AUCHITHYAM | Volume-5 | Issue-7 | June 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
2. బాలవ్యాకరణ సమీపకాలిక వ్యాకరణాలు: కృత్తద్ధిత వృత్తులు

డా. దొడ్డి ప్రవీణ
తెలుగు అధ్యాపకురాలు
ఎస్.వి.ఎల్.ఎన్.ఎస్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల
భీమునిపట్నం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9290441535, Email: praveenaphdtelugu@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
“ప్రథమే హి విద్వాంసో వైయకరణాః వ్యాకరణ మూలత్వాత్ సర్వ విద్యానామ్” (ఆనంద వర్ధనుడు-ధన్యాలోకం -పుట 208) ప్రాచీనభారతీయసంస్కృతీ సంప్రదాయ పరిగణనంలో శాస్త్రాలు ఆరు అవి . 1. తర్కం 2. వ్యాకరణం 3. అలంకార శాస్త్రం 4. మీమాంస 5. ధర్మశాస్త్రం 6. నీతి శాస్త్రం పై పరిగణనలలో రెండవ స్థానం వ్యాకరణం ఉండటం గమనార్హమైన అంశం. వ్యాకరణం షట్చాస్త్రాలలో ఒకటి. పందొమ్మిదవశతాబ్దoలో ప్రతిభావంతులుగా పేరెన్నికగన్న యాంధ్ర పండితులలో మొట్టమొదట పేర్కొదగిన వ్యక్తి శ్రీమాన్ పరవస్తు చిన్నయసూరి. సుమారు వంద సంవత్సరాల నుండి పఠన పాఠనాదులలో బహుళప్రచారo పొందిన బాలవ్యాకరణ, నీతిచంద్రికల ద్వారా ఆ మహనీయుని పేరు తెలియని అక్షరాస్యులాంధ్ర దేశo లో నుండుట అరుదు. సూరి అసాధారణ మేధాసంపన్నుడు. ఏక సంధాగ్రాహి అగుట వలన అననేక భాషలందు, పెక్కు శాస్త్రములందు, సామాన్యుల వలె గాక అతనికి అల్పకాలములోనే పాండిత్యo లభించడం లో వింతలేదు. ఆచ్చిక ప్రాతిపదికముల మీద వచ్చే ప్రసిద్ధ తద్ధిత ప్రత్యయాలను, వాటి అర్ధాలను, తద్ధిత నిమిత్తకములైన కార్యాలను, తద్ధిత వృత్తులుగా నిరూపింపఁబడినవి. తెలుగు ధాతువులలో వేటివేటికి ఏ యే ప్రత్యయాలు కలిగి, ఏయే కృదంత విశేష్యరూపాలు, నిష్పన్నమవుతాయో యీ పరిచ్ఛేదములో ప్రదర్శించ బడింది.. ఈ కృత్ ప్రత్యయములలో నొక్కొక్క దానికి అనేక అర్ధాలుంటాయి. మరియు అనేక కృత్తులకు ఒకే అర్థముంటుంది. ఇటువంటి చికాకువలన, అర్ధాలను సూటిగా సూచించడానికి వీలు పడకుండుట వలన లోకవ్యవహారమే శరణ్యoగా చూపించి అర్థనిర్దేశo ఉపేక్షించబడింది. ప్రత్యయములు మాత్రమే ప్రదర్శించ బడ్డాయి. ఆంధ్రసాహితీలోకంలోని వ్యాకరణాలలో గొప్పదైన బాలవ్యాకరణానికి, సమీపకాలిక వ్యాకరణాలలోని కృద్వృత్తి, తద్ధితవృత్తులు ఏ విధంగా ఉన్నాయో నిర్మాణాత్మక- పరిశోధనాపద్ధతిలో పరిశీలించడం ఈ వ్యాసం ప్రధానోద్దేశం. పరిశోధన కొరకు పాపినేని అబ్బాయి నాయుడు ఆంధ్ర వ్యాకరణ సంగ్రహము, టి. ఆంజనేయ శాస్త్రి ఆశుబోధలక్షణ సంగ్రహము, తాత వెళ్లి మిఠాదార్ శేషగిరి శాస్త్రి ఆంధ్రశబ్ద తత్వము, బులుసు పాపయ్యశాస్త్రి తెలుగు వ్యాకరణము, కేతవరపు వెంకటశాస్త్రి ఆంధ్రచంద్రిక, బహుజనపల్లి సీతారామాచార్యులు ప్రౌఢవ్యాకరణము, మల్లాది సూర్యనారాయణ శాస్త్రి ఆంధ్రభాషాను శాసనము అనే వ్యాకరణ గ్రంథాలను తీసుకున్నాము.
Keywords: బాలవ్యాకరణము, ఆంధ్రవ్యాకరణసంగ్రహము, ఆశుబోధలక్షణసంగ్రహము, తెలుగు వ్యాకరణము, ఆంధ్రచంద్రిక, ప్రౌఢవ్యాకరణము, ఆంధ్రభాషానుశాసనము, కృద్వృత్తి, తద్ధితవృత్తి.
