AUCHITHYAM | Volume-5 | Issue-14 | December 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
1. కడపజిల్లా కథాసాహిత్యం: సాంస్కృతిక ప్రతిఫలనాలు

ఆచార్య డా. కె. శ్రీదేవి
తెలుగు & అనువాద అధ్యయనశాఖ,
ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం.
చిత్తూరుజిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9441404080, Email: kinnerasreedevi65@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 20.11.2024 ఎంపిక (D.O.A): 28.11.2024 ప్రచురణ (D.O.P): 01.12.2024
వ్యాససంగ్రహం:
కడపజిల్లాలోని మూడుతరాల కథకులు సృజించిన కథాసాహిత్యాన్ని సాంస్కృతికాంశాల దృష్ట్యా విశ్లేషించండం ఈ వ్యాసం ముఖ్యోద్దేశం. 20-21 శతాబ్దాలలో వెలువడిన ప్రఖ్యాతకథకుల కథాసంకలనాలు ఈ వ్యాసానికి ప్రాథమిక ఆకరాలు. మారుతున్న కడపజిల్లా సామాజిక సంక్లిష్ట పరిస్థితుల మధ్య కథావస్తువులను ఈ కథకులు కథల్లోకి ఎలా తీసుకొచ్చారు? భౌగోళిక స్థితిగతులను తమ కథల్లో ఎలా చిత్రించారు? కరువు, తాగునీటి సమస్య, సాగునీటి సమస్య, పంటలు పండకపోవడం, పంటగిట్టుబాటు ధర లేకపోవడం, దళారీల దోపిడి మొదలైనవన్నీ కథావస్తువులైన విధాన్ని ఈ వ్యాసం చర్చిస్తుంది. కడపజిల్లా ప్రత్యేక సామాజిక, సాంస్కృతిక లక్షణాలను ఈతరం రచయితలు స్పష్టంగా గుర్తించారని సోదాహరణంగా తెలియజెప్పడం ఈ వ్యాసపరమావధి.
Keywords: మూడుతరాల కథకులు, ప్రాంతీయత, సామాజికస్థితిగతులు, దళిత అస్తిత్వం, కరువు.
1. ఉపక్రమణిక:
విస్తృతమైన తెలుగు కథాసాహిత్యచరిత్రలో సీమకథాసాహిత్యచరిత్రను ప్రాంతీయచరిత్రగా గుర్తిస్తాం. అలాగే కడపజిల్లా కథాసాహిత్యచరిత్ర అందులో అంతర్భాగమే అయినప్పటికి, తన ప్రత్యేక సాంస్కృతికశైలీ సంప్రదాయాలలో కడపజిల్లా కథాసాహిత్యచరిత్ర విలక్షణంగా కనపడుతుంది. తెలుగుకథకు అదనపు గౌరవాన్ని అందించడంలో కడపకథ నిర్వహించిన పాత్ర విశేషమైంది.
బండారు అచ్చమాంబ తొలికథానిక ‘‘స్త్రీవిద్య’’, ‘‘ధనత్రయోదశి’’ (1902) గురజాడ దిద్దుబాటు (1910) వచ్చిన తర్వాత పదహేడేళ్ళకు కడపజిల్లా సాహిత్యచరిత్రలో కథాసాహిత్యప్రక్రియ ఆవిర్భవించిందన్న విషయం ఇటీవలి పరిశోధనలు నిరూపించాయి. జూలై, 1926లో ప్రొద్దుటూరు పట్టణంలోని పైడిమర్రి పిచ్చయ్య శ్రేష్టి సంపాదకత్వంలో వెలువడిన భారత కథానిధి పత్రికలో ప్రచురించబడిరది. కథ పేరు ‘‘మతబేధం’’ రచయిత పెండ్లిమర్రి మండలానికి చెందిన అయ్యలరాజు నరసింహమూర్తి. కానీ ఆ తరువాత అంత ఉదృతిలో ఆ ఒరవడిని కొనసాగించిన ధాఖలాలు మాత్రం లేవు.
2. కడపజిల్లాలో కథ వెనుకబడటానికి గల కారణాలు:
2.1 సాంస్కృతిక అంశాలు:
- కడపజిల్లా నుండి పత్రికలు వస్తున్నా, అవి కథానిక వికాసానికి ఏ మాత్రం దోహదం చేయలేకపోయాయి.
- కడపజిల్లా చుట్టుపక్కల జరుగుతున్న అభివృద్ధి సాంస్కృతిక చైతన్యం, వ్యవహార భాష సామాజిక సాహిత్యోద్యమాల ప్రభావం కడపజిల్లా సాహిత్యకారుల పైన పడలేదు.
- కడపజిల్లా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వ ఉద్యమాల ప్రభావం ప్రజలలో బలమైన భూస్వామ్య పునాది ఉండటం వలన శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించ లేకపోయింది.
- మధ్యయుగాల్లో సామాజిక నిరసన కవులైన వేమన, వీరబ్రహ్మం, సిద్ధయ్యల తత్త్వాల సారం కూడా కడపజిల్లా సాహిత్య సాంస్కృతిక, వైజ్ఞానిక వాతావరణాన్ని వేగవంతం చేయలేక పోయింది.
- రాజస్థానేతర సాహిత్యం కడపజిల్లా సాంసృతిక చిత్రాన్ని స్వతంత్ర భావాల వైపు మల్లించలేక పోయింది. జిల్లావాసుల సాహిత్య సాంస్కృతిక వెనుకబాటు తనానికి ఈ అంశాలతో పాటూ భౌతికాంశాలు కూడా కారణమయ్యాయి.
2.2 భౌతికాంశాలు:
- రెండవ ప్రపంచ యుద్ధకాలంలో వచ్చిన వాణిజ్య వ్యాపారాలు భారీ పరిశ్రమల స్థాపన తప్ప ఆ తర్వాత అభివృద్ది పనులేవీ జరగకపోవడం వలన ఆధునిక జీవితానికి ఆస్కారం కలగకపోవడం
- వ్యవసాయం ప్రకృతి మీద ఆధారపడటం తప్ప ప్రత్యామ్నాయ నీటిపారుదల సౌకర్యాలు కల్పించకపోవడం.
- ప్రభుత్వ, ప్రభుత్వేతరులు నెలకొల్పిన విద్యా సంస్థల సంఖ్య నామమాత్రంగానే ఉండటం.
- పట్టణ నాగరికత అభివృద్దికి అవసరమైన ఆధునిక జీవన సౌకర్యాలు అందుబాటులోకి రాకపోవడం.
- చదువుకున్న వాళ్ళ ఆలోచనలు ఒకవిస్పష్ట రూపాన్ని పొందకపోవడం.
- క్రైస్తవ మిషనరీల సేవలు బడుగు వర్గాలకు ఉద్దేశింపబడినవే అయినప్పటికీ ఆధిపత్యకులాల వాళ్ళకే ఎక్కువ అందుబాటులోకి వచ్చాయి.
- ఒకే సామాజిక వర్గం విద్యా సాహిత్య రాజకీయ రంగాలలో కడపజిల్లా సామాజిక చిత్రపటాన్ని ఇప్పటికీ ప్రభావితం చేయడం గుర్తించదగిన విషయం.
ఏ భాషా సాహిత్యమైనా స్థల, కాలాలకు అతీతంగా ఉండజాలదు. అందువల్ల ప్రాంతీయముద్రను అనివార్యంగా సంతరించుకున్న ఏమంచి సాహిత్యంలోనైనా అది తన స్థానిక ముద్రను లేదా స్థానీయతను శక్తివంతంగా ఆవిష్కరించడం సాహిత్యంలో అత్యంత ప్రాంతీయ వ్యక్తీకరణ రూపం. ఒకే భాషలో రాయబడినా సాహిత్యంలో కూడా స్థానీయత వల్ల కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండటాన్ని స్పష్టంగానే గుర్తించవచ్చు. కడప కథాసాహిత్య స్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. భౌగోళికంగా, ఆర్థికంగా, సాంస్కృతిక పరంగా కూడా అటువంటి స్వతంత్ర ముద్రలను కలిగి ఉన్న కడప సమాజం సాహిత్య వ్యక్తీకరణలో కూడా అటువంటి స్వతంత్ర ముద్రను ప్రదర్శించింది. ఆయాప్రాంతాల రచయితలు ఎంచుకొనే సమస్యలు ఆ సమస్యలను సాహిత్యంలో వ్యక్తీకరించే పద్ధతులు మొదలైన వాటిలో స్పష్టమైన వ్యత్యాసం ఉంది.
3. కథకులు - ప్రాంతీయత:
రావిశాస్త్రి, అట్టాడ లాంటి రచయితలు కోస్తా జిల్లాలలో ఉండరు. అల్లం రాజయ్య లాంటి రచయిత ఉత్తరాంధ్రలో రాలేడు. అలాగే అల్లంరాజయ్య లాంటి రచయిత రాయలసీమలో రానట్లే. కేతు విశ్వనాధ రెడ్డి లాంటి రచయిత తెలంగాణలోనూ, ఉత్తరాంధ్రాలోనూ రాలేడు. ఈ పై రచయితలందరూ తమ రచనల్లో ప్రాంతీయతలను చాలా ఎక్కువ స్థాయిలోనే ప్రతిబింబించారు. అయినప్పటికి ఆ ప్రాంతీయత వీళ్ళందరి రచనల్లో ఒకే రకంగా కాక విభిన్నంగా ఉండటం గమనార్హం. మనమెంత వద్దనుకున్న మనిషికి బహుళ గుర్తింపులలో నుంచి ఉదాహరణకు భౌగోళిక, భాషా ప్రాంతీయ, వర్గ, మత, లింగం లాంటి అంశాలు రూపొందుతాయి. ఈ దృష్టితో చూసినప్పుడు ఒక నిరిష్ట ప్రాంతం నుండి వెలువడే సాహిత్యంలో అనివార్యంగా ఆప్రాంత భాషా సంస్కృతులతో పాటూ ఆప్రాంతపు సామాజిక బృందాల అస్తిత్వం కూడా ఆవిష్కృతమౌతుంది. ఇది ఏస్థాయిలో ఎంత శక్తివంతంగా ఆవిష్కృతమైంది అనే విషయాన్ని బట్టి రచయితల శక్తి సామర్ధ్యాలను అంచనా వేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పునాది మీదే ఇవాల్టి కడపజిల్లా కథా రచయితలను అంచనా వేయాల్సి ఉంటుంది.
4. కడపజిల్లా కథకులు – మూడుతరాలు:
కడపజిల్లా మొదటితరం కథకుల్ని కథకుల వయస్సు ప్రమాణంగా కాక ఆకాలంలో వచ్చిన కథల ప్రచురణ కాలాన్ని ప్రమాణంగా తీసుకోవడం జరిగింది, ఎందుకంటే, మొదటితరంలో ఉదృతంగా రాసిన కథకులు ఆ తరువాత రెండవతరం మూడవతరం వారితో సమానంగా కథాసాహిత్యాన్ని సృజిస్తున్నారు.
అలాగే రెండవతరంలోకి అనగా 1960 నుండి 80 దశకం వరకు కథలు రాస్తూనే ఉన్నారు. వయసురీత్యా మొదటితరం రచయితలతో సమాన వయస్సు ఉన్నా వీరి కథాకాలాన్ని అనుసరించి రెండవతరంగా విభజించుకొంటున్నాను.
మూడవతరం కథకుకులు చాలా స్పష్టంగా అస్తిత్వ ఉద్యమ ప్రభావంతో కథలు రాస్తుండటం వల్ల వీరిని గుర్తించడంలో ఎలాంటి ఇబ్బందీ లేదు. కడప జిల్లా కథాసాహిత్యాన్ని కథకులపరంగా, కథల పరంగా రెండురకాలుగా విభజించి చూడటం వల్ల కథాసాహిత్యం స్వరూప స్వభావాలను అంచనా వేయడానికి లేదా విశ్లేషించడానికి సౌలభ్యంగా ఉంటుంది. ఇది స్థూల విభజనే కానీ సూక్ష్మ విభజన కాదు.
కడపజిల్లా కథకుల్ని మూడుతరాలుగా విభజించుకుంటే, మొదటితరం కథకులుగా భారతం నాదముని రాజు, రాచమల్లు రామచంద్రారెడ్డి, సొదుం జయరాం, కేతు విశ్వనాధరెడ్డి, పి. రామకృష్ణారెడ్డి, వై.సి.వి.రెడ్డి మొదలగువారు చేరతారు. రెండవ తరం కథకులుగా సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, పాలగిరి విశ్వప్రసాద్, దాదాహయత్, కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి, షేక్ హుస్సెన్, యం.వి. రమణరెడ్డి, మల్లెమాల వేణుగోపాల్ రెడ్డి, ఎస్.సి.రామసుబ్బారెడ్డి, మోహ్న (విజయమోహన్ రెడ్డి) మలిశెట్టి జానకీరాం, ఎస్,రామచంద్ర మొదలగువారు చేరతారు. ముడవతరం కథకులు చక్రవేణు, డి.రామచంద్రరాజు శశిశ్రీ, ఎన్.ఎస్,ఖలందర్, బత్తుల ప్రసాద్, నాగలారపు విజయసారథి, వేంపల్లి గంగాధర్, వేంపల్లి షరీఫ్, ఎస్,పి మహమూద్, వేంపల్లి రెడ్డి నాగరాజు, సొదుం రమణారెడ్డి, అక్కం పేట ఇబ్రహీం, తవ్వా ఓబుల్ రెడ్డి, చెరువు అనంత కృష్ణశర్మ షబ్బీర్ మొదలైనవారు చేరతారు.
అయితే ఇటీవలి పరిశోధనలో 1926లోనే కథలు రాసిన విషయం వెల్లడయింది. పంతొమ్మిది వందలా ఇరవయ్యారులో మహబూబ్ మియా సాహెబ్ ‘‘సత్యమాంబ’’, (సెప్టెంబర్, 1926) ‘‘చంద్రశేఖర్’’ (అక్టోబర్,1927), ‘‘మీనాక్షీ’’ (డిసెంబర్,1927), ‘‘పురుషులకు పునర్వివాహం’’ (డిశంబర్, 1928) కథలు రాశారు.
5. కడపజిల్లా కథలు – ఇతివృత్తం, భాష, సాంస్కృతికాంశాలు:
కడప జిల్లా తొలితరం రచయితలు బి.నాదముని రాజు, రా.రా, సొదుం జయరాం, కేతు విశ్వనాథ రెడ్డి, పి.రామకృష్ణా రెడ్డి, వీళ్ళు వస్తువుతో పాటు కథా నిర్మాణంలో కూడా చాలా జాగ్రత్త వహించారు.
భారతం నాదముని రాజు (1956-65) 1956లో ప్రచురించిన ‘‘నీలవేణి’’ కడప జిల్లా కథగా వెలుగులో కొచ్చిన కథ. ఈయన దాదాపు మూడు వందల కథలు రాసినట్లుగా ‘‘కడప కథ’’ సంకలనానికి సంపాదకీయంలో ఎడిటర్ తవ్వా ఓబుల్ రెడ్డి రాసారు. కానీ నీలవేణి కథా సంపుటితో పాటు పన్నెండు కథలు వివిధ పత్రికలలో ప్రచురించబడినవి మాత్రమే ఈ వ్యాసకర్త పిహెచ్.డి. పరిశోధన సమయంలో దొరికాయి. మిగిలిన కథలను భావి పరిశోధకులు సాధించాల్సిఉంది. ఈయన కథలు కడపజిల్లా జీవితంతో ప్రభావితం కాలేదు. ఉద్యోగరీత్యా తిరుపతి, శ్రీకాళహస్తి న్యాయ శాఖలో ఉద్యోగం చేశారు. కనీసం తిరుపతి, కాళహస్తిలో కూడా ఈయన కథలు కనిపించలేదు.
కడపజిల్లా నుండి చాలా అరుదుగా కథలు రాస్తుండటం వలన మాండలిక భాషను ఉపయోగించడానికి సంకోచించి ఉండవచ్చు. అప్పటికే తెలుగు కథాసాహిత్యంలో పెద్దఎత్తున వస్తున్న కోస్తాంధ్ర రచయితల ప్రభావంతో వాళ్ళను అనుకరించడానికే ప్రయత్నించారనిపిస్తుంది. కథావస్తువులలోనూ, కథానిర్మాణంలోనూ, వాళ్ళతో ఏమాత్రం తీసిపోని విథంగానూ, లేదా సమానంగానూ కథా రచన కొనసాగించారనిపిస్తుంది. ఉదాహరణకు ‘‘నీలవేణి’’ అనే కథలో తీసుకున్న ఇతివృత్తం. రచయితలు సామాజిక వాస్తవికతకు దూరమవుతున్న క్రమాన్ని చెప్పారు. అంతే కాదు గురజాడ అప్పారావు ఉపయోగించిన కథ ఎత్తుగడలు ఈకథల్లో కనిపిస్తాయి. ఇంకా గురజాడ కథల్లోని సంకల్పం బి. నాదముని రాజు ‘‘నీలవేణి’’ కథలో కనపడుతుంది. ఇంతకు ముందే చెఫ్ఫుకున్నట్లుగా కథాసంవిధానంలో నవ్యత, సమకాలీనత సమపాళ్ళల్లో సాధించారు. అంతేకాదు కథలోని పాత్రే తన ముందుకొచ్చి, రచయితలు స్త్రీల పాత్రచిత్రణ విషయంలో ముఖ్యంగా ఎంత వెనుకబడిఉన్నారో చెప్పడానికి వాడిన వ్యంగ్యాత్మక సాంకేతికత (satirical technique) అత్యంత ఆధునికమైంది. పాత్రల స్వభావంలోనూ కథాసందర్భం. కానీ, సంభాషణల విషయంలో కానీ నాదముని రాజు కడప జీవితాన్ని సృజించలేదనడానికి ఈ నాలుగు పంక్తుల సంభాషణను గమనించినప్పుడు, సంభోధనల విషయంలో నీలిమ పాత్రకూడా కృష్ణాజిల్లా మాండలికాన్నే ఉపయోగించిన విషయం ఇక్కడ గమనించవచ్చు.
‘‘మాస్టారూ! సున్నితమైన స్వరం మధురంగా వినిపించింది. ఎవరీ అమ్మాయి? ఒంటరిగాణ్ణి ఎందుకు నాగదిలో కొచ్చింది. అందులోను వేళగాని వేళ !
ఏమిటి మాష్టారూ ! అలా చూస్తారు? నేను నీలవేణినండి తన్ను తాను సగర్వంగా పరిచయం చేసుకుంది..
నీలవేణి... వా...? నేను దిమ్మెరపోయి ప్రశ్నించాను.
అవునండీ! నీలవేణినే! క్షణం క్రిందట రైలు కింద పడవేయటమా అని యెవరిని గురించి ఆలోచన చేశారో ఆవిడను నేనే’’ అంటుంది. (నీలవేణి- కడప కథ-2006, పు. 2-3)
సొదుం జయరాం ‘‘వాడినమల్లెలు’’, ‘‘సొదుం జయరాం కథలు’’, ‘‘సింహాద్రి స్వీట్ హోమ్’’ అనే మూడు కథాసంపుటాలను రచించారు. ఈయన కథలు జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. జీవితాలు సమతలంగా, సాఫీగా నడిచే అవకాశం లేదని గుర్తించిన అవగాహన ఈయన కథల్లో వ్యక్తమవుతుంది. అందుకే ‘‘లేదు సుఖం, లేదు రసం, చేదు విషం, జీవఫలం’’ అంటారు. జీవితాన్ని అందంగా, ఆనందంగా హాయిగా ఉందనే రచయిత దృక్ఫథం ఈయన ఎలాంటి జీవితాన్ని సందర్శించగలిగాడో చెప్పాల్సిన పనిలేదు. ఎవరి జీవితంలో సంతోషాలుంటాయి? ఎందుకుంటాయి? ఎలా ఉంటాయి? ఎవరైన సంతోషంగా జీవించగలగడం భౌతికమా? మానసికమా? మానసిక ఆనందం భౌతికాంశాలతో సంబంధం లేకుండా సాధించడం వీలవదు. భౌతిక ఆనందం భౌతిక సౌకర్యాలపైన ఆధారపడి ఉంటుంది. మరి ఆ సౌకర్యాలు ఎవరి శ్రమతో ఎర్పడినవి? ఆ సంతోషాలకు మూలం శ్రమ దోపిడి తప్ప మరోకారణం ఉండదు. ఆ అవగాహనతోనే ప్రతీ కథాంశాన్ని కార్యాకరణ సంబంధాలతో నడిపించడం సొదుం జయరాం వాస్తవికతా శిల్పంలో భాగం. ఉదాహరణకు...
