AUCHITHYAM | Volume-5 | Issue-14 | December 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
7. బవనీల కళావాద్యం: జమిడిక

డా. సునీత నీటూరి
తెలుగు లెక్చరర్,
సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల, వికారాబాద్
వికారాబాద్ జిల్లా, తెలంగాణ
సెల్: +91 7702802023, Email: cherukupalliarunaprasad@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 20.11.2024 ఎంపిక (D.O.A): 30.11.2024 ప్రచురణ (D.O.P): 01.12.2024
వ్యాససంగ్రహం:
భారతదేశం అనాదిగా భిన్న మతాల, సంస్కృతుల, ఆచార సంప్రదాయాల సమాహారం. ఇందులో భాగంగానే ఎన్నో జానపద కళారూపాలు. ఈ జానపద కళారూపాలను ఆశ్రయించి ఎన్నో కులాలు. ఈ కులాలను ఆశ్రయించి అనేక ఉపకులాలు ఉన్నాయి. వీటినే ఆశ్రిత కులాలు అని అంటున్నాము. ఈ ఆశ్రిత కులాలలోని ఒక కులమే ‘బవనీలు’. వీరు మాదిగ ఆశ్రిత కులం. వీరిని బవనీలు, బైండ్లవారు అనే పేర్లతో పిలుస్తాము. వీరు మాదిగలకు పూజారులుగా ఉంటారు. వీరి కళారూప ప్రదర్శనలో ఉపయోగించే ప్రధాన వాద్యం జమిడిక. నాటక రంగానికి మాత్రుకైన తరతరాల వైభవాన్ని సంతరించుకున్న జానపద కళారూపమైన బవనీల కళా వాద్య విశేషాలను తెలియజెప్పడం, ప్రాచీన కళారూపాలను పునరుద్ధరించి ప్రగతిశీల దృక్పథంతో, నూతన ప్రయోగంతో, ఆధునిక పద్ధతులలో జానపద కళారుపాల్లో బవనీలు- వారి పాత్రను తెలియజెప్పడం ఈ వ్యాసరచన ముఖ్య ఉద్దేశం. అంశానికి సంబంధించిన విషయసేకరణలో భాగంగా ముందుగా అందుబాటులో ఉన్న వివిధ పుస్తకాలు, దినపత్రికలలో వచ్చిన వ్యాసాలు, గ్రంథాల ద్వారా బవనీలను ప్రత్యక్షంగా కలిసి విషయ సేకరణ చేయడమైనది. ముఖ్య ఆధారాలుగా ఇప్పటి వరకు వచ్చిన బవనీలకు సంబంధించిన గ్రంథాలను, ముఖాముఖి సంభాషణల ద్వారా కూడా ముఖ్యమైన విషయాలను, సాహిత్యపత్రికలలో వచ్చిన సమీక్షలను పరిగణనలోకి తీసుకున్నాను. ప్రస్తుతం కళాకారులకు అందవలసిన ప్రోత్సాహం, ఆదరణ లేకపోవటం వల్లను, మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితులవల్ల వీరు కులవృత్తులను పాటించక పోటీ ప్రపంచంలో తమ పిల్లలను చదివించుకుంటూ వివిధ ఉద్యోగాలు, వృత్తులలోకి స్థిరపడటం జరుగుతోంది. అందువల్ల వీరిని గురించి తెలియజెప్పే చిన్నప్రయత్నమే ఈ ‘‘బవనీల కళావాద్యం - జమిడిక’’.
Keywords: బవనీలు, జమిడిక, ఆశ్రిత కులం, వాద్య విశేషం, సాహిత్య అంశాలు, బవనీల కళారూపం
1. పరిచయం:
భారతదేశం అనాదిగా భిన్నమతాల, సంస్కృతుల ఆచార సంప్రదాయల సమాహారం. ఇందులో భాగంగానే మనదేశంలో ఎన్నో కులాలు, వాటికి ఉపకులాలు ఉన్నాయి. ప్రధాన కులానికి ఆశ్రయించి కొన్ని కులాలు ఉన్నాయి. వీటినే ఆశ్రిత కులాలు అని అంటున్నాము. ఇవి దాదాపు భారతదేశంలోని అన్ని కులాలలో ఈ వ్యవస్థ ఉంది. దేశంలోని చాల కులాలు అనేక వృత్తులు నిర్వహిస్తూ ఉన్నాయి. ఒక కులంవారు వారికి సంప్రదాయబద్ధంగా మరియు వంశపారంపర్యంగా వస్తున్న వృత్తిని చేపట్టటం అనేది అనాదిగా వస్తున్నదే. అయితే అక్కడక్కడా కులవృత్తిని కాదని వేరే వృత్తులను చేపట్టటం జరుగుతున్నప్పటికీ ప్రధానంగా కులవృత్తిని చేయడం అనేది కూడా భారతదేశంలో (సంప్రదాయికంగా) కొనసాగుతూనే ఉన్నది.
‘‘ఒక్కో కులం వారికి ఒక్కో వృత్తి అని అనుకున్నప్పుడు చాల వృత్తులలో కథ, గాన, సేవ, కళాప్రదర్శన చేసి దాని ద్వారా జీవనం సాగించే కులాలు సంప్రదాయబద్ధంగా కొన్ని శతాబ్దాలుగా ఉన్నాయి. ఈ విధంగా ఉన్నాయని చెప్పడానికి అనేక చారిత్రక ఆధారాలు కూడ లభిస్తాయి.’’ (ఆర్విఎస్.సుందరం-ఆంధ్రుల జానపద విజ్ఞానం).