1. ఉపోద్ఘాతం:
వ్యాకరణానికి “శబ్దానుశాసనం” “శబ్దశాస్త్రం" అనే నామాంతరాలు ఉన్నాయి. “వి”, "ఆజ్" అనే ఉపసర్గలతో కూడిన "కృ" ధాతువుకు కరణార్థంలో ల్యుట్ ప్రత్యయం రాగా "వ్యాకరణమ్” అనే శబ్దం నిష్పన్నమయింది. "కరణాధికరణ యోశ్చ" (పాణినీయం 3-3-117) అనే పాణినీయ సూత్రం ల్యుట్ ప్రత్యయాన్ని విధిస్తున్నది. దీనిలో లకార, టకారాలు ఇత్సంజ్ఞ కలవి. (లు+యు+ట్) కాబట్టి అవి పోగా 'యు' మిగులుతుంది. దానికి “యువోర నాకే” (పాణినీయం 6-1-1) అనే పాణినీయ సూత్రంచేత “ఆన" అనేది ఆదేశం రాగా వ్యాకృ+ఆన-అయి “కృ”లోని ఋకారానికి గుణమూ; నకారానికి 'ణ' త్వం వచ్చి వ్యాకరణ శబ్దం సిద్ధమైంది. ('వ్యాకరణ' శబ్దం పాణినీయ వ్యుత్పత్తి ఇది. అంటే ఆ శబ్దం పాణినీయానికి ముందే ఉందని అర్థం). "వ్యాకరణమ్" సంస్కృత భాషా శబ్దం. సంస్కృతంలో అది వ్యాకరణ సంప్రదాయ సూత్రాను సరణిలో నపుంసక లింగం. అదంత అమహత్తు. కాబట్టి తెలుగు వ్యాకరణ సూత్రంప్రకారం "ము”వర్ణకం వచ్చి 'వ్యాకరణము' అనే పదం ఏర్పడింది. (“అమహన్న పుంసకముల కదంతంబులకు ము వర్ణకంబగు:" (బా.వ్యా.: తత్సమ పరిచ్ఛేదం: సూ.39)). వ్యాకరణ+ము=వ్యాకరణము. "వ్యాక్రియంతే శబ్దా అనే నేతి వ్యాకరణమ్” (పతంజలి . వ్యాకరణ మహాభాష్యం , పుట.56) అని పతంజలి “మహాభాష్యం"లో వ్యాకరణశబ్దవ్యుత్పత్తి నిర్దేశించబడింది. శబ్దాలను వ్యాకరించేది కాబట్టి ఇది వ్యాకరణం అని అర్థం. వ్యాకరించడం అనేదాన్ని అన్నంభట్టు "ప్రదీపోద్యోతం"లో "అనుశాసనమ్: ప్రకృతి ప్రత్యయాది విభాగేన వ్యుత్పాదనము తత్ వ్యాకరణేన సాక్షాత్ క్రియతే" (పతంజలి . వ్యాకరణ మహాభాష్యం,పుట.56). అని ప్రకృతి ప్రత్యయాది విభాగంచేసి శబ్దాలకు వ్యుత్పత్తులను చెప్పడం “వ్యాకరించడం” అనే పదానికి అర్థం గా చెప్పారు.
2. బాలవ్యాకరణం - సమీపకాల వ్యాకరణాలు - వ్యాకర్తలు:
బాలవ్యాకరణానికి సమీపకాలిక వ్యాకరణాలుగా పద్దెనిమిది వందలనుండి పంతొమ్మిది వందల వరకు మధ్యవచ్చిన వ్యాకరణాలను తీసుకున్నప్పటికి, 1926 లో వచ్చిన మల్లాది సూర్యనారాయణ శాస్త్రి “ఆంధ్ర భాషానుశాసనము“ ను కూడా స్వీకరించాను . మొత్తం 31 గ్రంథాలను తీసుకున్నప్పటికి కొందరు మాత్రమే కృద్వృత్తి, తద్ధిత వృత్తులను సమగ్రంగా వివరించారు. వాటిని మాత్రమే పరిశోధనావ్యాసంలో వివరించాను .
ఈ పరిశోధనలో ఆంధ్రవ్యాకరణసంగ్రహము, ఆశుబోధలక్షణసంగ్రహము, ఆంధ్రశబ్ద తత్వము, తెలుగు వ్యాకరణము, ఆంధ్రచంద్రిక, ప్రౌఢవ్యాకరణముఆంధ్రభాషానుశాసనము అనే వ్యాకరణ గ్రంథాలను పరిశీలించడమైననది.
2.1 బాలవ్యాకరణము:
కర్త పరవస్తు చిన్నయసూరి. ఈయన జీవిత కాలం క్రీ.శ.1806-1862. పందొమ్మిదవ శతాబ్దిలో ప్రతిభావంతులయి పేరెన్నికగన్న ఆంధ్ర పండితులలో ప్రప్రథమంగా పేర్కోదగ్గ వ్యక్తి శ్రీమాన్ పరవస్తు చిన్నయ సూరి. ఈయన చిత్తాద (సాతాని) వైష్ణవ శాఖకు చెందినవాడు. తల్లి శ్రీనివాసాంబ, తండ్రి వెంకట రంగ రామానుజాచార్యులు. పుట్టిన స్థలం చెంగల్పట్టు జిల్లాలోని పెరంబుదూరు, నివాసం చెన్నపట్నం (మద్రాసు).ఆంధ్ర సాహితీ లోకానికి, పాఠక ప్రపంచానికీ తెలిసినవి చిన్నయ సూరి రచనలు రెండే.అవి (1) నీతి చంద్రిక, (2) బాల వ్యాకరణం. చిన్నయసూరి కేవలం ఈ రెండు గ్రంథాల రచయిత మాత్రమే కాదు. ఆయన రచనలు ఇంకా అనేకం ఉన్నాయి. విద్యార్థులకు తను రచించిన, తాను బోధిస్తున్న వ్యాకరణాల విషయకంగా వారి క్లేశాన్ని ఉపాధ్యాయుడిగా చిన్నయ సూరి గ్రహిస్తూ వస్తున్నారు. తనను తాను మెరుగు పరుచుకుంటున్నారు. ఆ క్రమంలో ఆయన బోధనానుభవంతో పరిణిత ప్రజ్ఞతో రూపుదిద్దుకొన్నదే బాలవ్యాకరణం.
2.2 ఆశుబోధ లక్షణసంగ్రహం:
వ్యాకరణ కర్త టి. ఆంజనేయశాస్త్రి. రచనా కాలం 1884. దీనిలో సంజ్ఞ, సంధి, నామ, క్రియ, శబ్దలక్షణ అనే అయిదు ప్రకరణాలు ఉన్నాయి. సరళమైన శైలిలో, విద్యార్థులకు స్పష్టార్థ పరిగ్రహణ ఉద్దేశంతో వ్రాయబడిన గ్రంథం ఇది.
2.3 ఆంధ్ర శబ్ద తత్త్వము:
కర్త తాతవెళ్లి మిఠాదార్ శ్రీ శేషగిరి శాస్త్రులుగారు. నేటి తమిళనాడులోని - ఉత్తర ఆర్కాడు జిల్లా (ప్రస్తుతం సేలం జిల్లా) తిరుపత్తూరు తాలూకాలో ప్రముఖ భూస్వాములు మిఠాదారులైన) వేంకటరమణ శాస్త్రులుగారి కుమారులు ఈయన. దాదాపు పద్దెనిమిది భాషలు నేర్వటమే కాదు. భాషాశాస్త్ర (Philology) ప్రవీణుడు ఈయన. బహు గ్రంథకర్త.
