headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను పూర్తిగా రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. ఇప్పటివరకు కేర్-లిస్ట్ లో ఉన్న అన్ని జర్నళ్ళు... ఇక పై "పీర్ రివ్యూడ్" జర్నళ్ళుగా కొన్ని ముఖ్యమైన "పారామీటర్లు" పాటిస్తూ కొనసాగాల్సి ఉంటుంది. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతుంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-7 | June 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

14. శ్రీమన్మహాభారత కర్ణ-శల్య-సౌప్తిక-స్త్రీపర్వాలు: ధర్మానుసరణలో ధర్మజుని వైశిష్ట్యం

డా. ముళ్ళపూడి బి.ఎస్.ఎస్. నారాయణ

సంస్కృత సహాయాచార్యులు, భాషాసాహిత్యశాఖ,
ప్రశాంతినిలయం ప్రాంగణం, శ్రీసత్యసాయి విశ్వవిద్యాలయం.
శ్రీసత్యసాయి జిల్లా – 515134, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9966108560, Email: mullapudibssnarayana@sssihl.edu.in
Download PDF


వ్యాససంగ్రహం:

“అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడజాతశత్రువే యలిగిననాడు ---“ ధర్మదీక్షాదక్షుడైన ధర్మజుడు కర్ణుడు చేసిన అవమానానికి అర్జునుడి పై అలక బూనిన కారణంగా కర్ణపర్వం ఒక మలుపు తిరిగిందనే చెప్పుకోవాలి. దాని పర్యవసానంగా కర్ణుడి మరణముతో ధర్మజుడు శాంతించాడు. శత్రుశేషాన్ని మిగల్చకుండా శల్యదుర్యోధనులను వీరస్వర్గానికి పంపి విజయలక్ష్మిని వరించాడు యుధిష్ఠిరుడు. కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీపర్వాలలోని ధర్మజుని ధర్మమార్గనిష్ఠను ఈ వ్యాసం చర్చిస్తుంది.

Keywords: కర్ణభారం, అర్జునుడు ధర్మరాజుని సంహరించటానికి ఉద్యుక్తుడగుట, కర్ణుని మరణము, శల్యపర్వం, యుధిష్ఠిర దుర్యోధన సంవాదము, సౌప్తికపర్వం. స్రీపర్వం, ధర్మజుని దివ్యదృష్టి- అనుస్మృతి, కర్ణుడు తన సోదరుడని ధర్మజుడు తెలుసుకొనుట.

ఉపోద్ఘాతం:

భీష్మ,ద్రోణపర్వాలలో తన ధర్మదీక్షతోనూ, పెద్దలపట్ల ప్రదర్శించవలసిన వినయవిధేయతలతోనూ విజయానికి చేరువైన పాండునందనుడు ఇక పై మరింత మానసిక వత్తిడికి గురి కావలసివచ్చింది. ధర్మజుడు ఎవరి పరాక్రమాన్ని తలుచుకుని ఇన్నాళ్ళూ నిద్రలేని రాత్రులు గడిపాడో అటువంటి కర్ణుడు సర్వసైన్యాధ్యక్షుడిగా ఎదురయ్యాడు. ధర్మజుని అవమానించాడు. పాండవులు వారి ప్రతిజ్ఞలను నిలబెట్టుకోవటం కోసం, వచ్చిన ఎన్నో అవకాశాలను వదులుకుని కర్ణాదులను వదిలిపెట్చిన సందర్భాలూ ఉన్నాయి. చివరికి శ్రీకృష్ణుడి అనుగ్రహంతో అర్జునుడి సత్యవాక్కులతో విజయం వశమయింది. ఒంటరియైన దుర్యోధనుడు జలస్థంభన విద్య ద్వారా కృష్ణద్వైపాయనహ్రదంలో దాక్కున్నప్పుడు యుధిష్ఠిరుడు తన మాటలనే అస్త్రాలుగా ప్రయోగించి భీముడితో ద్వంద్వయుద్ధానికి సిద్ధం చేయించాడు.

కర్ణ(భారం)పర్వం:

పదహారవరోజు యుద్ధంలో యుధిష్ఠిర-దుర్యోధనుల మద్య యుద్ధం జరిగింది. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఆ యుద్ధంలో యుధిష్టిరుడే విజయం సాధించాడు. ధనుర్యుద్ధం చేశారు, కాసేపు కత్తి పట్టారు. అన్ని సందర్భాలలోనూ ధర్మరాజే దుర్యోధనుడిని పరాజయం పాలు చేస్తూ వచ్చాడు. చివరికి యుధిష్ఠిరుడు ప్రయోగించిన శక్తి ఆయుధం గుండేల్లో దిగి మూర్ఛపోయాడు దుర్యోధనుడు.

                 తముద్యతగదం దృష్ట్వా దండహస్తమివాత్మకమ్

                  ధర్మరాజో మహాశక్తిం ప్రాహిణోత్ తవ సూనవే. 29.30,31

భీముడు చేసిన ప్రతిజ్ఞ గుర్తు చేసుకుని దుర్యోధనుడిని చంపకుండా వదిలివేశాడు యుధిష్ఠిరుడు.

