headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను పూర్తిగా రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. ఇప్పటివరకు కేర్-లిస్ట్ లో ఉన్న అన్ని జర్నళ్ళు... ఇక పై "పీర్ రివ్యూడ్" జర్నళ్ళుగా కొన్ని ముఖ్యమైన "పారామీటర్లు" పాటిస్తూ కొనసాగాల్సి ఉంటుంది. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతుంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-9 | August 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

5. వ్యావహారిక భాష: “గిడుగు” అనంతర పరిణామాలు

డా. కె. ఉదయ్ కిరణ్

అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగుశాఖ,
డా. బి. ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం,
ఎచ్చెర్ల, శ్రీకాకుళంజిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9494188200, Email: udaykiran188200@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

గిడుగు మరణానంతరం అటు విద్యావిధానంలోనూ, ఇటు తెలుగు సాహిత్యంలోనూ వ్యావహారిక భాష ఏ విధంగా అమలులోకి వచ్చిందో తెలియజేయడమే ఈ పరిశోధనా వ్యాస ఉద్దేశ్యం. తెలుగు భాషా చరిత్రలో గిడుగు తరువాత విద్యావిధానంలో జరిగిన పరిణామాల వివరాలు చాలా తక్కువగా లభ్యమవుతున్నందువలన దానిని గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా వ్యావహారిక భాష ఆధునిక సాహిత్యంపై చూపిన ప్రభావాన్ని గమనించాలి. 1940 గిడుగు మరణం తరువాత విశ్వవిద్యాలయాల్లో శిష్ట వ్యావహారికం అమలులోకి వచ్చిందనే దానికి దారితీసిన పరిస్థితుల వివరణలు పెద్దగా కనిపించవు. ఈ వ్యాసంలో విద్యావిధానం, సాహిత్యం ఈ రెండు అంశాలనే ప్రధానంగా పొందుపరచడానికి కారణం ఇతర రంగాలలో అంటే రేడియో, పత్రిక, సినిమా మొదలైనవాటిలో అప్పటికే వ్యావహారిక భాష అమలులో ఉండడం. ఈ వ్యాసం ద్వారా వ్యావహారిక భాషను విద్యలో అమలు చేయటానికి ఏర్పడిన కమిటీలు, వాటి సిఫార్సులను తెలియజేయడం, ఆధునిక తెలుగు సాహిత్యానికి వ్యావహారిక భాష ఎంతగా ఉపయోగపడిందో వివరించడమే ప్రధాన ఉద్దేశ్యం.

Keywords: వ్యావహారిక భాష, గిడుగు కృషి, గిడుగు మరణం తరువాత వ్యావహారిక భాష అమలుకు ప్రభుత్వ కమిటీల నిర్ణయాలు, సాహిత్యంలో వాడుక భాష

1. ఉపోద్ఘాతం:

తెలుగు భాషా చరిత్రలో 20వ శతాబ్ది ఆరంభంలో ఆంధ్రరాష్ట్రంలో సంభవించిన మహా విప్లవం వ్యావహారిక భాషోద్యమం. 1906సంవత్సరంలో విశాఖపట్నానికి విద్యా విచారణాధికారిగా వచ్చిన జె. ఎ. యేట్స్ దొరకు కలిగిన అనుమనపు బీజం విద్యా వ్యవస్థలో పెను మార్పులకు కారణమయ్యింది. అది మొదలు గిడుగు వెంకట రామమూర్తి 22, జనవరి, 1940సంవత్సరంలో తన తుది శ్వాసవిడిచే వరకూ పట్టువదలని విక్రమార్కునిలా వ్యావహారిక భాషోద్యమాన్ని ఆంధ్ర దేశమంతటా వ్యాప్తి చేశారు.