2.4. తెనుఁగు వ్యాకరణము:
కర్త అనకాపల్లి మునిసిపల్ పాఠశాలలో ఉపాధ్యాయుడైన బులుసు పాపయ్య శాస్త్రి. “ఆరంభ పుస్తకం” అని ముఖచిత్రం మీద ఉంది. సవరించి కొత్త విషయాలు చేర్చిన మూడవకూర్పు కాలం 1914. బహుశా తొలికూర్పు 1900 ప్రాంతం కావచ్చు. MACMILLAN & Company Limited BOMBAY, CULCUTTA AND LONDON" వారిచేత ప్రకాశితం కావటం విశేషం. దీనిలో సంజ్ఞ, పద, క్రియ, సంధి, (తద్ధిత, కృదంత), వాక్య పరిచ్ఛేదాలు ఉన్నాయి. చివర ఛందో, అలంకార లక్షణాలు చెప్పబడ్డాయి. ఆంగ్ల వ్యాకరణాల ప్రభావం దీనిమీద ఉంది.
2.5 ఆంధ్రచంద్రిక:
ఈ వ్యాకరణ కర్త విశాఖపట్నం ఏ.వి.ఎన్.కళాశాల ఆంధ్రోపన్యాసకుడు, బహు గ్రంథకర్త అయిన కేతవరపు వేంకటశాస్త్రి, ఇది లఘువ్యాకరణం, తెలుగుభాషకుగల సామాన్యలక్షణాలు ఇందు చెప్పబడ్డాయి. పూర్వవ్యాకరణాల ప్రభావం దీనిమీద ఉంది. దానితోపాటు ఆంధ్ర వ్యాకరణాల పద్ధతికూడా అనుసరించబడింది. ఇది వివరణాత్మక వ్యాకరణం. దీనిలో ప్రతీ అంశానికీ అభ్యాసాలున్నాయి. సంజ్ఞ, శబ్ద, సర్వనామ, క్రియ, అవ్యయ, కృదంత, సమాస, సంధి, ఔపవిభక్తిక, ద్రుత ప్రకృతిక ప్రకరణాలు దీనిలో ఉన్నాయి. ప్రకరణాల సంఖ్య ఎక్కువే అయినా వ్యాకరణం చిన్నదే. ఇదీ వివరణాత్మక వ్యాకరణమే. దీని రచనాకాలం 1920.
2.6 ప్రౌఢవ్యాకరణము:
బహుజనవల్లి సీతారామాచార్యులు వ్రాసిన ప్రౌఢవ్యాకరణం గూర్చి కొత్తగా తెలుపవలసిన అవసరం లేదు. బాలవ్యాకరణమందు ప్రస్తావించబడని లేదా అభిప్రాయ భేదాలున్న విషయపూరకంగా వ్రాయబడినది ప్రౌఢవ్యాకరణం.
2.7 ఆంధ్ర భాషానుశాసనం:
1920 ప్రాంతం తర్వాత కూడా అనేకానేక విద్యార్థి వ్యాకరణాలు తెలుగులో వెలువడ్డాయి, వాటిలో విషయాలు అత్యధికాలు పూర్వవ్యాకరణ ప్రసక్తాలు, నూత్నత్వం తక్కువ. అయితే 1926లో వెలువడిన మల్లాది సూర్యనారాయణశాస్త్రిగారి “ఆంధ్రభాషానుశాసనం” ఒక విధంగా గ్రాంధిక, వ్యావహారిక భాషలనూ; భాషాశాస్త్ర పద్ధతులను, ఆంగ్లవ్యాకరణ సిద్ధాంతాలను సమన్వయించిన బృహద్వాకరణం. ఈ పరిశోధనావ్యాసంలో బాలవ్యాకరణము, సమీప కాలిక వ్యాకరణాలలోని కృద్వృత్తి, తద్ధిత వృత్తులను సమగ్రంగా తీసుకొని పరిశోధించడమైనది.
3. బాలవ్యాకరణం, సమీపకాలవ్యాకరణాలు- కృద్వృత్తి పరిశీలన:
బాలవ్యాకరణము, సమీప కాలిక వ్యాకరణాలలోని కృద్వృత్తిని ఇప్పుడు పరిశీలిద్దాం.
కృద్వృత్తి:
‘‘కృ’’ ధాతువుకు ‘‘క్విన్’’ ప్రత్యయం చేరడం వలన ‘‘కృత్’’ అనే రూపం సిద్ధిస్తుంది. సాధారణంగా క్రియాపదాలపై చేరే భిన్న ప్రత్యయాలకు, సిద్ధించిన పదాలకు ఈ ‘‘కృత్’’ సంజ్ఞ విధించబడిరది. ‘‘కృత్’’ ప్రత్యయాలు అంతమందుగల పదాలు కృదంతాలు. ఇవి ధాతువుకే చేరడం వలన వీటిని ప్రాథమిక నిష్పన్నరూపాలని ఆధునికులంటారు. ధాతువుకు కృత్ప్రత్యయాలు చేరేటప్పుడు వర్ణలోపాత్మకమైన కార్యాలు జరుగుతాయి. వీటిని కృద్వృత్తిలో కలిగే మార్పులుగా పరిగణించవచ్చు.
వికృతి వివేకంలో-
‘‘అజన్యజన్యభేదేన శబ్దాస్స్యుర్వికృతౌమతాః
జన్యాంతగత వర్ణానాం భూయసీస్యాద్వి చిత్రతా’’ (వికృతి వివేకం, అజన్త. 95) అని తెలిపారు. దీనిని బట్టి తెలుగులో (1) అధాతు ప్రకృతికాలు, (2) ధాతు ప్రకృతికాలని శబ్దాలు ద్వివిధాలు. అధాతు ప్రకృతికాలకు గోడ, మేడ, నోరు మొదలైనవి ఉదాహరణలుగా చూపవచ్చు. చూపు, త్రోపు, కోరిక, పొందిక మొదలైనవి ధాతు ప్రకృతికాలకి ఉదాహరణలుగా చూడవచ్చు. అహోబలపతి 158 కృదంత రూపాలను ప్రదర్శించారు. కవిజనమండ టీకా కర్త 50 కృదంతాలను చూపారు.
చిన్నయకు సమకాలికులు రచించిన వ్యాకరణాలలో కృదంతాల విభజన శాస్త్రీయంగా లేదు.