పదిహేడవరోజు యుద్ధంలో కర్ణుడికి ముందుగా యుధిష్ఠిరుడు కనిపించాడు. వారిమధ్య జరిగిన యుద్ధంలో కర్ణుడు సునాయాసంగా విజయం సాధించాడు. ధర్మరాజు రథాన్ని నువ్వుగింజలంతగా ముక్కలు చేశాడు. ఆ సమయంలో కర్ణుడితో పోరు మంచిది కాదనిపించి ధర్మరాజు యుద్ధవిముఖుడై పక్కకు తొలగి పోతుంటే కర్ణుడు రథం మీదనుండే ధర్మారాజుని (వీపుని) తాకి తాను పవిత్రుడవుదామనుకున్నాడు. ధర్మరాజుని అది అవమానించినట్టే. వెంటనే శల్యుడు కర్ణుడి చర్యను గమనించి నీ ప్రయత్నం ఆపు కర్ణా, నీవు ఆయన్ని తాకిన వెంటనే తన క్రోధాగ్నితో నిన్ను భస్మం కూడా చేయగల సమర్థుడు ధర్మరాజు అని వారించాడు. కర్ణుడు ఆ ప్రయత్నాన్ని ఆపి పరుషపు మాటలతో ధర్మరాజుని అవమనించాడు. “నీకు యుద్ధం ఎందుకు? ఇంటికి పో, లేకపోతే అరణ్యాలకు పోవయ్యా.  కర్ణుడు నిన్ను ఏనాడూ సంహరించడు”. అని కుంతికి ఇచ్చిన మాటను గుర్తు చేసుకుని పాండవ సైన్యం పై పడ్డాడు.

ఈ సయయంలోనే ధర్మరాజు బాణాలతో గాయమైన శరీరంతో విశ్రాంతికోసం నకులుడి రథంలో శిబిరం వైపు వెళుతుంటే కర్ణుడు మరలా వెంటబడి ధర్మరాజుని బాణాలతో కొట్టాడు. దుర్యోధనుడు చూస్తున్నాడని చేసిన దుశ్చర్య ఇది. నకులుడిని కూడా గాయపరిచి వారు ప్రయాణిస్తున్న రథాన్ని నాశనం చేశాడు. ధర్మరాజునే  లక్ష్యంగా చేసుకుని శరప్రహారం చేస్తుంటే శల్యుడు కర్ణుడిని వారించి ధర్మరాజుని విడిచిపెట్టు. నీవు పోరాడవలసింది అర్జునుడితో. అదిగో అర్జునుడు దుర్యోధనుడి వైపుకే వస్తున్నాడు. ఈ స్థితిలో ఉన్న ధర్మరాజుతో పోరాడటం నీకే అవమానకరం. అని కర్ణుడి మనసు అర్జునుడి పై మరలించాడు. ధర్మరాజు సహదేవుడి రథం ఎక్కి విచారంగా శిబిరానికి వెళ్లిపోయాడు. శరీరంలో గుచ్చుకున్న బాణాలు తీసుకుంటూ ఔషధాలు సేవించి  శరీరానికి కాస్త విశ్రాంతినిచ్చాడు. ధర్మరాజు కనిపించపోవటంతో విషయం తెలుసుకుని కృష్ణార్జునులు కూడా ధర్మరాజుని పరామర్శించటానికి శిబిరానికి చేరుకున్నారు.

3. కర్ణుని మరణము:

కర్ణుడి పరాక్రమాన్ని చూసి కృష్ణుడు అర్జునుడితో ‘నీ దివ్యాస్త్రాలను ప్రయోగించి కర్ణుడి శిరస్సు ఖండించు అర్జునా’ అని సూచించాడు. కృష్ణుడి ఆజ్ఞతో అర్జునుడు ఒక ఉత్తమమైన బాణాన్నితీసుకుని గాండీవానికి సంధించి బాగా లాగుతూ – “మహాస్త్ర ప్రేరితమైన ఈ మహాశరం దుర్మనస్కుల శరీరాలను, హృదయాలను, ప్రాణాలను అపహరించగలది. నేను తపస్సు చేసిఉంటే గురువులను ఆనందింపజేసి ఉంటే, యాగాలు చేసి ఉంటే, మిత్రుల మాటలు విని ఉంటే, ఈ బాణం కర్ణుని సంహరించును గాక”-