2. రచనా నేపథ్యం: 

తెలుగు భాషా చరిత్రలో గిడుగు మరణం తరువాత మరలా 1955 సంవత్సరంలో మద్రాసు విశ్వవిద్యాలయం వ్యావహారిక భాషను ప్రవేశపెట్టిందని, 1965 సంవత్సరంలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, 1973 లో ఆంధ్ర విశ్వకళా పరిషత్ దానిని అనుసరించాయన్న అంశములతో వ్యవహారిక భాషోద్యమం సంపూర్ణమయినట్టు ముగింపు కనపడుతోంది.

గిడుగు మరణానికి, విశ్వవిద్యాలయాల్లో వ్యవహారిక భాష ఆమోదానికి మధ్య ఆ దిశగా జరిగిన ప్రయత్నాలు, ఏర్పడిన కమిటీలు, వాటి తీర్మానాలు అతి కొద్దిగా మాత్రమే లభిస్తున్నందువలన ఆ వివరాలను  పరిచయం చేయటంతో పాటు ఆధునిక తెలుగు సాహిత్యంపై వాడుక ప్రభావం ఎంతగా ఉన్నదో తెలియజేయడమే ఈ పరిశోధనాపత్రం సారాంశం. ఇతర రంగాలలో అప్పటికే వ్యవహారిక భాష నడుస్తుండడంతో కేవలం ఈ రెండు అంశాలను మాత్రమే ఇక్కడ వివరించదలిచాను.

3. గిడుగు వ్యావహారిక భాషోద్యమం: 

సవర భాషాభివృద్ధికి విశేషమయిన కృషి చేసినవారిగా, నిఘంటు కర్తగా, పత్రికా సంపాదకునిగా, భాషావేత్తగా, శాసన పరిశోదకునిగా, తెలుగు భాషోద్యమ సారధిగా గిడుగు రామమూర్తి పంతులు సుప్రసిద్ధులు. వ్యావహారిక భాషోద్యమాన్ని ఉరకలెత్తించటానికి గిడుగువారు పురాణేతిహాసాది ప్రాచీన కావ్యాలలో వ్యావహారిక ప్రయోగాలను ప్రస్తావించటానికి సారించిన దృష్టి వారి తర్కబద్ధ నిరూపణా మార్గానికి నిదర్శనం. అటువంటి ఆయన కృషికి మూల కారకుడు మాత్రం ఆంగ్లేయుడే.

ఆంగ్లేయులు మన ప్రాంతానికి రాక మునుపు తెలుగు భాషకి మూలం సంస్కృతమనే అపోహ వేళ్ళూనుకుంది. సంస్కృతాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నవారే పండితులనే దురభిప్రాయం కూడా నాడు తెలుగు నాట స్థిరపడిపోయింది. సంస్కృత భాష ద్వారా ప్రభావితమయిన గ్రాంథిక భాష గొప్పదనే భావన సర్వత్రా నెలకొంది. ఆంధ్రరాష్ట్రంలో ముద్రణా యంత్రాలు వచ్చి పత్రికల నిర్వహణ గణనీయంగా పెరిగింది. కానీ “ఆంధ్ర భాషా సంజీవని”, “పురుషార్థ ప్రదాయిని”, “అముద్రిత గ్రంథ చింతామణి” వంటి ఆ పత్రికల పేర్ల సైతం గ్రాంథిక భాషపై తెలుగువారికి గల వ్యామోహాన్ని తెలియజేస్తున్నాయి. అంటే కాకుండా ఆయా పత్రికల్లో యతిప్రాసల గురించి, శబ్దస్వరూపాల గురించి, పదాల అర్థ వివరణ చర్చలు మాత్రమే విశేషంగా ముద్రితమయ్యేవి. అటువంటి చర్చలకు సారస్వత సంఘాల స్పర్ధలు, గ్రాంథికవాదుల స్వీయ పాండితీ ప్రక ర్షను నిరూపించుకోవటం వంటి అంశాలు ఆజ్యం పోసాయనేది జగమెరిగిన సత్యం.

