊరు అంతా తనను భర్తను చంపిన ఆడదానిగా చిత్రీకరించి మాటలంటుంటే భరించలేక, బయటకు అడుగే పెట్టక ఆకలితో అలమటిస్తుంది.
తనను పరామర్శించడానికి వచ్చిన కొందరు తనను లొంగదీసుకుంటే, తన పొట్ట నింపుకోవడం కోసం, బుక్కెడు అన్నం కోసం, తనను తాను వారికి అర్పించుకుంటుంది. సమాజంలో దృష్టిలో ఇది తప్పే కావచ్చు కాని, ఆమెను కష్టాల్లో ఉన్నప్పుడు హంతకురాలిగా ముద్రవేసి, వెలివేసినంత పని చేసి, ఆమె ఆకలికి అల్లాడి పస్తులున్న సమయంలో, సమాజం చూపెట్టిన వివక్ష, ఆమెను ఒళ్ళు అమ్ముకొని, కడుపు నింపుకునే పరిస్థితికి దిగజార్చింది అని చెప్పవచ్చు.
4. సామాజికచిత్రణ:
"రచయిత సమాజమును సమగ్రముగా పరిశీలించి, నవలాంగము లన్నింటిని సమకూర్చుకొని, తనకు గల ప్రతిభా వ్యుత్పత్యభ్యాసములతో పరిశ్రమించినచో మంచి నవలను సృష్టించి తన ఆలోచనా పరిధికి తగిన సందేశము నివ్వగలడు. రచయిత నీరసుడైనచో అతని సృష్టియంతయు నీరసమగును. అతడందించు సందేశము నీరసముగా నుండును. మనము పడు శ్రమ మరియు కాలము వ్యర్థమగును”4
అని పుల్లాభొట్ల వేంకటేశ్వర్లు గారన్నట్లు నవలా రచయిత సమాజముపై పూర్తి అవగాహన కలిగి, అంతిమంగా తన నవల ద్వారా సమాజంలో మార్పును గాని, సమాజానికి ఒక సందేశమును గాని ఇవ్వకపోతే ఆ నవల తన ప్రయోజనాన్ని కోల్పోయినట్లే అని చెప్పక తప్పదు.'శిధిల స్వర్గంలో' ముంపు బాధితుల బాధలను తెలియజేస్తూ, వారి గురించి ప్రపంచానికి, ప్రభుత్వాలకు, పాలకులకు ఉండాల్సిన బాధ్యతలను గుర్తు చేశారు.
4.1 నీటిపారుదల ప్రాజెక్టులు – ఎల్లంపల్లి ప్రాజెక్టు:
క్రీస్తు పూర్వం నుండి నేటి వరకు చక్రవర్తులు, రాజులు, పాలకులు తమ ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే పంటలు బాగా పండాలని, అందుకు మంచి నీటి వసతులు ఉండాలని అనేక నీటి వసతి సౌకర్యాలను కల్పించారు. మనం చరిత్రను పరిశీలిస్తే, శాతవాహనుల కాలంలో పంటలకు నీటివసతి కోసం ఉదక యంత్రం అనే నీటిని ఎత్తిపోసే పరికరాన్ని కనుగొన్నారని తెలుస్తుంది. అలాగే మధ్యయుగాలలో కూడా ఢిల్లీ సుల్తానుల కాలంలో నీటి కాలువలు తవ్వించారని చదువుకున్నాం. మన కాకతీయులు గొలుసుకట్టు చెరువుల ద్వారా దేశంలోనే అత్యంత మెరుగైన నీటి వసతులను అందించారని తెలుసుకున్నాం. ప్రస్తుతం చూస్తున్నాము కూడా. రైతులకు సకాలంలో నీరు అందకపోతే, పంటలు పండవు, తద్వారా దేశం దుర్భిక్షంలోకి నెట్టివేయబడుతుంది. అందుకని రైతులకు నీటి వసతుల కోసం దేశవ్యాప్తంగా ఉన్న నదులపై ప్రజెక్టులు నిర్మించవలసిన అనివార్యత ఏర్పడింది.