తపోsస్తి తప్తం గురవశ్చ తోషితా మయా యదీష్టం సుహృదాం శృతం తథా

 అనేన సత్యేన నిహన్త్వయం శరః సుసంహితః కర్ణమరిం మమోర్జితమ్.      91,46

అంటూ అధర్వ అంగిరస మంత్రాల ద్వారా పుట్టించిన కృత్యను ప్రజ్వలింప చేస్తూ విడిచిపెడుతూ మరలా– ఈ బాణం సూర్య చంద్రుల ప్రభావంతో కర్ణుడిని యమలోకానికి తీసుకుపోవాలి, నాకు విజయం చేకూర్చాలి అని కోరుకున్నాడు అర్జునుడు. ఇంతకంటే మంత్రం ఏం కావాలి, రామాయణంలోకూడా ఇంద్రజిత్తుని సంహరించటానకి లక్ష్మణుడు ఎన్నో రకాలుగా ప్రయత్నించి చివరికి ఒక బాణాన్ని తీసి "ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది, పౌరుషేచా ప్రతిద్వంద్వే శరైనం జహి రావణిమ్" అని శరాన్ని విడిచిపెడతాడు. ఆటువంటి సత్యవాక్యాలే మహా మంత్రాలై ఆ శరం శత్రువుని సంహరిస్తుంది. సత్యానికున్న బలం అటువంటిది. పదిహేడవరోజు మధ్యాహ్న సమయంలో అర్జునుడు ప్రయోగించిన ఆ మహాస్త్రానికి కర్ణుడి శిరస్సు ఖండించబడింది. పాండవులందరూ ఆనందంతో శంఖనాదాలు పూరించారు. కౌరవులు ఆ సన్నివేశం చూసి శకుని అశ్వత్థామ మొదలైన వీరులతో సహా అందరూ కర్ణుడి మరణానికి అర్జునుని వీర ప్రతాపానికి యుద్ధభూమిని విడిచి పారిపోయారు. తమ శిబిరాలకు చేరుకున్నారు అంతా. కృష్ణుడు ఆనందంతో అర్జునుడిని ఆలింగనం చేసుకుని అర్జునా ఇంద్రుడు వృత్తాసురుడిని సంహరించినట్టు నీవు కర్ణుడిని సంహరించావయ్యా. నీ పరాక్రమానికి తిరుగులేదు. పద, ఈ శుభవార్తని ధర్మరాజుకి నివేదిద్దాం అని బయలుదేరారు. అనందంతో ఇద్దరూ ధర్మరాజుకి విషయం చెప్పారు. ధర్మరాజు పరమానందం చెంది కృష్ణార్జునులను ప్రశంసించి కృష్ణుడికి మనసారా కృతజ్ఞతలు తెలిపాడు. ధర్మరాజుకి ఇంకా ఆనందం సరిపోలేదు. యుద్ధభూమిలో కర్ణుడు పడిపోయిన ప్రాంతానికి వెళ్ళి కవచం బద్దలైపోయి అనేక వందల బాణాలతో శరీరం అంతా ఛిద్రం అయిపోయిన కర్ణుడి పార్థవదేహాన్ని చూసి అప్పడు హమ్మయ్య అనుకున్నాడు ధర్మరాజు. పుత్రసహింతంగా మరణించిన ఆ కర్ణుడిని మాటి మాటికీ చూస్తూ తన పరాభవాన్ని గుర్తుచేసుకుని ఇన్నాళ్లూ తాను పడిన ఆవేదనను శాంతింపచేసుకున్నాడు. దుర్యోధనుడు ఇన్నాళ్లూ ఏ కర్ణుడిని చూసుకుని, ఏ సోదరులను చూసుకుని విర్రవీగాడో వారంతా యుద్ధభూమిలో శాశ్వతంగా నిద్రపోతున్నారు. ధర్మరాజు పరమానందంతో  సోదరులతో కలిసి విజయానందాన్ని పంచుకున్నాడు. (ఇంతవరకూ కర్ణపర్వం  సమాప్తం.)

4. శల్యపర్వం:

కౌరవపక్షంలో శల్యుడు సర్వసైన్యాధిపతి బాధ్యతలు స్వీకరించాక శ్రీకృష్ణుడు శల్యుడి పరాక్రమం గురించి ధర్మరాజుకి చెప్తూ, “ధర్మజా! ఎంత ఆలోచించినా శల్యుడితో సమానమైన పరాక్రమం గల వీరుడిని మన పక్షంలో ఊహించలేకపోతున్నాను. మద్రరాజుకి స్వేచ్ఛని ఇచ్చాడు దుర్యోధనుడు. ఈ స్వేఛ్చతో శల్యుడు రణరంగంలో కాలుడివలే వీరవిహారం చేస్తాడు.  అటువంటి పరాక్రమవంతుడిని ధర్మాత్ముడవైన  నీవు తప్ప యుద్ధంలో ఎదురేగి పోరాడే వారు ఈ భూమండలంలోనే లేరు” అని కృష్ణపరమాత్ముడే స్వయంగా నిర్థారించేశాడు.

తస్యాద్య న ప్రపశ్యామి ప్రతియోద్ధారమాహవే

త్వామృతే పురుషవ్యాఘ్ర శార్దూలసమవిక్రమమ్. 7.33

త్వం ఋతే- అంటే నీవు తప్ప అని, నీవు తప్ప ఇంకెవరూ చంపలేరు.

‘ధర్మరాజా! మామ కదా అని శల్యుడి పై జాలి చూపించకు. శల్యుడిని పడగొట్టాలంటే నీ క్షాత్రబలంతో పాటు నీ తపోబలాన్ని కూడా యుద్ధంలో చూపించాలి. శల్యుడు అంతటి పరాక్రమవంతుడు’, అని కృష్ణుడు ధర్మరాజుతో అన్నాడు.

