AUCHITHYAM | Volume-4 | Issue-4 | April 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed
16. ‘మల్లాది’ వారి ‘మందాకిని’ నవల పాత్రచిత్రణలు: సందేశం

జి. యమునారాణి
తెలుగు సహాయాచార్యులు,
శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థ, అనంతపురము.
అనంతపురము జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 8985556576, Email: gyamunarani@sssihl.edu.in
Download
PDF
వ్యాససంగ్రహం:
ఒకప్పుడు వివాహం అన్నది జన్మజన్మలబంధంగా భావించేవారు పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని ఒక్కసారి మూడు ముళ్ళు పడితే ఇక కడదాకా కలిసి ఉండాలని ప్రజలు వివాహానంతరం ఆలుమగలు ఇద్దరికీ అప్పగింతల సమయంలోనే చెప్పి పంపించేవారు అయితే కాలంతోపాటు వివాహ పద్ధతుల్లో మార్పులు వచ్చాయి . మనుషుల ఆలోచనలు మారాయి. పెద్దల మాటకు మర్యాద తగ్గింది. కాబట్టి ఈనాడు వివాహ బంధాన్ని చిన్నచిన్న కారణాలకే తెగ దింపులు చేసుకొని, విడాకుల పేరుతో విడివిడిగా బ్రతుకుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అనేక వ్యసనాలు గల భర్తను ఎంతోచాకచక్యంగా శాస్త్రీయమైన చిట్కాలు, ఉపాయాలతో ఏ విధంగా భార్య మార్చుకోగలిగింది అన్నది మల్లాదివారు మందాకిని నవల ద్వారా పాఠకులోకానికి ఎన్నో సూచనలు అందించారు ఆ సూచనలు ఈతరం యువత తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మల్లాది వారు మందాకిని పాత్ర ద్వారా పాఠక లోకానికి అందించిన సూచనలు, ఆ పాత్రాలను చిత్రించిన విధానాన్ని గురించి విశ్లేషించడమే ఈ వ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం.
Keywords: మందాకిని, మల్లాది, పాత్రచిత్రణ, నవల, సందేశం.
1. రచయిత పరిచయం:
మల్లాది దక్షణామూర్తి, మల్లాది శారదాంబ దంపతులకు 1949, నవంబర్,13వ తేదీన మల్లాది వెంకట కృష్ణమూర్తి విజయవాడలో జన్మించారు. బాల్యం,విద్యాభ్యాసం పూర్తిగా విజయవాడలోనే సాగింది.వీరి చిన్నతనం నుండి కుటుంబంలో అందరూ విద్యావంతులు కావడంతో అందరికీ పుస్తకాలు చదవడం అలవాటుగా ఉండేది. అదే అలవాటు మల్లాది వెంకటకృష్ణమూర్తి గారికి కూడా వచ్చింది. వీరు 1969 లో డగ్రీ పూర్తి చేసుకొని 1970లో హైదరాబాదులోని పెంగ్విన్ టెక్సటైల్స్ లో ఉద్యోగంలో చేరారు. ఉద్యోగంలో చేరిన వెంటనే వీరు వ్రాసిన తొలి కథ ఉపాయశాలి దీనిని "చందమామ" పత్రికకు పంపగా ఆగస్టు సంచికలో అచ్చైంది. ఆ తర్వాత వరుసగా ఆంధ్ర ప్రభ, ఆంధ్ర, అపరాధ పరిశోధల వంటి పత్రికల్లో కథలు రావడంతో తన రచనా వ్యాసంగం ప్రారంభమయ్యింది.( 1) అప్పట్లో ఇతర భాషల్లోవచ్చే పత్రికల్లోని కథలను కూడా చదివే అలవాటు ఉండటంతో వీరు మొత్తం 5000కు పైగా కథలు వ్రాస్తే అందులో 2000 కథలు అనువాదాలు కాగా,3000 కథలు సొంతంగా వ్రాశారు. 1973 లో వీరు వ్రాసిన తొలి నవలిక "అద్దెకిచ్చిన హృదయాలు".నాటి నుండి నేటి వరకు వీరు వ్రాసిన నవలలసంఖ్య 106. ఇప్పటికీ వ్రాస్తూనే ఉన్నారు.వీరి నవలల అధారంగా 22 చలన చిత్రాలు చిత్రించబడ్డాయి, 9 ధారావాహికలుగా టెలివిజన్లో ప్రసారం కాబడ్డాయి. 1,000 కి పైగా వ్యాసాలు వ్రాశారు.వివిధ పత్రికల్లో వివిధ పేర్రతో 70 శీర్షికలను నిర్వహించారు. 34 దేశాలను సందర్శించి రచయితగా - 11యాత్రాచరిత్రలను పాఠకలోకానికి అందించారు.(2)