‘‘మనకు ఒకరిపట్ల మనసులో అప్యాయత, అనురాగం ఉండవచ్చు. కానీ దాన్ని వ్యక్తం చెయ్యడానికి కూడా డబ్బులు కావాలి’’ (జయరాం సొదుం, వాడినమల్లెలు కథా సంపుటి) అంటారు సంప్రదాయానికి, తన అభీష్టానికి వ్యతిరేకంగా రెండో పెళ్లి చేసుకుందని, మళ్ళీ పెళ్ళి చేసుకున్న కూతురి మొఖం కూడా చూడనని అన్న తండ్రి డబ్బు కోసమే అమెని ఆశ్రయించాడు. ఆమె మీది అపేక్ష కంటే డబ్బు అవసరం అతన్ని అమె దగ్గరికి నడిపించడంలో రచయితకు మధ్యతరగతి మనుషుల అవసరాలు, ఆపేక్షలకు, అనుబంధాలకు మూలం డబ్బే అన్న వాస్తవాన్ని ప్రతీ కథలో దృశ్యమానం చేస్తాడు. ‘‘పాడె’’ కథలో ఎంత డబ్బైనా ఇచ్చి శవ సంస్కారం జరిపించాలన్న కొడుకుతో ‘‘డబ్బుతో పనులవుతాయా ? ఆచారాన్ని పాటిస్తే అవుతాయి గానీ’’ (జయరాం సొదుం, పాడె. కడపకథ, కథాసంకలనం, 2006) అని వితర్కించిన పిచ్చిరెడ్డితో దళితవాడ ధనియాలు(డేనియల్) వెయ్యి రూపాయలిస్తే, గుంత తీస్తామంటారు అంత వరకు వర్షంలో గుంత తీయలేమని మొరాయించిన దళితులు డబ్బులిస్తే తీస్తామనడం వ్యాపారీకరణ చెందిన మానవసంబంధాలలోని వాస్తవికత. ఈస్థితి కృష్ణా రెడ్డికి, పిచ్చిరెడ్డికి అశ్చర్యంతో నోళ్ళు తెరిచేలా చేస్తుంది. తమ పెద్దరికానికి విలువివ్వకుండా కేవలం డబ్బులిస్తే చేస్తామనడం వాళ్ళ దర్పానికి అభిజాత్యానికి ధనియాలు పెట్టిన చెక్. అందుకే ‘‘పిచ్చిరెడ్డికి మటుకూ, ఏ తత్వమూ వినిపించలేదు. గోవిందలూ వినిపించడం లేదు. ఒక ఆచారానికి ‘‘పాడె’’ లేచినట్లుగా తెగ బాధ పడిపోతున్నాడు’’ అంటాడు! (‘‘పాడె’’ కడప కథ-2006, పు. 187) కథకుడు.
అభ్యుదయ రచయితల సాహిత్య ఉద్యమంలో భాగస్వామి అయిన ఎమ్మనూరి చిన్న వెంకటరెడ్డి, వై.సి.వి. గానే ప్రసిద్దులు ‘‘గట్టిగింజలు’’ కథాసంకలనంలో రైతు కూలీల శ్రమను భూస్వాములు దోపిడి చేస్తున్న క్రమాన్ని వివరించారు. ఈయన రచనలు కడప జిల్లా పడపటి తాలుకాల మాండలిక భాషా సమృద్దిని కూడగట్టుకొన్నవి. ఈ విషయాలే కథకు సహజత్వాన్ని వాస్తవానికి దగ్గరతనాన్ని చేకూర్చింది. ‘‘దిక్కులేని బ్రతుకులు’’ కథలో రాజమ్మను లొంగదీసుకోవడమే కాకుండా వారి ఆస్తిని కూడా కైవసం చేసుకుంటాడు. రాజమ్మ ఆఖరుకు ఊరు వదిలిపోతుంది.
అమాయకుల అసహాయతలను ఆధారంగా చేసుకొని వారి ఆస్తిని దుర్మార్గంతో కాజేసి అందలమెక్కి ఊరేగుతున్న పెద్దరెడ్ల దుర్మార్గ ప్రవర్తనకు ఈకథ ప్రతీక. ‘‘ఇంకానా’’ అనే కథలో నాగిరెడ్డి అనే భూస్వామికి నారిగాడు బాకి పడతాడు. ఈ బాకీ తీర్చేందుకు పనికి పోని నారిగాన్ని నాగిరెడ్డి చితక్కొడతాడు. దీన్ని మౌనంగా భరించేకన్నా వారిపై కేసు పెట్టి శిక్షించవచ్చునని, కాలం మారిందని నాగన్న పాత్ర ద్వారా పాఠకుల చేతనకు బాధ్యత తీసుకున్నాడని చెప్పడానికి అతని మాటల్లోనే గమనించవచ్చు.
‘‘ఆస్తులు న్నోళ్ళు మిడిమేలంగా దర్పం జరుపుకోవాలని చూస్తారు. ఊరు ఊరంతా మనల్ని తప్పు పట్టడం లేదు. లోలోపల వాళ్ళ సాయం ఉంటుంది. పైగా టౌన్లో కూలోళ్ళంటే అభిమానం ఉన్నోళ్ళు చాలా మంది ఉంటారు, న్యాయంగా పని చేద్దాం న్యాయంగా కూలి ఇమ్మందాం కూలికి రాకుంటే కొట్టేందుకు వాళ్ళకు అధికారం లేదు. అలా కూలీలను ఈడ్చుకోని పోయేవాళ్ళు పోవాలని పోరాడేవాళ్ళు కూడా ఉన్నార్రా మన కోసం యొర్రి మొగమా!’’ (చిన్నవెంకటరెడ్డి ఎమ్మనూరి (వై.సి.వి.) ఇంకానా గట్టిగింజలు కథాసంపుటి, 2018.) అని వాళ్ళకు ధైర్యం చెప్తాడు.
ఈ మాటాలలో అన్యాయం జరిగితే అణిగిమణిగి పడి ఉండక మీకోసం పోరాడే రైతుకూలీ సంఘాలున్నాయని అవి కూలీల బాధల నివారణకై పోరాటం చేసి న్యాయం చేకూరుస్తారన్న భరోసానిచ్చి రచయిత ఉద్యమకారుల పక్షంలో నిలబడతాడు. వై.సి.వి సాహిత్య సృజనకారుడే కాదు. వ్యవసాయ రైతు కూలీ సంఘం నాయకుడు కూడా. అందుకే అంత ఖచ్చితంగా తన కథల ద్వారా వాగ్దానం చేస్తున్నాడు.
కోస్తా ఆంధ్రా ప్రాంతానికి, రాయలసీమకు మధ్య సాంస్కృతిక జీవితంలోగల వ్యత్యాసాలను పి.రామకృష్ణారెడ్డి ‘‘మనిషి-పశువు’’ కథ వివరిస్తుంది. అంతేకాదు ఆ వ్యత్యాసాలు ఎర్పడటానికి గల కారణాలను కూడా విశ్లేషిస్తుంది రాయలసీమలో ఇంకా కొనసాగుతున్న ఫ్యూడల్ సంబంధాన్ని ఈ కథకుడు రాయలసీమ ‘‘వెనుకబాటు తనంలోగల ఒకానొక positive అంశంగా గుర్తించడం ద్వారా ప్రాంతీయ నిర్ధిష్టతను రచయిత చాలా శక్తివంతంగా చెప్పారు. మనుషులు పశువులు కలసి ఉండటం వలన ఆరోగ్య సమస్యలొస్తాయని అన్న భానుమూర్తితో శివారెడ్డి అన్న మాటలు.
‘‘మనుషులూ పసులు కల్సి ఉండటమనేది మాఅబ్బబ్బల తరాలనుంచి ఉందిక్కడ, నువ్వు చెప్పినట్లు పసుల్తో ఉంటే రోగాలొచ్చేది నిజమైతే, వాళ్ళెవరూ బతికి ఉండగుడ్దు మల్లా’’ (రామకృష్ణారెడ్డి. పి. మనిషి. పశువు, పి. రామకృష్ణారెడ్డి రచనలు, మానవి పబ్లికేషన్స్, 2015) అనేది శివారెడ్డి వాదం. అతని మొండి వాదంలో, సాంస్కృతిక వ్యత్యాసాలు ఎర్పడటానికి కారణమైన ఆంధ్రాప్రాంత వాసుల స్వార్ధం, కుట్ర పూరిత రాజకీయాలు శివారెడ్డి ప్రత్యక్షంగా చూసినవాడు. అందుకే అతని వాదంలో రాజకీయ చరిత్రను అంత సులువుగా మరిచిపోని తనాన్ని తెలియజేస్తుంది. ఆంధ్రాప్రాంతం నుంచి వచ్చిన భానుమూర్తి ప్రసాద్‌లు చెప్పే అంశాలలో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి కూడా శివారెడ్డికి మనస్కరించడం లేదన్న సంగతి, అతని మొండి తన్నాన్ని తెలియజేస్తుంది. అంతేకాదు పలుమార్లు మీపక్క, మాపక్కా అంటూ మాట్లాడటంలో కూడా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజా జీవితంలో ఉన్న వ్యత్యాసాల్ని గుర్తించిన కోపం, కసి అతని మాటల్లో వ్యక్తమౌతుంది.
కొ.కు ప్రభావంతో రాచమల్లు రామచంధ్రారెడ్డి (రా.రా) సొదుం జయరాం, కేతు విశ్వనాధరెడ్డి మొదలగు కథకులు కథను సూటిగా చెప్పడం వీరి కథా శిల్పంలోని ప్రత్యేకత. శ్రమను పెట్టుబడిగా మార్చి పంటలు పండిరచే రైతులకు డబ్బులు చేతిలో పడితే తప్ప సేద్యం చేయడం సాద్యంగాని పరిస్థితి వచ్చింది. ఈ దశలోనే వాణిజ్య పంటల పట్ల ఆసక్తి పెరుగుతూ వచ్చింది. బీడు నేలలు వేల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చాయి. చిరకాలంగా ఉన్న వ్యవసాయేతర కులాలు వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టాయి. భూమి చేతులు మారింది. ఉత్పత్తి పెరిగింది. కానీ ఉత్పత్తి చేసే రైతు పరిస్థితి రానురాను దయనీయంగా మారటం కడప జిల్లా పరిసర ప్రాంతంలో జరుగుతున్న పరిణామం. దీనికి తోడు కరువు కరాళనృత్యం చేస్తూనే ఉంది. పల్లెల్లో బ్రతకడం కష్టమై పట్టణాలకు వలస వచ్చే రైతు కూలీలు భవన నిర్మాణ కార్మికులుగా మారడం వలన వీరి సంఖ్య పెరిగింది. చిన్నకారు రైతులకు కూడా వర్షాలు రాకపోవడంతో బ్రతుకుదెరువు కష్టమై పోతుంది. మారుతున్న కడపజిల్లా సామాజిక సంక్లిష్ట పరిస్థితుల మధ్య కథావస్తువులను ఈ కథకులు కథల్లోకి తీసుకొచ్చారు. కడప జిల్లా అనుభవిస్తున్న బౌగోళిక స్థితిగతులను తమ కథల్లో చిత్రించడం ప్రారంభించారు. కరువు తాగు నీటి సమస్య సాగునీటి సమస్య, పంటలు పండక పోవడం,పండిన పంటలకు గిట్టు బాటు ధర లేకపోవడం, దళారీల దోపిడి ఇవన్నీ కథా వస్తువులయ్యాయి. కడప జిల్లా ప్రత్యేక సామాజిక, సాంస్కృతిక లక్షణాలను ఈతరం రచయితలు స్పష్టంగా గుర్తించారు.
కేతు విశ్వనాధరెడ్డి ఈ అంశాలను సమ్మేళనం చేసి అధ్బతమైన కథాసాహిత్యాన్ని సృష్టించారు. కథా రచనలో ఆయన తీసుకున్న ప్రాంతం వస్తుపరంగా కడప జీవితం, కడపజిల్లాలోని అత్యంత వెనుకబడిన గ్రామాల నిజ స్థితి అందులోని వ్యక్తుల మధ్యగల సంబంధాలను, ఆ సంబంధాలను నిర్దేశిస్తున్న ఆర్ధిక మూలాలను లోతుగా విశ్లేషించే లక్ష్యంతో కేతు అనేక కథలు రాశారు. గ్రామ సీమల్లోని సగటు రైతు కుటుంబాలలోని ఆత్మిక, ఆర్ధిక, సంక్షోభాలు, ఆ సంక్షోభాల ఫలితంగా ఛిద్రమౌతున్న జీవితాలు వాటి గురించిన వేదన ఆయన కథల్లో ప్రధానంగా చిత్రించడం జరిగింది. ఈ చిత్రించడం అనేది బాహ్య వ్యక్తి దృష్టి నుంచి కాకుండ, తను ఏ జీవితాన్ని తన సాహిత్యంలో ప్రధానంగా చిత్రించడం జరిగిందో అదే జీవితాన్ని ఆయన స్వయంగా చూశారు. అనుభవించారు. అందువల్ల ఆయన కథల్లో చిత్రించిన జీవితం అత్యంత ఆమోదయోగ్యంగా కనిపిస్తుంది. ఎక్కడ emotions కు లోను కాకుండా జీవితాన్ని దాని యదార్ధ స్థితిలో, విశ్లేషణాత్మక దృష్టితో పట్టుకోవడం ఆయన కథలన్నింటిలోనూ కనిపించే సామాన్య లక్షణం.
కేతు విశ్వనాధరెడ్డి కథల్లో చాలా సందర్భాలలో కరువు చిత్రణ, కరువు వాతపడ్ద వారి దారుణ స్థితి కనపడుతుంది. ‘‘నమ్ముకున్న నేల’’ లాంటి కథలు ఈ కరువును చాలా సమగ్రంగా చిత్రించాయి. పల్లెటూళ్ళలో పొలాలను తెగనమ్మి ఏదోరకంగా తమ అస్తిత్వాన్ని నిలుపుకోవాలనే బలమైన కోరికతో నగరాలకు చేరటం, అక్కడ జీవితం మరింత దుర్భరమౌతున్న సన్నివేశాలు. అలాగే పట్టణాలలో స్థిరపడి అక్కడ మనుగడ సాధించేందుకు పట్నం చేరినవాళ్ళు అక్కడ కూడా మరిన్ని సంక్షోభాల్లో కూరుకు పోతున్నారు. తమ సంతానానికి ఒకదారి చూపించేందుకు ఆర్ధికంగా తమ శక్తి చాలాక మళ్ళీ పల్లేటూళ్ళల్లో మిగిలి ఉన్న పొలంపైనే ఆధారాపడుతున్నారు. ‘‘నమ్ముకున్న నేల’’ కథలో కౌలు చేస్తున్న వీరరెడ్డి తన పొలానికి అడ్వాన్సు తీసుకున్నందున పొలం అమ్మడానికి ఒప్పుకోడని అయినకాడికి ఎదో కొంత తగ్గించి అతనికే అమ్మాలనుకుంటాడు. ఆయన పొలం అమ్ముతానన్నప్పుడు వీరారెడ్డి నుంచి ఎలాంటి వ్యతిరేకత కనిపించదు. పైగా ‘‘నేను నీ భూమి చేసుకుంటే, సుబ్బరాయుడి బాకి, బ్యాంకు బాకి, నీబాకీ, నేనెట్లా తీర్చాలని’’ (విశ్వనాథరెడ్డి కేతు ‘నమ్ముకున్న నేల’ - కేతు విశ్వనాథరెడ్డి కథలు - విశాలాంధ్ర పబ్లికేషన్స్, హైదరాబాద్ - 2009) అడిగిన ప్రశ్నకు నిరుత్తరుడవుతాడు. వందేళ్ళ కాలంలో తాను పల్లె విడిచిన తరువాత, పల్లెలో తనకు కనిపించని దృశ్యాలు ఒక్కొక్కటిగా రచయిత వర్ణిస్తాడు. అంటే, తన అస్తిత్వానికి ఊతమవుతుందనుకున్న పొలం నిరుపయోగమై కౌలు తీసుకున్న వ్యక్తి కూడా భూమి నిరాకరించాల్సిన స్థితి. భూమి ఉపయోగితా విలువలలో వచ్చిన పరిణామం. భూమి నిరుపయోగమైన పరిణామంలో ఇద్దరు వ్యక్తుల జీవితాల్లో నెలకొన్న నిస్సహాయ స్థితిని ఈ స్థితిని ఆధారంగా చేసుకొని, పైకెదగడానికి స్థిరంగా ఉండే మరొక వ్యాపారి అనైతిక స్వభావాన్ని ఈకథ ఆలోచనాత్మకంగా సంకేతిస్తుంది. అంతకంటె ఎక్కువగా వ్యవసాయ యోగ్యమైన భూములు బీడు భూములై క్రమంగా అవి ఫ్యాక్టరీల నిర్మాణం కోసం తప్ప పనికిరాని భూములుగా ఉన్నాయి. వ్యాపారస్తుల చేతికిపోయి కొత్తవిలువను అంటే ఉపయోగితావిలువ (use value) నుండి వ్యాపారవిలువ (commercial use) ను సంతరించుకుంటున్న నేపధ్యంలో మానవ సంబంధాలలో వస్తున్న మార్పుల్ని రికార్డు చేయగలిగారు. ఒకే ఒక వాక్యంలో మానవ విలువలలో జరిగిన విధ్వంసాన్ని సిమెంటు ఫ్యాక్టరీ నిర్మాణం వలన వచ్చిన సంకీర్ణ సంక్షుభిత సంస్కృతిని ఈ కథలో చిత్రించారు.
అభివృద్ధి అనేది కేవలం పారిశ్రామికంగా పరివర్తన (transformation) చెందటం అనే ఒక నినాదం వెనుక ఉన్న విషాదాన్ని కూడా ఈకథ బహిర్గతం చేస్తుంది.అదే సందర్భంలో ఆధునికత తెచ్చిన అభివృద్ది రాజకీయాలను (develop-mental politics) కూడా ఈ కథ ప్రశ్నిస్తుంది. ప్రపంచీకరణ వెనుక ఉన్న భీభత్సాన్ని ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత జీవితాలు ధ్వంసమై, అవి పారిశ్రామికంగా, ముందుకు వచ్చిన వర్గాల అభివృద్దికి సోపానమౌతున్న వైనాన్ని కూడా ఈకథ తెలియజేస్తుంది.
చిలమకూరులో ఒకటి రెండు దశాబ్ధాలుగా వచ్చిన మార్పుల క్రమం మొత్తాన్ని చిత్రించారు. ఉదాహరణకు ‘‘జీవుల మొగం, కార్ల మొగం, పెద్దగా చూడని చిలమకూరు రోడ్డు మీద ఇప్పుడు జీపులు, కార్లు అదే పనిగా అటూ ఇటూ తిరుగుతున్నాయి. ఫ్యాక్టరీ కట్టే చోటుకు రాళ్ళు తీసుకుపోతూ గతుకుల రోడ్డు మీద లారీలు, లారీల్లో ఆ రాళ్ళలాగా ఆడ, మగ ...’’ (విశ్వనాథరెడ్డి కేతు ‘మార్పు’, కేతు విశ్వనాథరెడ్డి కథలు, విశాలాంధ్ర పబ్లికేషన్స్, హైదరాబాద్, 2009) ‘‘రోడ్డు పక్క కొత్త అంగళ్ళలో . చార్మీనారు, సిజర్ తప్ప నిన్న మొన్నటి దాక మరే రకం సిగరెట్లు దొరకేవి కావు. కాని అంగళ్ళలో రెడ్ హిల్స్ దాక రకాలు కనబడుతున్నాయి, బ్రాందీ షాపులే ఇంకా వచ్చినట్లు లేదు...ఇన్నేళ్లు వ్యవసాయం, వాన మీద ఆధారపడిన వాణిజ్య పంటలు, రాళ్ళ గనుల వ్యాపారంలో లేని కొత్త మార్పులు ఇప్పుడు కనబడుతున్నాయి’’ (విశ్వనాథరెడ్డి కేతు ‘మార్పు’ - కేతు విశ్వనాథరెడ్డి కథలు - విశాలాంధ్ర పబ్లికేషన్స్, హైదరాబాద్, 2009)
‘‘కేతు విశ్వనాథ రెడ్డి కడపజిల్లా చిలమకూరులో వచ్చిన మార్పుల్ని కేవలం ఒక మేధావి దృష్టి నుంచి మాత్రమే కాక, ఒక మామూలు వ్యక్తి తన నమ్మకాన్ని, అప్పటి దాక జీవించిన కనీసం సానుకూలంగా భావించిన విలువలు, స్థితిగతులు కళ్ళముందే ధ్వంసమవుతున్నప్పుడు వాటివల్ల ఒకానొక nostalgic దృష్టితో స్పందించి, ఆస్పందననే కథగా మలిచారు. ఈ విషయాన్ని సెంటిమెంట్ అన్నా నష్టంలేదు తన చిన్న తనంలో ఆఊరి అరుగు మీద మామూలుగా కనబడే ఊరి సంఘ జీవితం ధ్వంసమైంది. జనం సమూహంగా కూర్చోని కథలు చెప్పుకున్న చోట మట్కా, జూదం ఆడే స్థితి దాపురించింది. అంటే, సామాజిక జీవితం (communitarian life) అలాగే రెండు దశాబ్ధాల క్రితం స్వయంసమృద్ధిగా ఉన్న (selfsufficient) ఒక ఊరి ఆర్ధిక వ్యవస్థతో పాటూ విలువల వ్యవస్థ కూడా పతనమయిన క్రమాన్ని రచయిత చిత్రించారు. ఈక్రమం వ్యాపారీకరణ మానవసంబంధాల క్రమంగా ఉండటం మరింత విషాదం. అలాగే వ్యవసాయ భూముల్లో పనులు చేసుకుంటున్న కూలీలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న చిన్న రైతులు క్రమంగా సిమెంటు ఫ్యాక్టరీ కూలీలుగా మారిన తీరును ఆక్రమంలో ధ్వంసమైన మానవ సంబంధాలలో తెచ్చిన మార్పులు, ఆ మార్పులు సృష్టించే విలువల పతనం అన్నీ కూడా ఈ కథకుడి దృష్టి నుంచి తప్పుకోలేకపోయాయి.
