AUCHITHYAM | Volume-5 | Issue-9 | August 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
11. మానేపల్లి సత్యనారాయణ ఉద్యమ నేపథ్యకథలు: ఇతివృత్తపరిశీలన

డా. సిరిశెట్టి సత్యనరాయణ
తెలుగు శాఖాధ్యక్షులు,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సబ్బవరం,
అనకాపల్లి జిల్లా. ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9849416374, Email: satyanarayana.sirisetti@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
ఆధునిక ప్రక్రియల్లో కథానికాప్రక్రియకున్నంత వైశాల్యం మరి దేనికీ లేదనే చెప్పాలి. గురజాడతో మొదలైన కథానిక అనేక ఉద్యమాల ఊపిరులను వస్తువుగా గైకొని ఉత్తరాంధ్రనే తన తొలిగడ్డగా స్వీకరించి, చా.సో, రావి శాస్త్రి, కా.రా మొదలైన తొలితరం కథారచయితల చేతిలో మెరుగులు దిద్దుకొన్నది. అదే కోవకు చెందిన వారందరితోనూ పరిచయాలున్న డా. మానేపల్లిగా పేరుగాంచిన రచయిత పూర్తిపేరు మానేపల్లి సత్యనారాయణ. వీరు అనేక ఉద్యమాలతో ప్రత్యక్షసంబంధాలు కలవారు గనుక కథారచనలో మేటి. దాదాపు మూడు వందల కథలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయంటే గొప్ప కథకుడు. ఆయనతో ముఖాముఖి నిర్వహించి ఆనాటి అనేక విషయాలను తెలుసుకోవడంతో, “డా. మానేపల్లి- ఉద్యమనేపథ్య కథల్లోని ఇతివృత్త పరిశీలన” అనే అంశంపై పరిశోధన వెలువడింది. రచయిత ఉత్తరాంధ్ర ప్రముఖ కథారచయితల్లో ఒకరు. 1960 నుండి నేటి వరకు కథారచనలోనేగాక వివిధ ప్రక్రియల్లో తలమునకలుగా నున్న పేరెన్నికగన్న రచయితల్లో డా. మానేపల్లిని ప్రముఖులు. ఆయనతో ముఖాముఖి నిర్వహిస్తున్నప్పుడు ఆనాటి అనేక సంఘటనలను తెలియజేశారు. ఈయన కేవలం కథలే కాక అనేక సాహిత్యప్రక్రియల్లో రచనలు చేసారు. ఉద్యమనేపథ్యంలో వచ్చిన మూడు కథల్లోని ఇతివృత్తాల పరిశీలన చేయడమే ప్రధాన లక్ష్యం.
Keywords: ఉత్తరాంధ్ర, ఉద్యమనేపథ్యం, కథ, సాహిత్యం, మానేపల్లి.
1. మానేపల్లి వారి జీవితం :
1960 నుండి నేటి వరకు కథారచనలోనే గాక వివిధ ప్రక్రియల్లో తలమునకలుగా నున్న పేరెన్నికగన్న రచయితల్లో డా.మానేపల్లిని ప్రముఖంగా పేర్కొనవచ్చును. డా.మానేపల్లిగా పేరుగాంచిన రచయిత పూర్తిపేరు మానేపల్లి సత్యనారాయణ. జూనియర్ లెక్చరర్ నుండి 1985 మార్చిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకునిగా పదోన్నతి పొంది ప్రభుత్వ నిబంధనల ప్రకారం 1 -1 -96 నుండి రీడర్ స్థాయికి ఎదిగి 31.5.2002 లో శ్రికాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల్లో పదవీ విరమణ చేశారు. 1992లో హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో “శ్రికాకుళ గిరిజన రైతాంగ పోరాటం-ప్రజాసాహిత్యం” అనే అంశంపై సిద్ధాంత వ్యాసం సమర్పించి పిహెచ్.డి డిగ్రీ పొందారు. విశాఖ జిల్లా యలమంచిలి పట్టణంలో 1974 లో ‘బుక్స్ అండ్ బుక్స్’ అనే పేరుతో రచయితల సహకార వేదిక ప్రారంభించారు. 1978లో ‘అవగాహన’ పేరుతో ఆధునిక ఆలోచనా వీచిక అనే సాహిత్యోద్యమ సంస్థను స్థాపించి అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఈ “అవగాహన” గ్రంథాలయం ఎందరో విద్యార్థులకు, పట్టణ పౌరులకు ఉపయోగపడింది. ఈ గ్రంథాలయం తెలుగు, ఆంగ్ల సాహిత్యంతో పాటు ఎన్నో జర్నల్స్ కలిగి, అనేక సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎందరో ప్రముఖుల ప్రశంసలను, మన్ననలను అందుకుంది. (నా సిద్ధాంత గ్రంథం కూడా ఈ గ్రంథాలయ సహకారంతోనే తయారయింది. అందుకు డా. మానేపల్లి వారు ఎంతో సహకరించారు). ఈయన తన చివరి శ్వాస వరకు సాహిత్య కృషి చేస్తూనే 25/01/2017న తుది శ్వాస విడిచారు. ఆయనతో ముఖాముఖి నిర్వహిస్తున్నప్పుడు ఆనాటి అనేక సంఘటనలను తెలియజేశారు. మానేపల్లి వారి మరణవార్త నన్నెంతగానో కలచివేసింది. చివరిగా ఆయన సంతాప సభను నిర్వహించి అనేకమంది ప్రముఖులను ఆహ్వానించి ఆయన ఋణం తీర్చుకోవడం జరిగింది. వ్యాస పరిశీనలో భాగంగా రచయిత కలం నుండి ఉద్భవించిన కథా రచనలను తెలుసుకుందాం.