2. కథా సంగ్రహం:
ఉమామహేశ్వరరావు అచ్చమాంబలకు నలుగురు సంతానం ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు పెద్ద కుమార్తె వసంతలక్ష్మి రెండవ కుమార్తె మందాకిని మూడవ కుమార్తె వాసంతి, కుమారుడు హేమాద్రి. పెద్ద కుమార్తె వసంతలక్ష్మికి వివాహం భర్త భానుమూర్తి అనేక వ్యసనాలకు కలిగి ఉండటంతో వసంతలక్ష్మిని అనేక హింసలకు గురి చేస్తూ ఉంటాడు. ఆ బాధలు భరించలేక వసంత లక్ష్మి ఆత్మహత్య చేసుకుంటుంది. వసంత లక్ష్మి కూతురు వసుధ తల్లి లేని బిడ్డ కావడం,రెండవ కుమార్తె మందాకినికి వస్తున్న పెళ్ళి సంబంధాలన్నీ అడిగిన కట్నం ఇవ్వలేదంటే వెనక్కి వెళ్ళిపోతుంటాయి. కట్నం సమకూర్చలేక ఇబ్బంది పడుతున్న తండ్రి పరిస్థితిని గుర్తించిన మందాకిని కుటుంబ పరిస్థితులను తలవంచి అన్ని వ్యసనాలకు బానిస అయినటువంటి బావ భానుమూర్తిని మందాకిని వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకుంటుంది.
3. పాత్రచిత్రణ:
“కథలేని నవలలు కథా వస్తువులేని నవలలు ఉండవచ్చు కానీ పాత్రలు లేని నవలలు మాత్రం ఉండడం సాధ్యం కాదు”(3) పాఠకుడిలో సానుభూతిని రేకెత్తించి రసానందాన్ని కలిగించేందుకు ప్రధానంగా తోడ్పడేవి పాత్రలే. "కథాకల్పనయందే, ఆయా పాత్రల రూపురేఖలను తీర్చిదిద్ది మన మనోనేత్రంల యందు అవి ఆవిష్కరించినట్లు చేయగల నేర్పు, ప్రతిభ నవలా రచయిత కుండ వలెను. అప్పుడే ఆ పాత్రలు సజీవ సంపన్నముగా నుండును. నాటకమునందలి పాత్రలవలే నవలయందలి పాత్రలు కూడా సజీవ సంపన్నముగా మనముందు ప్రత్యక్షమైనప్పుడే మనకు అది ఆనందమును చేకూర్చగలవు"( 4).
"కథ నిర్వహణకు అవసరమైన సంఖ్యలో పాత్రలను రచయిత ఎన్నుకుంటాడు. అవి ఒకటి కావచ్చు 20 కావచ్చు. ఈ నవలికలో ప్రధానమైన ఐదు పాత్రల చేత రచయిత కథను నడిపించారు.
3.1వసంత లక్ష్మి:
ఎన్నో ఆశలతో వివాహం చేసుకున్న వసంతలక్ష్మికి అసలు తీరకపోగా భర్త కు ఉన్న వ్యసనాల వల్ల ఎన్నో బాధలను భరిస్తుంది.ఆ అలవాట్లను దూరం చేయలేక ,వాటిని భరించలేక చివరకు ఆత్మహత్య చేసుకుంటుంది. వవ్యసనపరులైన భర్తల ఆగడాలని భరించలేని ఎంతో మంది మహిళలు ఆత్మహత్యలకు పాల్పడి అర్ధాంతరంగా తమ జీవితాలను ముగించుకుంటున్నారు.అటువంటి మహిళలకు ప్రతినిధిగా రచయిత వసంత లక్ష్మి పాత్రను చిత్రించారు. ఆత్మహత్యకు పాల్పడే ముందు తన భర్త మీద ఉన్న కోపం, ఏమీ చేయలేని కక్షతో ఉత్తరం రాసి పెడుతుంది."నా ఆత్మహత్యకు నూటికి నూరుపాళ్ళు నా భర్త కారణం" (5) కానీ పోలీసులు మరణవాంగ్మూలం తీసుకోవడానికి వచ్చి తనను ప్రశ్నించినప్పుడు వారితో భానుమూర్తే తన ఆత్మహత్యకు కారణమని చెప్పటానికి వసంతలక్ష్మికి మనస్కరించదు. "మా ఆయనకి ఏం తెలియదు ఆయన నిద్రపోతున్నారు నా ఒళ్ళు కాలినప్పుడు" (6) అని అబద్ధం చెబుతుంది. అందుకు కారణం ఎక్కడ తన భర్త కు శిక్ష పడుతుందో అన్న భయం. వివాహానంతరం వారి మధ్య ఏర్పడిన బంధమే దీనికి కారణం కారణం.