గత వందేళ్ళ నుంచి కడపజిల్లా భౌతికజీవితంలో వచ్చిన మార్పులు రాయలసీమేతరులకు అనూహ్యమైనవి. పులివెందుల, కోడూరు, రాజంపేట, చుట్టుపక్కల గ్రామాల నుండి పశువులను లారీలలో బెంగుళూరు కబేళాకు తోలుతున్న పరిస్థితి కోడూరు నుండి కువైట్ దేశానికి తరలివెళ్ళే ఆడవాళ్ళ అధమాధమ స్థితిగతుల గురించి చెప్పిన ‘‘కసాయి కరువు’’, ‘‘కువేట్ సావిత్రమ్మ’’ కథలను తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి సారిగా స్పృశించిన అపూర్వ కథకుడు చక్రవేణు. గ్రామీణ జన జీవితంలో పశువులు అంతర్భాగం. అందులోనూ వ్యవసాయ దారునికి పశువులతో ఉన్న అనుబంధం, మంచి నీళ్ళు లేక బావులు, చెఱువులు, వంకలు, అన్నీ ఎండిపోయినాయి. ఎప్పుడెప్పుడు పెద్దరెడ్డి మోటరేస్తాడా! అని ఎదురు చూడ్డంలోనే ఆ పల్లెవాసుల బతుకులు తెల్లవారిపోతుంటాయి. మనుషులు తాగడానికే నీళ్ళు లేక అవస్థలు పడుతుంటే పశువులకు మాత్రం ఎక్కణ్ణుంచి తెచ్చి నీళ్ళు పడతారు? వర్షాలు లేక బీటలుపడిన నేలలో పచ్చగడ్డి కాదుకదా పిచ్చి మొక్కలు కూడా మొలవడం లేదు. ఇలాంటి పరిస్థితులలో బళ్ళారి నుండి గొడ్ల వ్యాపారస్తులు కొంత మంది కడప జిల్లాలోని రాజం పేట, కోడూరు, పక్క పల్లెల్లో పశువుల్ని కొని బెంగళూరులో కసాయివాళ్ళకు అమ్ముతున్నారు. అట్లావచ్చిన పశువుల వ్యాపారస్తులకు తమ గొడ్లను అయినకాడికి అమ్మేస్తున్నారు. ఎంతో ప్రేమతో తమ బిడ్డల్లా పెంచిన పశువులు తమ కళ్ళ ముందే మేత లేక, తాగేందుకు నీళ్ళు లేక ‘‘అంబా’’ అంటూ అలమటిస్తూ అరిచే అరుపుల్ని,కళ్ళు బయటకొచ్చేట్టుగా విప్పార్చి చూసే ఆకలి చూపుల్ని చూస్తూ భరించడం కన్నా వాటిని కసాయివాళ్ళకు అమ్మటమే వాళ్ళకు ఉచితంగా తోచింది. వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో తమ బిడ్డలకు నాలుగు రోజులన్నా గంజి కాసి పోయచ్చనే ఆశ ఒక వైపు, అయ్యో పశువులమ్మి బిడ్డల్ని బ్రతికించుకొనే రోజులొచ్చనే! అని మరో వైపు అక్రోశించే మనసును రాయి చేసుకొని పశువుల్ని కబేళాలకు తోలే దృశ్యం ఎంత బీభత్సంగా ఉంటుందో ‘‘కసాయి కరువు’’ కథలో చక్రవేణు చిత్రిక పట్టినాడు. .తన అక్క భర్త యనాదయ్యకు కోడూరు దగ్గరలోని మంగం పేట ముగ్గురాళ్ళ గనులలో పని దొరికిందని తెలుస్తుంది. రాళ్ళు కోసుకొని బాగా దెబ్బలు తగిలి పుండ్లవుతున్నా, ‘‘పర్వాలేదు. పని దొరుకుతుందంట’’ (చక్రవేణు, కసాయి కరువు, చక్రవేణు కథలు, విరసం ప్రచురణ, 2005.) అంటుంది రాజమ్మ!
‘‘అట్లైతే మీరు పోయినాక మామనడిగి బాగా పనిదొరికేట్లైతే జాబు రాయండక్క! మేము కూడా మా ఇంటాయనకు చెప్పి అక్కడికే వచ్చేస్తాం. ఆపని చేసి పుణ్యం కట్టుకో అక్కా!... మరిసిపోగాకక్కా! మీతో పాటు మేమూ కూడా ఒక పూట తింటాం’’ (చక్రవేణు, కువైట్ సావిత్రమ్మ, కరువు, చక్రవేణు కథలు, విరసం ప్రచురణ, 2005.) అంటూ మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంది నాగమ్మ. ప్రాణాలుగ్గపట్టుకొని గని కార్మికులు పనులకు పోతున్నారు. అట్లని అపనులకు పోకుండ ఉండలేరు. చస్తూ బ్రతుకుతూ ఊపిరాడని గనుల్లోనే అప్పుడో ఇప్పుడో అంటూ క్షణం క్షణం బ్రతుకు భయంతో ప్రమాదకరమైన పనులకు పోతూనే ఉన్నారు. పని మానేసి పస్తులుండటం కన్నా ప్రాణాంతకమైన పనులైనాసరే చెయ్యడానికి సిద్దమౌతున్నారు. ఏవో ఒక పనులు ప్రాణం తీసేవైనా, పోసేవైనా చెయ్యక తప్పని స్థితిలోని అనివార్యతను ఈకథలో కేతు విశ్వనాధ రెడ్డి కడప జిల్లాల్లోని నాపరాయి గనులు, ముగ్గురాళ్ళ గనుల్లో పని చేసే కార్మికుల జీవితాలలోని దుర్భరతను అక్షరీకరించారు.
పల్లెల్లో కరువు పశువుల్ని కసాయోళ్ళ లారీ ఎక్కించినట్లు ఆడవాళ్ళను కూడా రాజంపేట, కడప రైల్వేస్టేషన్ల నుంచి కువైట్ లాంటి ప్రాంతాలకు తరలిస్తుంది. భారత దేశం నుండి కువైట్ దేశానికి వలస పోయిన వాళ్ళల్లో ఆంధ్రప్రదేశ్ నుండే ఎక్కువ. అందులోనూ కడప జిల్లాదే అగ్రస్థానం ఈస్థానం ఎలా కైవశమయ్యిందో కడప జిల్లాలోని కరువుకే తెలుసు. కసాయి కత్తులకు ఎరగా కొనిపోబడే పశువుల్లాగే ఎంతోమంది సావిత్రమ్మలు, రామలక్షుమ్మలు పెళ్ళి గాని పదిహేడేండ్ల అమ్మాయిల నుంచి నలభై నలభై ఐదేళ్ళ స్త్రీల వరకు ఇంటి పని పేరుతో (domestic work) తమ శరీరాలను ఫణంగా పెట్టి కువైట్ దేశానికి సంపాదన నిమిత్తం నడిచే ఖజానాలుగా యువతులు తరలిపోతున్నారు.
విశాలమైన తెలుగు నేల నుండి అధిక సంఖ్యాకులు కువైట్ దుబాయి ప్రాంతాలకు జీవన భృతి కోసం వలసలు పోతున్నారు. తెలుగు కథా ఖ్యాతిని విశ్వవ్యాప్తి చేయగల కథకులు అనేక మంది కడప జిల్లాలో ఉన్నారు. అయితే ఎవరూ కువేట్ స్త్రీల మనోవేదనల్ని సాహిత్యీకరించలేకపోయారు. చక్రవేణు మొట్ట మొదటాగా ఈ సమస్యను ‘‘కువైట్ సావిత్రమ్మ కథ ద్వారా అంత వరకు అమూర్తంగా ఉన్న కువైట్ తరలివెళ్ళే స్త్రీల మనోగతాలను, వారి రవాణాలో ఎదురయ్యే బ్రోకర్ల దగుల్బాజీ చర్యలను కడప జిల్లా సామాజిక విధ్వంసాన్ని మొట్టమొదటిసారిగా ఈ కథ రచ్చకెక్కించ గలిగింది. కువైట్ వెళ్ళిన వాళ్ళు నాలుగు కాసులు గలగలాడిరచుకుంటూ సొంత గూటికి చేరితే మేము కూడా వాళ్ళలాగ సంపాదించలేక పోయామన్న ఆదుర్దాలో తరతరాలుగా వంశ ప్రతిష్ట,పరువు మర్యాదల పేరుతో పేర్చుకున్న పేకమేడల్ని తమ చేతుల్తో తామే కూలదోసుకున్న విలువల విధ్వాసాన్ని తెలుగు కథా సాహిత్య చరిత్రలో నిలిపింది కడప జిల్లా కథే. ఇంతవరకు రాయలసీమలో ఆధునిక జీవితమే సాంద్రంగా కనిపించదు. అందుకు కారణం విరివిగా నెలకొనాల్సిన భారీ పరిశ్రమల స్ధాపన ఇంతవరకు జరగనేలేదు. అందుకే ఆధునిక జీవితానికే అవకాశంలేనిచోట అత్యాధునిక విలువల ఆవిర్భావానికి అవకాశం తక్కువ. వాటిద్వారా సంక్రమించే వ్యాపారీకరణ విలువల విధ్వంసాన్ని సృజించడంలో చక్రవేణు ‘‘కువైట్ సావిత్రమ్మ’’ కథ సమాధానంగా నిలుస్తుంది.
కరువు వలన మానవ సంబంధాలలో వచ్చిన మార్పును ‘‘కువైట్ సావిత్రమ్మ’’ కథ అత్యంత సమర్ధవంతంగా ప్రతిబింబించింది. సావిత్రమ్మ భర్త రాజయ్య చనిపోయిన తరువాత సావిత్రమ్మ కుటుంబానికి ఎవరి ఆదరణ లేక దిక్కులేనిదౌతుంది. భర్త చనిపోయి నెలతిరగక ముందే మరిది ఆమెను బెదిరించి బలవంతంగా లొంగదీసు కుంటాడు. బిడ్డల్ని పస్తు పెట్టలేక, ఇళ్ళు గడవని స్థితిలో, పోషించేందుకు మరో మార్గంలేక తన శరీరాన్నే ఫణంగా పెడుతుంది. దానితో ఆమె మరిది ఊర్లో ఎవరెవరితోనో వ్యభిచారం చేసింది. ఎన్నిసార్లో కొట్టినాం తిట్టినాం. అయినామానుకోలా. నలుగుర్లో మాపరువు తీసింది. ఇప్పుడు అక్కడెక్కడ నుండో కువైట్‌కు పోయి ఒకనాకొడుకు వచ్చిఉన్నాడు. ఈళ్ళమ్మగారి ఊరంట, రహమాన్ అంట ఆడితో కులుకుతా ఉండిరది. మావంశాన్ని నాశనం చేయడానికే ఇది మా ఇంటి కొచ్చిందంటూ ‘‘పరువు ప్రతిష్టల పేరుతో ఆమెపై అభియోగం మోపి ఊరినుండి వెళ్ళగొడతాడు.
సావిత్రమ్మను రహమాన్ తో ఉంటే, ‘‘ఇద్దర్నీ గుడిసెలో పెట్టి నిప్పంటిస్తానన్న’’ మరిది చిన్నబ్బ, వదిన కువైట్ లో సంపాదించుకొచ్చిన తరువాత ‘‘రహమాన్ అన్న’’ ను కువైట్ తీసుకుపోమని అడిగానని అంటాడు. ‘‘అయిపుట్టినోడు’’ కాస్త ‘‘రహమాన్ అన్న’’ గా మారిన వైనం అంతా డబ్బుమాయే! అంతేకాదు కువైట్ పోవడమంటే మానాన్ని అమ్ముకోవటమేనని సావిత్రమ్మ చెప్పినప్పుడు తన భర్తకు ఆ సంగతులన్నీ తెలుసని, తెలిసే తనను పంపుతున్నాడంటుంది రామలక్ష్మమ్మ. చిన్నబ్బె కాదు పరదాల మాటున బతుకుతున్న పదిహేడేండ్ల పెండ్లి కాని ముస్లిం యువతులను కూడ వాళ్ళ తల్లితండ్రులే డబ్బు సంపాదన కోసం కువైట్ పంపుతున్నారు. ఇలా గ్రామం మొత్తం కువైట్ రొచ్చుగుంటలోకి వెళుతోందని తెలిసినా విధి లేక, నిలువున కూరుకుపోవడానికి స్వతహాగానే సిద్దపడుతున్నారు. ఒకప్పుడు ఊరి నుంచి వెలివేయబడిన, సావిత్రమ్మ కువైట్ నుంచి తిరిగొచ్చిన తరువాత అసాధారణమైన ఆదరణకు పాత్రురాలైంది. ‘‘దండిగా డబ్బులొచ్చేట్లుగా వుంటే పెండ్లాలను కూడా అమ్మేంతగా, దిగజారిన భయంకరమైన విలువల విధ్వంసం’’ (చక్రవేణు, కువైట్ సావిత్రమ్మ, కరువు, చక్రవేణు కథలు, విరసం ప్రచురణ, 2005.) కడప జిల్లాలోని రాజంపేట, కోడూరు, కడప రైల్వేష్టేషన్లలో కనపడుతుంది.
సామాజికనిర్మితిలో మిగిలిన తెలుగు సమాజానికి, కడప ప్రాంతానికి పెద్దగ వ్యత్యాసం లేకపోయినప్పటికి సహజ వనరుల కొరత, ఆర్ధిక లేమి వలన కలిగిన వెనుకబాటుతనం అన్నది కడప జిల్లా అస్థిత్వాన్ని శతాబ్ధాలుగా వెన్నంటి ఉంటూ వస్తున్న సమస్య. ఈ ఆర్ధిక వెనుకబాటు తనం చాలా వరకు కడప జిల్లాను సాంస్కృతికంగా ముందుకు పోవడానికి అడ్డంకిగా నిలిచింది. దీనికి తోడు కరువు నిరంతరం ఈ సాంస్కృతిక వెనుకబాటుతనాన్ని వర్తమాన తరాలకు ప్రమోట్ చేసింది.
కడప జిల్లాలో పల్లెల నుంచి పట్టణాలకు, పట్టణాల నుంచి నగరాలకు పనుల కోసం వలస పోయి అక్కడ లైంగిక వృత్తిని కొనసాగించే కంపెనీలలో తేలిన జీవితాలు చాలానే ఉన్నాయ్. ఈక్రమం ఇంకా ముగియలేదు. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇది మరింత విస్తరించి స్త్రీలు డబ్బు సంపాదన కోసం, ఆ డబ్బుద్వారా కుటుంబాలను నిలబెట్టుకోవటం కోసం దుబాయ్ లాంటి దేశాలకు వలస పోయి మారకపు సరుకుగా మారిపోయారు. రాయలసీమ కథకుడు చక్రవేణు రాసిన ‘‘కువైట్ సావిత్రమ్మ’’ లాంటి కథలు ఈ స్థితిని చాలా స్పష్టంగా కథానిక సాహిత్యంలో విశ్లేషించారు. స్త్రీలు సెక్స్ వర్కర్స్ గా మార్చబడిన వైనం కోస్తా ఆంధ్రాలో కూడా జరిగినప్పటికీ, అక్కడ పరిస్థితికి ఇక్కడికి మౌళిక వ్యత్యాసం ఉంది. కడపజిల్లా కరువులోని ఈ క్రమం స్త్రీలు తమ పిల్లల్ని పోషించుకోవడానికి వేరే గత్యంతరం లేక వేశ్యావృత్తిలోకి ప్రవేశిస్తే, ఆంధ్రలో మితిమీరి పోయిన కన్సూమరిజం ప్రభావం ఫలితంగా స్త్రీలు వినిమయ వస్తువుల కోసం వ్యక్తిత్వాలను వదులుకోవడం కేవలం డబ్బు సంపాదన ద్వారా వినిమయ ప్రపంచంలో లభ్యమయ్యే వస్తువుల్ని పొందే లక్ష్యంతో అక్కడ స్త్రీలు వేశ్యావృత్తిలోకి ప్రవేశించడం జరిగింది. ఈక్రమం మొత్తం కాల్పనిక సాహిత్యానికి గొప్ప ముడి సరుకు అయితే ఈ ముడి సరుకును శక్తివంతంగా ఉపయోగించుకున్న రచయితలు తక్కువమందే ఉన్నారు. ఎక్కువ సందర్భాలలో రచయితలు ప్రత్యక్షంగా కనిపించే ఆర్ధిక సమస్యలకు స్పందించి రాయటం, ఆయా సంఘటనల పట్ల ఒక వైఖరి తీసుకోని దాన్ని కథాసాహిత్యంలో ప్రతిఫలింపచేయటం అంత సులభతరమైన అంశమేమి కాదు. అందుకు రచయితలకు లోతైన పరిశీలన, అత్యంత ప్రతిభ అవసరం. ఈ పరిశీలనాశక్తి ప్రతిభ రచయితలకు పుష్కలంగానే ఉందన్న విషయం కడపజిల్లాలోని వర్తమాన కథాసాహిత్యాన్ని పరిశీలిస్తే స్పష్టమవుతుంది.