ముఖ్యంగా తెలంగాణలో చాలా వరకు మెట్టనేలలు ఉండడానికి కారణం, సరైన నీటి నిల్వలు, నీటి వనరులు లేకపోవమే. తెలంగాణలో కృష్ణా, గోదావరి వంటి పెద్ద నదులు ప్రవహిస్తున్నా, ఆ నీరంతా వృథాగా సముద్రంలో కలవడం తప్ప, చెప్పుకోతగ్గ ఏ పెద్ద ప్రాజెక్టు లేదు. ఈ మధ్య కాలంలోనే తెలంగాణ నదులపై ప్రాజెక్టులకు ప్రభ్వుతం పూనుకోవడం శుభపరిణామంగా భావించాలి. నిజాం కాలంలో నిర్మించిన నిజాంసాగర్, ఉస్మాన్సాగర్, ఆ తరువాత కాలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు తప్ప, తెలంగాణ భూములకు నీళ్లిచ్చిన ప్రాజెక్టులు పెద్దగా ఏమీ లేవని తెలుస్తున్నది. కృష్ణానదిపై నాగార్జున సాగర్, గోదావరి పై కట్టిన ధవళేశ్వరం బ్యారేజీ వంటి వాటితో ఆంధ్ర ప్రాంతం సస్యశామలంగా ఉంటే, అవే నదులు ఇక్కడ ఎటువంటి ప్రాజెక్టులు లేక ఈ ప్రాంతపు బిడ్డలకు అందకుండా పోయాయని, దశాబ్దాలుగా తెలంగాణ రచయితలు, కవులు వివిధ సందర్భాలలో, వ్యక్తపరచారు. ముఖ్యంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ నినాదమైన "నీళ్ళు, నిధులు నియామకాలు"లో నీటి ప్రాజెక్టులకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వబడింది. అటువంటి సందర్భాలలో అనేక పాటలు, కథలు, వ్యాసాలు ఈ విషయాన్ని సమాజం ముందుంచాయి.
“తలాపున పారుతుంది గోదారి
నీ చేను నీ చెలకా ఎడారీ" 5
"ఉత్తరాన గోదావరి ఉప్పొంగి ఉరకనేమి
దక్షిణాన కృష్ణమ్మ దర్జాగా పారనేమి
నీళ్ళు లేక నోళ్లు దెరిచే బీళ్ళను జూడు
మా పల్లెలన్నీ బోసివోగా తల్లడిల్లుతున్న తల్లి” 6
వంటి పాటలు తెలంగాణ దుర్భిక్షాన్ని తెలియజేస్తున్నాయి.