వాస్తవానికి సమాజంలో చాలామంది ఆడవాళ్లు తమ ప్రాణాలు పోతున్నా భర్తలకు శిక్ష పడకూడదు అన్న ఉద్దేశంతోనే ఈ విధంగానే వ్యవహరిస్తారు. వాస్తవానికి వివాహ బంధంలో కోపాలు, ఆవేశాలు ఆలుమగల మధ్య ఏర్పడే తాత్కాలిక భావోద్రేకాలే తప్ప అవి శాశ్వతమైనవి కావు అన్న విషయానికి నవలలోని ఈ సన్నివేశమే మంచి ఉదాహరణగా నిలుస్తుంది.
3.2 భానుమూర్తి:
నాటకాలు తాగుడు పేకాట అక్రమ సంబంధాలు వంటి అనేక వ్యసనాలు గల వాడు భానుమూర్తి.వాటిని మానుకోలేక చివరికి తన భార్యను కోల్పోతాడు . మద్యం తీసుకోవడం వల్ల ఎంతటి విజ్ఞావంతుడైన విజ్ఞతను కోల్పోయి ప్రవర్తిస్తారని అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ రచయిత తన బాధ్యతగా భానుమూర్తి పాత్ర ద్వారా తెలియ పరచాలనుకున్నారు. మద్యం సేవించిన సమయాల్లో భానుమూర్తి ప్రవర్తన, మాట్లాడే తీరు వ్యవహారం అక్కడక్కడా పాఠకుడికి హాస్యం పుట్టిస్తాయి. మందాకిని తన అక్క వసంత లక్ష్మి సూసైడ్ నోట్ చూపించినప్పుడు భానుమూర్తులోకలిగిన మార్పు అతని మాటల్లో స్పష్టమవుతుంది. "ఐ యాం ఈక్వల్లి హ్యూమన్. మీలాగా నేను మనిషినే, మృగాన్ని కాదు. నన్ను ఎవరు హేట్ చేయకండి. నన్ను దూరం చేయకండి. నేను మీలాంటి మనిషినే. నేను మీ అక్కయ్యను చంపలేదు. నో... నేను హంతకున్ని కాదు. వసంత లక్ష్మే చచ్చిపోయింది. నన్ను వదిలి వెళ్ళిపోయింది."(7) అతని మాటల్లోనే భాగోద్వేగానికి మందాకినికి నోటి మాట రాలేదు.
ఎంతటి దుర్మార్గుడైనా అంతర్గతంగా ఏదో ఒక మూలన మంచి అన్నది దాగి ఉంటుంది. అని పాఠకుడిని ఆలోచింపచేసేలా భానుమూర్తి మందాకినిల సంభాషణలను ఆ సన్నివేశంలో రచయిత చాలా సహజంగా చిత్రించారు. .