6. స్త్రీ సమస్యల ప్రస్తావనలు:
కడప జిల్లాలోని స్త్రీల దారుణ స్థితిగతులపైన వచ్చిన కథలలో ఈ సమస్యలను లోతుగానే చర్చించారు ఫ్యాక్షనిజం అనేది కడపజిల్లాలో చాలా దశాబ్దాల నుంచి ఉన్నప్పటికి గత నాలుగైదు దశాబ్దాలలో ఇది మరింత వికృతంగా తన స్వరూపాన్న్ని ప్రదర్శించింది. ప్రాంతీయ అస్థిత్వం ఫ్యాక్షనిజం ఫలితంగా రక్తసిక్తమైంది సమాజంలో కుల బృందాలు, ముఠాలుగా, విచ్చలవిడిగా విజృంభించి పరస్పరం హత్యలు చేసుకోవడం ఆనవాయితీ అయ్యింది. ఈ క్రమంలో కూడా మళ్ళీ నష్టపోతున్నది స్త్రీలే. వితంతువులుగా మారినస్త్రీలు తమ సంసారాన్ని నిలుపుకోవడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికీ నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రత్యక్ష హింసను గురించి చాలావరకు కథలు వెలవడుతున్నప్పటికీ పరోక్షంగా ఆ హింస స్త్రీల జీవితాల్లో తీసుకు వస్తున్న మార్పులు, ఆ మార్పులలో ఉండే హింస గురించి ఎక్కువ కథలు రాలేదు. అరకొరగా వచ్చిన కథలు కూడా శక్తివంతంగా ఉన్నాయని చెప్పడం కష్టం. అంతమాత్రం చేత పూర్తిగా ఆ విషయం గురించి కథలు రాలేదని ఉదాహరణకు సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి రచించిన కథ ‘‘తడి’’. ఫ్యాక్షన్ని అనుభవించిన స్త్రీగా ఆమె మానసిక వేదన ఆ సమయంలో తన పరిధిలో ఈకథకు పరిష్కారం వైపు నడిపించిన కథ ఇది. అలాగే ఫ్యాక్షనిజంలో పాలుపంచుకుంటున్న భర్త ఆరాచకాలను భరిస్తున్న స్త్రీలు తమ సంసారాల్ని నిలబెట్టుకోవటం కోసం, భర్తల ప్రాణాల్ని నిలుపుకోవడం కోసం ఎంత పోరాటం చేయవలసి వస్తుందో శక్తివంతంగా నిరూపించిన కథ ‘‘వీరనారి’’. ఒకే కుటుంబంలోని స్త్రీలు ముగ్గురూ కూడా వితంతువులుగా మారడం అనేది మనం ఆంధ్రప్రాంతంలో చూడలేం. కారణం కడప జిల్లాలోని ఫ్యాక్షనిజం ఫలితం. తగాదాలతో వరుసహత్యలతో అత్త, కోడలు, కూతురు తమ భర్తలను కోల్పోయిన అత్యంత విషాదం మనం పాలగిరి విశ్వప్రసాద్ రచించిన ‘‘చుక్క పొడిచింది’’ కథలో చూడవచ్చు. అలాగే భర్త మరణానికి కారణమైన వారిని చంపినంతవరకు తాను వితంతువుగా మారనని ప్రతిజ్ఞలు చేసేవారు కూడా మనకు కడపజిల్లాలో తప్ప మరెక్కడా కానరారు. ఈ విషయాన్ని కేతు విశ్వనాథరెడ్డి ‘‘కూలిన బురుజు’’ కథలోని లక్ష్మి, ‘‘చుక్కపొడిచింది’’ కథలోని సుజాత మేనత్త అయిన శారదమ్మ పాత్రల ద్వారా ప్రాంతీయ జీవితంలోని ప్రత్యేకతల్ని రాయలసీమ రచయితలు, సాహిత్య సృజన చేశారు. అయితే ఈ సమస్యను చిత్రించిన ఈ ముగ్గురు రచయితలు కేతు విశ్వనాథ రెడ్డి, పాలగిరి విశ్వ ప్రసాద్ రెడ్డి, సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి, వీరందరూ కడప జిల్లా వారు కావడం ఒకే కులానికి చెందిన వారు కావడం కాకతాళీయం కాదు. తమ జీవితంలో తాము చూసిన జీవితాన్ని చిత్రించడంలో వాళ్ళ రచనలోని సార్వజనీన లక్షణానికి, స్థానికతకు ఇవి నిదర్శనాలు.
7. దళిత అస్తిత్వం:
కడప జిల్లా నుండి దళిత అస్థిత్వస్పృహతో వచ్చిన కథలు తక్కువ. ఎందుకంటే, దళిత అస్తిత్వాన్ని సృజించిన రచయితలలో చాలామంది దళితేతరులు రాసిన సానుభూతి రచనలకు తమ అనుభవంలో నుంచి రాసిన కథలకు కొంత తేడా ఉందనిపిస్తుంది. కొంత మినహాయింపు కూడా ఉంది. ఎందుకంటే పి.రామకృష్ణారెడ్డి, లాంటి రచయితల కథలు చూసినప్పుడు అందులోని దళిత స్పృహ చాలా సాంద్రంగానే వ్యక్తమైంది. కడప జిల్లా నుండి విజయసారధి ‘‘చంద్రగ్రహణం’’ కథలను దళిత అస్తిత్వకథను తీసుకోవడం జరిగింది, అలాగే దళిత కులానికి చెందినప్పటికీ దళిత వర్గ స్పర్శతో రచించిన కథలు దళిత సానుభూతి కథలైనప్పటికీ దళిత చైతన్యాన్ని చిత్రించిన కడప కథకులు పి. రామకృష్ణారెడ్డి ‘‘ఎలిగే పెద్దోళ్ళు నలిగే చిన్నోళ్ళు’’ సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ‘‘చనుబాలు’’, ‘‘అంటు’’, ‘‘దాదాహయత్’’, ‘‘ఎల్లువ’’, ‘‘చెప్పుకింద పూలు’’, వై.సి.వి. ఇంటిమాదిగోడు, బత్తుల ప్రసాద్ ‘‘నెత్తురమరకలు’’, ‘‘కూరాక్కు సచ్చేటోన్నా’’ మొదలైనవి.
బత్తుల ప్రసాద్ ‘‘నెత్తురమరకలు’’ కడపజిల్లా దళితుల స్థితిగతులను తెలిపే కథ. దళిత కుటుంబాలలో దారిద్య్రాన్ని చెప్పేక్రమంలో బడికి వెళ్ళే పసిపిల్లలకు కాళ్ళకు చెప్పులు కొనుక్కోడానికి, చినిగిపోయి కుట్టువేయడానికి కూడా పనికిరాని జాకెట్టుతో గడిపే దళిత స్త్రీలు, వారిపిల్లల దయనీయ స్థితిని కళ్ళకు కట్టినట్లు ఇందులో రచయిత వర్ణించారు. వాళ్ళ దారిద్య్రం ఫ్యాక్షన్ రాజకీయాలలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది. బాంబుల తయారికీ, కాపలాగా వెళ్ళినవాళ్ళను శవాలుగా మారుస్తుంది. చదువుకున్న దళితులు కూడా చేసేందుకు పనులులేక కన్నవాళ్ళకు భారంగా బతకలేక తాముకన్న కలలన్ని తమ కళ్ళ ముందే కల్లలుగా మారే దౌర్భాగ్యాన్ని చిత్రించిన కథ ఇది. కన్నతల్లి వయసుడిగి కూడ కూలి చేసి కొడుకును పోషిస్తుంటే, ఆతల్లికి పట్టెడన్నం పెట్టలేని, ఒక్క చీర కొనియ్యలేని యువకుల నిస్సహాయతను చాటి చెప్పే కథ. కడప జిల్లా లోని ఫ్యాక్షన్ గ్రామాల్లోని ప్రజలు ఒకసారి కాకుంటే మరోసారైనా ఆగుంపు రాజకీయాల్లోకి ప్రవేశించకుండా ఉండలేని అనివార్యతను చెప్పే నేపథ్యంలో అబ్బన్న పాత్ర ఇలా అంటుంది. భయంకరమైన భౌగోళిక పరిస్థితులొకవైపు, చదువుకున్న దళితులకు కూడా ఉద్యోగాలు దొరకని దేశ ఆర్ధికపరిస్థితి ఒకవైపు ఎలాంటి దైన్యానికైనా దిగేందుకు సిద్ధపరుస్తున్న తీరును రచయిత ఈకథలో చిత్రించారు. భారతదేశానికి స్వాతంత్య్రమొచ్చిన అరవై సంవత్సరాల తరువాత కూడా దళితుల స్థితిగతుల్లో మార్పు రాని స్థితిని ఈ కథలో బట్టబయలు చేయడం ద్వారా దళిత అస్థిత్వాన్ని నిద్రాణమైన దరిద్య్రం ఎలా మింగేస్తుందో బత్తుల ప్రసాద్ ఈకథలో చెప్పే ప్రయత్నం చేశారు.
నాగులారపు విజయ సారథి ‘‘చంద్రగ్రహణం’’ కథ స్వార్ధపరులైన రాజకీయ నాయకులు తమ కక్ష్యల కోసం దళితుల జీవితాల్ని ఫణంగా పెట్టే కుటిలత్వాన్ని బట్టబయలు చేశారు. ఈ కథ ద్వారా దళితులు తమ అస్తిత్వాన్ని గుర్తింపజేసే ప్రయత్నం చేశారు. నాయకత్వ లక్షణాలున్న నరసింహులు లాంటి వారిని చేరదీయడంలోనూ, పావులుగా మలచుకోవడంలోనూ ముఠానాయకుల సూడో ధర్మాన్ని నిలబెట్టడం కోసం పనిచేస్తున్నారు. దళితులుగా తమ జీవితాలను బాగుచేసుకొనేందుకు మాత్రమే
వీళ్ళు రాజకీయ దళితులుగా తమ జీవితాలను ప్రభావితం చేసే ఉద్యమాల చైతన్యాన్ని గుర్తించిన దళితులలో సక్రమమైన మార్గంలో దళిత ఉద్యమ చైతన్యం అందడం లేదన్న అభిప్రాయాన్ని ఆవేదనతో చంద్ర పాత్ర ద్వారా రచయిత వెలిబుచ్చగలిగారు. ఎలీశా యువకుడు, ధైర్యం, తెలివి తేటలుగల పాత్ర. అందుకే చంద్ర చూపించిన నాగిరెడ్డి అసలు స్వరూపాన్ని గుర్తుపట్టగలిగాడు. అందుకే నరసింహులుతో ఇలా అంటాడు ‘‘మొన్నే గదూ మన నడిపోనికి, రామిరెడ్డికి తగాదా పడితే ప్రత్యర్థయిన రామిరెడ్డి మాట మాటన్నే’’ అని అనడంలో ఆ పాత్ర చైతన్య స్థాయి కూడా పాఠకులకు అర్థమవుతుంది.
దళితవర్గప్రయోజనం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ వర్గం వాళ్ళవైపే నాగిరెడ్డి ఉండటాన్ని కూడా గుర్తుపట్టగలిగినారు. అలాగే ఎన్నికల రాజకీయాలలో నేడు దళిత ఓట్లకు గల ప్రాధాన్యం కూడా ఎక్కువే. వాళ్ళ సేవలను పొందే క్రమంలో ఆధిపత్య కులాలు దళిత వాడలకు రావడం, వాళ్ళతో మాట్లాడ్డం, వాళ్ళతో కలిసి బంతి భోజనాలు చేయడం లాంటి ఎత్తుగడలు చాలానే ఉంటాయి. వాటిని గుర్తుపట్టడంలో మాత్రం వాళ్ళ కుల స్వభావాన్ని, వర్గ స్వభావాన్ని నరసింహులుతోపాటు ఎలీశా కూడా వెనుకబడిన వైనాన్ని అంటే అటు పాతతరాన్ని, ఇటు కొత్త తరాన్ని సైతం బురిడీ కొట్టించిన పెద్దరెడ్ల దుర్మార్గాన్ని, మోసపూరిత రాజకీయ ఎత్తుగడల్ని రచయిత ఈ కథలో చిత్రించారు.
ఏమైనా ఈ కథలో విజయ సారథి కొంతవరకు దళితుల అస్తిత్వ చైతన్యాన్ని అందించే క్రమంలో భాగంగా, దళిత ఉద్యమ భావజాలాన్ని కూడా కడప జిల్లా అగ్ర కులాలు ఏవిధంగా ఉపయోగ పెట్టుకుంటున్నాయో ఈకథలో చిత్రించారు. అయితే చంద్ర అతన్ని హత్య చేస్తాడు. కేశవరెడ్డి కూడా తన పాలేరుపై జరిగిన ఆ హత్య తనకు జరిగినట్లుగానే భావించి తిప్పారెడ్డిపైన కేసుపెడతాడు. నాటకీయత వలన కథా కథనంలో వాస్తవికత కొరవడిరది. చంద్ర మరణంతో నాగిరెడ్డిలో కలిగిన కనువిప్పు సంఘటన పేలవంగా చిత్రించబడిరది.
పి. రామకృష్ణారెడ్డి ‘‘ఎలిగే పెద్దోళ్ళు నలిగే సిన్నోళ్ళు’’కథలో ఒకేకులం వాళ్ళు అయి ఉండి కూడా ఓబిగాన్ని నిట్ట నిలువునా కిరసనాయిలు పోసి తగల బెట్టి సంపినా అంకన్న మాత్రం రెడ్ల పక్కనున్నాడు. ఈ సంఘటన పదే పదే ఆలోచింప చేయటంతోనే అంకన్నలో తమ అణచివేతకు రాజకీయ పునాదులు కూలిపోయే ప్రశ్నలు అంకన్నలో మొదలైనాయి. కులస్పృహ లేని దళితులు అగ్రవర్ణాల వారి కుల స్పృహను, ఐఖ్యతను చూసిన తరువాత తమలో అదే కుల స్పృహ ఎందుకు లేదు? అనే అస్తిత్వ చైతన్య విచికిత్స అంకన్న అంతర్మధనంలో బయటపడుతుంది. దళిత కులాల్లో ఉన్న అనైక్యతకు మూల కారణమైన అగ్రవర్ణ రాజకీయాలను కూడా ఈ కథలో ఎండగట్టడం జరిగింది. అగ్రవర్ణాల వాళ్ళ ఆధిపత్యాలు నిలబెట్టడం కోసం, కాంట్రాక్టర్ల కోసం, వాళ్ళను రాజకీయంగా బలపరచడం కోసం వాళ్ళ ఆస్తుల్ని కాపాడ్డం కోసం తప్ప తమ బ్రతుకులకు అర్ధం లేదన్న వాస్తవాన్ని అంకన్న ఆలోచనల ద్వారా బహిర్గతం చేయడంలో పి. రామకృష్ణారెడ్డి తన పాఠకుల్ని చాలా నేర్పుగా చైతన్య పరచడంలోని నిబద్దత అర్ధమవుతుంది. దళితులు ఆత్మగౌరవ ఉద్యమాలలోకి రావడానికి గల కారణాలను రెండిరటిని ఈకథలో పరోక్షంగా చిత్రించడం జరిగింది.
- మునిగాడు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకోవడం ద్వారా ఎవరి కూలిపనికి పోకపోవడం, ఇల్లు కట్టుకోవడం, పది పదహైదు వేల విలువైన టి.వి. కొనుక్కోవడం, కుర్చిమీద కూర్చోని దర్జాగా టి.వి.చూడటం రంగారెడ్డి, వర్ధన్‌రెడ్డి సహించలేకపోతాడు. పల్లెలోని వాళ్ళందరూ. ముఖ్యంగా అట్టడుగు కులాల వాళ్ళు తమ ఆధీనం లోనే ఉంటూ ఎంతసేపూ వాళ్ళు కూలీలుగానే బ్రతకాలనుకునే పెద్దరెడ్ల దురహంకారానికి వాళ్ళ ఆలోచనా విధానమే తార్కాణం.
- దళితుల భార్యలపై దౌర్జన్యం చేస్తే దాన్ని ప్రశ్నించినందుకు మాదిగోడే బలవ్వడం. అగ్ర కులాల స్త్రీలు ఆట్టడుగు వర్గాల వారితో సంబంధాలు పెట్టుకున్నప్పుడు కూడా మాదిగలే బలవ్వడం. ఎవరు ఎవరితో సంబంధం పెట్టుకున్నా దళిత వర్గమే బలయ్యే అనివార్యతను రచయిత ఈకథలో బట్టబయలు చేశారు. రెండు వైపుల పదునున్న కత్తుల్లాంటి అగ్రవర్ణ ఆధిపత్యాన్ని ఈకథలో చిత్రించి, తన వర్గ దృక్పథంతో ఈ కథను వ్యాఖ్యానించడంలోనే రామకృష్ణారెడ్డి దళిత సహానుభూతి, సంస్కారం వ్యక్తమవుతుంది. ఈ విధంగా దళితులు ఒకరిని మరొకరు బలపరుచు కోకుండ విడివిడిగా బ్రతకడం అనేది ఆధిపత్య వర్గాలకు ఏవిధంగా ఉపకరిస్తుందో ఈకథలో వివరణాత్మకంగా వివరించే ప్రయత్నం చేశాడు.
దాదాహయత్ ‘‘ఎల్లువ’’ కథలో దళిత వర్గాలు అనాదిగా అగ్రవర్ణాల చేతిలో అట్టడుగు వర్గాల వాళ్ళు ఎంతగా నలిగిపోతున్నారో చిత్రించిన కథ. మాల మాదిగలతో పాటు బిసి కులాలు కూడా ఆధిపత్యకులాల అభిజాత్యంలాంటి ఎల్లువలో పడి కొట్టుకు పోతున్నట్టుగా చిత్రించడం ద్వారా అట్టడుగు వర్గాల వారితో బిసి కులాలు కలవాల్సిన అవసరాన్ని పరోక్షంగా చెప్పిన ఈకథ అగ్రవర్ణాలలోని దుర్మార్గమైన ఎత్తుగడలను పట్టిస్తుంది. అయితే సమగ్ర గామీణ వ్యవస్థలో ఆ సంఘర్షణలో ఉండటం అనివార్యం. మిగిలిన కథల కంటే కొంత బిన్నంగా దీనిని పట్టించుకున్నట్లుగా అనిపిస్తుంది. రచయిత కడప జిల్లా ప్రొద్దుటూరు నివాసి కావడం వలన అక్కడ జరిగే ఫ్యాక్షన్ రాజకీయాలు, కుల ఘర్షణలోని ప్రత్యేక వాతావరణాన్ని రచయిత బహిర్గతం చేశారు. దాదాహయత్ కుల వైరుధ్యాలను చిత్రించడంలో చేసిన ముగింపు వాక్యం ‘‘ఈరిగాడు కూడా తన పక్కనే కొట్టుకుపోవడం నారాయణకు స్పష్టంగా గుర్తు’’ (దాదా హయత్, ఎల్లువ, సీమ ఫ్యాక్షన్ కథలు, పెన్నేటి పబ్లికేషన్స్, 2005.) అని రాయడంలోనే దళిత బహుజనులు అగ్ర కులాధిపత్యాన్ని ఎదిరించాల్సిన అవసరతను, ఎల్లువలో కొట్టుకు పోతున్నట్టుగా చిత్రించడంలో దళితవర్గాల్లో పెరగాల్సిన ఐక్యతను సంకేతించడం జరిగింది.. ఏ వెల్లువైతే దళితుల కులాలను ఆపల్లెకు చేర్చిందో రామిరెడ్డి కులాధిక్య అభిజాత్యాపు ‘‘ఎల్లువ’’ మళ్ళీ ఎదురై, వాళ్ళను నిరాశ్రయులుగా మార్చిన వేదన గొల్ల నారాయణ పక్షంలో పాఠకులకు వశమవుతుంది. రామిరెడ్డి మాటలను గమనిస్తే అతడు ఎంత కుట్రదారో రచయిత నిరూపించే ప్రయత్నం చేశారు. దళితులను తమ పరిసర ప్రాంతాలలో భరించేందుకు కూడా అగ్ర వర్ణాలు ఇష్టపడటం లేదన్నది వాస్తవం. రామిరెడ్డి జేజబ్బ కూడా వాళ్ళపై సానుభూతితో ఇంటి స్థలం ఇవ్వలేదు. ఓట్లకోసం మాత్రమే ఆశ్రయం కల్పించారు. ఈరోజు ఆ అధికారానికి దళిత కుటుంబాలు ముప్పుగా మారడంతో వారిని ఆపల్లె నుంచే పంపేయాలనే కుట్రపూరిత ఆలోచనలు చేయడంలోనే అతని అగ్రకుల అభిజాత్యం నగ్నంగా వ్యక్తమవుతుంది. రామిరెడ్డికి నిజంగా గొల్ల నారాయణ మీద ప్రేముందా? కనీసం మానవత్వం ఉంటే రామిరెడ్డి తండ్రికి భూమిరెడ్డికి పన్ను గట్టిన రసీదులు గొల్ల నారాయణకే ఇవ్వచ్చు. లేదా నిజంగా భూమి విలువ పదిహేను వేలు చెల్లించి నారాయణకు న్యాయం చేయవచ్చు. అవి రెండు చేయడంద్వారా గొల్ల నారాయణ మునిగిపోకుండా కాపాడగలడు. కానీ గొల్ల నారాయణను నిలబెట్టడం కోసం రామిరెడ్డి సహాయం చేయడం లేదన్న వాస్తవం నారాయణకు కూడా రామిరెడ్డి నీచ ప్రవృత్తి తెలుసనే విషయం రచయిత ముగింపు వాక్యంలో వ్యక్త మవుతుంది. ఈరిగాడితో పాటూ తను కూడా కొట్టుకుపోవడం అనేది ఆధిపత్య కులాలు వేసే ఎత్తుగడలకు ఎవరైనా ఒక్కటెనన్న వర్గ పక్షపాతాన్ని గుర్తు చేసిన కథగా చెప్పవచ్చు. దళిత కులాలు ఒక్కరుగా లేరు. మెజారిటీ కులాలైన బిసీలు కూడా వారితో అగ్ర కులాధిపత్యానికి వ్యతిరేకంగా వాళ్ళు కూడా తమ సమైఖ్యతను ప్రకటించే అవకాశం ఉందన్న వాస్తవం కూడా దాగిఉంది. వెనుకబడిన కులాలకు మాలమాదిగ కులాలకు చెందిన దళితుల మద్య తగాదాలు రెచ్చగొడుతూ లబ్ధిపొందే అగ్రకులాలవాళ్ళ ఎత్తులు పైకి కనిపించని రీతిలో ఎంత నిగూఢంగా ఉంటాయో ఈకథ ద్వారా వ్యక్తం చేయబడ్డాయి.
సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి కథ ‘‘అంటు’’ దళిత జీవనంలోని అస్పృశ్యతా కోణాన్ని కుల వైరుధ్యాల నేపధ్యంలో చిత్రించిన కథ. దళితుల్లోని మాల మాదిగ కులాల మధ్యగల వైరుధ్యాలను ఆసరాగా చేసుకొని అగ్రవర్ణస్తులు వారిని తమ ఆధిపత్యంలో ఉంచుకొనే కుట్రను తెలియజేస్తుంది. ఆ కుట్రలోని ఆంతర్యాన్ని పసిగట్టగలిన మాల కొండన్న పాత్ర మాదిగలకు పూర్తి కూలి ఇవ్వాలని తీసుకున్న నిర్ణయంతో మాల మాదిగలు ఒక్కటిగా మారాల్సిన చారిత్రక అవసరాన్ని గుర్తు చేసిందనిపిస్తుంది. దళిత అస్తిత్వానికి దూరంగా బ్రతుకుతున్న సాంస్కృతిక పరాయితనాన్ని సూక్ష్మంగా ప్రశ్నించిన కథ. దళితులు తమ మూలాలకు దూరమైపోతున్న క్రమాన్ని ఇంతకు ముందు చాలా మంది కథకులు చెప్పినప్పటికి, ఈకథలో అగ్రకులాల వారితో దళిత నాయకులు లాలూచీపడటం వలన దళితులకు జరుగుతున్న అన్యాయం కూడా రచయిత ఎండగట్టడం విశేషం.
ఈకథలో అగ్రకులాల చేత హీనంగా చూడబడే ఈ రెండు కులాలు ఒకర్నొకరు నీచంగా చూసుకోవడంలోని సాంస్కృతిక కుట్రను దాని వెనుక ఉన్న కుల వ్యవస్థ విద్రోహాన్ని కూడా ఈకథ ఆవిష్కరిస్తుంది.
కడపజిల్లాలో ప్రవేశించిన క్రిష్టియన్ మత సంస్థల ద్వారా జరిగే ప్రచారం ఆహార పదార్ధాలను అందించడంలో వారి సేవలు, విద్యాసంస్థల కృషిని స్టీఫెన్ పాత్ర ద్వార రచయిత ఈకథలో రికార్డు చేయగలిగారు. అయితే హిందూ మతంలో తమను తక్కువగా చూస్తున్నారని క్రిస్టియానిటీలో చేరిన వారిలో కూడా ఈ బేధాభిప్రాయాలు పోలేదన్న వాస్తవాన్ని చిత్రించారు. ‘‘దేవుడి బిడ్డలకు’’ కులం అడ్డుకాదని బోధించే క్రిష్టియన్ మతంలోని హిపోక్రసిని ఈకథ బట్టబయలు చేస్తుంది. అసలు మాదిగలు వెళ్ళే చర్చికి మాలలు, మాలలు వెళ్ళే చర్చికి మాదిగలు వెళ్ళలేనంత తీవ్రమైన స్థాయిలో కులవివక్ష ఉందని చెప్పడం ఈకథలో మరోకోణం. అయితే మత మార్పిడి పొందిన క్రిష్టియన్ రెడ్లు అలాగే క్రిష్టియన్ నాయుళ్ళు మిగిలిన క్రిష్టియన్ అగ్రవర్ణాల గుత్తాధిపత్యం కింద దళిత క్రిష్టియన్లు ఎంతగా నలిగిపోతున్నారో ఈకథలో రచయిత చిత్రించడం వలన మన సమాజం అన్ని అసమానతలకన్నా ముందు కులం అసమానతల్ని రూపుమాపంది మరే వైరుద్యాలు మాసిపోవేమోనన్న అభిప్రాయమే బలమైనదని చెప్పిన అంబెద్కర్ అభిప్రాయం బుజువు చేయబడిరది. అంతే కాదు క్రింది వర్గాలను ఆదరించిన సంస్థల్లో కూడా, వీరి ఆధిపత్యలు చెలాయించాలను కోవడంలో ఎక్కడ సంపద వనరులు ఉంటాయో అక్కడికి విస్తరించగలుగుతున్నారు. మతాంతరీకరణ పొంది లబ్ధి పొందటానికి కూడా వెనుకాడని వీరికి అభిజాత్యాలు అడ్డురాలేదు. వీరి ప్యూడల్ సంస్కృతి వీరికి అడ్డంకిగా మారలేదు అన్న కఠోర సత్యాన్ని ఈ కథ గుర్తు చేస్తుంది.
దళిత కథ పుట్టిన తొలినాళ్ళలో అగ్రకులాల, వెనుకబడినకులాల రచయితలు దళితుల అనుభవాలు రాసినట్లే దళితుల అనుభవాలను తమ అనుభవంలో నుంచి దర్శించే ప్రయత్నం చేశారు అటువంటి వారిలో పి.రామకిష్ణారెడ్డి, సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి, దాదాహయత్, లాంటి రచయితలు దళిత సమస్యల్ని సానుభూతితో అర్ధం చేసుకుంటూ తమ కుల సంస్కారాలకు అతీతంగా కొంత వరకు శక్తివంతంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. కానీ దళితోద్యమం వచ్చిన తరువాత అందులో భాగంగానే దళిత రచయితలు తమ జీవితానుభవాలను చాలా గాఢంగా రచయితలు ఆవిష్కరించారు.
8. వృత్తి అస్తిత్వం:
మానవాళికి అస్తిత్వం అందించిన అత్యున్నత ఫలం నాగరికత. ప్రపంచ వ్యాప్తంగా, జీవావరణం నుంచి శ్రమ, పని విభజనల నుంచి వృత్తి పనిముట్లను పుట్టించినది వృత్తి అస్తిత్వాలే వృత్తి పనిముట్లు గ్రామీణ వ్యవసాయంలో రైతులకు ఉపయోగపడే విధంగా మలచడంలో కమ్మరులుగా పిలవబడే ‘‘కంసాలి’’ కులానికి చెందిన ‘‘కొలిమి’’ వృత్తి పని వాళ్ళు వీళ్ళను అనేక ప్రాంతాలలో అనేక పేర్లతో విశ్వ బ్రాహ్మణులని, ఆచారులని పిలుస్తారు. నాగరికతకు బి.సి. కులాలకు చెందిన వృత్తి పని వాళ్ళకి అవినాభావ సంబంధం ఉంది. సమస్త నాగరికతలకు మూలం వీరి ఉత్పత్తి శ్రమలే. నిర్మాణాలు కట్టడాలు విజ్ఞాన శాస్త్రం పని ముట్లతో తమ అస్తిత్వానికే కాక మానవ నాగరికత అస్తిత్వానికే రూపకల్పన చేసిన విశ్వబ్రాహ్మణులు కమ్మరి కులానికి చెందిన వృత్తి కళాకారులు. అలాంటి వారి జీవితం గ్రామీణ రాజకీయాలలో ఎలా నలిగిపోతున్నారో చిత్రించిన కథలు రాయల సీమ నుంచి వచ్చాయి. కమ్మరుల జీవితంలోని అసంబద్దతను చిత్రించిన కథలలో ముఖ్యమైనది వేంపల్లి గంగాధర్ రచించిన ‘‘నేలదిగని ఊడలు’’.
ఈ కథలో ఇనుప సామాన్లు తయారు చేసే పని, ఎద్దుల నాడాలు దిగగొడుతూ పాత్రలకు తగరం అంటిస్తూ గొడ్డలి, వడ్రంగి పనిముట్లలో రంపం గొడ్డలి కత్తి, కొడవలి ఒకటేమిటి అన్నింటిని తయారు చేస్తారు. తమ వృత్తి అస్తిత్వాన్ని నిలబెట్టుకొనే క్రమంలో తప్పుడు కేసుల్లో ఇరుక్కోవడంతో వాళ్ళజీవితాలు ఎలా చిధ్రమవుతున్నాయో ఈ కథలో చిత్రించడం జరిగింది. గ్రామ ప్రెసిడెంటు ఎలక్షన్లలో ఒక వర్గం వారికి సానుకూలంగా మరో వర్గానికి వ్యతిరేకంగా పని చేసారనే నెపంతో బొజ్జన్నను ఖైదు చేయడంలోని ధైన్యాన్ని ఈకథ వ్యక్తం చేస్తుంది. పనిముట్లు తయారుచేసే కంసాలి ఆయుధాలను తయారు చేస్తున్నాడని ‘‘నేలదిగని ఊడలు’’ చిత్రిస్తే ఇనుప పని ముట్లు తయారు చేసే క్రమంలో ఆయుధాలు తయారు చేస్తున్నారని నిరూపించడం చాలా సులభం అందుకే కుల వృత్తిలోని అరెష్టుల అనివార్యతను గుర్తించే ప్రయత్నం జరిగింది.
చారిత్రకంగా చూసినా కడప జిల్లా ప్రాంతంలో హిందూ ముస్లీంల మధ్య ఘర్షణలు ఎన్నడూ తలెత్తలేదు. హిందువులు ముస్లీంలు సామాజికంగా, సాంస్కృతికంగా ఒకరితో ఒకరు కలిసిపోయిఉన్నారు విజయనరగ సామ్రాజ్యానికి సామంతులుగా కడప కర్నూలు ప్రాంతాలను స్థానికంగా ఉన్న మట్లి రాజుల పరిపాలనాంతరం కడపలో నవాబులు రాజ్యమేలినారు. ఈ నవాబులు నిజాంసంస్థానంలో భాగంగా రాజ్యం ఏలినారు హిందూ స్త్రీలను వివాహం చేసుకోవడం ద్వారా హిందువులతో సంబంధ బాంధవ్యాలను నవాబులు నెలకొల్పడం కూడా ఇందుకు ఒక కారణమనిపిస్తుంది.
9. మైనార్టీ కథలు- కథకులు:
అలాగే సూఫి మతాన్ని ఎక్కువ మంది కడప జిల్లా ముస్లీంలు అవలంబించడం వలన కూడా కడప కర్నూలు ప్రాంతంలో అత్యధికంగా ముస్లీంలు ఉన్నప్పటికి, చెదురు మదురు సంఘటనలు తప్ప ఎలాంటి విషాధ, అవాంఛనీయ సంఘటనలు ఎప్పుడు జరగలేదు. ముస్లీంలు మైనార్టీలుగా వాళ్ళు పొందిన అవమానాలను, వివక్ష, దోపిడిని, హింసలను తమ రచనల్లో చిత్రీకరిస్తున్నారు. దాదాపు పన్నెండు మంది కథకులు కడపజిల్లా నుండి కథాసాహిత్యాన్ని సృజించగలిగారు. వారిలో దాదాహయత్ మసీదు పావురం, శశిశ్రీ ( రహమతుల్లా యస్.బి.) వలీమా, దహేజ్, కంకర్, కథలు, సత్యాగ్ని (షేక్ హుస్సేన్) ‘‘పాచికలు’’, ‘‘యంత్రం’’ వేంపల్లి షరీప్ ‘‘తురకోని సేద్యం’’, ఎన్.యస్.ఖలంధర్ ‘‘పిల్లిమెడగంట’’ యస్.సికిందర్ భాషా ‘‘వివక్ష’’, నూరుల్లా ‘‘గరీబ్ జిందగీ’’ మహమ్మూద్ ‘‘మిష్కిన్’’, ఇనాయతుల్లా ‘‘ఘోస్లా’’, అక్కంపేట ఇబ్రహీం ‘‘ఫతప్’’, ‘‘ఖబూతరా’’ మొదలైన కథల్లో ముస్లీం జీవన వైరుధ్యం లోని భిన్న కోణాల్ని కథకులు ఆవిష్కరించగలిగారు. ముస్లీం జీవితాల్లో ముఖ్యంగా పరుచుకున్న పేదరికం, ఆచారాల పేరుతో జరుగుతున్న అణిచివేతల్ని చిత్రిస్తూనే కడప జిల్లా వాసులుగా ఫ్యాక్షన్ రాజకీయ నాయకుల చేతిలో బొమ్మలుగా మారిన రజాక్ మీయా బతుకు సేద్యాన్ని బలంగా ఆవిష్కరించగలిగాయి.
ముస్లీం కథ ప్రారంభంలోనే ముస్లీం స్త్రీల సమస్యలను చిత్రిస్తూ మొదలైంది. ఆతరువాత న్యూనతా భావం వరకే పరిమితమైన కథలు తరువాత దేశంలో నివశిస్తున్న మైనారిటీల స్థితిగతులను ఆవిష్కరిస్తూ హిందు ఫాసిజంమీద తాము అల్ప సంఖ్యాకులుగా పోరాటం చేయలేకపోయిన తమ నిరసనను వ్యతిరేకతను చిత్రించారు. అయితే తమ మతా చారాల వలన ముస్లీం స్త్రీల జీవితాలలో పరుచుకున్న అభద్రతకు పితృస్వామిక దుర్మార్గ స్వభావానికి కారణమైన మతాన్ని దాని అజ్ఞానాన్నిబట్టబయలు చేస్తూ, ఆ క్రమంలో మతానికి ఆవల ముస్లిం స్త్రీలు తమ జీవితాల్లో పరచుకున్న యాంత్రికతను సత్యాగ్ని ‘‘యంత్రం’’ పాచికలు కథల్లోనూ వ్యక్తీకరించారు. స్త్రీలందరూ ఎదుర్కొంటున్న పురుషాధిపత్య సామాజిక వ్యవస్థతో పాటూ ముస్లిం స్త్రీలు మతాచారాల వలన భర్తల మూఢ విశ్వాసాల వలన అదనపు భారాన్ని మోస్తున్న వైనాన్ని ముస్లిం రచయితలు తమ కథల్లో బలంగానే వ్యక్తీకరించడం జరిగింది. 1989లోనే తొలి ముస్లిం మైనార్టీ కథ కడప జిల్లా నుండి షేక్ హుస్సేన్ (సత్యాగ్ని) కథ ‘‘అగ్ని సరస్సు’’ వెలువడటం కడప జిల్లా ముస్లిం మైనార్టీ అస్థిత్వ చైతన్యానికి నిదర్శనం. ఆ కాలంలో ‘‘పాచికలు’’ పేరుతో వచ్చిన ముస్లిం స్త్రీల కథల సంకలనం తప్ప మరే ముస్లిం రచయితల కథా సంకలనాలు తెలుగు సాహిత్యంలో కనపడకపోవటం యాదృచ్చికం కాదు.
‘‘పాచికలు’’ కథలో ముస్లిం మతాచారం ప్రకారం ఏర్పరచిన ధర్మం ముస్లింల ప్రత్యేక హక్కుల పరిరక్షణలో భాగంగా ఏర్పరచిన నిబంధనల్లో పురుషాధిపత్య భావజాలమే కనపడుతుంది. ఒక్క స్త్రీ నాలుగు నిక్కాలైనా చేసుకోవచ్చునని చెప్పిన ఆచారమే ఆమతాచారాలను మోసుకు తిరిగే సంప్రదాయ వాదులు, షహనాజ్ ను కులట కూతురు అంటూ ఆడిపోసుకోవడంలో ఉన్న ద్వంద్వ నీతిని ఎండగడుతుందీ కథ.
ప్రతీ కథలోనూ ముస్లిం స్త్రీలను అనుమానించి ‘‘తలాఖ్’’ చెప్పిన సంధర్భాలే ఎక్కువ ‘‘తలాఖ్’’, ‘‘బంగారుకత్తి’’ లా మారిందని రచయిత ఉపమించడంలోని ‘‘తలాఖ్’’ కుటుంబ జీవితంలో ఎంతటి కల్లోలాన్ని, హింసను సృష్టిస్తుందో అర్థమవుతుంది. తలాఖ్ తీసుకున్న స్త్రీలు మళ్ళీ నాలుగుపెళ్ళిళ్లైనా తీసుకోవచ్చని చెప్తుంది. అది స్త్రీలకు ఆమోదయోగ్యమైనదా? వాళ్లు కోరి ఏర్పరచుకున్న నిబంధనేనా స్త్రీల జీవికకు ఇవి ఎంత మాత్రం దోహదం చేయగలవన్న విచక్షణ ఏ మతమూ చూపించలేదన్న జ్ఞానాన్ని, ‘‘పాచికలు’’ యంత్రం కథలు అందిస్తాయి.
ఏ తప్పూ చేయని స్త్రీలు తలాఖ్ వలన జీవితం ఛిద్రమై వేశ్యలుగా, దొంగలుగా, భిక్షగత్తెలుగా జీవించే పరిస్థితుల్ని కల్పించిన సంప్రదాయం పట్ల రచయితకు తీవ్రమైన అసంతృప్తి ఉంది. అందుకే ముస్లిం స్త్రీల పక్షాన నిలబడి వాళ్ళ జీవితాల్ని వాళ్ళే సరిదిద్దుకోగలరన్న ప్రగాఢ విశ్వాసాన్ని ‘యంత్రం’ కథలో బహిర్గతం చేయగలిగారు. ముస్లిం స్త్రీలు పిల్లల్ని కనడానికి మగవాడికి సుఖాన్ని పంచిచ్చే ‘‘యంత్రాలు’’ కాదన్న ధ్వనిని ‘‘పాచికలు’’ ‘‘యంత్రం’’ రెండు కథల్లోనూ శక్తివంతంగా వ్యక్తీకరించగలిగారు. ముస్లిం మతాచారాల పట్ల మూఢ విశ్వాసాల పట్ల పురుషులకున్న మూర్ఖత్వాన్ని షేక్ హుస్సేన్ కథలు బట్టబయలు చేస్తున్నాయి. కొన్ని సంధర్భాలలో ముస్లిం మతాచారాలు ఏర్పరచడంలోని సదుద్దేశాన్ని కూడా తన కథల్లో వివరించడానికి ప్రయత్నించారు. (పుట 25 ‘‘పాచికలు’’ ముస్లిం స్త్రీల కథలు షేక్ హుస్సేన్ సత్యాగ్ని ననర్ కితాబ్ ఘర్-జూన్ 1986 డిసెంబర్ 2005) ‘‘ముత్తా’’ మతాచారాన్ని ‘‘మన మతమే ఆచరించవచ్చని’’ చెప్పిందని నమ్మించి ఒప్పించే తల్లుల పేదరికంలోని దైన్యాన్ని ఈ కథ బట్టబయలు చేస్తుంది.
ఆడంబరాల కోసం ముస్లిం మతాచారాలను వక్రీకరించి భాష్యం చెప్పే మత ఛాందసవాదులకు షేక్ హుస్సేన్ (సత్యాగ్ని) కథలు చురకల్లాంటివి. నిస్సహాయులైన ముస్లిం స్త్రీలు ఆత్మహత్యలకు పాల్పడటం ద్వారా వాళ్ళ సమస్యలు సమసి పోవనే సత్యాన్ని ‘‘ముతా’’ కథలోని నానిమా పాత్ర ద్వారా ఆత్మహత్య మహాపాపం! ధైర్యంగా పరిస్థితుల్ని ఎదుర్కొని నిలబడాలే తప్ప ప్రాణ త్యాగం మంచిది కాదని హిత బోధ చేస్తారు. ఇట్లా ముస్లిం మత ఛాందసుల మూఢ విశ్వాసాలను అశాస్త్రీయ సంప్రదాయాలను వ్యతిరేకిస్తూ రాసిన కథలు ‘‘దహేజ్’’ మొదలైనవి. తాము నమ్మిన మతాన్ని తామే సంస్కరించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించిన కారణంగానే ఈ కథకులు మతతత్వాన్ని ఎదిరించడానికి పూనుకున్నారు. తప్ప మతవిద్వేషం ఈ కథల్లో ఎక్కడా కనపడదు. ముస్లిం కథా వస్తువులు న్యూనతాభావం, పరాయీకరణ, అస్థిత్వ చిత్రణ, అభద్రతాభావం, వర్గసంఘర్షణ, మతవాదుల మూర్ఖత్వం మతపరమైన నమ్మకాలలో ఆధునిక దృక్పథం మధ్యతరగతి జీవిత ప్రస్థానంలోని సాంసృతిక నేపథ్యం, స్త్రీల సమస్యలు సంప్రదాయ నిరసన మానవత్వం మొదలైనవి మైనార్టీల జీవిత స్థితిగతుల్ని వారిలో నుండి ఆర్థిక అసమానతల్ని వివక్షతని పరాయీకరణని భాదల్ని, నిరాశని నిస్పృహని వీటన్నింటికీ కారణమైన ముస్లిం మైనార్టీల పట్లగల భావజాలాన్ని అందులో ఉన్న అశాస్త్రీయతని ఇతివృత్తాలుగా గ్రహించి వాటి మూలాలకు గల సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాలు ఈ కథలు ప్రతిఫలిస్తున్నాయి.