యుద్ధం ప్రారంభించటానికి ముందు కూడా పాండవులు ఎవరు ఎవరిని సంహరించాలో కూడా నిశ్చయించుకున్న సందర్భంలోనే 'శల్యుడు నా వంతు' అని ధర్మరాజు నోట అప్పుడే  వచ్చింది. దాంతో కృష్ణ వచనాలతో శల్యుడిని తానే సంహరించాలని నిశ్చయించుకున్నాడు ధర్మజుడు. యుద్ధం ప్రారంభించారు. శల్యుడు సర్వతోభద్రమనే వ్యూహాన్ని రచించాడు. అంటే 'సర్వత్రా భద్రం' అని అని. అన్ని వైపులా సురక్షితమైనది అనే వ్యూహం అది. శల్యుడు ధర్మరాజుతో పోరాడుతూనే మరోపక్క నకులసహదేవులతో సాత్యకితో భీకరమైన యుద్ధాన్ని ప్రదర్శించాడు. తన బాణ వర్షంతో వారిని ముంచేశాడు. ఆ గంటసేపూ శల్యుడి యుద్ధనైపుణ్యం చూసిన ధర్మరాజు పాండవసేన నిర్వీర్యం అవుతుందని ఖంగారు పడ్డాడు. కానీ కృష్ణుడు ‘ధర్మాజా! శల్యుడిని నీవే సంహరిస్తావు’ అని చెప్పిన వచనాలు ఎలా సత్యం కాకుండా ఉంటాయి? అని కృష్ణ వచనాల మీద నమ్మకంతో విజయమో వీరస్వర్గమో తేల్చుకుందాం అనుకున్నాడు. శల్యుడిని గెలిచే ప్రణాళికను సిద్ధం చేసుకుని సోదరులతో తన ఉపాయాన్ని చెప్పాడు. నకులసహదేవులు తన రథచక్ర సంరక్షకులుగా ఉండాలి. స్వయానా వారిరువురి మేనమామే  ఈ శల్యుడు. (వారిని చూడగానే శల్యుడికి రక్తసంబంధం గుర్తు రావాలి. మానసికంగా శల్యుని శక్తికి అడ్డుకట్టలాంటిది ఈ ధర్మజుని యుద్ధ ప్రణాళిక అని కూడా గమనించవచ్చు.) భీష్మాదులను పడగొట్టి మీరందరూ మీ వంతు కార్యాన్ని నిర్వర్తించారు. ఇక నా కార్యాన్ని నేడు ఈ శల్యవధతో పూర్తి చేస్తాను. అలాగే సాత్యకి నా రథం దక్షిణ చక్రాన్ని దుష్టధ్యుమ్నుడు ఉత్తర చక్రాన్ని రక్షిస్తూంటారు. అర్జునుడు వెనక భాగాన్ని భీముడు ముందు భాగాన్ని రక్షిస్తూ ఉండాలి. మా ఇరువురి పోరులో నాకు వేరే వారి వలన ఆటంకం రాకుండా మీరు రక్షిస్తూ ఉండాలి. ఈ ఏర్పాట్లతో నేను శల్యుడిని తప్పక గెలవగలను అని తన అంచనాను వివరించాడు. పృష్ఠగోపో భవత్వద్య మమ పార్థో ధనంజయః/ పురఃసరో మమాద్యాస్తు భీమః  శస్త్రభృతాం వరః 16.24 అందరూ దానికి సమ్మతించి ధర్మజుని పథకం ప్రకారమే  ముందుకు సాగారు. అంటే కృష్ణుడి సత్యవచనాలను అందరూ కలిసి కార్యరూపంలో పెడుతున్నారు. అలాగే అటుపక్క శల్యుడికి కూడా రక్షణగా మిగిలిన యోధులు చుట్టూ నిలిచారు. ముందుగా దుర్యోధనుడే నిలిచాడు. కానీ భీముడి ప్రతాపాగ్నికి దుర్యోధనుడు రథంలో కుప్పకూలిపోయాడు. ఇప్పటికీ ఇలా జరగటం నాల్గవసారి, మూర్ఛపోయిన దుర్యోధనుడు తేరుకునేటప్పటికీ యుద్ధభూమికి దూరంగా ఉన్నాడు. సారథిలేని అశ్వాలు అలా లాక్కుపోయాయి దుర్యోధనుడిని. హతసూతా హయాస్తస్య రథమాదాయ భారత/ వ్యద్రావన్త దిశో రాజన్ హాహాకారస్తదాభవత్. 16.44.