2. మానేపల్లి రచనలు – వివిధ ప్రక్రియల్లో కృషి :
డా.మానేపల్లి అనేక ప్రక్రియల్లో రచనలు చేశారు. అవి కవిత్వం, కథ, నవల, అనువాదం, వ్యాసం, సమీక్ష మొదలైనవి. ఇతని తొలి రచన ‘కార్డుకథ ’‘వేషాలు’. ఇది 1960లో మద్రాసులోని “చిత్రగుప్త” పత్రికలో ప్రచురితమైంది. తొలిగేయం “డబ్బువిలువ” ఆంధ్రపత్రికలో ప్రచురితమైంది.
2.1 కథలు:
అ) ‘రాజీ’ (1997) 12 కథల సంపుటి. – ఇది చాగింటి సోమయాజుల గారికి అంకితం.
ఆ)‘ఆడవాళ్ళుపుట్టరు’ (1997)32కథల సంపుటి.- ఇది కాళీపట్నంరామారావు గారికి అంకితం.
ఇ) ‘మట్టివాసన’ (1998) 18 కథల సంపుటి.
ఈ) ‘కర్ఫ్యూ’ (1998) 25 కథల సంపుటి (అనువాదాలు)
ఉ) ‘ఆక్రమణ’ (2002) 5 కథల సంపుటి.
ఊ) ‘అమ్మమ్మఫొటో’ 16 కథల సంపుటి. (త్వరలోవెలువడనున్నది)
నవీన కథామాల(1968), రాధమ్మ మొగుడొచ్చాడు(1977), నాగావళి కథలు(1994), వంశదార కథలు(1999), కథానగరం(2000), దళిత(విముక్తి) కథలు–8(2000), సాహితీ స్రవంతి (ప్రజాశక్తి) కథాసంకలనం (2002) మొదలైన సంకలనాల్లోకథలు ప్రచురితమయ్యాయి.
2.2 ఇతివృత్తపరిశీలన :
మానవ జీవితాన్నిసమగ్రంగా అన్నికోణాల్లో చూపించ గలిగిన గొప్ప సాహితీ ప్రక్రియ కథ. కథలో ఇతివృత్తాన్ని ఆంగ్లంలో plot అంటారు. “రచయిత ఊహా శక్తికి సంబంధించింది కథ. రచనా నైపుణ్యానికి సంబంధించింది ఇతివృత్తం. కథా వస్తువుకు రచనానుకూలమైన పథకం రూపొందినపుడు అది ఇతివృత్తమవుతుంది. అనగా ఉద్దిష్ట క్రమంలో వికాసం చెందిన కథా వస్తు విన్యాసమునే ఇతివృత్తమనవచ్చు1” అనిపోరంకి దక్షిణామూర్తి పేర్కొన్నారు.
“ఇతివృత్తమనగా కార్యకారణ సంబంధముండే, ఉత్సుకతను కలిగించే సంఘటనల పరంపర లేదా సంఘటనల క్రమం. సంఘటనల్లో పాల్గొనే వ్యక్తుల మధ్య ఘర్షణ అయినా, భావాల మధ్య ఘర్షణ అయినా, కోరికల ఆశయాల మధ్య ఘర్షణ అయినా వీటి క్రమం ఇతివృత్తమవుతుంది 2” అని కేతు విశ్వనాధరెడ్డి పేర్కొన్నారు.