"తెలంగాణ ప్రాజక్టులపై వలసపాలకులకెప్పుడూ సవతి ప్రేమే, పొరుగు రాష్ట్రాలతో లాలూచీ పడడం దగ్గర్నుంచి ట్రిబ్యూనల్ ఎదుట తెలంగాణ పక్షాన సమర్థంగా వాదించకపోవడం, సముచిత వాటా నీటిని పొందకపోవడం, పొందిన వాటా వినియోగం కోసం ప్రాజెక్టును రూపొందించకపోవడం, రూపొందించిన ప్రాజెక్టులకు నిధులు సమకూర్చకపోవడం, విపరీతమైన జాప్యానికి కారణభూతమవడం, ప్రాజెక్టు అమలయ్యాక అందులో నీటిని సరిగ్గా వినియోగించకపోవడం, వీలైతే తెలంగాణ ప్రాజెక్టుల్లో నిలువ చేసిన నీటిని ఆంధ్ర ప్రాజెక్టులకు తరలించడం, తస్కరించడం, ఇలాంటి అనేక కుట్రలు చేశారు, చేస్తున్నారు"7
అని తెలంగాణ ప్రాజెక్టుల అన్యాయంపై ఆర్. విద్యాసాగర్ రావు వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని బట్టి ఇక్కడ సాగునీటి రంగం ఎంత వివక్షకు గురైందో అర్థం చేసుకోవచ్చు.ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు ఉపశమనం కలిగించాలని, గోదావరి నదిపై ఒక ఆనకట్ట కట్టడానికి నిర్ణయించింది. 2004 సం॥లో అప్పటి ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్వపు కరీంనగర్ జిల్లా, రామగుండం మండలం ఎల్లంపల్లి వద్ద గోదావరి నదిపై ఈ ప్రాజెక్టును నిర్మించారు. 2004, జూలై 28న ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డా॥ వై.యస్. రాజశేఖర రెడ్డిచే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. ఈ ప్రాజెక్టు మొదటి దశలో రూ.900 కోట్లతో 63 టి.ఎం.సీ.ల నీటిని నిలువచేసేలా, రెండవ దశలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలకు 49.5 టి.ఎం.సి.ల నీటిని అందించేలా రూపకల్పన చేయబడింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అనేక ఆందోళనలు సాగాయి.
“శ్రీరాంసాగర్ గేట్లు ఎత్తినపుడు ఈ ప్రాజెక్టుకు నీటి లభ్యత ఉంటుంది. ఎప్పుడో శ్రీరాం సాగర్ గేట్లు ఎత్తినపుడు కొంత నీరు వస్తుందే తప్ప గోదావరిలో నీరు లభ్యత లేదు. అందువలన ప్రాణహిత లిఫ్టు నీటిని ఇందులోకి మళ్ళించాలని పథకం రూపొందించారు"8
4.2 ముంపు సమస్యలు – పరిహారంలో జాప్యం:
జూలై 2007లో పూర్తి కావల్సిన ఈ ప్రాజెక్టు 2016లో పూర్తయింది. దీని కింద ప్రకటించిన ముంపు గ్రామాల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ ప్రాజెక్టు కింద మొత్తం 37 గ్రామాలను ముంపు గ్రామాలుగా ప్రకటించారు. అయితే అప్పటి వరకు ప్రశాంతంగా బతుకుతున్న ఆ పల్లెల్లో ఈ ముంపు పెను ఉపద్రవమై వారి జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. "నదుల మీద పెద్ద ప్రాజెక్టులు కట్టడం వలన కింది ప్రాంతాలకు లక్షల ఎకరాలు పారుతాయని ఆశలు చూపించే భారీ నీటి ప్రాజెక్టులు పూర్తయ్యేదెప్పుడో తెలువది గాని ప్రాజెక్టు ముంపు గ్రామాలలో కకావికలమైతున్న మానవ సమాజాల చరిత్ర సంస్కృతులు, ప్రజల మధ్య విధ్వంసమవుతున్న మానవ సంబంధాలకి ఈ నవల అద్దం పట్టింది"9 అన్న జూకంటి జగన్నాధం మాటలను బట్టి ముంపు ఎంతటి విషాదాన్ని మిగులుస్తుందో మనం ఊహించవచ్చు. అటువంటి అతి విషాదకరమయిన, ఆలోచించదగిన ఇతివృత్తంతో కె.వి. నరేందర్ ఈ నవలను రచించారు.