‘‘మూర్త్వం సత్త్వభూతం సత్త్వనామభిః ప్రజ్యాపక్తిరితి’’1 అని నిరుక్తంలో చెప్పబడిరది. యాస్కుడు ‘‘సత్వస్వభావ మాపన్నా వ్యక్తిర్నామభిరుచ్యతే’’2 అని కృదంతాలనే సత్వనామలని తెల్పారు. వీటికి లింగవచనాదులుంటాయి. ప్రాచీనంధ్రవ్యాకరణాలలో కృదంతవిభాగం లేదు. ఆంధ్రశబ్ద చింతామణిలో-
‘‘ప్రాకృతభవసంస్కృత భవసంస్కృతవత్ప్రాకృతభవ వికృతిభవాః
వ్యతిరిక్తా భూయాంసో వ్యతిరిక్తాస్సంప్రదాయతో వేద్యాః’’ (హలన్త 4) అని తెలిపారు. ప్రాకృత భవాలు, సంస్కృత భవాలు కాక వ్యతిరిక్తాలైనవి విశేషంగా కలవని, అవి సంప్రదాయాన్ని బట్టి వేద్యాలని చింతామణి ఆశయంగా కనిపిస్తుంది.
3.1 బాల వ్యాకరణము:
చిన్నయసూరి బాలవ్యాకరణంలో కృదంత పరిచ్ఛేదాన్ని ఏర్పరచి వివరించారు. ‘‘కృత్తుల కర్థంబులు యథావ్యవహారంబుగ గ్రాహ్యంబులు’’ (కృదంత. 1) అని తెలిపారు. క్రియాపరిచ్ఛేదంలో విహితాలైన ‘‘ట’’ వర్ణకాదులు పద్నాలుగూ కూడా కృత్తులే. అయినా వాటిని కూడా కృతులన్నిటితోపాటు ఈ కృదంత పరిచ్ఛేదంలోనే చూపడం ప్రకరణోచితం.
ఈయన బాలవ్యాకరణంలో నిర్దేశింపదలచిన కృత్తులు మొత్తం 38. వీటి స్వరూప స్వభావాలలోని భేదాలనాధారంగా రెండు జాతులుగా విభజించారు. మొదటి జాతి-24, రెండవ జాతి 14. మొదటి జాతిలో ‘‘క’’ వర్ణకాదులు కొన్ని కొన్ని ధాతువులకు మాత్రమే వస్తే, రెండవ జాతిలో ‘‘ట’’ వర్ణకాదులు సర్వధాతువులకు సాధారణంగా చేరుతాయి. ‘‘కృత్తులకు వక్ష్యమాణంబులకు భావ కర్తృ కర్మాద్యర్థంబులు మహాజన వ్యవహారానుసారిగా నెఱుంగునది’’ (కృదంత. 1 వృత్తి) అని పరిచ్ఛేదానికంతకూ అవతారికగా ఈ వాక్యాన్ని తెలిపారు. ఇంతకుముందు క్రియా పరిచ్ఛేదంలో తెలిపిన కృత్తులకు అర్థనిర్దేశం చేయబడిరదని, ఇటుపై ఈ పరిచ్ఛేదంలో వక్షమాన కృత్తులకు అర్థనిర్దేశం చేయతలంపు లేదని, కేవల ప్రత్యయాలు మాత్రమే విధింపబడతాయని, అర్థాలను సందర్భోచితంగా ఊహించుకొనాలని తన ప్రణాళిక తెలుపుతుంది.3
సూరి ‘‘ఇటంగృత్కగతపవేములు పరంబులగునపుడు క, గ, చ, య, వ లకు లోపంబగు.’’ (కృదంత. 2) అని తెలిపారు. కృదంతపరిచ్ఛేదంలో కృత్ప్రత్యయాలైన క,గ,త,ప,వ, ఇమి పరమైన, ధాతువు అంతమందుండే క,గ,చ,య,వ- లకు లోపం వస్తుంది. వ+ ఇవి-వేమి. ఇక్కడ సంస్కృత సంధి ఏర్పరచి ఎంతో లాఘవాన్ని, శ్రుతి హితత్వాన్ని సంపాదించారు. “క” వర్ణకంబలుగ్వాదులకు, ఇమి వర్ణకం కలుగ్వాదులకు, తఙ్ వర్ణకం చేయ్వాదులకు, కువర్ణకం బడంగ్వాదులకు, టవర్ణకం బాడ్వాదులకు, టువర్ణకం పడ్వాదులకు, పవర్ణకం తిరియ్వాదులకు, వువర్ణకం మాయ్వాదులకు, ఇక వర్ణకం బంజ్వాదులకు, నఙి-అప్పాదులకు, బ-యేల్వాదులకు, గడ-చేర్వాదులకు, ఇకి-కోర్వాదులకు, వు-మాన్వాదులకు, అ-గీఱ్వాదులకు, అక - మాఱ్వాదులకు, ఉ-బడుగ్వాదులకు వస్తాయని తెలిపారు. ఆయా గణాలను ఏర్పాటుచేసి విశేషంగా నిర్దేశించారు.
తద్ధితాలలాగానే కృత్తుల కర్థనిర్ణయం చేయడం సాధ్యపడదని, మచ్చుకు చూపి యాథావ్యవహారంగా గ్రహించాలని తెలిపారు. ఈ పరిచ్ఛేదంలో సూరి 20 గణాలను ఏర్పాటుచేసి తన దక్షత చూపారు.
3.2 ఆశుబోధలక్షణ సంగ్రహము:
టి. ఆంజనేయశాస్త్రి కృదంతపరిచ్ఛేదాన్ని ప్రత్యేకించి చూపలేదు. శబ్దలక్షణ ప్రకరణంలోనే తెలిపారు. ‘‘క్రియా ప్రకరణమున జెప్పిన ‘‘డు’’ మొదలగునవి తప్ప క్రియల మీద వచ్చు తక్కిన వర్ణకములు కృత్తులనబడును. అవి అంతమందుగల శబ్దములు కృదంతములు. అవి కర్తృకర్మాదులను దెలుపును. కృదంతములు సాధారణముగా నామవాచకములే యగును’’ (ఆశుబోధ లక్షణ్సంగ్రహము పుట. 60) అని నిర్వచించి పదమూడు కృత్తులను తెలిపారు. అకము, ఇక, ఇకి, ఇమి, క, కువ, ట, టు, డు, త, న, పు, వు అనే పదమూడు కృత్తులు తెలిపి వాటిలో ఇక, ఇమి, త, న - ఇవి తద్ధితాలుగాను అర్థవిశేషాలలో వస్తాయని వివరించారు.