నాటకరంగానికి మాత్రం యుగయుగాలుగా, తరతరాల వైభవాన్ని సంతరించుతున్న జానపద కళారూపాలను గురించి ఈతరం వారికి తెలియదనటం అతిశయోక్తి కాదు. అది తరతరాల వైభవం, తరగని వైభవం. అయితే నూరు సంవత్సరాలకు ముందు నాటకరంగం లేని నాడు మన ప్రజలకున్న కళారూపా లేమిటి? అని మనం ప్రశ్నించుకుంటే మనకు కనిపించేవి ఆనాటి జానపద కాళారూపాలే. వీటినే నమ్ముకొని ప్రధాన కులాన్ని ఆశ్రయించి జీవనం సాగిస్తున్న ఉపకులాల్లో ఈ బవనీలు ఒకరు. వీరు మాదిగ ఆశ్రిత కులాల్లో ఒకరిగా ఉన్నారు. తెలుగుదేశంలో వృత్తి గాయకులుగా పేరుపొందిన వారిలు బవనీలు ఒకరు. ఈ వృత్తి గాయకులు ఎల్లమ్మ, మారమ్మ, మైసమ్మ, భవాని, దుర్గ, కాళి, మొదలైన పేర్లు కలిగిన శక్తిని ఆరాధించి ఆమె గుణగానం చేసి, ఆటలు, పాటలు పాడుతూ కాలం గడుపుతారు. ఆదిశక్తి రూపమైన దుర్గాదేవియే వీరికి ఆరాధ్య దైవం. తెలంగాణలో బవనీలు (బైండ్లవారు) పాడే పాటలు శక్తికి సంబంధించినవిగా ఉండటం చేత వీరిని ఒకవిధంగా శక్తి గాయకులని చెప్పవచ్చును. కాని, ఈ పేరు ప్రచారంలో లేదు. ఈ వృత్తి గాయకులు జానపద కళారూప ప్రదర్శనలో విశేషమైన స్థానం సంపాదించినారు.
‘‘షెడ్యూలు కులాలు అనబడే మాదిగలలో దేవీ పూజ నెఱపువారు బైనీండ్లు. వీరే బైండ్ల వారనియు, బవనీలనియు పేర్కొనబడిరి. వీరు ‘‘పంబ’’ వాద్యమును మ్రోగించుచు మాతృదేవతా కథనము చేయుట వలన, ‘పంబల’ వారనే పేరు వచ్చినది’’ అని డా. నాయని కృష్ణకుమారిగారు చెప్పుచున్నారు. (జానపద గేయ గాథలు, డా॥నాయని కృష్ణకుమారి`పుట నెం.323).
‘‘బైండ్లవారను పేరు వీరు వాయించెడి వాద్యము వలన వచ్చి ఉండును. వీరి వాద్యమునకు ‘జమిడిక’ అని పేరు. శిష్టులు వీరిని ‘బవనిక’ అని అందురు. బవనికలు వాయించువారు బవనీలు - బైండ్లవారు. బవనికనే ‘జమిడిక’ లేదా ‘పంబ’ అని అందురు. బవనిక వాయించుటచే బవనీలు- బైండ్ల వారైనటులే, పంబ వాయించుటచే పంబ వారైరి. (తెలుగు జానపద గేయసాహిత్యం, రెండవ సంపుటము, ఆచార్య బిరుదురాజు రామరాజు, పుట నెం. 800).
ఆశ్రిత కులాల జానపద కళా వాద్యాల సంస్కృతి, సాహిత్యాంశాలు, విశిష్టత అనే అంశంపై నేను 2023 అక్టోబరం నెలలో ఉస్మానియా విశ్వ విద్యాలయం, తెలుగు శాఖకు సమర్పించిన గ్రంథం. అందులో భాగంగానే ఈ వ్యాస సమర్పణ.
జమిడిక వాద్య పరికరం Photo
బవనీయ కళాకారులు శ్రీ ముత్యప్ప మరియు శ్రీ చంద్రప్పలతో వ్యాసకర్త డా.సునీత నీటూరి Photo
2. పూర్వ పరిశోధనల వివరాలు:
జానపద కళారూపాలు జానపద సాహిత్యంలో భాగంగా వివిధ ఆశ్రితకులాల సాహిత్యం, ఆచార సంప్రదాయాలు, సంస్కృతి వంటి అంశాలపై పరిశోధనలు జరిగాయి. కాని ప్రత్యేకంగా జానపద కళావాద్యం ‘జమిడిక’ అనే అంశంపై నాకు తెలిసినంత వరకు గతంలో ఎటువంటి వ్యాసాలు వెలువడలేదు.
‘జానపద కళ`డప్పు`ఒక పరిశీలన’ అనే అంశంపై శ్రీ ఇరుగంటి నిరీక్షణరావు పరిశోధన గ్రంథాన్ని వెలువరించారు. ఇందులో కేవలం ఒక డప్పు వాద్యాన్ని గురించి మాత్రమే తెలియజేశారు. అయితే ప్రత్యేకించి జానపద ఆశ్రిత కులాలకు సంబంధించి నటువంటి వాద్య పరికరాలను గురించి ప్రస్తావించలేదు.