 మిగిలిన రథికులందరూ ఆ దుర్యోధనుడిని  రక్షించుకునే ప్రయత్నంలో పడ్డారు. ఇక్కడ శల్యుడు మిగిలాడు. యుధిష్టిరుడు శల్యుడిని తీవ్రమైన బాణాలతో కొట్టాడు. శల్యుడు సూర్యాగ్నులతో సమానమైన బాణాలతో ధర్మరాజు సారథిని సంహరించాడు. మరోపక్క అడ్డువస్తున్న భీమ దుష్టద్యుమ్న సాత్యకులను దూరంగా పారిపోయేట్టు చేస్తూ ధర్మరాజుని మట్టుపెట్టటానికి ప్రయత్నించాడు శల్యుడు. ధర్మరాజు శక్తి ఆయుధాన్ని మనసులో ధ్యానించి శ్రీకృష్ణుడి వచనాలను గుర్తుచేసుకుంటూ  తన తపశ్శక్తినంతా స్మరించి అగ్నిలా ప్రకాశించే నేత్రాలతో ఆ  బాణాన్ని శల్యుడి మీద ప్రయోగించాడు. “ధృతరాష్ట్ర మహారాజా! ఆనాడు ధర్మరాజు యొక్క తీవ్రమైన క్రోధాగ్ని జ్వాలను చూశాక, మద్రరాజు శల్యుడు ఇంకా ఆ అగ్నికి ఆహుతి కాకుండా సజీవంగా ఉన్నాడంటే నాకు చాలా ఆశ్చర్యమేసింది మహారాజా” అంటూ సంజయుడు ధృతరాష్ట్రుడికి ధర్మరాజు యొక్క తపోదృష్టిని, శల్యుడి పరాక్రమాన్ని తెలియచేశాడు. శల్యరాజు కూడా తక్కువవాడేం కాదు. ఎన్నో యాగాలను చేసినవాడే. ఆ యాగ ఫలమే ఆ క్రోధాగ్నినుండీ అతన్ని కాపాడింది. అందుకే కృష్ణుడు ‘ధర్మజా! శల్యసంహారానికి నీ తపోబలంతో పాటు నీ క్షాత్రబలం కావాలి’ అన్నాడు. ఆ శక్తి ఆయుధం ప్రళయకాలంలో ఆకాశం నుండీ  క్రిందపడే ఉల్క వలే శల్యుడి మీద పడటాన్ని కౌరవులందరూ చూశారు. ఆ శక్తి విశేషమైనది. అంతరిక్షంలోగానీ, భూమిమీద గానీ, జలాశయ ప్రాణులను గానీ చంపడంలో సమర్థమైనది ఆ శక్తి. విశ్వకర్మ పరమేశ్వరుడి కోసం నిర్మించినది. చిరుగంటలు పతాకాలు మణిమాణిక్యాలతో ప్రకాశించేది ఆ శక్తి. బ్రహ్మద్వేషులను, ధర్మాత్ములను హాని చేసే వారిని సంహరించటంలో ఈ శక్తి ఆయుధం విశేషమైనది. ఆ అస్త్రాన్ని అమోఘమైన మంత్రాలతో అభిమంత్రించి ‘శల్యా, నీవు చంపబడినట్టే’ అంటూ పెద్దగా అరుస్తూ ఆ బాణాన్ని విడిచాడు ధర్మరాజు. ఆ మద్రరాజుని సంహరించే సమయంలో ధర్మరాజు రూపం త్రిపురాసుర సంహారంలో మహేశ్వరుడి రుద్రరూపం వలే ఉందని వ్యాసులువారు వర్ణించారు. దాంతో మహిమాన్వితమైన ఆ బాణానికి శల్యుడి వక్షస్థలం చీలిపోయి నవరంధ్రాలనుండీ రక్తం స్రవిస్తూ శల్యుడు  వజ్రాయుధంతో కొట్టబడిన పర్వత శిఖరం వలే నేలమీద పడ్డాడు.

తాం సర్వశక్త్యా ప్రహితాం సుశక్తిం యుధిష్టిరేణాప్రతివార్యవీర్యామ్.

ప్రతిగ్రహాయాభిననర్ద శల్యః సమ్యగ్హుతామగ్నిరివాజ్య ధారామ్. 17.49

యజ్ఞంలోని ఆజ్యధారలతో యథావిధిగా హవిస్సును పొంది శాంతించిన అగ్నిదేవుడిలా ఉన్నాడు శల్యుడు అని చెప్పారు.

శల్యశాంతితో పాండవులు ఆనందోత్సాహంతో సింహనాదాలు చేశారు. కౌరవులు తలోదిక్కూ పరిగెత్తారు ధర్మరాజు ప్రతాపానికి.   కానీ ధర్మరాజు ఆ ఊపులోనే సర్పసంహారం చేసే గరుడుడి వలే ధనస్సు విడిచిపెట్టకుండా కనబడిన కౌరవ యోధులను సంహరిస్తూనే ఉన్నాడు. అందులో ముఖ్యంగా శల్యుడి మరణానికి తీవ్రవేదనకు గురైన శల్యుడి సోదరులు వీరులవలే ధర్మరాజుతో పోరాడారు, కానీ వారికి కూడా శల్యుడికి పట్టిన గతే పట్టింది. ఈ విధంగా పద్దెనిమిదవ రోజు దాదాపు యుద్ధం ప్రారంభించిన మూడు నాలుగు గంటలలోనే శల్యుడు శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయాడు.

5. సౌప్తికపర్వం:

ఉపపాండవులను సంహరించిన అశ్వత్థామను ఓడించిన భీముడు సంతోషంగా ద్రౌపదికి, ‘నీ కుమారులను చంపిన అశ్వత్థామ శిరోమణి ఇదే. అతడు ఓడిపోయాడు. ఇక నీవు శోకాన్ని విడిచిపెట్టు. దుర్యోధనుడిని సంహరించాం. దుశ్శాసనుడి నెత్తురు త్రాగాను. శత్రుత్వం ఋణం తీరిపోయింది. అరణ్యకష్టాలు ఇక లేవు. బ్రాహ్మణుడన్న గౌరవంతో గురుపుత్రుడన్న కారణంతో అశ్వత్థామను ఓడించి ప్రాణాలతో విడిచి పెట్టాం. నీవిక శాంతించు ద్రౌపదీ’ అని పలికాడు భీమసేనుడు. ద్రౌపది ఆమణిని గ్రహించి గురుపుత్రుడు నాకు కూడా గురువుతో సమానమే.

కేవలానృణ్యమాప్తాస్మి గురుపుత్రో గురుర్మమ

శిరస్యేతం మణిం రాజా ప్రతిబధ్నాతు భారత. 16.34

పుత్రశోకంలో వారి మరణానికి బదులు కోరాను, అంటూ ఆ మణిని ధర్మరాజు శిరస్సున గురువుగారి గుర్తుగా గురువుగారి అనుగ్రహంగా ధరించమని ఇచ్చింది. ధర్మరాజు ఆమణిని నమస్కరించి గురువును స్మరిస్తూ శిరస్సున ధరించాడు.