3.3 ఆంధ్రశబ్దతత్త్వము::
తాతవెళ్ళి మిఠాదార్ శేషగిరిశాస్త్రి కృదంతాలను క్రియాప్రకరణంలో తెలిపారు. ‘‘ధాతువునకు భావార్థమునందు క, వ, ఇక, ఇకి, ఉట, త, మి, వు, అది, ఉడు ప్రత్యయములగు’’ (ఆంధ్రశబ్దతత్వము క్రియా. 157) అని కృత్ప్రత్యయాలను తెలపి అవి చేరే రూపాలను వివరించారు. కకారానికి పూర్వమైన ధాత్వంత గ,చ, య, వలకు లోపం వస్తుందని తెలిపారు. దీనికి మూలం బాల వ్యాకర్త తెలిపిన ‘‘ఇటం గృత్కగతపవేములు పరంబులగునపుడు కగచయవలకు లోపంబగు’’ (బాలవ్యాకరణము కృదంత. 2) అనే సూత్రం. అలాగే ‘‘క’’ ప్రత్యయానికి ‘‘వ’’ కారాదేశం (ఎఱుకువ) (క్రియా. 159), అంజ్వాదులకు ‘‘ఇ’’ కారాగమం (క్రియా 160), కోర్వాదులకు ‘‘ఇకి’’ (క్రియా. 161), వర్ణాలు వస్తాయని తెలిపారు. ఉట, త, మి, వు, అది, ఉడు ప్రత్యయాలు చేరేటప్పుడు కలిగే మార్పులను వివరించారు. ఈయన చిన్నయ సూరినే అనుసరించారు. కాని ధాతువులకు కలిగే లోపాగమాలను కూడా సవివరంగా వివరించారు.
3.4 తెలుగు వ్యాకరణము:
బులుసు పాపయ్యశాస్త్రి ‘‘ధాతువులనుండి నామములు పుట్టుటకు చేర్పఁబడు ప్రత్యయములు కృత్తులనఁబడును. కృత్ప్రత్యయములంత మందుఁగల పదములు కృదంతములు.’’ (తెనుగు వ్యాకరణము పుట. 86) అని నిర్వచించి వ్యంజనాదులైన కృత్తులు పరమైనప్పుడు ధాతువు తుదివర్ణం తఱచుగా లోపిస్తుందని తెలిపారు. ఈయన క, ఁత, కువ, ట, టు, పము, త, పు, బడి, గడ, వు, డు, అకము, ఇక, ఇకి, ఇమి, అ, ఉ- అనే పద్దెనిమిది కృత్తులు కలిగిన శబ్దాలను చూపారు.
3.5 ఆంధ్ర చంద్రిక:
కేతవరపు వేంకటశాస్త్రి ‘‘ధాతువు వలనఁగల్గు నామవాచకములు కృదంతములు. కృత్రపత్యయము కొనయదుండుటచేఁగృదంతములను పేరు వీనికిఁగల్గెను.’’ (ఆంధ్ర చంద్రిక పుట. 46) అని నిర్వచించి క, త, ఇమి, ట, టు, పు, ఇక, న, బడి, గడ, ఇకి, వు, అ, అక, డు, ఉ, వడి, మడి, ని, అవు, ఇ, కలి, ఇడి, ఎన, పురము, మతి, వలి, కువ అనే 28 కృత్ప్రత్యయాలు చేరే కృదంతరూపాలను తెలిపారు. అయితే ఈయన ఎటువంటి గణాలను ఏర్పరచలేదు.
3.6 ప్రౌఢవ్యాకరణము:
ప్రౌఢవ్యాకర్త - మతి-పుర వర్ణకాలను విశేషించి తెలిపారు. ‘‘వలి’’ వర్ణకాన్ని (ప్రౌఢ వ్యాకరణము కృదంత. 7) ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈయన ‘‘ఎక్కు’’ కు ‘‘ఎగు’’ ఆదేశంగా వస్తుందని తెలిపి ‘‘ఏగువ’’ అనే రూపాన్ని (ప్రౌఢ వ్యాకరణము కృదంత. 5) చూపారు.
3.7 ఆంధ్రభాషానుశాసనము:
మల్లాది సూర్యనారాయణశాస్త్రి ఆంధ్రభాషానుశాసనంలో “విలుచు మొదలగువానికి ‘వ’ ప్రత్యయమగును’’ (కృత్ప్రకరణం 33) అని తెలిపారు. విలుచు - విలువ, ఆఁగు - ఆవ అని ఉదాహరణలు చూపారు. ఇక్కడ ప్రత్యయం ‘వ’ అని తెలిపారు. ‘‘తెలియు మొదలగు కొన్నిటికి ‘వి’ ప్రత్యయమగును” (కృత్ప్రకరణం 25). అని ఈయన తెలిపి తెలియు - తెలివి, తనియు - తనివి వంటి ఉదాహరణలు చూపారు. చిన్నయ సూరి తెలిపిన అన్ని కృత్ప్రత్యయాలను ఈయన వివరించారు. ఈయన ఏడుపుటలలో విశేషంగా కృత్ప్రయాలను వివరించారు.
కొంతమంది వ్యాకర్తలు క్రియాపరిచ్ఛేదంలోనే కృదంతాలను వివరించారు. క్రియాపరిచ్ఛేదమైనా, కృత్ప్రత్యయాలకు, కృదంతరిచ్ఛేదమంతటి స్వస్థానం కాకపోయినా, కేవలం పరస్థానం కాదు. క్రియ అనగా ధాతువు, ధాతువుకు వచ్చేవి కృత్తులు. కావున కృత్తులు ప్రసంగం క్రియా ప్రకరణంలో ఉండడం ఉచితం కాదు.4
4. బాలవ్యాకరణం, సమీపకాలవ్యాకరణాలు- తద్ధితవృత్తి పరిశీలన:
తద్ధిత వృత్తి:
త్‌త్ + హితము = తద్ధితము. దానికి హితమైనదని శబ్దార్థం. సాధారణంగా ప్రాతిపదికలకు భావాద్యర్థాలలో కలిగే ప్రత్యయాలకు తద్ధితాలని సంజ్ఞ. తద్ధితాలు కూడా ప్రాతిపదికలవుతాయి. వీటిపై విభక్తి ప్రత్యయాలు చేరుతాయి. ఇవి విశ్యేష్యాలో, విశేషణాలో అవుతాయి.