ఆ పరిస్థితుల్లో మన విద్యావిధానంలో కూడా గ్రాంథిక భాష రాజ్యమేలింది. 1906 వ సంవత్సరంలో జె. ఏ. యేట్స్ దొర (ఉత్తర సర్కారు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్) పాఠ్యాంశాలలో భాషకి, వ్యావహారిక భాషకి మధ్య విస్తృత బేధాన్ని గమనించి తన అనుమానాన్ని అప్పటి ఏ. వి. ఎన్. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ పి. టి. శ్రీనివాసయ్యంగార్ ముందుంచారు. సంపూర్ణంగా తన అనుమానాన్ని నివృత్తి చేసుకోడానికి శ్రీనివాసయ్యంగార్ ద్వారా గురజాడ, గిడుగులను కలుసుకున్నారు. అప్పటికే దాదాపు రెండు దశాబ్దాలకు ముందు నుండి సవర భాషకి ఎనలేని సేవ చేసిన గిడుగువారు పాఠ్యాంశాలలో, పరీక్షలు రాయటంలో వాడుక భాష ఆవశ్యకతను గుర్తించారు. జె. ఏ. యేట్స్ ఆధ్వర్యంలో 1907 సంవత్సరం నుండి 1911 సంవత్సరం వరకు ఉపాధ్యాయ వార్షిక సమావేశాల్లో గిడుగువారు తెలుగు భాషా పరిణామాన్ని, విద్యావిధానంలో దానిని ప్రవేశపెట్టవలసిన నూతన రీతుల్ని గురించి ఉపన్యసించారు. ఆంగ్లేయుల విద్యావిధానం వలన సమాజంలో అందరికీ చదువుకునే అవకాశం కలిగింది. కానీ పాఠ్య పుస్తకాలు, పరీక్షలు రాయటం మొదలయినవి గ్రాంథిక భాషలో ఉండటం వలన విద్యాభ్యాసం పూర్తి చేయటం అందరికీ సాధ్యమయ్యేది కాదు. కనుకనే గిడుగువారి అడుగులు శిష్ట వ్యావహారిక భాషని గ్రంథస్థ భాషగా అంగీకరింపచేసే దిశగా ముందుకు నడిచాయి. శిష్టవ్యవహారికాన్ని అమలుపరచటం వలన అందరికీ మేలు జరుగుతుందనేది గిడుగువారి భావన. ఆ కారణంగానే 1911వ సంవత్సరంలో వ్యావహారిక భాషోద్యమానికి నడుం బిగించారు గిడుగు రామమూర్తి పంతులు.

ఆయన కృషి ఫలితంగానే 1911వ సంవత్సరంలో పాఠ్యాంశాలు శిష్టవ్యావహారికంలో ఉండేటట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే వ్యవాహారిక భాషని నేర్చుకోడానికి వ్యాకరణం, నిఘంటువులు అనువుగా లేవని అందువలన దానిని అభ్యసించడం కష్టమని గ్రాంథికవాదులు ఈ విధానానికి అడ్డుపడ్డారు. వారి కోరికపై విద్యకు గ్రాంథికమా? శిష్ట వ్యవహారికమా? ఏది మేలు అని నిర్ణయించడానికి త్రిసభ్య కమిటీని ప్రభుత్వం నియమించింది. అందులో వ్యవహారికాన్ని సమర్ధించే గురజాడ ఏకాకి కావడం వలన 1914వ  సంవత్సరంలో పాఠశాలల్లో వ్యవహారికాన్ని వాడరాదని మద్రాసు విశ్వవిద్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

“ఈ జీ. ఓ. పుట్టేసరికి రామమూర్తీ నీవు నీ గంజాం జిల్లాకు జీఓ (go) అన్నట్లయిందని పానుగంటివారు వేళాకోళం చేశారు.” [గిడుగు రామమూర్తి జీవితం - ఉద్యమం - డా. అక్కిరాజు రమాపతిరావు - పుట. 38.] 