ఆచార్య జయధీర్ తిరుమలరావుగారు ‘మూలధ్వని’ పేరుతో జానపద, గిరిజన వాద్య పరికరాల గురించి ఒక పుస్తకాన్ని వెలువరించారు. కాని పూర్తి స్థాయిలో ఆశ్రిత కులాల జానపద కళా వాద్యాల సంస్కృతి, సాహిత్యాంశాలపై ఈ పుస్తకంలో ప్రస్తావించలేదు.
వరంగల్ జానపదకళాపీఠం ‘జానపద కళా వాద్యాలు’ అనే అంశంమీద 2015/2016లో సెమినార్ నిర్వహించారు.
ఇవన్నీ కూడా జానపద కళావాద్యాల స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తాయి.
జానపద కళారూపాలు జానపద సాహిత్యంలో భాగంగా వివిధ ఆశ్రితకులాల సాహిత్యం-ఆచార సంప్రదాయాలు, సంస్కృతి వంటి అంశాలపై పరిశోధనలు జరిగాయి. కాని, ప్రత్యేకంగా ‘‘జానపద కళావాద్యం-జమిడిక’’ అనే అంశంపై నాకు తెలిసినంత వరకు గతంలో ఎటువంటి వ్యాసాలు వెలువడలేదు.
బవనీలు మాదిగలకు ఆశ్రితులుగా ఉన్నారు. వీరు మాదిగలకు పౌరోహిత్యం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆశ్రిత కులాల వారికి ఒకప్పుడు సమాజంలో మంచి ఆదరణ, ప్రోత్సాహం, గుర్తింపు ఉన్నాయి. వీరు సాధారణంగా ప్రతి సంవత్సరం నిర్ణీత సమయంలో వారికి సంబంధించిన ఆశ్రిత గ్రామాలకు వెళ్ళి ఆయా కులాల వారికి చెందిన మూలపురుషుల కథలు, గోత్ర నామలు రామాయణ, మహాభారత, పురాణాలకు సంబంధించిన కథలను వివిధ రూపాలలో (అంటే కథ, గేయం, నాటిక, హరికథ మొదలైన), వివిధ అలంకరణలతో ప్రదర్సిస్తూ జీవనోపాధిని పొందేవారు.
స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రభుత్వంవారు ఆణగారిన, అట్టడుగువర్గాల అభ్యున్నతికి అనేక చట్టాలు తీసుకురావటం జరిగింది. ఈ క్రమంలో సమాజంలో అనేక మార్పులు జరిగాయి. అందరికీ విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు అన్ని రంగాలలో కల్పించడం జరిగింది. దీనితో సమాజంలోని అన్ని వర్గాలవారు ప్రాథమికంగా విద్యను అభ్యసిస్తున్నారు. దీని ద్వారా ఎక్కువ శాతం కులవృత్తులను వదిలేస్తూ విద్యార్జన చేస్తూ అనేక రంగాలలో ఉపాధిని పొందుతున్నారు. ఈ కారణంగా అనాదిగా వస్తున్న కులవృత్తులు మాయమవుతున్నాయి. కాని, ఇప్పటికీ అక్కడక్కడా ఈ కులవృత్తులు, వారిని ఆశ్రయిస్తున్న కళలు ఇంకా సజీవంగానే ఉన్నాయని చెప్పవచ్చు. ఈ కులవృత్తుల కళాకారులనే జానపద కళాకారులుగా పేర్కొంటాము. వీరు ఉపయోగించే వాద్యపరికరాలనే ‘జానపద వాద్యాలు’ అవి అంటాము.
3. జానపద కళావాద్యాలు:
భారతదేశంలో జానపద వాద్యాలు అనగానే ముఖ్యంగా గుర్తుకు వచ్చేవి గ్రామీణులు తమతమ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలలో భాగంగా పుట్టుక దగ్గరి నుంచి చనిపోయే వరకు, పండగలు, పబ్బాలు, సాంస్కృతిక కార్యక్రమాలలో వాడే విభిన్నమైన పరికరాలు గుర్తుకువస్తాయి. వీటిని ముఖ్యంగా 4 రకాలుగా వర్గీకరించవచ్చును.
1) తర్రతి వాద్యాలు: తంత్రులు లేదా తీగ (string) లతో వాయించేవి. ఉదా: తంబుర, కడ్డీ తంత్రి, సారంగి, వీణ, బుర్రవీణ, జానపద కిన్నెర, సితార వాద్యం మొదలైనవి).
2) సుషిర వాద్యాలు: గాలితో (wind) పనిచేసే వాద్యాలు లేదా గాలిని ఊది వాయించేవి. ఉదా: వేణువు, సన్నాయి, కొమ్ము, నాదస్వరం, షహనాయ్, శంఖువు, నరసింగ్ మొదలైనవి.
3) చర్మ (అవనద్ధ) వాద్యాలు): చర్మాన్ని ఉపయోగించి వాటిని కొట్టి వాయించేవి. ఉదా: మృదంగం, డోలు, డమరుకం, మద్దెల, తబల, తప్పెట, దుందుభి, నగారా, డోలక్, పంచముఖ వాద్యం మొదలైనవి.
4) ఘన వాద్యాలు: ఘనం అనగా గట్టిగా ఉండేవి. ఇది తాళం ననుసరించి వాద్యాలు. ఉదా. తాళాలు, గంటలు, గజ్జెలు, ఘటం, చిరుతలు, మోర్సింగ్, మంజరి మొదలైనవి.