దాదాహయత్ ‘‘మసీదు పావురం’’ కూడా మతవిద్వేషాలపై వచ్చిన కథే. కానీ కథా స్థలం హైదరాబాదు చార్మినార్ పరిసరాలలోని మదీనా సెంటర్ పాతబస్తీ జీవితాన్ని తెలిపిన కథ. కానీ ‘‘ఖబూతరా’’ కథలోనూ దాదాహయత్ మసీదు పావురం కథలోనూ ప్రాణాన్ని కోల్పోయింది పావురాలు. ఇక్కడ పావురాల మరణాన్ని రచయిత ముస్లింల మరణంతో సంకేతిస్తున్నారు. పరోక్షంగా హిందువుల మత విద్వేశానికి బలైన ముస్లింల పట్లగల సానుభూతిని వ్యక్తపరుస్తున్నారు. హిందువుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ముస్లింల సమస్యలను కథావస్తువులుగా తీసుకోవడంలోనే ఈ రచయితలలో ముస్లీం అస్తిత్వ సమస్యలను గుర్తించగలిగారు. పావురాలు ముస్లీంల సంస్కృతిలో భాగం. హిందువుల దేవాలయాల్లోనూ, ఎత్త్తైన చర్చి కట్టడాలలోను, పావురాలు నివాసం ఉన్నా కూడా పావురాల నివాసానికి గూడు లాంటివి మసీదు నిర్మాణంలోనే ఏర్పాటు ఉంటుంది. అలా చేయడం వలన కూడా ముస్లింల సాంస్కృతిక చిహ్నంగా చూడటం ఒక కారణమేమో అనిపిస్తుంది. మొత్తానికి పావురంఅనేది ముస్లిం జీవికతోగల విడదీయరాని సంబంధంగా చూడటానికి గల మరో కారణం. చాలా మంది సంప్రదాయ గ్రామీణ ముస్లిం కుటుంబాలలో పావురాల పెంపకం రివాజుగా ఉండటం మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి ఈ ఇద్దరు కథారచయితలు పావురాలను ప్రతీకలుగా తీసుకోవడంలో ఔచిత్యం ఉందనిపిస్తుంది. హిందువులలో ముస్లింలపట్ల తప్పుడు భావాలు పాతుకుపోయి ఉన్నాయి. తమ ప్రమేయం ఏమాత్రం లేకుండ భారతదేశ చరిత్రలో అడుగడుగున వివక్షకు, అభద్రతకు, అవమానానికి గురైనారు. కొన్ని సంఘటనలకు సాధారణ ముస్లిం ప్రజలను బాధ్యులుగా భావిస్తూ అన్యాయంగా వాళ్ళపై ముస్లీం అయితే చాలు ఒక ఐ.యస్.ఐ ఏజంటులాగా వ్యవహరించే అమానుష వైఖరిని ముస్లిం మైనర్టీ సాహిత్యం ప్రశ్నించింది.
నిజజీవితంలో అనుక్షణం ముస్లిం కథకులు ఎక్కడైతే రాజీ పడుతున్నారో, ఏసమస్యలతోనైతే సంఘర్షిస్తున్నారో, దాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆలోచనలోకి తీసుకు రావడం దాని తీవ్రతను చర్చించడం తోచిన పరిష్కారాలను వెతకడం మేధో చింతన గల రచయితలు చేసే పని. వేంపల్లి షరీఫ్ కూడా ఆ వర్గానికి చెందిన రచయితే అనడానికి సాక్ష్యం ఈయన ‘‘తురకోని సేద్యం’’ కథ ఇతర కులాలలోని పేద స్త్రీలకు ఉన్న వెసులు బాటు కూడా ముస్లిం స్త్రీలకు ఇవ్వని ఆచారాలు వాళ్ల ప్రాణాల్ని సైతం బలికొనేటట్లు చేయడంలోని విషాదం బురఖా తప్పని సరిగా ధరించాలన్న నియమం వల్లనే రజాక్ మీయా భార్య ప్రాణాలు పోగొట్టుకుంటుంది. తన్తో పాటు కూలిగా వచ్చిన స్త్రీ తన చేతికి ఆమె ఘోష దుప్పటిని కట్టుకుంటానని అడిగిన ఆమె దుప్పటి తీయడానికి అంగీకరించలేదు .ప్రాణాలు నిలబెట్టుకోవడానికి పనికి రాని మతాచారం ప్రాణాలు పోగొట్టుకోవడానికి మాత్రం ఉపయోగపడిరది అనే వ్యంగ్యం తొంగిచూస్తుంది. దిగజారుతున్న ఆర్ధిక పరిస్థితులలో కుటుంబానికింత తిండి పెట్టాటానికి కూడా ఆస్కారం ఇవ్వని ముస్లిం మతాచారాల పట్ల తీవ్రమైన స్వరంతో కాకపోయినా ఈకథ బురుఖ వలన జరికే నష్టాన్ని చెప్పినట్లైంది.
శశిశ్రీ ‘‘వలీమా’’ కథలో సత్తార్ పెండ్లి చేసుకోని ‘‘వలీమా విందు’’ భోజనానికి ఆహ్వానిస్తాడు. పెళ్ళికొచ్చిన వాళ్ళు చదివించే చదివింపులతో మటన్ షాపు మస్తాన్ అప్పు తీర్చుకోవాలనుకుంటాడు, మస్తాన్ సత్తార్ ను ఎప్పుడు ఖైమాకింద కొట్టేస్తాడో అని ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న పాఠకులకు సత్తార్ వలీమాలో జరిగే అపశ్రుతులను సానుభూతితో అర్ధంచేసుకొని, నేను కూడా మనిషినే అంటూ తన సంస్కారాన్ని ప్రదర్శిస్తాడు. ఎప్పుడో చిన్న వయసులోనే అరబ్ దేశానికి వెళ్ళిన మిత్రుడు సత్తార్ వలీమ ఫంక్షన్ అని తెలుసుకొన్న రెహమాన్, హఠాత్తుగా ఊడి పడటమే కాకుండ దగదగ మెరిసే ఉంగరాన్ని బహుకరించి సత్తార్ వలీమ విందులో ఎదురైన కష్టాన్ని మటుమాయం చేయగలగడంతో మానవత్వమే మళ్ళీ శశిశ్రీ కథాకాన్వాస్‌ను విస్తరిస్తుంది. అనుక్షణం ఊహించని మలుపులతో కథాకథనాన్ని నడిపి ఎత్తుగడలో ఓహెన్రీ కథల్ని తలపింప చేస్తారు.
బాబ్రీ మసీదు విధ్వంసకాండ తరువాతనే తెలుగు సాహిత్యంలో ముస్లిం అస్తిత్వ చైతన్యం కనపడుతుంది. కడపజిల్లాలో అంతకు ముందునుంచి కూడా సామాజిక రాజకీయ ఆర్ధిక రంగాలలో ముస్లీం మైనార్టీల పట్ల మెజాటీ వర్గం చూపిస్తున్న వివక్షతని వేలెత్తి చూపుతూ, చెదురు మదురుగా కథలచ్చాయి. వాటిలో ఈకథలో కనిపించినంత ఘాడత సూటిదన్నాన్ని వ్యక్తీకరించిన కథలు తక్కువ. కానీ ఇప్పుడు వస్తున్న కథల్ల్లో ముస్లిం స్త్రీల ధైన్యాన్ని, దాని చుట్టుకొని ఉన్న సామాజిక చట్రాన్ని బద్దలు కొట్టిన అక్కంపేట ఇబ్రహీం కథ ‘‘ఫతప్‌ా’’. ముస్లింగా పుట్టడమే ఒక తప్పుగా కొసాగుతున్న ధోరణిని నిర్మొహమాటంగా షాహీదా ఈకథలో ప్రశ్నిస్తుంది.
తానొక ముసల్మాన్ అయినందుకు, ఈరోజు తనకు పని దొరక్క పస్తుండవలసి వచ్చింది. అంటే ముస్లీంగా పుట్టడమే తప్పా? తాను పస్తుండటానికి కారణం ఎదుటి వాళ్ళ దుర్మార్గం, వాళ్ళ దోపిడీకి అజా అడ్డు వచ్చినందుకు తను పస్తుండాల్సి వచ్చింది. (పుట 189 ఫతన్ ముస్లీం కథలు అక్కంపేట ఇబ్రహీం ఫతప్ సంపాదకుడు స్కైబాబ ‘‘నసల్’’ కితాబ్ షుర్ ప్రచురణలు-1) అనే అస్తిత్వానికి సంబంధించిన ప్రశ్నలు ఆమెను చుట్టుముడుతున్నాయి.. ‘‘నాబట్టల్లారా ఎంత కుల్లుందిరా మీకాడా. మీకు నష్టం వస్తుందని నమాజ్ చదువుకోవడం మానుకోవాలా’’ మసీదు వీధి ఫాతిమా కూడా నోరు తెరిచింది. మరి మీరు ఎవరికి లాభం వస్తుందని అర్థరాత్రిదాకా ఎవ్వరిని నిద్రపోనివ్వకుండా మైక్ పెట్టి భజనలు చేస్తుండారు’’అని ఇంకో ఆమె ఆమెకు మద్ధతుగా అంటుంది.
‘‘మీకు బయపడి మేము టైం తప్పించి అజా చదవాలా?’’ (షరీఫ్ వేంపల్లి, తురుకోని సేద్యం, జుమ్ము కథా సంపుటి, సూఫీ పబ్లికేషన్స్, హైదరాబాద్, 2011) అని జహనాబి అంటే, మీరు కూడా సుప్రభాతం గిప్రభాతం అని అదేదో క్యాసెట్ తెల్లవారుజామున పెట్టకుండ మొబ్బులో పెట్టుకుంటే ఏమి ‘‘బైరున్నిస్సా ఆవేశంగా ప్రశ్నించింది’’ (పుట 189 షరీఫ్ వేంపల్లి, తురుకోని సేద్యం, జుమ్ము కథా సంపుటి, సూఫీ పబ్లికేషన్స్, హైదరాబాద్, 2011)
ఫాతిమా, జహరాబి బైరున్నిసాల ప్రశ్నలు మనుసులో కెలుకుతుంటే, వాటికన్నా తీవ్రమైన ప్రశ్నలు తన అంతరంగం మీదకు చొచ్చుకొస్తుంటే, ఆలోచిస్తూ ఇల్లు చేరిన షాహీదా, మతం కంటే ముందు ఆమె ఆలోచించాల్సింది పిల్లలకు తిండి గురించన్న వాస్తవ స్థితి అన్న స్ఫురణ షాహిదాదే కాదు అందరిదీ.
మహమ్మూద్ కోల్పోయే శ్రమ విలువను అతని శ్రమకు ఆమె శ్రమ కూడా తోడైతే అదనపు విలువ చేకూరుతుందని షాహిదా గుర్తిస్తుంది. తమ శ్రమను దోపిడీ చేసే దళారీల దుర్మార్గానికి గండి కొట్టే ప్రయత్నంలో భాగంగా ఈకథలో షాహీదా పాత్రను రచయిత చైతన్యవంతంగా తీర్చిదిద్దగలిగాడు.
‘‘అయ్యా హుసేనయ్యా బాగున్నారా అయ్యా? నేను బీబమ్మని. నేనెన్ని సార్లు జాబు రాయించి వేసినా జవాబు రాలేదు. పిల్లోడు బాగున్నాడా అయ్యా సిన్నమ్మకు చెక్కు పంపించా అది చేరిందో లేదో నువ్వన్నా జాబు రాయవా ఇదో నీ కోడలు ఇండియాకు వస్తాఉంటే ఆమెతో ఈ క్యాసెట్ మాట్లాడి పంపిస్తా ఉండానయ్యా అయ్యా ఏమడ్రస్సు ఇచ్చినారో అదే అడ్రసుకు జాబులు రాసినాను. ఇక్కడున్న అందరికి జాబులొస్తున్నాయి. కానీ నాకుమటుకు రావడం లేదు’’ (షరీఫ్ వేంపల్లి, తురుకోని సేద్యం, జుమ్ము కథాసంపుటి, సూఫీ పబ్లికేషన్స్, హైదరాబాద్, 2007).
ఇలా సాగిన ఎన్, యస్ ఖలందర్ కథ ‘‘పిల్లి మెడ గంట’’. ఇందులో విస్తరించిన మొత్తం దీనత్వాన్ని ఈమూడు వాక్యాలు పట్టిస్తాయి. ఇలా కథాసారాంశాన్ని మొత్తం ఒక పేరాలోనే నిక్షిప్తం చేయడంలోనే, ఇది మామూలు శిల్పం కాదు ప్రత్యేకమైనదని తెలుస్తుంది.
‘‘అంగట్లో పని లేకున్నా చేసిన పనినే పది సార్లు చేయించడం ఎంత బాగా చేసినా బాగలేదని చెప్పడం ఇంకోసారి చెయ్ అనడం షాపు యజమాని అలవాటుగా మారిపోయింది. రోజు రోజుకు పని భారం పెరుగుతూ పోవడం చేసిన పనికి ఎదో ఒక వంక పెట్టడం తప్పులెత్తి చూపి అసహ్యించుకోవడం, చీదరించుకోవడం భరించలేకున్నాను’’ (దాదా ఖలందర్ 'పిల్లి మెడలో గంట' వతన్ కథా సంకలనం, మిష్కిన్ ప్రచురణలు, హైదరాబాద్. 2005) అని అనడంలో నిరంతరం హింసకు గురి చేసే యజమానుల వికృత ప్రవర్తనకు ఈవాక్యాలు నిదర్శనం. ముస్లింలు మనదేశంలో వివక్షకు గురవుతున్నారనుకుంటున్నాం. కానీ ముస్లింలు మెజార్టీలుగా ఉన్న అరబ్బు దేశాలలో ముస్లీం వలసలు అనుభవిస్తున్న హింస మినహాయింపు కాదని ‘‘మిష్కిన్’’ కథ నిరూపిస్తుంది. ముస్లిం దేశాలకు వలస వెళ్ళిన వాళ్ళ జీవితాలలోని విషాదాన్ని కులం కంటే వర్గ స్వభావం ఎంత బలమైనదో రచయిత మహమ్మద్ ఈకథలో చిత్రించారు.
10. కరువు-కక్షలు:
కరువుకు, కక్షలకు కూడ అంతర్గత సంబంధాన్ని తెలిపే కథ పాలగిరి విశ్వ ప్రసాద్ ‘‘కరువొచ్చే.... కచ్చెలూ వచ్చె’’ నీటి పారుదల సౌకర్యాలకు తోడు భౌగోళిక పరిస్థితుల అననుకూలతతో రాయలసీమ వ్యవసాయం కుంటు పడిరది. రెండు శతాబ్దాల చరిత్రనే సామాజిక చరిత్రగా కొనసాగించిన పాలకుల అలసత్వాన్ని, ప్రజల మూర్ఖత్వాన్ని ఈ కథలో రచయిత చిత్రించగలిగారు.
‘‘ఈ కచ్చెలు మాసిపోయేదెప్పుడో… అనాదిగా ఈడ కచ్చెలుండయ్ కరువుకు కచ్చెలకు కానరాని సంబంధం వుందేమో ! ఏం పని లేని మనిషి బుర్ర దయ్యాలకు కొంపంటారు అట్లనే మనిషి దురలవాట్ల దిక్కో, రాచ్చసత్వం దిక్కో మల్లుకుంటాడేమో.... కరువుల్తో సేయడానికి ఏం పని లేక అన్నింట్లో ఎనుకబడి, ఆలోసించే ఇంగితం కూడా లేక రాయల సీమ తన అసహనాన్ని అనచుకుండేదెట్లో తెలక కచ్చెల్ దిక్కు మల్లినాడేమో! ఈ కచ్చెలకు తోడు అగ్గిలో నూనే బోసినట్లు ఈ రాజకీయాలొకటి.... థూ’’ (పేజి 46-పాలగిఒరి విశ్వప్రసాద్.... కచ్చెలూ వచ్చె’’. సాహిత్య నేత్రం త్రైమాస పత్రిక ఏప్రెల్-జూన్ 1995సంకలనంలో చుక్కపొడిచింది)
భార్యాబిడ్డల్ని ఇబ్బంది పెట్టైనాసరే, భూములు పాడుబెట్టైనా అమ్మైనాసరే కక్ష్యల్ని కొనసాగించాలనే నిర్ణయాన్ని వయస్సులో చిన్నదైనా పట్నంలో చదివిన శ్రీలత తప్పు పడుతుంది. శ్రీలత వీళ్ళ మాటల్ని విన్న తరువాత వాళ్ళ సమావేశ ఉద్దేశం మారిపోయి, కక్షల్ని ప్రేరేపించడం చూసి ఆవేదనతో ఇలా అంటుంది.
‘‘మా ఆడోళ్ళందరం ఇన్నేళ్ళు నోర్మూస్కుని మీకు తందానతాన అంటాండబట్టి ఇట్లైంది. మీరంతా మీపాటికి మీరు కొట్టుకొని జైల్లంబడిపోతే ఇండ్లకాడ మీపెండ్లాం పిల్లోళ్లు ఏ సావు సచ్చాండారో మీకేమన్నా తడతాందా?... తట్టదు’’ (విశ్వప్రసాద్, కరువొచ్చె కచ్చలూవచ్చె, చక్క పొదిచింది కథాసంకలనం, నేత్రం ప్రచురణలు, కడప, 2006) అంటుంది.
ఈమె మాటల్లోని వాస్తవం వారిని కదిలిస్తుంది. ‘‘ఔన్రా మనం దేనికోసం కొట్టుకుంటాన్నెట్టు?’’ అనే ప్రశ్న వాళ్ళల్లో కలుగుతుంది. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు కడపజిల్లా వాసులను వరుస కరువుల్లోకి నెట్టివేసాయి. నీటిపారుదల సౌకర్యాలు, వర్షభావం రెండిరటికీ తోడుగా పాలెగాళ్ళ సంస్కృతి కూడా రాయలసీమ రాజకీయాలు ఫాక్షన్ రాజకీయాలుగా ప్రబలమవడానికి కారణమయ్యాయి. ప్రజలు ఎంత గొప్పకు పోయినోళ్లు కూడా కరువులతో కూలీలుగా మారుతున్న వైనాన్ని కేతు విశ్వనాథ రెడ్డి ‘‘నమ్ముకున్న నేల, మార్పు’’ కథల్లో కూడా చిత్రించారు.
విశ్వనాథ రెడ్డి పీర్లసావిడి కథలో రాజకీయంగా ఉన్న గ్రామంలో స్థానిక రాజకీయాలతో రెండు వర్గాలుగా విడిపోయినా ప్రెసిడెంట్ అశ్వత్థ రెడ్డి గ్రామ రెడ్డిగా కొనసాగుతున్న వ్యక్తికి అసెంబ్లీ ఎన్నికల్లో చెరోపక్షం నిలబడతారు. కథాకాలంలో అనగా 1980సంవత్సరంలో రాజకీయంగా కడపజిల్లాలో అంత తొందరగా పార్టీలు మారడమనేది అరుదైన విషయమే.
మనసులో కమ్ముకున్న సవాలక్ష సంకోచాలు, వింతభయాల నిర్వేదంలో పల్లె ప్రజలు ఎలాంటి దుర్భరమైన జీవితానికి గురవుతున్నారో ‘‘కూలిన బురుజు కథలో రాయలసీమ గ్రామీణ జీవితంలో ముఠా రాజకీయాలు పోషించే పాత్ర పట్ల గల నిరసనను కథకుని పాత్ర అనుభవంలో నుంచి విశ్లేషిస్తుంది.