వ్యావహారిక భాషోద్యమాన్ని నడపడానికి 1919 సంవత్సరంలో గిడుగు “తెలుగు పత్రిక” ను స్థాపించారు. కానీ అది ఎక్కువ కాలం నడవలేదు. 28. 02. 1919 న “వర్తమానాంధ్ర భాషా ప్రవర్తక సమాజం” ఏర్పడింది. ఈ సంస్థ ఏర్పడటానికి కందుకూరి వీరేశలింగం తన వంతు కృషి చేసారు.

గ్రాంథికవాదుల్ని సైతం తన వాదనలతో ప్రతి సమాధానం ఇవ్వలేనంతగా కట్టడి చేసేవారు. అందుకు వారి వారి రచనలలో గల వాడుక మాటలనే ఉదాహరణగా చూపించేవారు. వేదం వేంకటరాయ శాస్త్రి, చిలకమర్తి లక్ష్మీ నరసింహం, పానుగంటి లక్ష్మీ నరసింహం, జయంతి రామయ్య పంతులు, కొమర్రాజు లక్ష్మణరావు మొదలయినవారందరూ గిడుగు వాదనలకి తలొగ్గినవారే.
గిడుగు రామమూర్తి పంతులు వాదనలో సారాంశాన్ని ఆచార్య గంటి జోగిసోమయాజులు ఇలా చెప్పారు.

“గ్రాంథిక భాష చచ్చిన భాష
అందెవ్వరు వ్రాసినను తప్పులుండక మానవు
అది పండితులకే తెలియదు
వ్యావహారిక భాష జీవద్భాష
అది సుబోధకంగానుండును
ఎల్లరకును తెలిసినది
పండితులకు గ్రాంథిక భాష పేర వాడునది కృతకము” [ఆంధ్ర భాషా వికాసము - ఆచార్య గంటి జోగిసోమయాజి  - పుట. 238.]

1933 మార్చి సంవత్సరం నుండి 1938 ఫిబ్రవరి మధ్య నవ్య సాహిత్య పరిషత్తు ఆధ్వర్యంలో అభినవాంధ్ర కవి పండిత సభ పేరున సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లో గిడుగు అత్యంత ముఖ్యమయిన పత్ర పోషించారు. 1933వ సంవత్సరంలో గిడుగువారు రచించిన గద్య చింతామణి, బాలకవిశరణ్యం, ఆంధ్ర పండితభిషక్కుల భాషా భేషజం, వ్యాసావళి వంటి గ్రంథాలు ప్రచురించారు.
1940 జనవరి 22 న గిడుగువారి మరణం వ్యవహారిక భాషోద్యమానికి తీరని లోటు. దాదాపు మూడు దశాబ్దాల పాటు ఉద్యమాన్ని నడిపిన గిడుగువారు తన జీవితకాలంలో సాధించలేకపోయింది శిష్ట వ్యవహారికాన్ని గ్రంథస్థభాషగా అంగీకరింప చేయలేకపోవటమే. మద్రాసు ప్రజామిత్ర కార్యాలయంలో వారు మాట్లాడిన చివరి ప్రసంగంలో ఇక వ్యావహారిక భాషను ఆమోదించడానికి విద్యశాఖవారు, యూనివర్సిటీలు మాత్రమే కనికరించడంలేదని

25 సంవత్సరముల క్రిందట ఈ రెండు సంస్థల వారున్ను వాడుకభాషను గ్రహించవలెనని చూచినప్పుడు, నా వాదం తెలుగువారు గ్రహించకపోవడం చేతను అలజడి ఎక్కువయినది. అందుచేత ఆ సంస్థల వారు దానిని గ్రహించలేదు. ఇప్పుడు తెలుగువారు నా వాదం గ్రహించినారు గనక, ఆ సంస్థలవారు గ్రహించి ఆమోదించేటట్లున్ను, ఆచరణలో పెట్టేటట్లున్ను చేయవలసిన భారం మీది. ఈ పని మీకు అప్పగించి నేను విరమిస్తున్నాను - సెలవు” [గిడుగు వేంకట రామమూర్తి - హెచ్. ఎస్. బ్రహ్మానంద, పుటలు. 34,35.] అని తన తుదివిన్నపంలో గిడుగు వేడుకున్నారు.   