4. జానపద కళావాద్యం - జమిడిక:
ఈ జమిడిక వాద్యాన్ని మాదిగ ఆశ్రిత కులమైన ‘బవనీలు’ లేదా ‘బైండ్ల’ వారు ఉపయోగిస్తారు. వీరినే పంబల, జముకు, కొమ్మువారు, ఆసాదులు అని కూడా ఆయా ప్రాంతాలను బట్టి పిలుస్తారు. ఈ బైండ్లవారు మాదిగలకు పూజారులు. కాకతీయ చక్రవర్తుల కాలంలో వీరశైవ మతస్థులకు వినోదాన్ని కల్పించేవారు. బవనీలు కాకతీయ చక్రవర్తుల కాలం నాటికే ప్రాముఖ్యం వహించినట్లు క్రీడాభిరామంలో ఉన్న ఈ క్రింది ఉదాహరణను బట్టి తెలుసుకోవచ్చును.
వాద్య వైఖరి కడు నెరవాది యనగ
ఏకవీరామహాదేవి ఎదుట నిల్చి
త్పోరశురాముని కథలెల్ల పాడి పాడె
చారుతర కీర్తి బవనీల చక్రవర్తికి4 (4. క్రీడాభిరామము-దర్వు నెం.150)
మాతంగి కొలుపులు చేసేది కూడా వీరే. వీరు ఉపయోగించే వాద్యం ‘జమిడిక’ పరికరం. దీనినే జమిలిక, జముకు అని, మరికొన్ని ప్రాంతాలలో దీనినే ‘పంబ’ అని పిలుస్తారు.
5. జమిడిక వాద్య విశేషం:
జమిడిక లేదా జముకు ` దీనిని వాయించే బవనీల (బైండ్ల) ప్రసక్తి ‘క్రీడాభిరామం’ గ్రంథంలో ఉంది. ముగ్గురు లేదా నలుగురు నలుగురి బృందం కథ చెబుతుంది. ప్రధాన కథకుడు అనేక బాణీలలో, శైలులలో కథా గానం చేస్తాడు. ప్రధాన కథకుడు వేపమండలు పట్టుకుంటాడు. భుజంపై వీరగోలు వేసుకుంటాడు.
జమిడిక లేదా జముకు - తాళానికి అనుగుణంగా వాయించే వాద్యం. దీనిని ఒకప్పుడు చెక్కతో తయారుచేసేవారు. తరువాత ఇత్తడితో చేస్తున్నారు. ఇలా తయారు చేసిన జమిడికని ఒకవైపు చర్మంతో మూస్తారు. ఒక నరాన్ని ‘గట్’ తాడుని చర్మానికి బిగిస్తారు. అది కుంచంలోంచి పైకి వస్తుంది. ఈ తాడుకి చివరన ఒక కర్రముక్కను కడతారు. కుంచాన్ని చంక కింద పెట్టుకుంటారు. ఆ చేత్తోనే తాడు కొనకు కట్టిన కర్రముక్కను లాగి పట్టుకుని ఇంకో చేత్తో ఈ తాడుని మీటుతూ దానికి అనుగుణంగా పాడుతారు. వాద్యాన్ని మీటుతున్నప్పుడు కర్రముక్కకు కట్టిన తాడుని విదిలిస్తూ, కదుపుతు ఉంటారు. దానివల్ల పుట్టిన ధ్వని కొంత భీకరంగా, తాళయుక్తంగా ఉంటుంది. ఈ వాద్యాన్ని వింటుంటే శ్రోతలకు శరీరం ఝల్లుమంటుంది. ‘జముక్, జుమ్‌చుక్’ అంటూ వినిపించే శబ్దం ఒక రకమైన ప్రత్యేక సంగీతమై అలరిస్తుంది. జమిడిక యొక్క మరో విశేషం ఏమిటంటే వాద్య వైఖరిలో అటు ఘన మరియు అనవద్ధ కోవకు చెందినదిగ కనిపిస్తుంది.
చర్మ వాద్యాలైన రుంజ, మృదంగం, తబలా, డోలు, మద్దెల, డమరుకం - వీటన్నింటికి ఈ లక్షణము జమిడికకు (జెమిళికకు) ఉంది. ఒక తంత్రి, ఒక చర్మం రెండూ కలిసి ఉన్న వాద్యం జమిడిక. దీనిలో రెండు రకాల ధ్వనులు వెలువడుతాయి. అవి 1) చర్మం మీద ధ్వని 2) తంత్రి మీద ధ్వని. ఇది ఈ విధమైన జంట విలక్షణాలతో భారతీయ వాద్యాలలోనే ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.