ఆచ్ఛికాలైన తద్ధితాలను గురించి ప్రాచీనాంధ్ర వ్యాకరణాలు ప్రస్థావించలేదు. అసలు తద్ధితమనే సంజ్ఞయే ఆంధ్రశబ్ద చింతామణిలోగాని, వికృతివివేకంలో గాని కనిపించదు. కావ్యాలంకార చూడామణిలో-
‘‘అరి - యిఁడి - కాఁడాఁడఱయన
ధరలో నొక కొన్ని చెల్లుతద్ధితపదముల్
పరుపడి వాని నెఱుంగుట’’ అని తెలిపి తొలిసారిగా ఈ సంజ్ఞను ఉపయోగించారు. ఆంధ్రశబ్ద చింతామణిలో ‘‘తార్థేతనశ్చ వికృతౌ స్యాత్’’ (హలన్త 10) సంస్కృతంలోని ‘‘త్వ’’ అనే ప్రత్యయంనందు తెలుగులో తన వర్ణకం వస్తుందని, భావర్థంలో వచ్చే తన ప్రత్యయాన్ని పరిచయం చేశారు.
ప్రథమాచార్యుడు ‘‘నామ్నః కవర్ణక స్స్యాత్స్యార్థే స్యాదుత్వమపి పరే తస్మిన్’’ (హలన్త 13) స్వార్థంలో నామాలకు ‘‘క’’ వర్ణకం వస్తుందని, అది పరమైనప్పుడు పూర్వాక్షరాలకు ఉత్వం వస్తుందని తెలిపారు. ఉదా: మెలఁత - మెలఁతుక, గొంతు - గొంతుక, సంస్కృతంలో క(ప్) ప్రత్యయం స్వార్థంలోనూ, అల్పార్థంలోనూ వస్తుంది. తెలుగులో స్వార్థంనందె ఇటువంటిది కలదని ప్రథమాచార్యుని భావం. ఇటువంటిదే వికృతి వివేకంలోనూ ‘‘భవేత్కస్త్రీ సమానామ్నా ఉత్వం తస్మిన్ పరే భవేత్’’ (వికృతి వివేకం. క్రియా 21) అని తెలిపారు. అనగా ఉక ప్రత్యయం స్త్రీవాచకాలకే విశేషంగా వస్తుంది. ద్వితీయాచార్యుడు తద్ధితాంతాలను జన్యపదాలుగా భావించి
‘‘అజన్య జన్య భేదేన శబ్దాస్స్యుర్వికృతౌమతాః
జన్యాంతగత వర్ణానాం భూయసీ స్యాద్వి చిత్రతా’’ (వికృతి వివేకం అజన్త. 95) అని తెలిపారు.
చిన్నయసూరి బాలవ్యాకరణానికి ముందు సూత్రాంధ్ర వ్యాకరణంలో తద్ధితాలను ‘‘అథతద్ధితౌ’’ అనే శీర్షికతో వివరించారు. ఈయన సూత్రాంధ్ర వ్యాకరణంలో ‘‘త్వార్థేతనఙ్’’5 అని తెలిపి, బాలవ్యాకరణంలో ‘‘తన వర్ణకంబు త్వార్థంబునందగు.’’ (తద్ధిత. 1) అని తెలిపారు. సంస్కృతంలో ‘‘త్వ’’ అనే ప్రత్యయార్థంలో తనవర్ణకం వస్తుంది. త్వార్థమనగా భావం. ఈ ప్రత్యం భావార్థంలో విశేషణాలకు, విశేష్యాలకు సామాన్యంగా వస్తుందన్న ఉద్దేశంతో తెలిపారు. దీనికి మూలం చింతామణికారుడు తెలిపిన ‘‘త్వార్థేతనశ్చ వికృతౌస్యాత్’’ 6 అనే సూత్రం.
4.1 బాలవ్యాకరణము:
చిన్నయసూరి సిద్ధాంత కౌముదిని అనుసరించి తద్ధిత పరిచ్ఛేదాన్ని ఏర్పరచారు. వివిధ అర్థాలలో వచ్చే ప్రత్యయాలను వివరించారు. ప్రత్యయనిరూపణలో చిన్నయసూరి, చిన్నాదులు, పేర్వాదులు, నల్లాదులు, అగ్గలాదులు, మగఁటిమ్యాదులు, అరమరాదులు, చిఱుతాదులు, అటాదులు, అటమాటాదులు, జాలాదులు, ఓయారాదులు, వగాదులు, ముక్కులోనగునవి అని గణాలను ఏర్పాటుచేసి నైపుణ్యంగా వివరించారు.7
చిన్నాదులకు ఱికవర్ణకం, పేర్వాదులకు ఇమి, నవర్ణకం గుణవాచకాలైన నల్లాదులకు, ఇక వర్ణకం అగ్గలాదులకు, అరమరాదులకు స్వార్థంలో ఇక, చిరుతాదులకు ‘ఉ’ వర్ణకం,
కాకత్తియ వర్ణకాలు పుంస్త్వ స్త్రీత్వామతుబర్థంలో ఆటాదులకు, ‘‘కా’’ వర్ణకం తిర్యక్కులకు వస్తాయని వివరించారు.
సూరి ‘‘అటమటాదులకు మతు బర్థంబునందీవర్ణకంబు పుంస్త్వంబునందగు’’ (తద్ధిత 15) అని తెలిపారు. దీనికి మూలం ‘‘కాఁడుర్గాఁడుర్భవేదీఁడు రస్తీత్యాద్యర్థబోధకాః’’ (వి.వి.అసన్త 50) అనే వికృతివివేక సూత్రం సూరి అటమటాదులుగా అటమటము, కమ్మతము వంటి గణాలను చేర్చారు. ఇందులో కోడిగము, మావటము, తిండి మొదలైనవి చేరుతాయి.
తన ప్రత్యయం భావార్థంలో సామాన్యంగా సంస్కృతాంధ్ర పదాలపై చేరుతాయి. కేవలం ఆచ్ఛిక పదాలపై చేరే భావార్థక ప్రత్యయాలు - ఱిక, - ఇమి, -న, -ఇక మొదలైనవి వస్తాయని సూరి8 వివరించారు. సూరి క్రమపద్ధతిలో గణాలను ఏర్పరచి ఈ పరిచ్ఛేదాన్ని వివరించారు.
‘‘సూరి‘ ‘అర్థవిశేషంబుల వర్ణకాంతరంబులును మహత్ప్రయోగంబుల నెఱుంగునది (తద్ధిత 28) అనే సూత్రంలో మరికొన్ని తద్ధిత ప్రత్యయాలను పరిచయం చేశారు. వీటిని ప్రత్యేక సూత్రాలుగా నిరూపించక క్రోడీకరించడానికి కారణం లక్ష్యాలు విశేషంగా లభించకపోవడమే. పరిమిత లక్ష్య ప్రదర్శనానికి, ప్రత్యేక సూత్రరచన చేయడం గ్రంథవిస్తరణే అవుతుంది. ఇటువంటి వర్ణకాలు మహాకవి ప్రయోగాలను బట్టి మరికొన్నింటిని సంగ్రహించవచ్చు. అందుకు మార్గాన్ని చూపారు.