4. గిడుగు అనంతరం విద్యావిధానంలో వ్యావహారిక భాష అమలు - పరిణామాలు:

గిడుగు తదనంతరం గ్రాంథిక భాషావాదులు ఉద్యమాలు చేయడంతో విద్యావిధానంలో ఏ భాష అవసరం అనే అంశంపై పోణంగి శ్రీ రామ అప్పారావు పర్యవేక్షణలో కమిటీ ఏర్పడింది.

4.1 పి. ఎస్. అప్పారావు కమిటీ సూచనలు:

ఈ కమిటీ నిర్ణయం ప్రకారం “సరళ గ్రాంథిక భాష”ని, “వ్యావహారిక భాష”ని విద్యావిధానంలో అమలు చేయాలని ఉంది. [IOSR Journal of humanities and social sciences (IHSS) - Volume -5, Evolution of Telugu language teaching PP - 33 - 36.] 

4.2 పింగళి లక్ష్మీకాంతం కమిటీ సూచనలు:

1965సంవత్సరంలో విశ్వవిద్యాలయాల్లో పాఠ్య గ్రంథాలలో ఉండవలసిన శైలి విషయంగా జరిగిన చర్చలో ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి పూర్తిగా వ్యావహారికభాషా శైలికి మొగ్గుచూపగా “ఈ విషయంలో ఏకాభిప్రాయం కోసం పింగళి లక్ష్మీకాంతంగారి అధ్యక్షతన ఒక సమావేశం జరిగింది. ఆ తర్వాత వారి అధ్యక్షతనే ఒక స్టయిల్ కమిటీ ఏర్పడింది.” [గిడుగు  సీతాపతి జీవితం - రచనలు- బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు - పుట. - 52.] ఈ కమిటీ తీర్మానాలను దృష్టిలో ఉంచుకొని తెలుగు భాషాభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ అధ్యక్షునిగా జె. పి. ఎల్. గ్విన్ నియమితులయ్యారు. ఈ కమిటీ మూడు నెలలలోనే ప్రభుత్వానికి తమ నివేదికని సమర్పించింది.

4.3 జె. పి. ఎల్. గ్విన్ కమిటీ నివేదిక: 

భారత సివిల్ సర్వీసెస్ లో పని చేస్తున్న గ్విన్ ను ఈ కమిటీ అధ్యకునిగా నియమించటం ద్వారా తెలుగు భాష ఆధునికతకి, భాషాభివృద్ధికి అవసరమయ్యే మార్గాల్ని, సూచనల్ని చెపుతూ, పరిపాలనకి ఉపయోగపడేలా భాష ఏ విధంగా ఉండాలో తెలియజేయాలని కోరింది.   గ్విన్ కమిటీ నివేదిక ఆధారంగా తెలుగు అకాడెమీ ఏర్పడింది. [Educational Administration - S. B. Naugia, Pg. No. - 256.]
గ్విన్ కమిటీ నివేదిక ఆధారంగా ఆంధ్రరాష్ట్రంలో తెలుగు అకాడెమీ తన కార్యకలాపాలని ప్రారంభించింది.

ఈ కమిటీల నిర్ణయాల పట్ల ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించి కృషి చేయడంతో ఉన్నత విద్యలలో వ్యావహారిక భాష అమలుకు మార్గం సుగమం అయ్యింది. అది మొదలు నేటికీ కూడా వ్యవహారికంలోనే సాగుతున్నాయి. వ్యావహారిక భాషోద్యమం కనుక ప్రారంభం కాకపోతే, కవి ప్రయోగాలయిన పదజాలాన్ని అంతా ప్రామాణికమని, అన్యదేశ్యాలని కూడా గ్రాంథికమని అంగీకరించక తప్పేది కాదేమో. తెలుగు పదజాలాన్ని మరిచే పరిస్థితి ఏర్పడేదేమో. అదే కనుక జరిగి ఉంటే దూరపు కొండలు నునుపు అన్న చందాన మాతృభాషని తృణీకరించి గ్రాంథిక పదాలతో సహవాసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడేది.