తరువాత ధర్మరాజు కృష్ణుడిని ఒక సందేహం అడిగాడు. ‘మాధవా! అశ్వత్థామ పాపాత్ముడు, గొప్ప కార్యాలు చేసినవాడుకూడా కాదు. అటువంటి వాడు మహారథులైన నా కుమారులను ఎలా చంపగలిగాడు.

కథం ను కృష్ణ పాపేన క్షుద్రేణాకృత కర్మణా

ద్రౌణినా నిహతాః సర్వే మమ పుత్రా మహారథాః. 17.2

అలాగే లక్షలాది మందితో పోరాడగలవారు ద్రుపదుని పుత్రులు వారిని ఎలా చంపగలిగాడు. గురువైన ద్రోణుడుకూడా రణభూమిలో ధృష్టద్యుమ్నుడికి ఎదురుపడటానికి ఉత్సాహ పడలేదు. ఇంతమంది మహావీరులని ఇంత తక్కువ వ్యవధిలో అశ్వత్థామ ఎలా చంపగలిగాడు చెప్పు’ అని కోరాడు. భగవానుడన్నాడు – ‘అశ్వత్థామ దేవదేవుడైన రుద్రుడిని శరణు కోరాడు, ఆ పరమేశ్వరుడి శక్తితోనే అందరినీ సంహరించగలిగాడు. భక్తవత్సలుడైన ఆ పరమేశ్వరుడు ప్రసన్నుడైతే అమరత్వాన్ని కూడా ఇవ్వగలడు’. అంటూ అశ్వత్థాముకు పరమేశ్వరుడి అనుగ్రహం ఏవిధంగా కలిగిందో చెప్పి, తరువాత పరమేశ్వరుడి మహిమను కూడా వర్ణించాడు. చివరికి పరమేశ్వరుడి అనుగ్రహంతో అశ్వత్థామ చేసిన ఈ కార్యాన్ని మనసులో పెట్టుకోమాకు నాయనా. ఇదంతా విధి విలాసం. జరగాల్సిన కార్యం గురించి ఆలోచించు అంటూ కృష్ణుడు ధర్మరాజును కార్యోన్ముఖుని గావించాడు.

న తన్మనసి కర్తవ్యం న చ తద్ ద్రౌణినా కృతమ్

మహాదేవప్రసాదేన కురు కార్యమనన్తరమ్.   18.26.

 6. స్త్రీపర్వం:

ధర్మజాదులు గాంధారి దగ్గరికి వచ్చారు. భీముడిని కోపగించిన గాంధారీ పలుకులు విని ధర్మజుడు వారించాడు. “నీ కుమారులను చంపిన క్రూరుణ్ణి నేనేనమ్మా, నీ శాపానికి తగినవాడిని, నన్ను శపించు, ఇంతమంది మిత్రులను బంధువులను చంపుకున్నాక నాకు ఇక ఈ రాజ్యంతో గానీ ధనంతో కానీ ప్రయోజనం లేదు” అంటూ ధర్మరాజు తన  శరీరాన్ని వాల్చి ఆమె పాదాలపై పడబోయాడు. గాంధారీ కళ్లకు కట్టుకున్న గంతలలోనుండీ ఆమెదృష్టి ధర్మరాజు పాదాల వ్రేళ్ళ కొనలమీద పడింది. వెంటనే అందమైన ఆయన గోళ్ళు నల్లగా మాడి పోయాయి. అంగుళ్యగ్రాణి దదృశే దేవీ పట్టాన్తరేణ సా/ తతః స కునఖీభూతో దర్శనీయనఖో నృపః. 15.30

ఆ దృశ్యం చూసి అర్జునుడు భయంతో వాసుదేవుడి వెనకాల దాక్కున్నాడు. చివరికి అందరూ శరణు వేడటంతో ఆమె శాంతించి వారినందరినీ కూడా ఓదార్చింది.

 7. ధర్మజుని దివ్యదృష్టి- అనుస్మృతి:

తరువాత ధృతరాష్ట్రుడు ధర్మరాజుని - యుధిష్ఠిరా! నీకు చనిపోయిన వీరుల సంఖ్య బ్రతికి ఉన్న వీరుల సంఖ్య తెలిస్తే చెప్పు? వారంతా ఏ గతిని పొందారు? అన్నాడు. యుధిష్ఠిరుడు ఖచ్చితమైన లెక్క చెప్పాడు. రాజా! యుద్ధంలో మొత్తం నూట అరవై ఆరు కోట్ల ఇరవై వేల మంది చనిపోయారు.  దశాయుతానామయుతం సహస్రాణి చ వింశతిః/ కోట్యః షష్టిశ్చ షట్ చైవ హ్యస్మిన్ రాజన్ మృధే హతః. 26.9. వీరు కాక ఇరవైనాలుగు వేల నూట అరవైఅయిదుగురి జాడ ఇంకా తెలియలేదు. 