ఈ నవలలో ముంపు బాధిత గ్రామాల ప్రజలు ఎదుర్కొనే ప్రతీ ఒక్క బాధను, వ్యధలను మన కళ్ళ ముందుచారు నరేందర్. ప్రాజెక్టులు కట్టడం వల్ల లక్షల ఎకరాలకు నీరు పారి, లక్షల కుటుంబాల బతుకులు పచ్చగా మారుతాయనడంలో సందేహం లేదు, కానీ ఆ ప్రాజెక్టు నీటిలో మునిగిన గ్రామాల పాలిట ఆ నీరు శాపమే అని చెప్పవచ్చు. ఈ ముంపు బాధిత ప్రజల గురించి అనిశెట్టి రజిత తన “నిర్భయాకాశం కింద" అనే కవితా సంపుటిలో-
"ప్రభుత్వపు బూటకపు ప్రగతి బాటలో
ఎదురవుతూ ప్రమాదాలు విలయాలూ
ఉత్పాతాలూ ప్రకృతి కోపాలు
ఏమి పట్టదా ఏలినవారికి
ఊళ్ళను గూళ్ళనూ సేద్యాన్ని శ్రమతత్వాన్ని మూలికలను ధనసంపదలనూసమస్తాన్నీ
సమూలంగా నాశనం చేస్తుంది
దీనుల విలాపాలను ముంచేస్తుంది
అది జల సమాధి ముంవంటే అది మరి"10
అని ముంపు గ్రామాల గోడును చెప్తూ పాలకుల నిర్లక్ష్య ధోరణిపై ఆవేదనతో రాస్తుంది.
అయితే ప్రాజెక్టులు నిర్మాణం ప్రారంభం కాకముందే, ముంపు గ్రామాల ప్రజలకు సరైన పరిహారం ప్రకటించి, అది వారికి అందజేసి, పునరావాస కాలనీలు నిర్మించి, అర్హులైన యువతీ యువకులకు ఉపాధి కల్పిస్తే ఈ ముంపు వలన కలిగే మానసిక, ఆర్థిక బాధలను సగానికి పైగా ఉపశమనం కలిగించనవారమవుతాము. అయితే ప్రాజెక్టులు మొదలు పెట్టాక కొన్ని యేండ్ల దాక ఇవేవీ జరుగక, హామీలు నెరవేరక గ్రామాలలో ఉండలేక, విడిచిపెట్టి పోలేక వారు పడే బాధలు వర్ణనాతీతంగా ఉంటాయని ఇక్కడ పలు జీవితాలను స్పృశించడం ద్వారా రచయిత మనకు ప్రత్యక్షానుభూతిని కలిగించారు. "ఈ ముంపు ప్రాంతాలను ప్రభుత్వం ప్రకటించిన తరువాత ఆయా గ్రామాల్లో ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయరు. ఒకవైపు ప్రజలకు సరియైన నష్టపరిహారం అందక, మరోవైపు ప్రాజెక్టు పూర్తిగాక, ముంపు ప్రాంతాలు తల్లడిల్లిపోతున్న దృశ్యాలు ఈ నవలలో కంటతడి పెట్టిస్తాయి”11
ఈ నవలను చదువుతున్నపుడు కోటిలింగాల చారిత్రక సాక్ష్యం నీట మునిగి పోతుందనే విషయాన్ని చారిత్రక దృష్టికోణంలో చూపించారు. నిజానికి కోటిలింగాలకు అంతటి చారిత్రక ప్రాముఖ్యత రావడానికి కారణం తెలంగాణ చారిత్రక వైభవంకు సాక్షిగా అది శాతవాహనుల తొలి రాజధాని, కోట బురుజులు, బౌద్ధ స్తూపం, సిముకుని నాణేలు బయల్పడి ఈ విషయానికి బలాన్ని చేకుర్చాయి. “కోటిలింగాలలో లభించిన శ్రీముఖుని నాణేలు వారి రాజధాని కోటిలింగాల అని నిరూపించినట్లు ప్రముఖ చారిత్రక పరిశోధకుడు రాజారెడ్డి వాదించగా ఇది నిస్సందేహంగా శాతవాహనుల రాజధాని” అని ఏటుకూరి బలరామయ్య అన్నారు ఇంతటి ప్రాముఖ్యం గల ప్రాంతాన్ని రక్షించుకోవాలని, అది ప్రభుత్వం, ప్రజల సామాజికబాధ్యత అని వెంకటయ్యసారు పాత్ర ద్వారా చెప్పించారు రచయిత.