గిడుగు నడిపిన వ్యావహారిక భాషోద్యమం దాదాపు మరొక 30 సంవత్సరాల పాటు అనేకమయిన అగ్నిపరీక్షలని ఎదుర్కొని స్వచ్ఛమయిన మేలిమి బంగారంగా ఉబికి వచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో శాశ్వత స్థానాన్ని అధిరోహించింది.

5. గిడుగు అనంతరం వెలువడిన వ్యవహారిక తెలుగు సాహిత్యం:

“చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి తమ అవధానాల్లోనూ, వ్యాస రచనల్లోనూ వ్యావహారికం వాడటం మాత్రమే కాకుండా రామమూర్తి సిద్ధాంతాన్ని ప్రచారం కూడా చేశారు: “తెలుగుకున్న వ్యాకరణ దీపం చిన్నది” అన్నది కూడా వారే.” [గిడుగు వేంకట రామమూర్తి - హెచ్. ఎస్. బ్రహ్మానంద, పుట. 84.]

ఆధునిక తెలుగు సాహిత్యంలో సంప్రదాయవాదిగా కనిపించే విశ్వనాథ సత్యనారాయణ కూడా తన గురువుగారి అభిప్రాయాన్ని సమర్ధిస్తూ కృష్ణా పత్రికలో “సరస్వతి నోముల పంట శ్రీ గిడుగు రామమూర్తి” అనే శీర్షికతో వ్యాసాన్ని రాసారంటే వారి ప్రభావం శ్రీశ్రీ వంటి అభ్యుదయ కవుల పైన ఇంకెంత ఉండి ఉంటుందో వేరుగా చెప్పవలసిన అవసరం లేదు. శ్రీశ్రీ స్వయంగా తన మహాప్రస్థానానికి సంబంధించినంత వరకు గిడుగు వారి వాడుకభాష ప్రభావంతోనే రచన సాగిందని పేర్కొన్నారు.

మాధవపెద్ది గోఖలే, పోరంకి దక్షిణామూర్తి, రావిశాస్త్రి మొదలైనవారు మాండలికభాషలో నవలలు, కథలు రాసి, వాటికి సాహిత్య భాషా గౌరవాన్ని తెచ్చిపెట్టారు.” [భాషా తపస్వి గిడుగు - ఆచార్య వెలమల సిమ్మన్న,పుట. 176. ]

“ప్రజావిద్య” అని పంతులుగారు కోరుకున్నది వస్తువులోను రూపంలోను సాహిత్యంలోను మార్పును తీసుకు వచ్చే చదువునే.

అందుకే ఈనాడు గద్దర్, వంగపండు ప్రసాదరావు, అల్లం రాజయ్య, శివసాగర్ మొదలైన ప్రజా రచయితల ప్రజాకళారూపాల్ని చూసి ఉంటే రామమూర్తిగారు తమ ఉద్యమం సఫలమైందని సంతసించేవారు.”[. గిడుగు వేంకట రామమూర్తి - హెచ్. ఎస్. బ్రహ్మానంద, పుట. 85. ]   

6. ముగింపు:

  • 1940 సంవత్సరంలో గిడుగు మరణించిన తరువాత నుండి 1973 సంవత్సరంలో విశ్వవిద్యాలయాలలో శిష్టవ్యవహారికాన్ని అమలు చేయడానికి మధ్య సంధి కాలంలో జరిగిన పరిణామాలు అక్కడక్కడా మాత్రమే ప్రస్తావితమయ్యాయి.
  • అందువలన వ్యావహారికభాషోద్యమ చరిత్రను అర్థాంతరంగా ముగించిన భావన లేదా మూడు దశాబ్దాల వివరాలను పొందుపరచకుండానే ముగించిన భావన కలగడం వలన ఏర్పడిన లోటును కొంతయినా పూరించే ప్రయత్నం ఈ వ్యాసం ద్వారా నెరవేరుతుంది.
  • ఈ సమాచారం భవిష్యత్ లో వ్యావహారిక భాషోద్యమం గురించి తెలుసుకోవాలనుకునే వారికి మరింత అదనపు విషయాన్ని అందించగలుగుతుందని ఆశిస్తున్నాను.