డి. రామచంద్ర రాజు ‘‘ఏటి దరిమాను’’ ముఠా నాయకులు దళితుల్ని పావులుగా చేసుకొని నడిపించిన ముఠా కక్షలను అదే దళితులందరూ కలసి ముఠా నాయకుల్ని మట్టుపెట్టడం ద్వారా ఆఊరి ఫ్యాక్షన్ కక్షలను నిర్మూలించినట్లుగా చిత్రించిన కథ. ఎలాగైనా తమవైపు తిప్పుకోవడంగానీ కాదంటే కడతేర్చడం గానీ చేయడానికి కూడా వెనుకాడరు. తమ మాట వినేవారందరిని ఒక గుంపుగా చేసుకొని ఆగుంపుకు తాను నాయకుడుగా చలామణి అవుతుంటాడు. ఆగుంపులో కుటుంబాల పరంగా, వర్గాల పరంగా,కులాల పరంగా, పల్లెల పరంగా వ్యక్తుల పరంగా, ఆధిపత్య రాజకీయాల పరంగా ఏర్పడడం మొదలైంది. ఫలితంగా గుంపు నాయకులే ముఠా నాయకులుగా అయ్యారు.
మట్కా, గాంబ్లింగ్ కల్తీ మద్యం అమ్మకాలు కిరాయి హత్యలు పేలుడు పదార్థాల అమ్మకాలు, ఆస్థులు, భూముల ఆక్రమణ లాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఖనిజ నిక్షేపాలున్న భూములను తామే గుప్పెట్లో ఉంచుకొని విలువైన సంపదను కొల్లగొడుతున్నారు. ప్రజలను భయపెట్టె సామర్థ్యం నేరాలు, ఘోరాలకు పాల్పడే యంత్రాంగం పోలింగ్ బూత్‌ల ఆక్రమణ రిగ్గింగ్, ఓటర్లను బెదిరించడం వంటి పనులు చేస్తూ తమ రాజకీయ ఆధిపత్యాన్ని కాపాడుకుంటున్నారు. అసాంఘిక, చట్టవిరుద్దమైన కార్యక్రమాల ద్వారా సంపాదించిన సొమ్మును తిరిగి ఎన్నికల్లో ఖర్చు చేసి పదవులు పొందుతున్నారు.
పాలగిరి విశ్వప్రసాద్ రచించిన ‘‘చుక్కపొడిచింది’’ కథ స్త్రీ కంఠ స్వరంతో ఫ్యాక్షనిజం సృష్టిస్తున్న విధ్వంసాన్ని హింసను ఎత్తి చూపిన మొట్టమొదటి కథ. ఇది పూర్తిగా స్త్రీ పాత్రల ద్వారానే ప్రధానంగా నడుస్తుంది. మూడురకాలైన స్త్రీ పాత్రలను రచయిత చిత్రించారు.
ఫ్యాక్షన్ గ్రామాల్లోని కుటుంబాలలో పుట్టిన వాళ్ళను కక్షలు ఎలా వాళ్ళ జీవితాలను కదిలిస్తాయో చూపించిన కథ ఇది. ఫ్యాక్షనిజం ఇతివృత్తంలో వచ్చిన కథలు దాదాపు 30 పైన ఉన్నా ఆ కథలన్నింటిలో పురుష పాత్రలే మాట్లాడతాయి. నామమాత్రంగానైనా స్త్రీల మనోభావాలను ఫ్యాక్షన్ పరంగా రికార్డు చేసిన కథలు చాలా అరుదు. అలా స్త్రీ కంఠంతో స్త్రీలు ఫ్యాక్షన్ కు వ్యతిరేకంగా ఉన్నారన్న వాస్తవాన్ని మొట్టమొదటి సారిగా రచించిన రచయిత.
ఫ్యాక్షన్ రాజకీయాలలో జీవిత భాగస్వామిని కోల్పోయిన వాళ్ళ జీవితంలో ఆనందం అన్న పదమే అదృశ్యమై పోతుంది. జీవితంలో తారసపడే చిన్నచిన్న ఆనందాలు సైతం ఉదాహరణకు భోజనం చేస్తున్నా కూడా, దానిని ఆస్వాదించలేని బండరాళ్ళుగా మారిపోతున్న వైనాన్ని, తీపి కూడా చేదుగా పరిణమించిన క్రమం అవగతమవుతుంది. తెలుగు కాల్పనిక సాహిత్యం ఫ్యాక్షన్ నేపథ్యంలో స్త్రీల జీవితంలో పరుచుకున్న హింసను చిత్రించిన కథలను పరిశీలించడం వలన కొంతవరకు ఆ ప్రతిఫలనాలు స్త్రీలనెలా ప్రభావితం చేస్తున్నాయో అవగహన కలుగుతుంది.
కడప జిల్లాలోని పొట్లదుర్తి గ్రామానికి చెందిన పాలగిరి విశ్వప్రాసాద్ ఈ ఇతివృత్తంతో మొట్ట మొదటి రచయిత అయితే ఆతరువాత వచ్చిన కథల్లో అంటే దాదాపు
‘‘చుక్కపొడిచింది’’ కథ వచ్చిన ఇరవై సంవత్సరాలకు కడప జిల్లా నుండి సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి ‘‘తడి, వీరనారి’’ కథలను ఫ్యాక్షన్ నేపధ్యంలో స్త్రీ దృక్కోణం నుండి రచించారు. స్త్రీలు ఫ్యాక్షన్ కక్షలను ఎలా వ్యతిరేకిస్తున్నారో ఫ్యాక్షన్ వలన ఏమి కొల్పోతున్నారో ఎలా కోల్పోతున్నారో స్త్రీల మనస్తత్వాన్ని ముఠా కలహాల పట్ల వాళ్లకు గల వైఖరిని ఈకథలో బలంగా ఆవిష్కరించారు.
ఫ్యాక్షనిజం ఫలితంగా మగవాళ్ళ జీవితంలో జరుగుతున్న హింస గురించి హక్కుల గురించి అనేక కథలు వచ్చాయి. ఫ్యాక్షన్ సమస్య కేవలం మగవాళ్ళకు సంబందించినదే నన్న భావనను కూడా చాలా కథలు కల్పించాయి. నిజానికి ఈ ఫ్యాక్షన్ సమస్య ఆడవాళ్ళ జీవితాలను నిరంతరం అస్తిరత్వానికి లోను చేయడం, వాళ్ళ ఆస్థిత్వాన్ని అతలాకుతలం చేయడమే కాకుండా అసలు వాళ్ళ జీవితాలకు అర్ధం లేకుండా చేస్తుంది. మగవాడికి పరాయిగా మారిన స్త్రీ భర్త జీవించినంత కాలం ఎటువంటి గుర్తింపు లేకుండా భర్తే సర్వస్వంగా జీవిస్తుంది. అతని మరణం తరువాత మరణించిన వ్యక్తి భార్యగా అతన్ని చంపిన వాళ్ళపై కక్ష సాధించే ఉపకరణంగా చూడటం రాయలసీమలో సాధారణంగా భావించే విషయం. దీన్ని తమ కథల్లో వ్యక్తీకరించిన కథకులు కేతు విశ్వనాథ రెడ్డి, విశ్వప్రసాద్.
ఈ స్థితిలో ఆడవాళ్ళు ‘‘ఏం మొగుడో ఏమో! సచ్చింది ఎవరి మొగుడో అర్ధం కాదు... యాడ సస్తరో ఎప్పుడు సస్తరో అర్ధం కాదు బయటికి పోయినోళ్ళు ఇంటి కొచ్చిందాక నమ్మకంలేకుంటే ఏఆడ మనిషి తాళిబొట్టూ ఎప్పుడు పుటుక్కు మంటదో తెల్దు ఈళ్ళ పాటీలు కూలిపోను’’ (వెంకట్రామిరెడ్డి సన్నపురెడ్డి, వీరనారి, కొత్తదుప్పటి సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి కథలు, విశాలాంధ్ర పబ్లికేషన్స్, హైదరాబాద్, 2008.) అని నిందించడం తప్ప ఆడవాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు ఈ నిస్సహాయతను ‘‘వీరనారి’’ ప్రతిబింబిస్తుంది.
ప్రొద్దుటూరు పట్టణంలోని గాంధీ రొడ్డులో జరిగిన యదార్థ సంఘటనను కథగా మలిచి కడప జిల్లా జీవితంలో ఫ్యాక్షన్ సందర్భాన్ని స్త్రీల ఆలోచననుండి ఆవిష్కరించే ప్రయత్నం ‘‘వీరనారి’’ కథలో విజయవంతంగా చేశారు. స్త్రీత్వంతో కూడిన పరిష్కారాలను ‘‘తడి’’ కథ ఆవిష్కరిస్తుంది ఈ కథలో భూమి తగాదాలు అన్న తమ్ముళ్ళ మద్య చెలరేగిన పగలకు, ద్వేషాలకు ఆడవాళ్ళు తమ ఆప్యాయతలు, మమకారాలతో వాటిని ఎలా శాంతింప చేశారో చెప్పిన కథ ఇది.
స్త్రీలకు ఫ్యాక్షన్ విషయాలతో సంబంధం కల్పించనంత వరకే అవి కొనసాగుతాయి అంత వరకు జఠిలంగా బ్రతుకుతూ తాకట్టు పెట్టైనా, అప్పులు చేసైనా, కేసులు నడపాలని మగవాళ్ళ పౌరుషాన్ని ప్రేమతో స్త్రీల ప్రమేయంతో, లజ్జితులను చేసిన వైనం ఈ కథలో కనబడుతుంది.
సన్నపురెడ్డి మరోకథ ‘‘కన్నీటి కత్తి’’ కథ కూడా ఫ్యాక్షనిష్టుల చేతిలో ఒక సాధనంగా మారిన వ్యక్తిలో, ఆ ఫ్యాక్షనిజం ఫలితంగా ఛిద్రమైన కుటుంబంలో మిగిలిన ఒక పాప తెచ్చిన హృదయ పరివర్తనను ఈ కథ చిత్రిస్తుంది. సామాజిక సంబంధాలు అయినప్పుడు మనుషుల మద్య సంబంధాలు అమానుషంగా ఉండటం ఆర్చర్యకరమైన విషయం కాదు అయితే సందర్భం ఎప్పుడూ అలా ఉండిపోదు కొన్ని సందర్భాల్లో మళ్ళీ ఆ మనిషిని చేయవచ్చు. మనిషి నిలుపుకోవాల్సిన మానవీయ స్పర్శను నిలుపు కోవడంలో ఉండే ఔన్నత్యాన్ని కూడా ఈ కథ ప్రతిఫలిస్తుంది.
ముఠాకక్షల దాడుల్లో చాలా అరుదుగా కనిపించే రాక్షసత్వాన్ని దాదాహయత్ తన ‘‘వారసత్వం’’ కథలో రికార్డు చేయగలిగాడు. ఈ కథలో పసిపిల్లలు బుడ్డోడు- లక్ష్మీ స్నేహితులు. ముఠా కక్షల సామాజిక సంస్కృతి ప్రభావంతో శత్రువుల్లాగా మారిపోవడం అనేది పైకి కనిపించే సాదాసీద అంశం కాదు ‘‘మానవ విలువల విధ్వంసం’’ ప్రేమ ఆప్యాయతలను అడుగంటు ఊడ్చేసి, మనుషుల్ని ఖాళీ చేసే డొల్లతనం కనబడుతుంది. లక్ష్మీ చేయి వదిలేసిన బుడ్డోడు తాను దాచిపెట్టిన బాంబుల సంచి కోసం పరుగెత్తాడంటే మరో ముఠానాయకుని ఆవిర్భానికి వారసత్వంగా ముఠా కక్షల కొనసాగింపుగా మనకు ‘‘వారసత్వం’’ కథ నిలుస్తుంది.
కడపజిల్లా పల్లెల్లో వదినంటే తల్లి తరువాత తల్లి అని మాటే గాని, తల్లి కంటే మించిన గౌరవాన్ని వదినలు పొందటం సాధారణ అంశం. ఎందుకంటే తల్లంటే ఉన్న చనువు వల్ల తల్లినైనా ఎప్పుడైనా విసుక్కుంటారు కానీ వదినలపై తమ అభిజాత్యాన్ని ప్రకటించుకొనే అవకాశం భూస్వామ్య భావజాలంగల కుటుంబాల్లో ఉండదు. అప్పట్లో కుటుంబ నియంత్రణ, శస్త్ర చికిత్సలు లేకపోవడం వలన కోడళ్ళు, అల్లుళ్ళు వచ్చే వరకు, వచ్చిన తరువాత కూడా స్త్రీలు పిల్లల్ని కంటూ ఉండేవారు అందుచేత కుటుంబ నిర్వహణలో భాగంగా వదినలు మరుదులని చాలావరకు ఎత్తుకొని పెంచి పెద్ద చేయడం రివాజు. మరి అటువంటి వదినను అన్న చనిపోయిన నెలకే చెరబట్టిన మరదుల దుర్మార్గాన్ని చిత్రించిన కథ కూడా. అంతేకాదు ప్రపంచం డబ్బు చుట్టూనే తిరుగుతూ, మానవ సంబంధాలు వ్యాపార సంబంధాలుగా రూపాంతరీకరణం చెందిన పెట్టుబడిదారి సమాజ స్వభావాన్ని సైతం బట్టబయలు చేసిన కథ ‘‘కువైట్ సావిత్రమ్మ’’ కథ. ‘‘అయిపుట్టినోడికల్లా కొంగు పరిచింది. ఇప్పుడు వాళ్ళమ్మగారి ఊరంట. ఎవరో రెహమాన్ అంట. వాడితో కులుకుతుంది.’’ అంటూ సావిత్రమ్మను ఊరి నుండి వెళ్ళగొట్టిన చిన్నబ్బ, తన భార్య రామలక్షుమ్మను కూడా సావిత్రమ్మతో పాటూ కువైట్ కు పంపడానికి సిద్దపడటం భూస్వమ్య విలువల విధ్వంసం కాక మరేం అవుతుంది. కాబట్టి ఇన్ని విశేషాంశాలు కలిగిన కథ ‘‘కువైట్ సావిత్రమ్మ’’. అందుకే రెండవతరం తెలుగు కథా చరిత్రలో కడప కథా సాహిత్య చరిత్రకు అదనపు గౌరవాన్ని అందించగలిగింది. ఈ కథ వచ్చిన తరువాత మూడవతరం కథ ‘‘కడప కథగా’’ ప్రత్యేక గుర్తింపు పొందగలిగిందనడం ఎంత మాత్రం అబద్దం కాదు.
రెండవతరం కథకులు, కేతు విశ్వనాథ రెడ్డి ‘‘నమ్ముకున్న నేల’’ కథతో కలిగిన గౌరవం మూడవతరం కథా రచయితగ చక్రవేణు ‘‘కువైట్ సావిత్రమ్మ’’ (చక్రవేణు. కువైట్ సావిత్రమ్మ, చక్రవేణు కథలు, విరసం ప్రచురణలు, 2005.) మరింత ఎత్తులకు ‘‘కడప కథ’’ ఎదిరించగలిగింది. చక్రవేణు ‘‘కువైట్ సావిత్రమ్మ’’ కథ తరువాత యన్.యస్ ఖలందర్ ‘‘పిల్లి మెడలో గంట’’ కూడా వైవిద్యభరితంగా సాగిన కథ. ఈ కథాశిల్పం మౌలికంగా సెజ్జుల పైన తుమ్మేటి రఘోత్తమ్మ రెడ్డి రాసిన మౌఖిక కథ కంటే భిన్నమైనది. పూర్తిగా కథకుడే మౌఖిక రూపంలో చెప్పాడు. యన్.యస్. ఖళంధర్ బూబమ్మ పాత్ర ద్వారా తను కువైట్ వెళ్ళిన తరువాత అక్కడ నుండి డబ్బు పంపుతుంది కానీ తన వాళ్ళ దగ్గర నుండి ఎలాంటి ప్రత్యుత్తరం లేకపోవడం వలన క్యాసెట్ రూపంలో తన బాధ వెళ్ళ బోసుకుంటుంది. ఎలాంటి గందరగోళంలోకి నెట్టివేయ బడుతుందో ఆమే స్వయంగా మాట్లాడిన మాటల రూపంలో తెలుస్తుంది.
ఈ శిల్పాన్ని ఎన్నుకోవడానికి బూబమ్మ నిరక్షరాస్యురాలు కావడం వలన మౌఖిక శిల్పం ఖచ్చితమైన అభివ్యక్తిగా మారింది. ఉత్తరాలు రాయలేని వాళ్ళకు క్యాసెట్లో మాట్లాడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. అందువలననే ఈ సమస్య సామాజిక వాస్తవికతా చట్రంలో ఇమడటానికి అవకాశం కలిగింది. ‘‘మున్నీ బేగం’’ కథ ముస్లిం యువకులు కువైట్ వెళ్ళడంతో ముస్లిం స్త్రీల జీవితంలోని యాంత్రికతను చిత్రస్తుంది. కువైట్ ప్రయాణమైన భర్త అనురాగానికి దూరమై గడిపే హింస కంటే తాను వచ్చేవరకు పరాయి మగాన్ని కన్నెత్తి చూడరాదని నిర్ధేషించడంలోని పురుషుల అహంకార స్వభావం ఈ కథలో చిత్రించబడిరది. పరాయిదేశంలో ఉంటూ కూడా భర్త తన కుటుంబంలో పది మంది మధ్య మసులుకోవాల్సిన, పద్ధతులు ఆమె పాటించాల్సిన ప్రాతివ్రత్యాన్ని గురించి హెచ్చరికలు చేయడంలోని హేయత్వాన్ని రుజువు చేస్తుంది.
కేతు బుచ్చిరెడ్డి 1980లో ‘ముత్యాలు - రత్నాలు’ పేరుతో 18 కథల సంపుటిని, 1989లో ఇదుగో సూర్యుడు 19 కథల సంపుటితో ప్రచురించారు. 1965 నుండి 1989 వరకూ రాసిన పై రెండు కథా సంపుటులలోని కథలను కేతు బుచ్చిరెడ్డి కథలు పేరుతో తన సమగ్రకథాసాహిత్యాన్ని ప్రచురించారు. 1980 ప్రాంతంలో రూప్ కన్వార్ సతీసహగమనం జరిగిన తరువాత అదే ఇతివృత్తంతో ‘‘ఇదుగో సూర్యుడు’’ అనే కథ రాశారు. మానవత, సంస్కరణ అన్నవి ఆధునిక భావాలు. వాటికి కూడా సామాజిక పునాదులు ఉన్నాయి. ఒక వ్యక్తిని సంస్కరించాలన్నా, సంస్కరించబడాలన్నా శూన్యంలో జరగదు. బలమైన సామాజిక వత్తిడిలలోనే జరుగుతుంది.
డి. రామచంద్ర రాజు రాసిన ‘‘చీకటి సవ్వడి’’ కథ ప్రేమించి పెళ్లి చేసుకున్న సురేష్ అప్పుల బాధలు పడలేక భార్యను కువైట్ పంపుతాడు. కువైట్ వెళ్ళే క్రమంలో జరిగే తతంగాన్ని భార్య గుర్తు చేసినా ‘‘నీకేం ఫర్వాలేదు’’ కువైట్ బ్రోకర్ సత్తార్ మంచి సేట్ ను చూశాడు. అంటూ భరోసా ఇచ్చి పంపుతాడు .కానీ భర్త ముందే బ్రోకర్ సత్తర్ కళ్ళతోనే ఆమె అందాల్ని అందినట్లు తడుముతుంటాడు. భర్తకు అప్పుడు లేని అభ్యంతరం బొంబాయి నుండి తిరిగి వచ్చిన తరువాత తన భార్య గురించి సత్తార్ మాట్లాడిన మాటలు సురేష్ జీర్ణం చేసుకోలేక పోతాడు. తన బలహీనతలను నిస్సహాయతని జయించలేక తాగుడుకు బానిసవుతాడు. అప్పులు తీర్చడం కోసం అవమానాల్ని చాకిరిని భరించిన రాజ్యలక్ష్మి పాత అప్పులకు తోడు కొత్త అప్పులు చేసిన భర్త నిస్సహాయతను అర్ధం చేసుకోవడం లోనూ, జీవితంలో ఎదురైన సంక్షోభాన్ని సంయమనంతో సమతౌల్యతతో సాధించగలిదింది. అంతకు ముందు అప్పుల్లో కూరుకు పోయినప్పుడు సురేష్ పాత్రలో లేని స్ధైర్యం రాజ్యలక్ష్మి పాత్ర చిత్రణలో చూస్తాం,‘‘కువైట్ సావిత్రమ్మ’’ కథలోని రామలక్ష్మి భర్త చేతుల్లో తన్నులు తినడం కంటే కువైట్ కు పోవడమే మేలని భావిస్తే, రాజ్యలక్ష్మి భర్త నిస్సహాయతను అర్ధం చేసుకోవడంలో కువైట్ కు పోకుండానే అప్పులు తీరే మార్గాన్ని తానే నిర్ణయించుకోవడంలోని వ్యత్యాసం రాజ్యలక్ష్మి చదువుకోవడం వలననే. ఆమె స్ధైర్యాన్ని ధైర్యాన్ని ప్రదర్శించడం వల్లనే భర్తను దక్కించుకోగలిగింది. కువైట్ వెళ్ళే వాళ్ళు పేదరికంలోని దుర్భరత్వాన్ని భరించడం కంటే పరాయిదేశంలో తమది కాని బతుకును బతకడానికి సిద్దపడడంలో పేదల జీవిత భద్రత కడప జిల్లాలోని కరువు సమస్యాత్మకం చేస్తున్న క్రమం అర్థమవుతుంది.