6. జమిడిక నిర్మాణం:
ఈ జెమిడిక (జమిడిక) ఒక చిన్న స్థూపం (డ్రమ్ వంటి ఆకారం) బకెట్ లేక కుదురు ఆకారం కలిగి ఉండి రెండు వైపుల రంధ్రములు ఉంటాయి. ఒకవైపు మూయబడి, మరొకవైపు తెరవబడి ఉంటుంది. జమిడికను కంచుతోగాని, మొగిలి కర్రతోగాని, టేకు, మద్ది కర్రలతోగాని తయారుచేస్తారు. జనుల వాడకంలో ఎక్కువగా కంచుతో తయారుచేసినవి వాడతారు. మూయబడిన వెలుపలి భాగానికి మధ్యలో ఒక చిన్న రంధ్రం చేసి, ఒక గుండ్రని ఆకారంగల చిన్న బొడ్డును ఆ రంధ్రం పెట్టిన దగ్గర అంటుపెట్టి, ఆ బోడ్డులో నుండి నరముగాని, మెలివేసిన దారముగాని ఒక అడుగు పొడవు కర్రకు కట్టి జెమిళిక లోపలి భాగంలోని కర్రను ఎడమచేతితో పట్టుకొని ఆడిస్తూ, కుడిచేతి చూపుడు వేలు, కుడిచేతి ముద్ర వేలు, ఈ రెండు వేళ్ళతో కలిపి మీటుతారు. అప్పుడు గంభీరమైన, ఆవేశ ప్రేరకమైన ధ్వనులు వినిపిస్తారు. జమిడికను ఎడమ భుజంపై వేసుకొంటారు. ఈ జమిడిక చాలాసేవు మీటడం వల్ల వేడి ఎక్కువవుతుంది. ఈ వేడిని తగ్గించడానికి, ఒక జడలాంటి బద్దెకుచ్చును ఆ కొండ్లకు కట్టి ఉంచుతారు. అప్పుడప్పుడు ఆ కుచ్చును నీటిలో ముంచి మూయబడిన పొరపైన నీటిని అద్దుతారు. దీనితో వేడి తగ్గి చల్లదనం వస్తుంది. జమిడిక అంచు చివరి భాగాన గవ్వల పట్టీని కడతారు. దీనికి ఒక ప్రక్క వాద్యం ఉంటుంది. దానిని వంతకారుడు మీటుతాడు. ఆ వాద్యాలను తిత్తి లేదా సుతి అంటారు.
ఈ సుతిని మొగిలి కర్రతో తయారుచేస్తారు. జమిడిక ఆకారం కంటే కొంచెం వెడల్పు తక్కవ ఉండి, పొడవు ఉంటుంది. ఇది కూడా రెండువైపుల ఖాళీ స్థలాలు కలిగి ఉండి, మూయబడిన వెలుపలి భాగం మధ్యలో బక రంధ్రం చేసి దానిని ఒక గుండ్రని ఆకారంగల చిన్న బొడ్డును ఆ రంధ్రం చేసిన వద్ద బూడిదను, అన్నమును మెత్తగా చేసి బోనం గావించి దానితో అంటు పెడతారు. ఆ అంటు పెట్టిన బొడ్డు నుంచి ఒక రాగి తీగను అర మూర పొడవుగా నున్నని కర్రకు కట్టి ఎందుటి కర్ర ముందుభాగంలో ఒక రంధ్రం చేసి, దానిలో ఒక చిన్న చిర్రను అవసరమును బట్టి వదులు-బిర్రు చేస్తుంటారు. ఈ తీగను ఒక అగ్గిపుల్ల లాంటి పుల్లతో మీటినచో ఒక విధమైన శబ్దం వస్తుంది. ఆయా సన్నివేశములను బట్టి మీటుతుంటారు.
జమిడిక మీటునప్పుడు ‘‘జుంకు జుం జుంకు జుం’’ అనే శబ్దం వస్తుంది. అందుకే దీనికి ‘జముకుల కథ’ అనే పేరు వచ్చింది. జమిడిక అను వాద్యానికి ‘‘బదనిక’’ అను మరో పేరు కూడ ఉంది. (ప్రజాకళలు`ప్రగతివాదులు, ఆరుద్ర రచనలు, పుట-14).
ఎల్లమ్మ, అంకమ్మ గ్రామ దేవతల కథలు చెప్పునప్పుడు, పెండ్లిండ్లు చేసేటప్పుడు, గ్రామ దేవతల కొలుపులు కొలిచేటప్పుడు జమిడికలు వాడతారు. వీరగాథలు లయ ప్రధానాలు కావున లయకు సరిపడు వాద్యాలే ఎక్కువగా వాడబడతాయి. లయ, తాళాలను సూచించునవి తట్టు వాద్యాలు. కావున కథాకారులు చేతితోగాని, పుల్లతోగాని కొట్టి వాయించెడి వాద్యాలను వాడుతుంటారు. తెలుగు వీరగాథలలో, ఎల్లమ్మ కథలలో జముకులు, జమిడికలు అంకమ్మ కథలలో పంబలు పల్నాటి వీరకథలలో వీరణములు (పెద్ద పైజు పంబలు), బొబ్బిలి కథలలోను, జంగం కథలలోను, శారద కథలలోను, బుర్రకథలలోను, గుమ్మెటలు... హరిహరీ పదములతో జముకులు, తంత్రీ వాద్యాలలోని తంబుర, సుతి కూడ వరుస మరియు లయ సూచిస్తుంటాయి. కావున వీర గాథలలో సంగీతాంశాలు ఉండవని భావింపరాదు. సుతి-లయ, తాళము, స్వరము వీరగాథలలో అతి స్పష్టముగా ఉంటాయని గమనింపవలెను. ఈ విధంగా గ్రామ ప్రజలను సంతోష పెట్టుటకు, అలాగే జమిడికను అప్పుడప్పుడు ఆకాశవాణిలో, దూరదర్శన్ వంటి సామాజిక మాధ్యమాల్లో కూడ కళాకారులు ఈ జమిడికను ఉపయోగిస్తారు.
7. కథాస్వరూపం:
జానపద గేయకథా ప్రచారకులలో బవనీలకు విశిష్ట స్థానం ఉంది. వీరు కథలను చెప్పడంలో గొప్ప నేర్పరులు. వీరు వంశపారంపర్యంగా కథలు చెబుతూ, శక్తి మాహత్మ్యాన్ని వివరిస్తూ, గ్రామ గ్రామాల్లో బిక్షాటన చేస్తుంటారు.