అదే విధంగా ఈ ప్రాజెక్టు వంటి ముంపు సమస్యలు వచ్చినపుడు నష్టపరిహారం అందే మధ్య దళారీలు, మోసగాల్లైన నాయకులు, అవినీతి పరులైన అధికారులు తమ స్వార్థం కోసం ఈ నిర్వాసితులకు అన్యాయం చేసి, అసలు ఆ గ్రామానికే సంబంధంలేని వారిని జాబితాలో చేరుస్తూ వందల కోట్ల రూపాయల అవినీతిని చేసిన అనేక సందర్భాలకు ప్రతీకగా ఇక్కడ మోహన్, మనోహర్ వంటి బాధితుల జీవితాలను ప్రవేశింజేశారు.
"తెలంగాణలోని కరీంనగర్ జిల్లా రామగుండంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామాల భూనిర్వాసిత కుటుంబాలకు అందజేసే పరిహారం చెల్లింపుల్లో పెద్ద ఎత్తున జరిగిన అవినీతి దందా బట్టబయలైంది. న్యాయంగా పొందాల్సిన పరిహారంను ఇక్కడ నిర్వాసితుల ముసుగులో కాజేసిన కోట్ల రూపాయల పరిహారం వ్యవహారం రెవెన్యూ అధికారులు చేపట్టిన రీ-సర్వేలతో వెలుగులోకి వచ్చింది"12
వంటి అనేక వార్తలు, ఆ కాలంలో దినపత్రికల్లో వచ్చాయి. దీన్ని బట్టి ఇందులో సామాజిక కోణం ఈ నవలలో ప్రతిబింబించిందని చెప్పవచ్చు.
5. స్త్రీ జీవనచిత్రణ :
ఈ నవలలో శ్యామల పాత్రను చాలా గొప్పగా చిత్రిస్తూ, స్త్రీ జీవితంలోని అతి గొప్ప పార్యాన్ని మనకు పరిచయం చేశారు రచయిత. శ్యామల తాగుబోతు అయిన తన భర్తను మార్చుకొని, చాలా పొదుపుగా డబ్బును వాడుతూ, కుటుంబాన్ని ఒక మంచి స్థితిలో నిలబెట్టడానికి కృషిచేస్తుంది. కానీ ముంపు డబ్బులు వచ్చినపుడు మాత్రం నారాయణ ఆ డబ్బులపై అధికారం చూపిస్తూ, శ్యామలను నానా మాటలంటాడు. ఇక్కడ స్త్రీకి గల ఆర్థిక స్వాతంత్య్రం, సాధికారత ప్రశ్నార్థకంగా మిగిలిన సామాజిక సమస్య కనబడుతుంది.
“ఆర్థికంగా స్వతంత్రురాలైన స్త్రీ, నైతికంగా బలవంతురాలైన స్త్రీ మాత్రమే తన సహజ వికాసానికి అవరోధంగా ఉన్న తల్లిదండ్రులనైనా, భర్తనైనా, పిల్లలనైనా ధిక్కరించి స్వతంత్రంగా నిలబడగలుగుతుంది. విధేయత, పురుషుడి నియంత్రణ లేకుండా కుటుంబం నిలబడదు అని అనిపిస్తే అలాంటి కుటుంబం లేక పోవడమే మంచిది అంటాడు చలం. ఏ నియంత్రణ లేకుండా సమాన బాధ్యత, స్వాతంత్ర్యం ఉన్నపుడే స్త్రీ వివాహ వ్యవస్థలో కొనసాగాలి లేకపోతే దానిని తిరస్కరించాలి”13
అన్నది చలం అభిప్రాయం. ఈ కోణంలో తన కుటుంబాన్ని, కూతురు జీవితాన్ని కాపాడుకోవాలనే ఆరాటంతో భర్తకు ఎదురు తిరిగిన శ్యామల, సమాజంలో వ్యసనపరులైన భర్తలతో జీవితాన్ని కొనసాగిస్తూనే, పిల్లలను పోషించుకునే ఎందరో సగటు గ్రామీణ మహిళల జీవితానికి నిదర్శనం అని చెప్పవచ్చు.