7. పాదసూచికలు:

  1. గిడుగు రామమూర్తి జీవితం - ఉద్యమం - డా. అక్కిరాజు రమాపతిరావు - పుట. 38.
  2. ఆంధ్ర భాషా వికాసము - ఆచార్య గంటి జోగిసోమయాజి  - పుట. 238.
  3. గిడుగు వేంకట రామమూర్తి - హెచ్. ఎస్. బ్రహ్మానంద, పుటలు. 34,35.
  4. A committee was established under the guidance of P S R Apparao to give suggestions for nationalize the text books. A conference with delegates taken place under the presidency of Pingali Lakshmikantam to decide the language style to be developed in the telugu textbook. They decided to divide the Telugu textbooks into two types based on the style of the language followed in the textbooks. 1.First language textbooks - Textbooks for the Mother tongue people in which the language followers was “Sarala Granthika Bhasha”(simple written language) 2. Second language textbooks - Textbooks for those who opted Telugu as a second language in which followed “Vyavaharika Bhasha”( spoken style of language)”
  5. IOSR Journal of humanities and social sciences (IHSS) - Volume -5, Evolution of Telugu language teaching PP - 33 - 36.
  6. గిడుగు  సీతాపతి జీవితం - రచనలు- బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు - పుట. - 52. 
  7. Based on the report of the “Gwynn” committee the state government established as institute of Telugu at the state level in 1968 and named it “Telugu Academy”. It started functioning from 6th August 1968[Educational Administration - S. B. Naugia, Pg. No. - 256.]
  8. గిడుగు వేంకట రామమూర్తి - హెచ్. ఎస్. బ్రహ్మానంద, పుట. 84.
  9. భాషా తపస్వి గిడుగు - ఆచార్య వెలమల సిమ్మన్న,పుట. 176.
  10. గిడుగు వేంకట రామమూర్తి - హెచ్. ఎస్. బ్రహ్మానంద, పుట. 85. 

8. ఉపయుక్తగ్రంథసూచి:

  1. జోగిసోమయాజి.  గంటి (1968)- ఆంధ్ర భాషా వికాసము - త్రివేణి పబ్లిషర్స్, మచిలిపట్టణము -1 & మద్రాసు - 1
  2. బ్రహ్మానంద. హెచ్. ఎస్.(1990) -  గిడుగు వేంకట రామమూర్తి - సాహిత్య అకాడెమీ, న్యూ ఢిల్లీ.
  3. భాషా తపస్వి గిడుగు(2023) - ఆచార్య వెలమల సిమ్మన్న- గిడుగు వేంకట నాగేశ్వరరావు, హైదరాబాద్
  4. రమాపతిరావు.అక్కిరాజు (2006) గిడుగు రామమూర్తి జీవితం - ఉద్యమం - పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్.
  5. శ్రీనివాసాచార్యులు. బొమ్మకంటి(1988)- గిడుగు సీతాపతి జీవితం - రచనలు - తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు 
  6. IOSR Journal of Humanities and Social Sciences (IHSS) - Volume -5, Evolution of Telugu Language teaching
  7. Nangia.  S. B.(2014) -  Educational Planning and Administration - APH Publishing Corporation New Delhi, Editor: M Brindhamani, ISBN:978 - 93 - 313 - 2123 -7

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "May-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-April-2025

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "MAY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Letter of Support - Format
[for Research Scholars only]