ప్రసిద్ధ సాహిత్య విమర్శకుడు వల్లంపాటి వెంకట సుబ్బయ్య దృష్టిలో కథావస్తువు, ఇతివృత్తము రెండూ ఒక్కటేనని చెప్తూ “కథ మనకు పూర్తిగా తెల్సిన తర్వాత ఈకథ ఏమి చెప్తుంది? అన్న ప్రశ్న వేసుకుంటే వచ్చే సమాధానమే కథా వస్తువు లేదా ఇతివృత్తం 3” అనంటారు.
ప్రసిద్ధ విమర్శకులు పాపినేని శివశంకర్ ఇతివృత్తాన్ని గూర్చి చెపుతూ ఇతివృత్తమనగా “ఒకరచనలో వ్యాఖ్యానించబడే ప్రత్యేక, ప్రాపంచిక, జీవిత, సంఘటనల విస్తృతి 4”అనంటారు.
ఇలాంటి కథేతి వృత్తాలను బాగా అవగాహన చేసుకొని కథారచన చేసిన వారు డా.మానేపల్లి సత్యనారాయణ. సమాజంలో జరుగుతున్న యధార్థ సంఘటనలను అన్నికోణాలనుంచి నిశితంగా పరిశీలించి, అక్కడ నుండే తనకు కావలసిన ముడిసరుకును గ్రహించి కథారచనను నిర్విరామంగా కొనసాగించిన రచయిత మానేపల్లి. ఇప్పటి వరకు ఆరు కథా సంపుటాలను వెలువరించారు. అయితే వ్యాస విస్తృతి చేత మచ్చుకు కొన్ని ఉద్యమ నేపథ్య కథల్లోని ఇతి వృత్త పరిశీలన చేయడం ప్రస్తుతాంశం.
3. ఉద్యమనేపథ్యం:
“ఉద్యమం అంటే శబ్దార్థం పైకెత్తుట.” కాని ప్రయత్నం, పూనిక అనే అర్థాలు రూఢి అయ్యాయి. బ్రౌణ్యంలో ఉద్యమం అంటే ఇదే అర్థంలో `an attempt’ అని వుంది. ఆక్స్ఫర్డు వారి `literary terms’ పుస్తకంలో ‘movement - the term applied since 1954 to a loose group’ 5 అని ఉంది.
కొందరు ధోరణి, వాదం, ఉద్యమం అనే వాటిని ఒకే అర్థంలో వాడుతున్నారు. ‘ఉద్యమం అంటే నిర్ధిష్ట లక్ష్యంతో క్రమబద్ధంగా చేసే కార్యకలాపాల సమాహారమనీ, ఒక నిర్ధిష్ట లక్ష్యాన్ని సాధించడం కోసం జనం సామాజికంగా చేసే ప్రయత్నమనీ, ఒక లక్ష్యాన్ని సాధించడం కోసం జరిగే వ్యవస్థీకృత ప్రయత్నమనీ, ఇలా రక రకాలుగా పెద్దలు ఉద్యమాన్ని నిర్వచించారు. ఏ ఉద్యమమైనా ‘మార్పు’ కోసం వస్తుంది. ‘పాత’ పై తిరుగుబాటు చేసి, నిరసించి ‘కొత్త’ కోసం వస్తుంది. ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నపుడు నిరసనలు పెల్లుబుకుతాయి. తత్ఫలితంగా ఉద్యమాలు తీవ్రరూపం దాలుస్తాయి. ఇలాంటి ఉద్యమాల నేపథ్యంలో డా.మానేపల్లి రాసిన కథలను విశ్లేషిద్దాం.
అ) ఏడుపుఎరుపెక్కింది
కూనీలు చేసేవారు బాగనే వుంటారు. దొంగ రవాణాలు చేసే వారు బాగనే ఉంటారు. ఆడ కూతుళ్ళను పాడుచేసే కుక్కల కొడుకులు బాగనే ఉంటారు. వందల కొద్దీ వేల కొద్దీ సిమెంటు బస్తాలు మింగిన వాళ్ళు ఎంపీలవుతారు. దొంగనోట్లు అచ్చేసే వాళ్ళు మంత్రులవుతారు. తప్పుడు తూకానికి కల్తీ సరుకులమ్మే దగుల్బాజీలు చైర్మన్లవుతారు. ఇలాంటి నీచమైన సంఘంలో బంద్లూ, సమ్మెలూ వస్తే అందులో సామాన్యులు బలవుతారని తెలియజెప్పే కథ ఇది.
‘వీళ్ళ బందు పాడుగాను, వీళ్ళ పార్టీలు నాశనం గాను, పొగరెక్కిన ఆంబోతులు పోట్లాడుకుని లేగదూడను కుమ్మేసినట్లు, పులుల యుద్ధంలో అమాయకులే చస్తారని దేశాధినేతలు బాగానే ఉంటారంటూ ఈ కథలో ’కోటమ్మ’ గుండెలు పగిలేలా ఏడుస్తుంటుంది.