రుక్మిణి జీవితాన్ని పరిశీలించినపుడు, తన భర్తకు అన్ని విధాలుగా అనుగుణంగా నడుచుకొని,అతను పని చేయకపోయినా తానే అతనికి అన్ని సమకూర్చి, సుఖాన్ని, గౌరవాన్ని అందించినా చివరకు కేవలం ఆస్తికి మాత్రమే విలునిచ్చి, విడాకులిచ్చిన భర్త పరంధాములు పంచాయతీలో అన్న మాటలద్వారా ఇంకా కొనసాగుతున్న పుషాధిక్యతను, వివాహ వ్యవస్థలోని కొన్ని లొసుగుల వలన జీవితంలో ఒంటరిగా గానో లేక జీవితాన్ని చాలించి, శవమై కనిపించే రుక్మిణి లాంటి స్త్రీలను ఎందరినో చూస్తున్నాము.
అందుకే ప్రముఖ రచయిత్రి ఓల్గా "జీవితం ప్రధాన ధ్యేయాలు ఇద్దరివీ ఒకటైతేనే ముందున్న వైవాహిక జీవితం సాఫీగా నడుస్తుంది. ఈ విషయం తెలుసుకునేందుకు కొంత కాలం అవసరం పెళ్ళిజీవితాంతం మనగలిగాలి అనుకొని కట్టుకోవలసిన బంధం, ఎదుటి వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకున్నాడని తెలుసుకున్న తర్వాతే పెట్టుకోవలసిన బంధం"14
అని అంటారు. ఈ విషయంలో పరంధాములు పూర్తి మనస్తత్వం అర్థం చేసకోకుండానే, అతనిని నమ్మడం వలననే రుక్మిణి జీవితం అర్థాంతరంగా ముగిసిందిఅని అర్థం చేసుకోవచ్చు.ఆనాటి కన్యాశుల్కం కంటే వికృతమైన, నీచమైన పద్ధతిలో వరకట్నం ఆడపిల్లలకు శాపంగా పరిణమించింది. వరకట్న సమస్య వలన నేడు మధ్య తరగతి కుటుంబాలలో ఎందరో తల్లిదండ్రులు తమ హీనమైన ఆర్థిక పరిస్థితి వల్ల అమ్మాయిల వివాహం చేయలేకపోతున్నారు. ఆడపిల్లల పెళ్ళితల్లిదండ్రులకు తలనొప్పిగా తయారయ్యింది. అబ్బాయి తరపు వారు అడిగినంత కట్నం ఇవ్వలేక తల్లడిల్లుతున్నారు. కేవలం తల్లిదండ్రులు కుదిర్చిన వివాహలే కాదు, ప్రేమించి పెళ్ళి చేసుకున్న ప్రేమ వివాహాలు కూడా సరిగా విజయవంతం కాలేకపోవడం కూడా జరుగుతున్నది. ఈ విషయంలో చదువుకున్నవారు, ఉద్యోగాలు చేస్తున్నవారు, ఆర్థికంగా నిలదొక్కుకున్న వర్గాల స్త్రీలు కూడా చిక్కుకోవడం విచారకరమైన పరిస్థితి.