భానుమూర్తికి వ్యసనాలు సరదాగా జీవితాన్ని గడిపేయాలనుకోవడం వల్ల వచ్చినటువంటివి. ఆ చెడు ఆలవాట్లను మానుకోలేక చివరికి తన భార్యను కోల్పోతాడు . పేకాటను మానుకోవచ్చు కదా అని మందాకిని భానుమూర్తితో అన్నప్పుడు"ఇంగ్లీషులో హాబిట్ అన్న పదం ఎలా వచ్చిందో తెలుసా... అలవాటు అన్నది ఎంతో వింత అయింది. ఏది హేబిట్ అవ్వకూడదు. అయిందా దాన్ని వదిలించుకోవడం ఎంతో కష్టం. ఈ సత్యం తెలిసే (HABIT) లోని అక్షరాలను ఇంగ్లీషులో ఈ విధంగా కూర్చోరు. హాబిట్ దీంట్లో నుంచి మొదటి అక్షరం తీసేసిన ఆ అలవాటు కొద్దిగా కూడా పోదు. (ABIT )స్వల్పంగా కూడా వదలదు. ఇప్పుడు ABIT లోని రెండో అక్షరం పోయినా ఇంకా కొద్దిగా ఉంటుంది అలవాటు." A" అక్షరం చెరిపేసి (BIT), కొద్దిగా, మరో అక్షరం చెరిపేసి IT అది ఇప్పుడు నాలుగు అక్షరాలు తీసేస్తే కానీ అలవాటు పూర్తిగా పోదు. దానర్థం చేసుకున్న అలవాటు పోవాలంటే, దాన్ని పూర్తిగా వదిలించుకోవాలంటే ఇంత కష్టపడాలి అని."(8)అలవాటు పదానికి భానుమూర్తి మాటల్లో ఇచ్చిన విశ్లేషణ పాఠకులకు చమత్కారంగానే అనిపించినా అది వాస్తవం. ఏ అలవాటైనా మానుకోవడం ఒక్కసారిగా సాధ్యం కాదు. అందువల్ల దానిని కొద్ది కొద్దిగా దూరం చేసుకోవాలి. అంతే తప్ప ఒకేసారి మాన్పించాలి అన్న ప్రయత్నం వృధానే అవుతుంది అని రచయిత చాలా చమత్కారంగా భానుమూర్తి మాటల ద్వారా ఆ విషయాన్ని పాఠకులకు సూచించారు.
3.3 మందాకిని:
మందాకిని సహజంగా అందమైనది, తెలివైనది. కుటుంబం పట్ల బాధ్యతగలది. వసంత లక్ష్మి మరణించడంతో తన అక్క కూతురు తల్లి లేనిదిఅవుతుంది. వాసంతి యోగేంద్రల తొందరపాటుతనంతో వివాహం కాకుండానే వాసంతి గర్భం దాల్చుతుంది. దానికి తోడు తన వివాహానికి కట్నం సమకూర్చలేక తండ్రి ఇబ్బందులు పడుతుంటాడు. అన్నీ కలగలిపి భానుముర్తి దుర్మార్గుడని, అతని వల్లనే తన అక్క మరణించింది అని తెలిసినప్పటికీ ఆమె పరిస్థితులకు తలవంచి భానుమూర్తిని వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకుంటుంది. భానుమూర్తితో వివాహానికి తల్లిదండ్రులు మొదట అంగీకరించరు. అయినా విధిలేక ఉమామహేశ్వరరావు ఇద్దరి కూతుర్ల వివాహాన్ని ఒకే పందిట్లో జరిపిస్తారు. అప్పగింతల సమయంలో అచ్చమాంబ, ఉమామహేశ్వరరావు, చెప్పిన మాటలు మందాకిని జాగ్రత్తగా ఆలకిస్తుంది. ఆ తర్వాత తన తెలివితేటలను ఉపయోగించి, భనుమూర్తి మాటలు, ప్రవర్తణను ఆధారంగా చేసుకుని, శాస్త్రీయమైన పద్ధతులతోనే భానుమూర్తిని మార్చడానికి ప్రయత్నం చేసి విజయం సాధిస్తుంది. చివరిగా తనను గురించి ఆందోళన చెందిన తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగించడంతోపాటు తన జీవితాన్ని కూడా చక్కగా మలుచుకోగలుగుతుంది.