కోటమ్మ పెద్దకొడుకు వల్ల ప్రభుత్వాలు కూలిపోయాయని, నక్సలైటు ముద్ర వేసి చింతపల్లి అడవుల్లో చంపేస్తారు. తల్లిని చూడనిచ్చారు, కాని శవాన్ని ఇవ్వలేదు. జేబుల్లో బాంబులు పెట్టుకు తిరుగుతున్నాడని, కరపత్రాలు పంచుతున్నాడని చంపేస్తారు. కోటమ్మకు శోకం ఉప్పెనలాగ పొంగి వస్తోంది. ఈ దు:ఖం పచ్చి ఆరకముందే ఇంకొక దు:ఖం వస్తుంది కోటమ్మకు.
బెజవాడలో ఒక ఎం.పీని బాంబులు పేల్చి చంపేస్తారు. ఢిల్లీ నుంచి పల్లెదాక ఎం.పీ కార్యకర్తలు బందులు చేస్తారు. 144సెక్షన్ అమలులో ఉంటుంది. కోటమ్మ చిన్నకొడుకు ఇంటింటికీ పేపర్లేసేవాడు. ఈ బందులో చిక్కిపోతాడు. అప్పుడే మిలట్రీ వాళ్ళు జనం మీదకు తుపాకులు పేలుస్తారు. అందులో పిట్టలా రాలిపోతాడు కోటమ్మ కొడుకు. రెండో కొడుకుకు ఏడాది నిండేసరికి కోటమ్మ భర్త కూడా రజాకార్ల గొడవల్లో కాళ్ళు పోగొట్టుకుంటాడు. ఎర్రజెండాల ఊరేగింపులో పాల్గొని లారీ క్రిందపడి మరణిస్తాడు భర్త. తన కళ్ళముందే భర్త, ఇద్దరు కొడుకులు అకారణంగా ఈ సంఘం చేత బలవడం చూసి కోటమ్మ కంట్లోంచి రక్తం బొట్లు కారుతాయి. పెద్ద కొడుకును పోలీసులు మింగేశారు. భర్తను లారీ మింగేసింది. చిన్నకొడుకును తుపాకులు మింగేసాయి. తను బ్రతుకు తెరువుకోసం నడుపు కొంటున్న టీ దుకాణం అల్లరిమూకలు ధ్వంసం చేశారు. కోటమ్మ గుండెల్లో దు:ఖం లావాలా పొంగుతోంది.
ఇంతలో వెంకట సుబ్బయ్య వచ్చి కోటమ్మను ఓదార్చి ‘కోటమ్మా! నీ పెనిమిటి, నీ కొడుకులు చిందించిన రక్తపు బొట్లు వూరికినే పోవు. ప్రభుత్వం సంక్షోభంలో ఉంది. ఎప్పటికైనా ఎర్రజెండా ఎగరేస్తాం కోటమ్మా! తప్పదు’ అని పలుకుతాడు. ఇందుకు నువ్వూ సాయం చేయాలని అని ఒక చీటీ యిస్తాడు.
‘ఈ దోపిడి పాలన విరగడవుతుందా? అందుకు తను కూడా సాయం చెయ్యిగలదా! అని అనుకుంటూ ’చీటీ జాగ్రత్తగా కొంగున కట్టుకుంటుంది. ఇది కథా సారాంశం. ఒక సాధారణ మహిళ తనకు జరిగిన అన్యాయానికి వేరొక మార్గం లేక నక్సలైటుగా మారుతుంది. అలా మారడనికి ప్రభుత్వాలు, ఈ సంఘమే కారణమని, ఎవరూ ఊరకే ఉద్యమ మార్గాన్ని ఎంచుకోరు గదా!
ఈ కథ బెజవాడలో వంగవీటి రంగా హత్య జరిగిన మర్నాడు మానేపల్లి వారు రాసినట్లు నాతో స్వయంగా చెప్పారు. రంగా హత్య జరిగినపుడు ఆంధ్రదేశమంతా అట్టుడికి పోయింది. ఎవరికి దొరికింది వాళ్ళు దోచుకున్నారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అయ్యాయి. ఇలాంటి సందర్భాల్లో జరిగిన బందుల్లో సామాన్య జనం ఇబ్బందులకు గురి కావడమే కాకుండా ప్రాణాలను కూడా పోగట్టుకుంటారు. ఇలాంటి వ్యవస్థ మీద తిరుగుబాటు నేపథ్యంలోనే నక్సలిజం పుట్టుకొస్తుందని ఈకథ తెలియజేస్తుంది.