6. ప్రపంచీకరణ వ్యతిరేకత:
పరమేశ్వరయ్య పాత్ర ద్వారా ప్రపంచీకరణ, యాంత్రీకరణ ఏ విధంగా పల్లె వృత్తులను, గ్రామీణ జీవన సౌందర్యాన్ని అతలాకుతలం చేశాయో మనం తెలుసుకోవచ్చు. అభివృద్ధి పేర జరగుతున్న నేటి మార్పులో కులవృత్తినే నమ్ముకుని లేదా సాంప్రదాయక వ్యవసాయ విధానాన్ని, పంటలను, కూలీ పనులను నమ్ముకున్న నిరక్షరాస్యులైన పల్లె ప్రజలు ఉపాధిలేక, పల్లెలను విడిచి పట్నాలకు, విదేశాలకు వలసవెళ్లే పేద ప్రజల బతుకులను చిత్రించారు రచయిత.
“ఓరేయ్ చంటీ...... మనవాల్లు నలుగురు బతకాలి గాని....... వాళ్ల నోటి దగ్గరి కూడుని ఎత్తుకెళ్లి పోవద్దురా...... నువ్వీ యంత్రాన్ని పొలాల్లో నాట్లు వేయడానికి, కోతలు కోయడానికి తెచ్చావు ఈ వూర్లో ఆరేడు వందల మంది ఆడ కూలీలున్నారు. వాళ్లందరి గతి ఏం కావాలె.... పని దొరక్కపోతే వాళ్ళ బతుకులేంగావాలె.....ఆ పాపం మనకెందుకు బిడ్డా". (పుట: 38)
అని పరమేశ్వరయ్యచే పని మాటలు ప్రపంచీకరణ మూలంగా శిధిలమవుతున్న పల్లె జీవితానికి నిలువెత్తు సాక్ష్యంగా అగుపిస్తాయి.
7. ముగింపు:
- కె.వి. నరేందర్ తన గ్రామానికి సమీప గ్రామాలైన ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామాలు, మిడ్ మానేరు ప్రాజెక్టు గ్రామాలు అన్నీ తిరిగి ఆయా గ్రామాలలోని వందల కుటుంబాలను కలిసి వారితో మాట్లాడి, వారి అనుభవాలను, బాధలను ఈ నవలగా మలిచారు.
- ప్రస్తుతం అభివృద్ధి పనుల వలన,ప్రపంచీకరణ, పారిశ్రామికీకరణ వలన నిరాశ్రయులయిన ఎన్నో బతుకుల క్షోభను అద్భుతమైన పాత్రల ద్వారా, ఆలోచింప చేసే సంఘటన ల కూర్పు ద్వారా గొప్ప నవలగా కూర్చారు.
- ఈ నవలలోని పాత్ర ఎంత పెద్దదైనా, చిన్నదైనా తమతో పాటు చివరిదాకా నడిపించి, అనందానుభూతులను లేదా విషాద సాక్షాత్కారాన్ని కలిగిస్తాయి. రచయిత పాత్రలను సృష్టించేటపుడు తాను తన వ్యక్తిగత జీవితంలో చూసిన వ్యక్తులు, వారి తీరు ఆధారంగానే తన పాత్రల్ని సృజియించి నవలా గమనాకి పరిపుష్ఠతను చేకూర్చాడు.
- తన శిథిల స్వర్గం నవలలో పీడిత వర్గాల ప్రజల బాధలను, పెట్టుబడి దారీ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ ప్రశ్నించడంలోని గొప్పతనాన్ని, శ్రామిక, రైతు కూలీల అభివృద్ధిని జరగాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
- తనకు కనబడిన ప్రతి దృశ్యం, ఎదురైన ప్రతి సంఘటన, సమీపంలోని ప్రతి సన్నివేశం ఆయన హృదయ ఫలకంపై పదిలంగా భద్రపరచుకొని నవలలోనికి తీసుకున్నారు. అంతే సహజంగా పాఠకులకు అందించారు.కావున ఉత్తమ నవలా రచయితగా వారిని ప్రభుత్వం గౌరవించడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు.