ఈ బవనీల ఇండ్లలో బాలురకు అక్షరాభ్యాసమైన తొలి రోజుల్లోనే కథలను ప్రతిరోజు మౌఖికంగా వల్లె వేయిస్తారు. పెద్దలు కథలను చదువుతూ పిల్లల చేత కథలు అభ్యాసం చేయిస్తారు.
బాలురకు చదవడం రాగానే వీరికి శక్తి కథలు వ్రాయబడిన తాళపత్ర గ్రంథాలను చదివి వినిపించి, వీరిచేత ఆయా కథలను కంఠతా పట్టిస్తారు. ముఖ్యంగా చక్కని కంఠంగల బాలురకు కథలు బాగా నేర్పిస్తారు. మిగతా బాలురకు వాద్య విద్యల్లో అభ్యాసం చేయిస్తారు. జమిడిక, సుతి మీటే పద్ధతి, దరువులు తాళాల్ని నేర్పిస్తారు.
కథను నేర్పేముందు బాలురకు కొన్ని పద్యాలు, పాటలు నేర్పుతారు. వాద్యాల మీద కథలు చెప్పే నేర్పు రాగానే గ్రామాలలో కథలు చెప్పే పెద్దల పక్కనుండి కథలు నేర్చుకాని అవకాశాన్ని బట్టి పెద్దలు వీరిచేత కథలు చెప్పిస్తారు. ప్రధాన కథకుడుకి ఇరువైపులా జమిడిక వాద్యకారుడు, సుతి వాద్యకారుడు ఉంటారు. ప్రధాన కథకుడు పెద్ద తలగుడ్డ చుట్టుకొని, కాళ్ళవరకు వ్రేలాడే (జీరాడే) తెల్లని ధోవతిని ధరించి ఉంటాడు. కాళ్ళుకు గజ్జెలు కట్టుకొని, ఒక చేయి చెవి దగ్గర పెట్టుకుని, రెండవ చేతితో అభినయం చేస్తూ కథాగానం చేస్తుంటాడు. జమిడిక వాద్యకారుడు లయబద్ధంగా జమిడికను మీటుతూ ఉంటే, సుతికారుడు సుతిపడుతూ ఉంటాడు. కథకుడు శ్రావ్యమైన కంఠంతో కథ చెపుతూ, గజ్జల కాళ్ళతో చక్కగా నాట్యం చేస్తూ వివిధ భంగిమలతో ప్రేక్షకుల్ని ఆనందపెడతాడు. కథా గానాన్ని మధ్యలో ఆపి, విశ్రాంతి తీసుకునే సమయంలో జమిడిక వాద్యకారుడు కథా వివరణ చెపుతుంటాడు. ఈ సమయంలో కథకుడు కొంత విరామం పొంది, మళ్ళీ తరువాత కథను అందుకుని అతను మధ్యలో పెద్ద కేక వేస్తాడు. ఈ కేకకు నిద్రిస్తున్న ప్రేక్షకులకు ఒక పెద్ద హెచ్చరికలా ఉంటుంది.
కథ చెప్పేటప్పుడు బవనీలు ప్రదర్శించు హావభావ విన్యాసాల్ని చూడవలెనెగాని చెప్పుటకు సాధ్యం గాదు. కథా వేదాన్ని పుంజుకునే కథకుడు లయబద్ధంగా, వేగంగా నాట్యం చేస్తూ, కథాగానం చేస్తూ హుషారుగా గంతులిడుతూ ఉంటే చూసేవారు ఉద్రేకంతో ఉంటారు. జమిడిక ధ్వని అతని కథా గానానికి అనుకూలంగా కదం తొక్కుతుంది. రాత్రుల్లో గ్రామ ప్రజలు భోజనం చేసి వచ్చి ఈ కథలు వినడం వాళ్ళకి విందు భోజనం తర్వాత తాంబూల సేవనంలా ఉంటుంది.
బవనీలు సారాయి, కల్లు తాగి మత్తులో తూగుతూ కూడా కథాగతిలో ఎట్టి అవరోధం లేకుండా కథ చెప్పడం చూస్తుంటే మనకు ఆశ్చర్యం కలుగక మానదు. వీరికి కొంత శ్రుత పాండిత్యం కూడా ఉంటుంది. భాగవత, రామాయణ పద్యాలు, కొన్ని శ్లోకాలు అపభ్రంశ రూపంలో చదువుతారు. వారి కథా కథన వైఖరి చూస్తే ఈ పద్ధతియే మెఱుగులు దిద్దుకొని బుర్రకథకు దారితీసిందని చెప్పవచ్చును. బవనీల కథాకథన పద్ధతి, వారి జమిడిక ధ్వని సోయగానికి ముగ్ధులై ఆధునిక విప్లవ కళాకారులు తమ కళారూపాలలో ‘‘జముకుల కథలను’’ బలమైన కళాపూపంగా వాడుకుంటున్నారు.