4.2 ఆంధ్ర వ్యాకరణ సంగ్రహము:
పాపినేని అబ్బాయినాయుడు ఆంధ్రవ్యాకరణ సంగ్రహం (పుట 73)లో తద్ధిత వృత్తులను అపత్యార్థక తద్ధిత వృత్తులు ఉదా: దాశరధి, ద్రౌపది: గోత్రార్థక తద్ధితవృత్తులు. ఉదా:రాఘవులు, కౌరవులు: సంబందార్థక తద్ధితవృత్తులు. ఉదా: హైహయులు, సాగరము: స్వార్థక తద్ధితవృత్తులు ఉదా: బాంధవులు, నారకము: దఘ్నార్థక తద్ధితవృత్తులు ఉదా: మోకాలికొలఁది, కుత్తుకబంటి: అని ఐదురకాలుగా వర్గీకరించి వివరించారు.
4.3 తెలుగు వ్యాకరణము:
బులుసు పాపయ్య శాస్త్రి తెనుఁగు వ్యాకరణం (పుట 84)లో తద్ధితాలనగా విశేష్య విశేషణాల నుండి విశేష్య విశేషణాలను కలిగించడానికి చేర్చబడే ప్రత్యయాలని, అటువంటి ప్రత్యయాలను చేర్చడంవలన ఏర్పడే విశేష్య విశేషణాలు తద్ధితాంతాలవుతాయని తెలిపారు. ఈయన తద్ధితాలను భావార్థక, స్వార్థ, మతుబద్ధ, స్త్రీలింగద్యోతక, అభావం, మానార్థకాలుగా వర్గీకరించారు. భావార్థంలో - తనము, ఱికము, అ, పు, ఇమి అనే ఐదు తద్ధిత ప్రత్యయాలనూ, స్వార్థంలో క, ఉక, కాఁడు/కత్తె, ఈడు అనే నాలుగు తద్ధిత ప్రత్యయాలనూ: మతుబద్ధంలో కాఁడు/కత్తె, ఈఁడు, అరి, ఇ, ఆఁడు/ఆఁడి అనే ఐదు తద్ధిత ప్రత్యయాలను, స్త్రీలింగ ద్యోతకంలో త(బోయిత) ప్రత్యయం: మానార్థంలో ఎఁడు, ఏసి, బంటి, అవ, అనే నాలుగు విభక్తి ప్రత్యయాలనూ: అభావంలో ఇఁడి అనే తద్ధిత ప్రత్యయాన్ని తెలిపి వివరించారు. అయితే ఇందులో కాఁడు/కత్తె అనేవి స్వార్థంలోనూ, మతుబర్థంలోనూ తెలిపారు. దీనికి కారణం మతుబర్థంలో కలవాడు కలది అనే అర్థంవస్తుంది. ఉదా: కాఁడు - ఆటకాఁడు. ఆట కలవాడు. స్వార్థంలో ప్రత్యయం అర్థం మారదు. ఉదా: చెలికాఁడు, చెలికత్తె.
4.4 ఆంధ్ర చంద్రిక:
కేతవరపు వేంకటశాస్త్రి ‘‘నామవాచకములకుఁగాని, విశేషణములకుఁగాని భావార్థము మొదలగు నర్థములందుఁ జేర్పఁబడు ప్రత్యయములు’’ (ఆంధ్ర చంద్రిక . పుట 44) అని నిర్వచించి తనము, ఱికము, ఇమి, కత్తియ, ఈఁడు, అరి, ఇ, త, ఆఁడ, ఆడి, ఇఁడి, ఎడు, బంటి, కొలఁది, మయము అనే 25 తద్ధిత ప్రత్యయాలనూ తెలిపి అవి చేరే శబ్దాలను చూపారు. పూర్వవ్యాకర్తలనే అనుసరించారు. కాని కొత్తదనం లేదు.
4.5 ప్రౌఢవ్యాకరణము:
ప్రౌఢవ్యాకర్త దఘ్నార్థంలో తత్సమ పదాల మీద బంటి ప్రత్యయం సకృత్తుగా వస్తుందని వివరించారు. ఉదా: కటిబంటి. ఈయన హ్రస్వమైన ‘‘అ’’ను తద్ధితంగా గ్రహించి (తద్ధిత 5) దీనిని గూడా మగాది గణంలో చేర్చారు. అందుచేత చెడుగు+అ - చెడుగఁడు: దుడుకు+అ-దుడుకఁడు అనే రూపాలు సాధించబడుతున్నాయి. చిన్నయసూరి ‘‘త’’ వర్ణకాన్ని తీసుకొని ‘ఎత’ రూపాన్ని పేర్కొంటే ప్రౌఢవ్యాకర్త - ఇత ప్రత్యయాన్ని తెలిపారు. చెంచితలన్ - వంటి ఉదాహరణలుచూపారు. ఈయన 9-అడ (వేఱు+అడము-వేఱడము), -అడి (వెల్ల+అడి-వెల్లడి), -ఇడి (తెలివి+ఇడి-తెలివిడి), -ఇత (ఇంపు+ఇత (ము) -ఇంపితము), -ఇద (ఒప్పు+ఇద(ము)-బప్పిదము), -ఇరి (వాఁపు+ఇరి-వాపిరి), అనే ప్రత్యయాలను స్వార్థంలోనూ:- ఇద (క్రొవ్వు+ఇద(ము) -క్రొవ్విదము) మతుబర్థంలోనూ, కర (నాయకరము) వర్ణకం భావార్థంలోనూ వస్తాయని విశేషించి చూపారు. సంస్కృత తద్ధితాలు అచ్చతెలుగు శబ్దాలపై చేరడం ఈయన నిరూపించారు. ఉదా: తనమయము.
4.6 ఆంధ్రభాషానుశాసనము:
మల్లాది సూర్యనారాయణ శాస్త్రి ‘‘నామవాచకముల కంటెను, కొన్ని విశేషణములకంటెను, విశేషార్థమందును స్వార్థమందును విధింపఁబడు ప్రత్యములు తద్ధితములు’’ (ఆంధ్ర భాషాను శాసనము .తద్ధిత 1) అని నిర్వచించారు. ఈయన తద్ధిత పరిచ్ఛేదాన్ని 37 సూత్రాలలో విశేషంగా వివరించారు. కొన్ని గుణాది నామవాచకాలకు న వర్ణకం వస్తుందని, రూపు, బలుపు మొదలైన శబ్దాలకు ‘‘అసి’’ ప్రత్యయం వస్తుందని, కులవాచక శబ్దాలకు, స్త్రీవాచకమైన ‘‘త’’ ప్రత్యయం (చాకిత) వస్తుందని తెలిపారు. ‘ఇత’ వర్ణకం కొన్నింటికి స్వార్థంలో (ఇంపిత, పోరితము) వస్తుందని తెలిపారు. ఈయన వివిధ తద్ధిత ప్రత్యయాలతో విశేషంగా చూపారు.