ఆ) ఉద్యమం సరళ రేఖ కాదు:
ఈ దేశం కోసం, ఈ ప్రజలకోసం ఎందరో ఉద్యమాల బాట పట్టారు. ప్రాణాలు వదిలారు. అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ మొదలైన వాళ్లు ప్రజాశ్రేయస్సు కోసం పోరాటలు చేసి పాలకవర్గాల చేతిలో ఇలాగే మరణించారు. రాజకీయ నాయకులు, పోలీసులు, దోపిడీదారులు దేశాన్ని దోచుకుంటూ ప్రజల్ని హింసిస్తన్నప్పుడు ఉద్యమాలు పుట్టుకు వస్తాయి. అలాంటి ఉద్యమ నేపథ్యంలో రాసిన కథే ఈ ‘ఉద్యమం సరళరేఖ కాదు’. ఇందులోని కథాంశాలను ఒకసారి పరిశీద్దాం.
సరళ కర్నూలు మెడికల్కాలేజిలో M.B.B.S నాల్గవ సంవత్సరం చదువుతుంటుంది. గతసారి సెలవులకు వచ్చినప్పుడు పెద్ద పారిశ్రామికవేత్త కొడుకును ప్రేమించానని, అతన్నే పెళ్ళి చేసుకుంటానని ఇంటి దగ్గర చెబుతుంది. సరళ చాలా పట్టుదల గల ఆడపిల్ల. రాష్ట్ర వ్యాప్తంగా ఒక అత్యాచారం కేసుమీద అన్ని మెడికళ్ కాలేజీల్లోను సమ్మె జరుగుతుంది. కాలేజీలు, హాస్టల్లు మూసివేయడంతో సరళ ఇంటికొస్తుంది. సరళ తండ్రి ఆఫీసు పని మీద బొంబాయి వెళతాడు. మరునాడు సరళ స్నేహితులను కలవడానికి ఊళ్ళోకి వెళుతుంది. తన చిన్ననాటి స్నేహితురాలు జ్యోతిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారని తెలుసుకుంటుంది. జ్యోతి డిగ్రీ చదువుతుండగానే దళాల్లోకి వెళ్ళిపోయింది. సరళ ఇంటికి వచ్చి ‘ఈదేశం కోసం, ఈ ప్రజలకోసం జ్యోతి ప్రాణాలను బలి ఇచ్చింది’ అని ఆవేశంతో తల్లికిచెబుతుంది. సరళ ఆవేశం చూసి తల్లికి భయమేస్తుంది. సరళ తిరిగి కర్నూలు వెళ్ళే ముందు జ్యోతి ఇంటికి వెళ్ళి వస్తుంది. జ్యోతి అన్నయ్య భాస్కర్రావు సరళ అడ్రస్ తీసుకుని, సరళకు ఫోను చేస్తాడు. సరళ చదువు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేస్తుంది. ముఖం చాలా సీరియస్ గా పెడుతుంది. కమ్యూనిష్టు ఉద్యమాలకు సంబంధించిన పుస్తకాలు చదువుతుంది. ఆ పుస్తకాలు భాస్కర్రావు ఇచ్చినవే. సరళ భాస్కర్రావుకు రోజురోజుకు దగ్గర అవుతుంది. ఒకసారి అఖిల భారత విప్లవ సంఘం ఊరేగింపు సభలో పాల్గొని అరెస్టు అవుతుంది. సరళ తండ్రి బైలు మీద విడిపించి కూతర్ని ఇంటికి తీసుకువచ్చి కోపంతో కొడతాడు. మళ్ళీ సారీ చెప్పి నీ సిద్ధాంతం తప్పు అంటాడు. ‘కేవలం రాజ్యంగం నిర్దేశించిన పౌరహక్కులు కావాలన్నందుకు, ప్రభుత్వం తను చేసిన చట్టాన్ని ఉల్లంగిస్తుంటే, దానికి వ్యతిరేకంగా పోరాడినందుకు పోలీసులు ఎన్ని దుర్మార్గాలు చేశారో’ అని తండ్రితో చెబుతుంది. ఇంకా ముందు పుట్టడం కంటే ముందుకు వెళ్ళడం గొప్ప అని, ఎప్పటికయినా ఈ దేశాన్ని, ఈ దోపిడి వ్యవస్థ నుండి నాతరమే విముక్తి చేస్తుందని, నా కంఠంలో ప్రాణం ఉండగా నేను ఈ ఉద్యమబాట విడిచి పెట్టనని తన నిర్ణయాన్ని చెబుతుంది. మరునాడు సరళ తల్లిదండ్రులకు లేఖ రాసి భాస్కర్రావుతో వెళ్ళిపోతుంది. కొంత కాలానికి తాను వరంగల్లులో ఉన్నానని ఉత్తరము రాస్తుంది. సరళని చూడడానికి వాళ్ళమ్మ వెళ్ళొస్తుంది. సరళ భాస్కర్రావుతో కలిసి వరంగల్లులో ఒక ఇల్లు తీసుకుని విప్లవ పార్టీ ఆదేశాల మేరకు రహస్యంగా ఉంటుంది. పోలీసు కాల్పుల్లో దెబ్బలు తగిలిన నక్సలైట్లుకు రహస్యంగా వైద్యము చేస్తుంటుంది. దేశం మొత్తం మీద ఎక్కడ ఉద్యమం జరిగినా సరళ, భాస్కర్రారావులు ఆ ఉద్యమాల్లో పాల్గొంటారు. ఇదీ ఈ కథా సారాంశం.