బవనీలు ఓంకారం పలికి అంబ కీర్తనతో, దండకంతో, దేవీస్తుతితో కథాగానాన్ని మొదలు పెడ్తారు. ఈ ప్రార్థన దేవతల కొలుపులను బట్టి ఉంటుంది. ఎక్కువగా గ్రామదేవతల స్తుతితో కథను ప్రారంభిస్తూ ఉంటారు. ప్రార్థన తర్వాత కథను మొదలు పెడ్తారు. కథ సీస పద్యాలతో, ద్విపదలతో సాగుతుంది. అభినయ పూర్వకంగా కథను వచనంలో చెప్తూ ఉంటారు. వచన రూపంగా కథను చెప్పే సందర్భంలో కథకుడు మధ్యమధ్యలో జమిడికను మీటుతూ ఉంటే, సుతికారుడు సుతిమీటుతూ, వంతకారుడు వంత పాడతారు. రెండు నిమిషాల కొకసారి కుడిచేతిలో జమిడికను మీటుతుంటాడు. కథా సందర్భమును బట్టి అవయవ చలనం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సన్నివేశాలు రాగానే ఎడమ చేతిని చెవి దగ్గర పెట్టుకొని కుడి చేతితో అభినయం చేస్తూ కథ చెప్తూ ఉంటారు. సందర్భానుసారంగా జమిడిక, సుతి, తిత్తి, హార్మోని ఆపి వచనంలో కథను చెప్తాడు. ఎల్లమ్మ కథ, శక్తి కల్యాణం, రేణుకా యుద్ధం, మలిసెట్ల యుద్ధం, మాంధాత కథ వంటి కథలు ఎక్కువ భాగం వచన రూపంలో చెబుతారు. మంధాంత కథను రెండు రోజులు చెప్పగలరు. శక్తి కల్యాణం రెండు గంటల్లో చెప్పగలికే కథం. కథ వివరంగా చెబుతున్నప్పుడు గేయాల సంఖ్య పెరిగినా వాటి పెంపుకన్నా కథను వివరంగా చెప్పడమే జరుగుతుంది. ఇవి నిస్సారంగా చెప్పుకుంటూ పోయే కథలు కాదు. వివిధ రాగాలను గొంతులో పలికిస్తూ, జమిడిక మీటుతూ అవయవ చలనం చేస్తూ కథలోని సంఘటనలు ప్రేక్షకుల కళ్ళముందు జరుగుతున్నాయా అన్నంతగా కథకుడు కథ చెబుతాడు.
కథ అంటేనే చెప్పబడేది. పల్లెటూళ్ళల్లో జానపదులు ఆనాటి కాలాన్ని ప్రతిబింబింప చేసే కథలు తరచుగా చెప్పుకునేవారు. ఆ కథల్లో జముకుల కథ, గొల్లసుద్దుల కథ, పిచ్చికుంట్ల కథ మొదలైనవి ఇటువంటి కథా రూపాలే. వీటిలో జముకుల కథలు బవనీలు అభినయం చేస్తూ ఊరూరూ తిరుగుతూ లోకమునకు ఆనందం కలిగిస్తూ జీవిస్తున్నారు. బవనీలు గానం చేసే ఈ శక్తి కథలను జమిడిక అనే వాద్య సహకారంతో బెబుతారు. అందుకే వీటిని ‘‘జముకుల కథ’’ అని పిలుస్తారు.
బవనీలు చెప్పే కథలలో అన్ని కథలు కూడా అమ్మవారికి సంబంధించినవే ఉంటాయి. అన్ని కథలలో రేణుకా తల్లి మాహత్మ్యము కనిపిస్తుంది. బవనీలు వీరావేశంతో చెప్పే 1) మాతపురాణం, 2) ఎల్లమ్మ కథ 3) శక్తి కల్యాణం 4) మాంధాత కథ 5) రేణుక యుద్ధం 6) మలిసెట్ల రాయబారం ముఖ్యమైనవి.
వ్యాస రచనలో భాగంగా నేను క్షేత్ర పర్యటన సందర్భంలో పైన చెప్పిన విధంగా బవనీయుల కళాకారులైన శ్రీ ముత్యప్ప, కడ్చర్ల గ్రామం, సేడం తాలూకా, గుల్బర్గ జిల్లా, కర్ణాటక మరియు శ్రీ చంద్రప్ప, కడ్చర్ల గ్రామం, సేడం తాలూకా, గుల్బర్గ జిల్లా, కర్ణాటక లను కలవడం జరిగింది. నేటికీ వారు తమ కళను ఆశ్రియించి జీవిస్తున్నారు.
8. ముగింపు
బవనీలు చెప్పే కథలలో కథకుడు మధ్యలో ఉండి ఉండి కథాగానం చేస్తూ ఉంటే ప్రక్కన వంతలు జమిడికల్ని వాయిస్తూ ఉంటారు. బైండ్లవారు తెలంగాణలో, ఉత్తరాంధ్రలో జముకులవారిగా ప్రాముఖ్యం వహిస్తున్నారు. రేణుక ఎల్లమ్మ, గంగానమ్మ, పోలేరమ్మ, మారెమ్మ, ఎర్ర మారెమ్మ, మహాలమ్మమ్మ, మహంకాళమ్మ మొదలైన దేవతలను కొలుస్తారు. ఆ దేవతల పుట్టు పూర్వోత్తరాలను కథాగానం చేసే పూజారులుగా ఉండేవారు. మాదిగల ఏకైశ కథా కళారూపం బైండ్ల కథ. బోనాల ప్రకాశ్ ‘‘బెండ్ల కథ’’ పుస్తకాన్ని రచించాడు. ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు రేణుకా ఎల్లమ్మ దేవత కథను చెప్పుకునే విధానమే బైండ్ల కథారూపమని అన్నారు. ఆరు రాష్ట్రాల్లో బైండ్ల కళారూపాలు సజీవంగా ఉన్నాయని చెప్పారు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిషా ప్రాంతాలలో కూడా తెలుగు బవనీల సంప్రదాయం కొనసాగుతున్నది. బవనీలు ప్రాథమికంగా పుజారులు. ప్రతి పూజలో వినిపించే లయాన్విత ధ్వనే సంగీతం. బైండ్లవారు మ్రోగించే జమిడికే అస్పృశ్యత, అంటరానితనం కారణాలతో వేరే వారెవ్వరు తాకరు. బైండ్ల ప్రదర్శన సాత్వికం కాదు. అది విరోచితంగా ఉంటుంది.