8. పాదసూచికలు:
- తెలుగు నవలానుశీలనం, పుట:124
- శిథిల స్వర్గం, 2013,ముందుమాట
- కథానిక ,నవల నాటకం, పుట : 156
- తెలుగు నవలా సాహిత్య వికాసం, పుట : 37
- నిప్పుల వాగు, పుట 34
- పైదే. పుట : 21
- నీళ్లు-నిజాలు ,పుట :8
- శిథిల స్వర్గం ,ముందుమాట.
- నిర్భయాకాశం కింద,పుట:86
- శిథిల స్వర్గం, ముందుమాట.
- తెలంగాణ చరిత్ర, పుట 42.
- ఆంధ్రప్రభదినపత్రిక,24 ఏప్రిల్,2018
- చదువుకున్న కమల ,పుట:158
- అతడు-ఆమె-మనం,పుట:38
9. ఉపయుక్తగ్రంథసూచి:
- అందెశ్రీ: నిప్పులవాగు, వాక్కులమ్మ ప్రచురణ, సికింద్రాబాద్, 2022
- ఆంధ్రభూమి దినపత్రిక, 24 ఏప్రిల్, 2016
- ఇనాక్ కొలుకలూరి: విమర్శిని, ప్రజాశక్తి బుక్ హైజ్, విజయవాడ, 2019
- ఈదారెడ్డి వెన్నవరం: చలం సాహిత్యంలో స్త్రీ, నవోదయ బుక్ హౌస్, ఫిబ్రవరి, 2005
- ఓల్గా: 'అతడు - ఆమె- మనం', సాహిత్యవిమర్శ, స్వేచ్ఛాప్రచురణలు, హైదరాబాదు, రెం. ము, ఆగష్టు, 2005
- గుడిపాటి : తెలంగాణ తెలుగు నవల, (సం) ఆచార్య పంతంగి వెంకటేశ్వర్లు, యూనివర్సిటీ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల, హన్మకొండ, 2014
- నరేందర్.కె.వి. : శిథిలస్వర్గం, జగిత్యాల, 2011
- నారాయణరెడ్డి సుంకిరెడ్డి: తెలంగాణ చరిత్ర, తెలంగాణ ప్రచురణలు, 2016
- మల్లారెడ్డి సారంపెల్లి: తెలంగాణ సాగునీటి వనరులు అవకాశాలు, నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2015
- మృణాళిని.సి: సకల సాహిత్య వ్యాసాలు, ధృతి పబ్లికేషన్స్, హైదరాబాద్, 2014
- రంగనాయకమ్మ, 'అంధకారంలో' నవల ముందుమాట, స్వీట్ హోమ్ పబ్లికేషన్స్, హైదరాబాద్, ఏడవ ముద్రణ, నవంబరు, 2015
- రంగనాయకమ్మ: అంధకారంలో, స్వీట్ హోమ్ పబ్లికేషన్స్, హైదరాబాద్, ఏడవ ముద్రణ, నవంబరు, 2015
- రజిత అనిశెట్టి : నిర్భయాకాశం కింద, హైదరాబాద్, 2016,
- నారాయణరెడ్డి సుంకిరెడ్డి: తెలంగాణ చరిత్ర, తెలంగాణ ప్రచురణలు, 2016
- వెంకటేశ్వర్లు పుల్లాభొట్ల: తెలుగు నవలా సాహిత్య వికాసం, తెలంగాణ సాహిత్య అకాడమీ, హైదరాబాద్, ద్వితీయ ముద్రణ, 2019
- సుజాతారెడ్డి ముదిగంటి: తెలుగు నవలానుశీలనం, ఎమెస్కో బుక్స్ ప్రై. లి., హైదరాబాద్, 2017
- స్వామి ననుమాస(సం): కథానిక నవల నాటకం, ఎం.ఎ. తెలుగు ద్వితీయసం||, అధ్యయన గ్రంథం, ఆచార్య జి. రాంరెడ్డి, దూరవిద్యాకేంద్రం, 2013
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "May-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-April-2025
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "MAY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి
బాధ్యత వహించరు.