ఈ కథ ద్వారా ప్రజలకోసం ఉద్యమిస్తూ జీవించడం గొప్ప అని, ఉద్యమం సరళరేఖ కాకపోవచ్చు గాని సరళలా ప్రజలకోసం ఉద్యమబాటలో నడవడమే నిజమైన మానవత్వం అని తెలుస్తుంది. అంతే కాదు తన స్నేహితురాలకు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక ఉద్యమబాట పట్టిన గొప్ప సంస్కర్తగా కవి ఈ పాత్రను దిద్దితీర్చారు. అందరూ స్పందించక పోచచ్చును గాని సున్నితమైన పాత్రలు ఇలానే స్పందిస్తాయని తెలుస్తుంది.
ఇ) రాక తప్పని మార్పు
ప్రభుత్వ పాలనలో లోపాలున్నప్పుడు, ప్రభుత్వమే టెర్రరిష్టులా మారినప్పుడు, విచ్ఛలవిడి దోపిడీ జరిగినప్పుడు, దేశంలో ధరల పెరుగుదల, హింస చెలరేగుతాయి. ప్రజలు తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఉద్యమాలు తీవ్రరూపం దాలుస్తాయి. ఆఉద్యమాల ప్రభావంతో మార్పు అనివార్యం అవుతుంది. ప్రజా ఉద్యమాలకు ప్రభుత్వాలు కూలుతాయి. హింస తగ్గుతుంది. ధరలు నియంత్రణలోనికి వస్తాయి. ఇలాంటి ఉద్యమ నేపథ్యంలో వచ్చిన కథే ‘రాకతప్పని మార్పు’. ఇందులోని కథాగమనాన్ని ఒకసారి పరిశీద్దాం.
మన్మధరావుకు యాభై ఏళ్ళు ఉంటాయి. అతని భార్య పేరు భూదేవి. అప్పుడప్పుడు ప్రేమతో ‘భువి’ అని పిలుస్తుంటాడు. ఈ మధ్యనే పెద్దకూతురు పెళ్ళి చేశాడు. చిన్న కూతురు చెన్నపట్నంలో ఇంజినీరింగ్ చదువుతుంది. చివర మగపిల్లవాడు ఫ్రాన్స్ లో చదువుతుంటాడు. మన్మధరావు ఫ్రాన్స్ చరిత్ర, ఫ్రాన్స్ విప్లవాలు చదువుకున్నవాడు. దేశంలో మండిపోతున్న ధరల వల్ల మన్మధరావు బాధ పడుతుంటాడు. ప్రభుత్వం ధరలు తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నా లాభం లేకపోతుంది. దేశంలో దోపిడి పాలన జరుగుతుంటుంది. ఒకవైపు మానవులు ఈ భూమిని ఎలా హింసిస్తున్నారో మన్మధరావు, అతని భార్య వార్తల ద్వారా తెలుసుకుంటారు. భూమి వేడెక్కి నిప్పుల కొలిమిలా మారిపోయిందని, నీరు కలుషితం, అడవుల నిర్మూలనం, ఆకాశం మలినం మొదలైన విషయాలు తెలుసుకొని మన్మధరావు కళ్ళనీళ్ళు గిర్రున తిరుగుతాయి. భూదేవికి గుండె బరువు ఎక్కుతుంది. పర్యావరణాన్ని పరిరక్షించుకొని జీవనం సాగించాలని మన్మధరావు ఒక అవగాహనకు వస్తాడు. మన్మధరావులో మధనం ప్రారంభం అవుతుంది. భూమిని రక్షించాలి. చుట్టూ ఉన్న ఆవరణాన్ని రక్షించాలి. సముద్రాలు, పర్వతాలు, అరణ్యాలు, ఎడారులు సమస్త జంతుకోటి, ప్రకృతి సిద్ధంగా ఉండాలి. వర్షాలు సక్రమంగా కురవాలి. ఇలా జరగాలంటే ప్రత్యక్ష చర్యకు దిగక తప్పదని మన్మధరావు ఆలోచిస్తాడు.