5. ముగింపు:
- బాలవ్యాకరణం, సమీపకాలవ్యాకరణాలలో కృద్వృత్తి, తద్ధితవృత్తుల పరిశీలన వల్ల ఈ క్రింది అంశాలను నిర్ధారించవచ్చు.
- సూరి వాక్యంలోని ‘‘వ్యక్షమాణాలు’’ కృత్తులుగాని అర్థాలు కావు. పరిచ్ఛేదమంతటా కేవల ప్రత్యయాలనేగాని అర్థంతో ఒక్కదానినైనా ఆయన నిర్దేశించలేదు. సూరి సూత్రానుసారంగా కేవల కృత్తులనే అర్థనిర్దేశ శూన్యంగానే ప్రదర్శించారు.
- సూరి ప్రదర్శించినవి ప్రత్యక్షకృద్యృత్తిలోనివి, కొన్ని పరోక్ష కృద్రూపాలు, మరికొన్ని అతిపరోక్షాలు ఉన్నాయి. సోదర భాషలను పరిశీలించినా, తెలుగులో ధాతురూపాన్ని కోల్పోయి, నామాలుగా వ్యవహారంలో ఉన్నకొన్ని శబ్దాలు గోచరిస్తాయి. తోట- తోడు, పగలు పగు- భేదించ (త) పగు -ఈ విషయాలను ప్రత్యేకంగా పరిశోధించాలి.
- వివిధ వ్యాకర్తలు అనేక తద్ధిత ప్రత్యయాలను తెలిపారు. ఇంకా మరికొన్ని తద్ధితాలు - ఆయి:-అన్నాయి - ఆప్యాయార్థం. అమ్మాయి, బాబాయి. ఇవి తత్సమ పదాలపై కూడా చేరుతాయి. ఉదా: సీతాయి, రామాయి.
- ఆరి: పిసినారి: గొట్టు - పిసిని గొట్టు - తాచ్చీల్యం: జనవ్యవహారంలో, సారస్వత వ్యవహారంలోనూ ఇటువంటి ప్రత్యయాలను శోధించి, అర్థనిర్ణయం గావించవచ్చు.
6. పాదసూచికలు:
- నిరుక్తం 1:12 సూ॥
- యాస్కుడు వాక్యపదీయము. 1: 22…
- దువ్వూరి వేంకటరమణ శాస్త్రి: రమణీయం: పుట: 430.
- దువ్వూరి వేంకటరమణ శాస్త్రి: రమణీయం: పుట: 430.
- పరవస్తు చిన్నయసూరి సూత్రాంధ్ర వ్యాకరణమ్. అథ తద్ధితౌ 1.
- ఆంధ్రశబ్ద చింతామణి: హలన్త 10.
- పరవస్తు చిన్నయసూరి బాలవ్యాకరణము: తద్ధిత 3 నుండి 24 వరకు.
- పరవస్తు చిన్నయసూరి బాలవ్యాకరణము: తద్ధిత 3,5,6,9.
- బహు జనపల్లి సీతారామాచార్యులు. ప్రౌఢవ్యాకరణము, తద్ధిత 4,5,6,7,8,9,10,11,12,17,18.
7. ఉపయుక్తగ్రంథసూచి:
- అధర్వణాచార్యుడు, వికృతి వివేకము (అధర్వణ కారికావళి). కవిజనమండన సహితము, వావిళ్లప్రతి, 1955.
- ఆంజనేయశాస్త్రి. టి. ఆశుబోధ లక్షణసంగ్రహము.బాలా త్రిపురసుందరీ ప్రెస్ , గుంటూరు 1884
- కేతన, మూలఘటిక. ఆంధ్రభాషా భూషణం, వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మద్రాసు: 1911
- చిన్నయసూరి, పరవస్తు. బాలవ్యాకరణము, స్టూడెంట్స్ ఫ్రెండ్స్ పుబ్లిషర్స్ ,నరసరావు పేట, 1911
- జోగిసోమయాజి, గంటి. (పరి.) వాక్యపదీయం. తెలుగు అకాడమి, హైదరాబాద్, 1974
- నన్నయ, ఆంధ్ర శబ్ద చింతామణి, చెన్నపురి వావిళ్ల రామస్వాము శాస్త్రులు అండ్ సునస్ పుబ్లిషర్స్,1937
- పాపయ్యశాస్త్రి, బులుసు. తెనుcగు వ్యాకరణము, అనకాపల్లి.
- ప్రవీణ, దొడ్డి. బాలవ్యాకరణానికి సమీప కాలిక వ్యాకరణాల పరిశీలన (సి.గ్ర.) PND పుబ్లిషర్స్, 2015
- వరాహనరసింహము, ఈశ్వర. (అను.) శ్రీ యాస్కముని ప్రణీత నిరుక్తము, హైదరాబాద్, 2014.
- వెంకటరమణ శాస్త్రి, దువ్వూరి. రమణీయం. ఆంధ్ర యూనివర్సిటీ ప్రెస్సూ , వాల్తేరు 1964
- వేంకటశాస్త్రి, కేతవరపు. ఆంధ్రచంద్రిక. ముద్రణాదిక వివరాల పుట అలభ్యం
- శేషగిరిశాస్త్రి, తాతవెళ్ళి మిఠాదార్. ఆంధ్ర శబ్దతత్వము. వేదము వేంకటరాయశాస్త్రి (ప్రచురణ), మదరాసు, 1848
- సీతారమాచార్యులు, బహుజనపల్లి. ప్రౌఢ వ్యాకరణము. విశాలాంధ్ర పబ్లిషర్, విశాఖపట్నం: 1999
- సూర్యనారాయణ శాస్త్రి, మల్లాది. ఆంధ్రభాషానుశాసనం. సరస్వతీపవర్ ప్రెస్, రాజమహేంద్రవరము, 1926
- Macmillan 7 company Limited Bombay, Culcutta and London, 1914.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "May-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-April-2025
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "MAY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి
బాధ్యత వహించరు.