మహారాజా, యుద్ధంలో సంతోషంగా ప్రాణాలను అర్పించిన మహా వీరులందరూ దేవేంద్రునితో సమానమైన లోకాలను  పొందారు మహారాజా. సంతోషంగా కాకపోయినా వీరత్వంతో ప్రాణాలను అర్పించినవారంతా గంధర్వలోకాలలో ఉన్నారు. యుద్ధవిముఖులై  ప్రాణభిక్షను అర్థిస్తూ మరణించినవారు గుహ్యకలోకాలను పొందారు. క్షత్రధర్మపరాయణులైన మహాత్మలు అందరూ బ్రహ్మలోకాలను పొందారు మహారాజా అంటూ వివరించాడు. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే యుద్ధంలో చనిపోయిన వారిని వారు తరువాత ఏలోకాలకు వెళ్లారో కూడా చూడగలిగిన శక్తి కలవాడు ఈ ధర్మనందనుడు. ఇక్కడ ధృతరాష్ట్రుడు కూడా ధర్మరాజు చెప్పిన సమాధానానికి ఆశ్చర్యపోయి అదే అడిగాడు. ‘నాయనా! నీవు ఏ జ్ఞానంతో ఇదంతా చూసినట్టు చెప్పగలుగుతున్నావు? నాకు చెప్పగలిగిన విషయమే అయితే చెప్పు’ అని అడిగాడు. యుధిష్ఠిరుడు  పెదనాన్నకి నమస్కరిస్తూ వినయంగా విషయమంతా వివరించాడు. మహారాజా, నీవు నన్ను తీర్థయాత్రలు చేయమని ఆదేశించినప్పుడు ఈ విశేష జ్ఞానాన్ని పొందాను. తీర్థయాత్రలు చేస్తూ నేను దేవర్షి అయిన లోమశుని సందర్శించాను. ఆయన అనుగ్రహానికి పాత్రుడనై ఆయన నుండీ అనుస్మృతి అనే విద్యను పొందాను. ఆ దివ్యదృష్టితోనే నేను ఈ విషయాలు తెలుసుకున్నాను అని చెప్పాడు.

దేవర్షిల్లోమశో దృష్టస్తతః ప్రాప్తోsస్మ్యనుస్మృతిమ్

దివ్యం చక్షురపి ప్రాప్తం జ్ఞానయోగేన వై పురా. 26.20

తరువాత యుధిష్ఠిరుడు సుధర్ముడిని, ధౌమ్యుడిని, సూతుడైన సంజయుని, విదురుని, యుయుత్సుని, ఇంద్రసేనుని, పిలిచి చనిపోయిన వారందిరికీ దహన సంస్కారాలు నిర్వర్తించమని ఆజ్ఞాపించాడు. అనాథ శవం వలే ఏ శరీరమూ మిగిలిపోకూడదు. దానికి తగిన ఏర్పాట్లు  శాస్త్రోక్తంగా చేయించమని చెప్పాడు. వారంతా ఆ ఏర్పాట్లను పూర్తిచేసి అందరికీ చితులు ఏర్పాటు చేయించి విధి ప్రకారం దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఆ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుడిని ముందుంచుకుని గంగా నది వైపు తర్పణాలు విడిచి పెట్టటానికి బయలుదేరాడు.

 8. కర్ణుడు తన సోదరుడని ధర్మజుడు తెలుసుకొనుట:

కురుకాంతలతో వీరపత్నులతో ఆ గంగా తీరమంతా నిండిపోయింది. చనిపోయిన వీరులందరికీ ధర్మరాజు బాధతో జలతర్పణాలు విడిచిపెడుతున్నాడు. ఆసమయంలో కుంతీదేవి వచ్చి  పాండవులతో అంటున్నది. “కుమారులారా! మేటి విలుకాడు, అర్జునుడి చేతిలో మరణించిన కర్ణుడు, సూతపుత్రుడని, రాథేయుడని మీరు భావిస్తున్నారు. లోకంలో ప్రాణాలకన్నా కీర్తే మిన్న అని భావించే మీ సోదరుడైన ఆ కర్ణుడికి కూడా ఉదకాన్ని వదలండి. అతడు మీకు అన్నయ్య,  మీకంటే ముందు నాకు సూర్యుని వలన పుట్టినవాడు” అన్నది.

స హి వః పూర్వజో భ్రాతా భాస్కరాన్మయ్యజాయత

కుణ్డలీ కవచీ శూరో దివాకరసమప్రభః 27.12

కర్ణుడి  జన్మవృత్తాంతాన్ని బయట పెట్టగానే పాండవులు హతాసువులైపోయినట్టు పడిపోయారు. కర్ణుడి గురించి శోకించసాగారు. ఆ బాధలో ధర్మనందనుడు దీర్ఘంగా నిట్టూరుస్తూ తల్లితో – “అమ్మా, కౌరవుల పతనం కన్నా వందరెట్లు ఎక్కువగా నన్ను ఈ విషయం బాధిస్తుంది. కర్ణుడి జననం ఎలా కలిగింది? ఇంత రహస్యాన్ని ఇంత కాలం ఎలా భరించావు? ఈ విషయం నాకు ముందే తెలిసివుంటే అసలు ఇంత రక్తపాతమే జరిగిఉండేది కాదుకదా. ఆ అద్భుత పరాక్రమశాలిని నీవెలా కన్నావు? అంటూ కర్ణుడికి తిలోదకాలిస్తూ కర్ణుడి భార్యలను పరివారాన్ని పిలిపించాడు. వారందరితో కలిసి అనంతర ప్రేతకర్మను కూడా పూర్తి చేశాడు. పాపినైన నేను ఈ విషయం తెలీక మహావీరుడైన నా అన్నను చంపుకున్నాను. ఇంత కాలం దాచిన ఈ రహస్యం వలన నాకీ అనర్థం వచ్చింది. కావున ఇక స్త్రీల మనస్సులలో రహస్యమేదీ నిలవదు అని పలికాడు.