ఇంకొక వైపు దేశంలో, రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల్లో ఒకరినొకరు తిట్టుకొని ఒకరి రహస్యాలు ఒకరు బయట పెట్టుకున్నవారే ముఖ్యమంత్రులు అవుతారు. అక్రమార్జనలో ఒకరిని మించినవారు ఒకరు. రాజకీయ నాయకుల్లో హంతకులు కూడా ఉండడంతో అన్ని పార్టీల్లో ఆందోలనకారులు బయలుదేరుతారు. ప్రపంచ రాజకీయాలు, పోరాటాలు తెలిసినవారు ఒక కూటమిగా ఏర్పడి ఉద్యమం సాగిస్తారు. ఉద్యమ నిర్మాణం ప్రారంభమైనప్పటినుండి ధరలు తగ్గుతాయి. ఇదంతా మన్మధరావు పరిశీలిస్తుంటాడు. రష్యాలో లాగా ఒక అక్టోబరు విప్లవానికి ప్రజలు సిద్ధమవుతారు. పన్నెండు, పదమూడు ఏళ్ళుదాటిన ఆడపిల్లలు, మగ పిల్లలతో బాలసంఘాల నిర్మాణం కూడా జరుగుతుంటుంది. రక్షణశాఖ లోంచి, జైళ్ళశాఖ నుంచి కొందరు సానుభూతి పరులు ఉద్యమంలోనికి వచ్చి చేరుతారు. మన్మధరావు కూడా పోరాటంలోనికి దిగడానికి సిద్ధమవుతాడు. కరపత్రాలు పంచుతూ, విరాళాలు సేకరిస్తూ ప్రజలను చైతన్యపరుస్తాడు. భూదేవి కూడా మహిళలను పోరాటానికి సిద్ధం కావలిసిందిగా ఉద్బోధిస్తుంది. రాక తప్పనిమార్పు గురించి వివరిస్తుంది. రైతులు, కార్మికులు ఇతర కష్టజీవులు ఉద్యమంలో తమ ప్రాణాలు వడ్డడానికి కూడా సిద్ధమవుతారు. ఉద్యమం తీవ్రరూపం దాలుస్తుంది. ఈ ప్రభావంతో దేశంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యమ ప్రభావంతో మనుష్యుల్లో జంతు లక్షణాలు పోతాయి. అశేష ప్రజానీకం ఒక పెనుమార్పు కోరుకుంటుంది. పర్యావరణంలో కూడా మార్పులు కనపడతాయి. పెట్రో నిలవలు పెరిగి మనమే ఇతరులకు పెట్రోలు ఇవ్వవచ్చు అనే వార్తలు ప్రముఖ పత్రికల్లో వస్తాయి. ఉద్యమాల తాకిడికి జైళ్ళకు వెళ్ళేవారు తగ్గుతారు. ప్రేవేటు కాలేజీల్లో కొందరు స్వచ్ఛందంగా ఫీజులు తగ్గిస్తారు. అన్నిషాపులకు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఉండే బోర్డులు తెలుగుభాషలోనే ఉండి తీరేటట్టు ఆమోదం వస్తుంది. ఆకాశము నుండి మబ్బులు లేకుండానే చినుకులు రాల్తాయి. త్వరలో సమ సమాజం వస్తుందని ప్రజలు ప్రగాఢంగా నమ్ముతారు. సమాజం ఇటువంటి మార్పు తప్పదని నమ్ముతారు. ఇదీ క్లుప్తంగా కథా సారాంశం.
ఈ కథ ద్వారా ప్రజలు విసుగు చెందినప్పుడు, విరక్తి చెందినప్పుడు ఏదో ఒకరోజు తిరుగుబాటు చేస్తారని, ఈ విధమైన తిరుగుబాటు వలన మార్పు అనివార్యం అవుతుందని తెలుస్తుంది. పాలకవర్గాలకు, నడిమంత్రపు సిరిగాళ్ళకు, దోపిడీ దారులకు ఈ తిరుగుబాట్లు, ఈ ఉద్యమాలు నచ్చక పోయినా సమాజమంతా తిరగబడిన రోజున సమ సమాజ నిర్మాణం జరుగుతుందని ఈకథ మనకు తెలియజేస్తుంది.