బైండ్ల కళాకారుల్ని మాంత్రికుల వలే జనం భావిస్తారు. వారికి మంత్ర-తంత్ర విద్య తెలుసుననే అపోహ ఉంది. జోగినిలను చేసే పూజారులు బైండ్లవారే. వీరు శాస్త్రోకంగా జానపద కర్మకాండలను జరిపిస్తారు. ఈ కార్యక్రమాలలో పంబ, జమిడిక మ్రోగుతూనే ఉంటాయి. జోగిని కావడానికి పేదరికం, పితృస్వామ్యం, లైంగిక దోపిడి కారణం. బైండ్లవారే ఈ పద్ధతని నిర్మూలించడానికి ముందుకు రావాలని కోరుతూ శ్రీకాకుళం గిరిజనోద్యమంలో సుబ్బారావు పాణిగ్రాహి గారు జమిడికను చేబూని విప్లవ గీతాలు ఆలపించి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకువచ్చారు. బైండ్ల కథలకు, మరాఠా బవనీల కథలకు కొంత పొంతన కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లలోని లింగంపేట మండలంలో వీరు ఎక్కువగా కనిపిస్తారు.
ఈ తరుణంలో ప్రస్తుతం కళాకారులకు అందవలసిన ప్రోత్సాహం, ఆదరణ లేకపోవటం వల్లను, మారుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల వల్ల వీరందరూ కులవృత్తులను పాటించక పోటీ ప్రపంచంలో తమ పిల్లలను చదివించుకుంటూ వివిధ వృత్తులలో స్థిరపడటం జరుగుతోంది. అందువల్ల జానపద కళలు, కళాకారులు వారు ఉపయోగించే వాద్యపరికరాలు కనుమరుగు అవడానికి కారణం పెరుగుతున్న సాంకేతికతో జానపద వాద్యాల స్థానంలో ఆధునిక వాద్యాలు వచ్చి స్థిరపడటం జరుగుతోంది. కాబట్టి మన జాతి సంపదలైన జానపద కళా వాద్యాలను సంరక్షించాల్సిన అవసరం ఉన్నది.
ఈ అంశం మీద గతంలో నేను ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఆశ్రిత కులాల జానపద కళావాద్యాల సంస్కృతి, సాహిత్యాంశాలు, విశిష్టత అనే అంశంపై పరిశోధనా గ్రంథం సమర్పించడం జరిగింది. ఇందులో ప్రధాన కులాన్ని ఆశ్రయించి ఉండే ఉపకులాలు, వారు వారి వారి ప్రధాన కులాలను ఆశ్రయించే సందర్భంలో వారు ప్రదర్శించే కళారూపాలలో భాగంగా ఉపయోగించే వాద్య పరికరాలను గురించి ప్రస్తావించడం జరిగింది.
9. ఉపయుక్త గ్రంథ సూచి:
- జయధీర్ తిరుమలరావు, మనోజ గూడూరు, మూలధ్వని - జానపద గిరిజన సంగీత వాద్యాల సామాజిక చరిత్ర, హైదరాబాద్.
- జయధీర్ తిరుమలరావు ` ప్రజా కళారూపాల ప్రత్యేక సంచిక, ప్రజాసాహితీ సాహిత్యోద్యమ పత్రిక, 1985.
- పగటి వేష కళాకారులు`సాంస్కృతిక జీవనం, జానపద గిరిజన విజ్ఞాన పీఠం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, వరంగల్లు, 2001.
- యాదయ్య చింతల, జానపద విజ్ఞానంలో బవనీలు ` ఒక పరిశీలన, పరిశోధనా గ్రంథం, 1990.
- రామరాజు బిరుదురాజు, తెలుగు జానపద గేయ సాహిత్యం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ద్వితీయ ముద్రణ, ఆంధ్ర రచయితల సంఘం.
- రాధాకృష్ణమూర్తి మిక్కిలినేని, తెలుగువారి జానపద కళారూపాలు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, ద్వితీయ ముద్రణ 2011.
- రాష్ట్ర స్థాయి జానపద కళోత్సవాలు, ప్రత్యేక సంచిక, జానపద గిరిజన విజ్ఞాన పీఠం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, వరంగల్లు, 2001.
- సునీత నీటూరి. ఆశ్రితకులాల జానపదకళావాద్యాల సంస్కృతి, సాహిత్యాంశాలు, విశిష్టత పరిశోధనాగ్రంథం.
- సుబ్బాచారి పులికొండ, తెలుగులో కులపురాణాలు-ఆశ్రిత వ్యవస్థ, పరిశోధనా గ్రంథం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2000.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "May-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-April-2025
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "MAY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి
బాధ్యత వహించరు.