పాపేనాసౌ మయా శ్రేష్ఠో భ్రాతా జ్ఞాతిర్నిపాతితః

అతో మనసి యద్ గుహ్యం స్త్రీణాం తన్న భవిష్యతి.     27.29

విశ్లేషణ - (తనకున్న అనుస్మృతివిద్యతో అంతా తెలుసుకుకోగల ధర్మజుడికి కర్ణుడి జన్మరహస్యం తెలియదా? అనే సందేహము కలుగుతుంది. అప్పటికీ ధర్మజుడుకి అప్రయత్నంగా కర్ణుడిని చూడగావనే ధర్మజుని దృష్టి కర్ణుడి పాదాలపై ప్రసరించేది.(ఇంతకంటే ధర్మజుని ధర్మశక్తికి ఉన్న నిదర్శనం ఇంకేం కావాలి?) ఈ ప్రశ్నకు ఉపాసకులైన వారు చక్కటి విశ్లేషణ చేయగలరు.  నా అభిప్రాయం ప్రకారం పరమాత్ముడైన శ్రీకృష్ణుడు అందరి బుద్ధినీ తన అధీనంలో ఉంచుకుని నెరవేర్చిన దైవకార్యం ఈ మహాభారతమనటంలో సందేహమే లేదు.  అలాంటప్పుడు ధర్మజునకు కూడా ఏ సమయంలో ఏ ఆలోచన ఎప్పుడు రావాలో నియంత్రించిన వాడు శ్రీకృష్ణుడే అని చెప్పుకోవాలి).

9. ముగింపు:

తనకున్న అనుస్మృతి అనే దివ్యదృష్టితో మరణించినవారి సంఖ్యను, వారు ఏ ఏ లోకాలకు చేరుకున్నారో వివరించిన యుధిష్ఠిరుడు ఈ విద్యను యుద్ధప్రారంభంలోనే ప్రయోగించుట జరిగినది. శత్రువీరులైన దుర్యోధనాదులను ఎవరెవరు సంహరించాలో, ఎన్ని రోజులు యుద్ధం జరుగుతుందోకూడా ముందే ధర్మరాజు నోట పలికించాడు వ్యాసభగవానుడు. తాను పుత్రశోకంలో ఉన్నప్పటికీ ఉపపాండవులను సంహరించిన అశ్వత్థామను గురుపుత్రుడనే కారణంతో  క్షమించిన క్షమాతపశ్శాలి ధర్మరాజు. గాంధారీ పుత్రశోకాగ్నినుండీ సోదరులను రక్షించుకున్న శాంతమూర్తి ధర్మనందనుడు. కర్ణుడు తన సోదరుడే అని తెలియగానే ఇంతకాలమూ తాను కౌరవుల పై క్రోధము ప్రదర్శించినప్పుడల్లా తన దృష్టి కర్ణుడి పాదముల పై పడటానికి, ఆ పాదాలు తల్లి కుంతీదేవి పాదలను పోలి ఉండటాన్ని సమన్వియించుకుని పరిపరి విధముల తపించిపోయిన వాత్సల్యమూర్తి  ధర్మజుడు. పరమాత్ముడైన శ్రీకృష్ణుడి నేతృత్వంలో యుద్ధంలో సోదరసహితంగా ఘనవిజయాన్ని సాధించి, దైవకార్యాన్ని నేరవేర్చిన పుణ్యమూర్తిగా యుధిష్ఠిరుడు మహాభారతేతిహాసంలో పుణ్యశ్లోకుడయ్యాడు.

 10. ఉపయుక్తగ్రంథసూచి:

  1. కృష్ణాచార్య, టి.ఆర్., & వ్యాసాచార్య, టి.ఆర్. (సంపా.). శీమన్మమహాభారతమ్. నిర్ణయసాగర్ ప్రెస్, కుంభకోణం, బోంబే.
  2. పట్నాయక్, కె.ఎన్.ఎస్. “ది మహాభారతమ్ క్రోనోలజీ”. (వ్యాసము). నవంబరు
  3. ప్రతాప్ చంద్ర, రాయ్ (అను.). ది మహాభారత. ఓరియంటల్ పబ్లిషింగ్ కో., కలకత్తా.
  4. మోహన్ గంగూలి, కిసరి. (అను.). ది మహాభారత.
  5. రామకృష్ణమూర్తి, తిప్పాభట్ల. & శ్రీనివాసులు, సూరం. వ్యాసమహాభారతము. విజయవాడ. 2010
  6. రామనారాయణదత్త శాస్తీ ,పాండ్యే. (హిందీ అను.) మహాభారతము. గీతాప్రెస్.
  7. శాస్త్రి, పి.పి.ఎస్. (సంపా.). ది మహాభారత. వావిళ్ళరామస్వామిశాస్త్రులు అండ్ సన్స్.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "May-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-April-2025

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "MAY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Letter of Support - Format
[for Research Scholars only]