4. ముగింపు:
- డా. మానేపల్లి తొలితరం ఉత్తరాంధ్ర కథా రచయితలైన రోణంకి అప్పలస్వామి, చా.సో, కా.రా, రావిశాస్త్రి, నారాయణబాబు, శ్రీశ్రీ వంటి ప్రముఖులతో పరిచయాలున్న వారు కావడం ఒక కారణమైతే, విరసంలో సభ్యుడు కావడం వలన ఆయనలో ఉద్యమ భావజాలం మెండుగా ఉంది.
- ఉపాధ్యాయ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాలుపంచుకోవడం, శ్రికాకుళ గిరిజన రైతాంగ పోరాటంపై పరిశోధన చేసినందున ఉత్తరాంధ్ర ఉద్యమాలపై అవగాన ఉన్నవారు మానేపల్లి. అందుచేతనే ఉద్యమ నేపథ్యంలో కథారచన చేసినప్పుడు ఆయా పాత్రలు అన్యాయం జరిగినప్పుడ ఎలా ఉద్యమించాయో తెలియజేశారు.
- ప్రభుత్వ పాలనలో లోపాలున్నపుడు, అరాచకం ప్రబలినప్పుడు, అన్యాయానికి గురైనప్పుడు, విసిగి వేసారినప్పుడు సమాజం పట్ల, దేశం పట్ల భక్తి, బాద్యత ఉన్న వారు ఎవరైనా ఎదురుతిరిగి ఎంతవరకైనా ముందు సాగడం నైజం.
- పై మూడు కథలూ మూడు విభిన్నమైన కథాంశాలతో సాగినా వాటి అంతిమ లక్ష్యం అన్యాయానెదిరించడమే. అక్రమాలపై తిరుగుబాటు బావుటా ఎగరేయడమే. రచయితలో కూడా అలాంటి భావజాలం లేకపొతే, సంఘంపట్ల సానుభూతి లేకపొతే ఇలాంటి పాత్రల సృష్టి జరుగదు.
- ఉద్యమనేపథ్యంలో డా.మానేపల్లి రాసిన ఈ కథలు మానేపల్లిని ఉత్తమ కథా రచయితల సరసన నిలబెడతయని నిస్సందేహంగా చెప్పవచ్చును.
5. సూచికలు:
- కథానికస్వరూపస్వభావాలు–పోరంకి దక్షిణామూర్తి: పుట:212
- దృష్టిసాహిత్యవ్యాసాలు -కేతు విశ్వనాధరెడ్డి; పుట:54
- నవలాశిల్పం -- వల్లంపాటివెంకటసుబ్బయ్య; పుట:21
- నిశాంత -సాహిత్యతాత్వికవ్యాసాలు– పాపినేనిశివశంకర్; పుట: 64
- Literary terms – by Robert conquest (page- 162)
6. ఉపయుక్త గ్రంధసూచి:
- చంద్రశేఖరరెడ్డి, రాచపాలెం. గురజాడ తొలికొత్త తెలుగు కథలు- శిల్పి ప్రచురణలు, అనంతపురం.
- దక్షిణా మూర్తి, పోరంకి. కథానికా స్వరూప స్వభావాలు. కథానికా వాఙ్మయం, ఆం. ప్ర . సాహిత్య అకాడమీ, హైదరాబాద్.
- పాలగుమ్మి, పద్మరాజు. తెలుగుకథా వికాసం- ఆంధ్ర సారస్వత సమితి, మచిలీపట్నం.
- రాంబాబు, వేదగిరి. తెలుగు కథానికకు వందేళ్ళు-శ్రీవేదగిరి కమ్యూనికేషన్స్, చిక్కడపల్లి, హైదరాబాద్.
- రాజారాం, మధురాంతకం. తెలుగు కథ పాత్రచిత్రణ (విమర్శనాత్మక వ్యాస సంపుటి ), ఆంధ్ర సారస్వత ప్రచురణ–4, 1974
- రామారావు, కాళీపట్నం. తెలుగు కథా కోశం, తెలుగు అకాడమీ, హైదరాబాద్, 2005
- రాములు, బి. ఎస్. సమగ్ర సాహిత్య కథ ( తాత్విక భూమిక )50 ఏళ్ళ తెలుగు కథ తీరుతెన్నులు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2003
- వీర్రాజు, శీలా. తెలుగు కథ (విమర్శనాత్మక వ్యాస సంపుటి), ఆంధ్ర సారస్వత సమితి, మచిలీపట్నం, 1974
- సత్యనారాయణ, మానేపల్లి. శ్రీకాకుళ పోరాట చరిత్ర. యలమంచిలి.
- సత్యనారాయణ, పాలకోడేరు. అందాల తెలుగు కథ, నవ భారతి ప్రచురణలు, బర్కత్ పురా, హైదరాబాద్, 1980
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "May-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-April-2025
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "MAY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి
బాధ్యత వహించరు.