అప్పులు అభద్రతతో జీవించడంలోని సంక్షోభం ముందు ఆకలి తీర్చే కూలీగా అయినా సరే జీవించే స్థితిని నలుగురు మెరుగ్గా భావించడం జరిగింది. కువైట్ వలసల స్థితి గతుల్ని ఈ నాలుగు కథలు చిత్రించగలిగాయి.
వ్యవసాయ కథల్లో కరువు, భూమి సమస్యల కథలు, నీటి కథలు, కరువు కథలు వచ్చాయి. గుక్కెడు నీళ్ళులేక ప్రాణాలు వదిలే ముసలమ్మలు బైరాగుల తత్వాల్లో నెలవైన నీళ్ళ తాత్విక పాటలు రాయలసీమలో తప్ప సువిశాల ఆంధ్రప్రదేశ్‌లో మరో చోట ఎక్కడా వినిపించే అవకాశమే లేని ప్రాదేశికత్వం ఈ కథలో మారుమోగుతుందన్న సింగమనేని నారాయణ మాటలు అక్షర సత్యాలు నీళ్ళకోసం ఒక Simidial situation లోకి వెళ్ళేస్థితి రాయలసీమలో సర్వసాధారణాంశం.
తెలుగు సాహిత్యంలో మొట్టమెదటి ముస్లిం కథావిర్భావం జరిగింది కడప జిల్లాలోనే. దాదాపు సగం జనాభా ముస్లింలు. వీళ్ళ స్థితిగతుల్ని చిత్రించిన కథలు మిగిలిన ప్రాంతాలన్నింటికి ఒక వరవడిని అందించింది. కడప జిల్లా ముస్లిం కథ. ఒక్క కడప జిల్లా నుండే షేక్ హుస్సేన్ (సత్యాగ్ని) దాదాహయత్, కళాంధర్ ఎన్.యస్., అక్కంపేట ఇబ్రహీం, శశిశ్రీ, వేంపల్లి షరీఫ్, మహమూద్, యస్ సికింధర్ భాషా, షేక్ పులివీడు గఫార్ ఇంతమంది రచయితలు ముస్లిం కథా సాహిత్యాన్ని సృజిస్తున్నారు. ముస్లిం అస్తిత్వ స్పృహతో వచ్చిన కథలు ‘‘పర్దా, జుమ్మా, తురకోని సేద్యం, టోపి, వివక్ష, పిల్లిమెడ గంట, మిష్కిన్, ఖబూతరా, ఇజ్జత్, వలీమా,కంకర్, నదీకేపాల్, ముత్తా, బంగారు కత్తి, పాచికలు, యంత్రం, మసీదు పావురం,’’ ఫతప్, మొదలైన కథలు ఎంతో వైవిధ్యంతో తెలుగు సాహిత్యంలోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించు కోగలిగాయి.
మొదటి తరం సీనియర్ ముస్లిం రచయితలు ముస్లిం కుటుంబాలలోని ఆచార వ్యవహారాలను హిందు, ఇతర సమాజ భావజాల ప్రభావంతో తమ మతాచారాలలో ఉన్నటువంటి ఛాందస వైఖరిని గుర్తించగలిగారు. ముస్లిం అస్తిత్వ స్పృహ తెలుగు సాహిత్యంలో ప్రవేశించక ముందే కడప జిల్లాలో ముస్లిం అస్తిత్వ సంవేదనల్ని పలికించారు. వర్తమాన అస్తిత్వ నేపధ్యం సీనియర్ రచయితలను కూడా ప్రభావితంచేసి ‘‘దహేజ్’’లాంటి మంచి కథలను బలమైన అభివ్యక్తితో యువ రచయితలతో పాటూ వైవిద్యమైన కథలను చాలానే సృజించారు. కానీ కువైట్ వలసల గురించి రాసిన క్లథల్లోని వైవిద్యాన్ని మాత్రమే ఈ వ్యాసంలో విశ్లేషించాను. కారణం తెలుగు కథా సాహిత్యంలో ముస్లిం జీవితాల గురించి వచ్చిన కథలు దాదాపుగా ఒకే జీవిత చిత్ర పటాన్ని అందించాయి. కడప కథ అని ప్రత్యేకంగా చాటి చెప్పగలిగినవి ముస్లిం కథకు తమదైన శైలిలో ఒక ట్రెండ్ సెట్టర్స్ గా) నిలబడి, తెలుగు కథకు అదనపు గౌరవాన్ని సంపాదించి పెట్టగలిగిన సాహిత్య సృజన కారులు ఈనాటి ముస్లిం యువ రచయితలు.
11. కడపజిల్లా కథలు - ఇతరాంశాలు:
కేంద్రసాహిత్య అకాడమీ యువరచయితగా గుర్తింపు పొందిన వేంపల్లి గంగాధర్ హరిజన, గిరిజన, వెనుకబడిన జీవితాలను సృజిస్తూ కథలు రాస్తున్న రచయిత. ప్రతి కథలోనూ కడప జిల్లాలోని గాలివీడు, సంబేపల్లి, వేంపల్లి, పరిసర ప్రాంతాలలో ఇతని కథావస్తువు నడుస్తుంది. ముఖ్యంగా బి.సిల జీవిత చిత్రాలను తన కథల్లో చాలా ఎక్కువగా సృజించారు. నేలదిగని ఊడ, పూల చేతులు, కథల్లో వెనుకబడిన కులాల వాళ్ళు కత్తులు సానబడుతూ ఊరూరూ తిరిగే దూదేకుల సాయిబులకు పోలీను వాళ్ళతో వచ్చే కష్టాలను చిత్రించారు. ఈ కష్టాలను అధిగమించడంలో జైలుపాలయి, జీవనోపాధైన సాన బట్టె యంత్రాన్ని సైతం వాళ్ళ వద్దే ఉంచుకోవడం లాంటి చర్యల్ని కేవలం తమ వృత్తి వల్లనే భరించాల్సి వస్తుంది. అంతే కాదు తాము ఎన్ని కత్తులు, కొడవళ్ళు ఎవరెవరి ఇంటి దగ్గర ఏరోజు సానబట్టారో కూడా చెప్పమని వత్తిడి చేస్తారు. చెప్తే, ముఠా నాయకుల నుండి సమస్య. చెప్పుకుంటే పోలీసులతో సమస్య. అన్ని వృత్తులలో పని దొరకక పోవడం సమస్య. ఈవృత్తిలో పని చేయడం సమస్య. పల్లె పల్లే తిరుగుతూ 500 నుండి 1000 రూపాయల వరకు సంపాదించు కోగలిగిన శక్తి ఉండి కూడా వేదింపుల కారణంగా సానబట్టే పనిని, కొలిమి పనిని నిర్వర్తించలేని అసహాయస్థితిని పైకి చెప్పలేని వాళ్ళ మూగ వేదనల్ని వేంపల్లి గంగాధర్ తనకథల్లో బహిర్గతం చేశారు. వాళ్ళు చెప్పడం వలన భవిష్యత్తులో జరిగే హింసా కాండను నివారించొచ్చనే వాదం పోలీసులది. మా ఆయుధాల సమాచారం పోలీసులకు ఎందుకిచ్చావని వేధించే ముఠానాయకుల మధ్య సానబట్టే వాళ్ళ జీవితాన్ని తన కథల్లో సమస్యాత్మకం చేయగలిగాడు. పోలీసు వాళ్ళు కొలిమి పని చేసే కంసలోళ్ళ మీద బ్రతికే వెనుకబడిన కులాల వాళ్ళను వేధించి తమ పనుల్ని జరిపించుకోవడం సాధారణాంశమే. అయితే జీవనోపాధినందించే తమ వృత్తే తమ పాలిటి శాపంగా మారడమే ఇందులోని వైరుధ్యం. ఎద్దుల కాళ్ళకు నాడాల్ని కొట్టే సాయిబులు కూడా ఎద్దులతో చేయించుకొనే పనులు తగ్గిపోవడంతో వాళ్ళ బతుకు చిత్రంలో ఎదురయ్యే హింసను చిత్రించడంలో వేంపల్లి గంగాధర్ కథాకథనం ప్రత్యేకమైంది.
అలాగే గిరిజన కథల్ని కూడా. కడప జిల్లాలోని సుగాలి, గాలివీడు పరిసర ప్రాంతాలలో జరుపుకొనే ‘‘మొలకల పున్నమి’’ పండుగను జరుపుకొనే గిరిజనుల సాంస్కృతిక జీవన దృశ్యాన్ని ‘‘మొలకల పున్నమి, మైనం బొమ్మలు’’ కథల్లో ఆవిష్కరించారు. నంబేపల్లి, గాలివీడు, రాయచోటి, చింతకొమ్మదిన్నె, ప్రాంతాలలోని గిరిజన తాండాలలో నుంచి బొంబాయి, పూణే, డిల్లీ, నగరాలకు తరలి వెళ్ళే స్త్రీల జీవన దృశ్యాల్ని ‘‘మైనం బొమ్మ’’ కథలో చిత్రించారు. ఆ తరువాత ఎయిడ్స్ లాంటి భయంకరమైన వ్యాధుల పాలయ్యేవాళ్ళ జీవితాన్ని మైనంతో పోలుస్తూ, స్త్రీలు రవాణా అవుతున్న వైనాన్ని ఈకథలో దృశ్యమానం చేయగలిగారు. ఇంకా కడప సరిహద్దు ప్రాంతాల్లో కరువు చాలా తీవ్రంగా ఉంటుంది. దీంతో కనీస అవసరాలు కూడా తీరని అనేక గ్రామాల జీవన దృశ్యాలు భయంకరంగా మారుతున్నాయి. జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు తరలిపోవడం ప్రారంభించారు. మరో ప్రత్యామ్నాయ జీవికలు లేక తల్లిదండ్రులే యుక్తవయస్సులో ఉన్న బిడ్డల్ని, భార్యల్ని వేశ్యావాటికల నిర్వహకులకు అప్పజెప్తున్నారు. పల్లెలోనుంచే అమ్మాయిలను సప్లయ్ చేసే దళారులు రాకెట్‌గా మారుతున్నారు. పోలీసు వ్యవస్థ కూడా దీన్ని నివారించడంలో విఫలమవుతున్నారు. దానికి కారణాలు వీళ్ళు సొంత ఊరి వాళ్ళు కావడం ఒకటి, తల్లిదండ్రులే తమ అంగీకారంతో అమ్మాయిల్ని పంపించడం మరొకటి, ఈ పరిస్థితుల కారణంగా నిరాటంకంగా యువతులు రవాణా అవుతూనే ఉన్నారు. అమానవీయ సంఘటనలు నిర్లజ్జగా సాగిపోతూనే ఉన్నాయి. ఆగ్రామాల నుండి పూణే పోయిన వాళ్ళున్నారా? అని ప్రశ్నించినప్పుడు సంకోచాలు లేకుండా ఫలాన అమ్మాయి పోయింది అని చెప్పడంలో ఒక దిగ్భ్రాంతి (shock) ఆ అమ్మయిలే ముందుకొచ్చి నేనే వెళ్లింది. అని చెప్పడం మరో దిగ్బ్రాంతి. ఈసంఘటల్ని ఎలా జీర్ణం చేసుకోవాలో కూడా అర్ధం కాని అగోచర స్థితిలోకి వెళ్లడం కన్నా దౌర్భాగ్యం సామాజికులకే ముంటుంది? ఈ ప్రాంతాల్లో చెప్పుకో దగిన పరిశ్రమలు లేకపోవడం ఉన్న కొంత భూమి కూడా కొంత మంది వ్యక్తుల గుప్పిట్లో ఉండటం వల్ల కొద్ది పాటి వనరుల ద్వారా సేద్యం సాగించలేని పరుస్థితుల్ని కడప కథ చిత్రించగలిగింది.
1957-1960 నాటికే రా.రా ‘‘అలసిన గుండెలు’’ సంకలనం వచ్చింది. అంతకు ముందే ఎప్పుడో చాలా మంచి కథలు రాశారని రా.రా సన్నిహిత మిత్రులైన ఆర్.వి ఆర్ ‘‘తెలుగు కథకులు’’, ‘‘కథన రీతులు’’ అనే వ్యాసంలో చెప్పారు. మరి ఆయన వ్యాఖ్య ప్రకారం ‘‘తొలి కడప కథ’’ ను తేల్చడానికి పరిశోధన జరగవలసి ఉంది అని కేతు విశ్వనాధరెడ్డి భావించడం ఈకారణంగానే కావచ్చు. ఏది ఏమైనా పరిశోధకులు తలుచుకుంటె ఇదేమంత కష్టమైన పని కాదనుకుంటాను. రా.రా కథల్ని ఎలా రాయలి అని చెప్పేటందుకే కథలు రాసినట్లుగా చక్కని శిల్ప మర్యాదలతో కథలు రాశారు. మొదటి తరానికి చెందిన కథలలో ముఖ్యంగా పూర్వకథకులు బి.నాదముని రాజు, రా.రా., సొదుం జయరాం కథల మధ్య తరగతికి చెందిన ఇతివృత్తాలలో కనిపించడం విశేషం.
కడప జిల్లాలో తొలితరం కమ్యూనిస్ట్ పార్టి నాయకత్వం పొన్నతోట వెంకట రెడ్డి, జి వెంకట్రామిరెడ్డి, ఎన్.శివ రామిరెడ్డి, కె. సుబ్బన్న, నంధ్యాల నాగిరెడ్డి మొదలైన వాళ్ళ అంకిత సేవలు కడప జిల్లా ప్రజా సంఘాలు, రైతు కూలి సంఘాలు, కార్మిక ఉపాద్యాయ ఉద్యమాలు రచయితల్ని బాగా ప్ర్రభావితం చేయగలిగాయి. అందుకే మొదటి తరం కథకులు ఎక్కువగా సామాజిక రాజకీయచిత్రాన్ని దాని ప్రతిఫలనరూపాన్నితమ కథల్లో చిత్రించగలిగారు. మొదటితరం కథకులు ఫ్యాక్షన్ గ్రామాల నుండి వచ్చిన వాళ్ళైనా వీరి కథావస్తువుల్లో ఈ గాఢమైన చిత్రణ కనిపించదు. (కేతు విశ్వనాథ రెడ్డి మినహాయింపు) నిజానికి మొదటి తరం కథారచయితల కథాకాలంలో ఫ్యాక్షన్ తీవ్రత ఒకరకంగా రెండవతరం కథాకాలం కంటే ఎక్కువగా ఉంది.
రెండవతరం, మూడవతరం నాటికి అంటే 80 దశకం తరువాత ఫ్యాక్షన్ తీవ్రత తగ్గడమే కాకుండా దాని రూపాన్ని కూడా మార్చుకుంది. మరి ఈ సమయంలోనే ఫ్యాక్షన్ రాజకీయాలను చిత్రించిన కథలు ఎక్కువగా రావడం విశేషాంశం. వ్యవసాయ సంబంధిత కథలు కడప జిల్లా నుండి చాలా ఎక్కువగానే వచ్చాయి. దాదాపు వ్యవసాయ కథలు రెండు వేలు దాకా ఉన్నాయంటే కడపజిల్లా కథకుల్ని కరువులతో కూడిన వ్యవసాయ జీవితం కథకుల్ని ఎంత ప్రభావితం చేసిందో అర్థమౌతుంది.
కడప జిల్లా నుండి తాత్విక కథలు కూడా వచ్చాయి. అందుకు ఉదాహరణ దాదాహయత్ ‘‘మురళి ఊదే పాపడు’’ కడప జిల్లాలో కార్మిక సంఘాలు చాలా ఎక్కువ. సంఘటిత, అంసంఘటిత కార్మిక సంఘాల పని తీరు చెప్పుకోదగిన స్థాయిలో జరిగింది. కానీ ఈ అంశంపైన వచ్చిన కథలు చాలా తక్కువ. వై.సి.వి.(గట్టిగింజలు) కేతువిశ్వనాథ్ రెడ్డి (తేడా, మార్పు) చక్రవేణు (కసాయికరువు) కథల్లో నామమాత్ర ప్రస్థావనలే తప్ప సమగ్రంగా కాకపోయినా పర్టికులర్‌గా రాలేదు.
12. ఉపసంహారం:
మొదటితరం కథకులలో నాదముని రాజు తప్ప కథకులందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం కాకతాళీయం కాదనుకుంటాను. ఇందుకు ప్రధానంగా రెండు కారణాలు కనపడుతున్నాయి. చదువుకోగలిగిన స్థోమత ఉత్పత్తి కులాల వారికి ఆరోజుల్లో ఉండటం. ఒక కారణమయితే, రెండో కారణం ‘‘రాయలసీమ డయాస్’’ పేరుతో కడప, కర్నూలు జిల్లాలలో చేపట్టిన కార్యక్రమాలలో భాగంగా విద్యారంగంలో విస్తరించిన క్రైస్తవ మిషనరీల సేవలు.
పలుసంస్థల నుండి అవార్డులను గెలుచుకొని కడప కథాసాహిత్యక్షేత్రంలో మొదటితరం కథకులుగా రాచమల్లు రామచంద్రారెడ్డి, కేతువిశ్వనాథరెడ్డిలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు లభించాయి. రెండవతరం కథకులుగా దాదాహయత్, మూడవతరం కథకులలో చక్రవేణు వేంపల్లి గాంగాధర యువ కథకులుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయికి కడపకథను ఎదిగించడంలో తమ బాధ్యత నిర్వర్తించారు.
సాహిత్య వస్తువు ఎంత విశ్వజనీనంగా ఉన్నా వ్యక్తీకరణలో అది అత్యంత ప్రాంతీయం. వ్యక్తీకరణలో ప్రాంతీయం కాని సాహిత్యమేదీ పాఠకున్ని కదిలించలేదు. సరైన సాహిత్యంలో ప్రాంతీయ ముద్ర అనివార్యంగా ఉంటుంది. మంచి సాహిత్యంగా గుర్తించబడిన ఏభాషా సాహిత్యాన్ని పరిశీలించినా ఈ విషయం అవగతమవుతుంది. ప్రాంతీయ సమస్యలనే కాకుండా ప్రాంతీయ వ్యక్తీకరణ పద్ధతులను సాహిత్యంలోకి ప్రవేశ పెట్టగలిగిన రచయితలు అనివార్యంగా మంచి రచయితలుగా గుర్తింపు పొందారు, పొందుతారు అన్నది అక్షర సత్యం.
13. ఆధారగ్రంథాలు:
- గోపాల్‌రెడ్డి, బెజవాడ. మెకంజీ కైఫీయత్తులు. సి.పి. బ్రౌన్ గ్రంథాలయం, 1972
- భూమన్, రాయలసీమ ముఖచిత్రం. సీమసాహితి ప్రచురణ, 2000
- రంగనాథాచార్యులు, కె.కె. (సంపా.) ఆధునిక తెలుగుసాహిత్యంలో విభిన్నధోరణులు. ఆంధ్ర సారసత్వపరిషత్, హైదరాబాద్, 1982
- రమణరెడ్డి, యం.వి., రాయలసీమ కన్నీటిగాథ. 1983
- రామక్రిష్ణారెడ్డి, పి., మనిషి - పశువు. సీమసాహితీ ప్రచురణలు, నంద్యాల,1997
- రామచంద్రారెడ్డి, రాచమల్లు. సవ్యసాచి, 28 మార్చి 1960
- విశ్వనాథరెడ్డి, కేతు. కడపజిల్లాలో కథాసాహిత్యం. వ్యాసం,1992
- విశ్వనాథరెడ్డి, కేతు. విశ్వనాథరెడ్డి కథలు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు, 2005
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "May-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-April-2025
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "MAY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి
బాధ్యత వహించరు.