ఏ వ్యక్తి అయినా వ్యసనాలకు బానిస అయ్యాడు అంటే అది అతనిలోని మానసిక బలహీనత. ఆ బలహీనత బయటపడాలి అంటే అది అతని మాటల ద్వారానే సాధ్యపడుతుంది. అని అర్థం చేసుకున్న మందాకిని భానుమూర్తి ఏది మాట్లాడినా ఓపికగా వినడం ఆ మాటల్లో అతని భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేది. భానుమూర్తి గురించి మాట్లాడుతూ "నాకు ఇది ఎంతో మానసిక తృప్తినిస్తుంది "(9).సంగీతం నృత్యం అవుట్డోర్ స్పోర్ట్స్ లాంటివి వాళ్లకు ఎలా తృప్తినిస్తుందో నాకు ఇది అంతే. "కానీ నన్ను అంత నాటకాలు వేస్తుంటే దుర్మార్గుడని కసాయివాడని అంటారు". "నేను దుర్మార్గున్ని కాదు నేను దృష్టిని కాదు నేను అందరిలా మంచివాన్ని ఐయామ్ ఓన్లీ ఆన్ ఆర్టిస్ట్."(10).
"నేను మీ అక్కయ్యను చంపలేదు.నో. నేను హంతకుణ్డి కాదు. వసంత లక్ష్మి చచ్చిపోయింది నన్ను వదిలి వెళ్ళిపోయింది." (11). ఇలా భానుమూర్తి మాటల ద్వారానే అతని బలహీనతలను గుర్తించడంతో పాటు, అందరిలాగే అతను కూడా సమాజంలో గౌరవంగా బ్రతకాలనుకుంటున్నారని అందరూ తనను మెచ్చుకోవాలన్నది అతని కోరికని, మనసు పొరల్లో ఏదో మూలన ఇంకా జాలి, దయ ఉన్నాయని మందాకిని భావించింది. ప్రయత్నిస్తే తన భర్తను మార్చుకోవచ్చునన్న ఒక విశ్వాసం మందాకినిలో కలిగింది.మందాకిని భానుమూర్తి స్నేహితుడి భార్యతో "చిన్న సూత్రం చెప్పనా? వ్యసనాలన్నీ మానసిక జబ్బులు. ప్రతి మానసిక జబ్బుకి సరైన మందు ప్రేమ. అది పనిచేయకపోతే రెట్టింపు చేయాలి. విసుక్కోకూడదు."(12)అని చెబుతుంది. ఈ సంభాషణల ఆధారంగా రచయిత మందాకిని పాత్రను ఎంత వాస్తవిక కోణంలో చిత్రించారు అర్థమవుతుంది.
మందాకిని పాత్రను రచయిత చాలా ఉన్నతంగా చిత్రించారు. ముగ్గుకు రంగులు అద్దితే మరింత అందం గా కనబడినట్టే మందాకినికి గల సహజ అందానికి తోడు ఓర్పు,తెలివితేటలు, కుటుంబం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించడం వంటి ఎన్నో సుగుణాలను అద్ది రచయిత ఆ పాత్రను పాఠకుల హృదయాల్లో ఎంతో ఉన్నతంగా ఆదర్శంగా చిరస్థాయిగా నిలిచిపోయేలా చిత్రీకరించారు.
3.4 అచ్చమాంబ:
వాస్తవానికి ఈ నవలలో అచ్చమాంబ పాత్ర చాలా పరిమితమే అయినప్పటికీ ఆమె అప్పగింతల సమయంలో కూతురుకు చెప్పిన మాటలు సమస్త మహిశాలోకానికి ఓ గొప్ప సందేశంగా నిలుస్తాయి. "వైవాహిక జీవితానికి కోపం బద్ధ శత్రువు. నీవు ఓపికున్నమనిషివే అయినా దాన్ని అదుపులో ఉంచుకో. మొగుడిని గుప్పిట్లో ఉంచుకోవాలని తల్లులు అత్తవారింటికి వెళ్లే కూతుళ్ళకి చెప్తుండేవారు.
నేనలా చెప్పను, అది తప్పు కాబట్టి.భర్త అరచేతిలోని ఇసుక లాంటివాడు. కట్టడి చేద్దామని గుప్పెట మూస్తే వేళ్ళ మధ్య ఇసుకలా జారిపోతాడు."(13).
ఇలా ప్రతి తల్లి తన కూతురుకు చెప్పగలిగితే ఈనాడు విడాకులు అంటూ పెళ్లయిన కొన్ని నెలలకే విడిపోయే పరిస్థితులు రాకుండా ఉంటాయి. అన్న విషయాన్ని రచయిత అచ్చమాంబ మాటల ద్వారా పాఠక లోకానికి ఒక గొప్ప సందేశాన్ని అందించారు.
3.5 ఉమామహేశ్వరరావు:
ఒక మధ్య తరగతి తండ్రి తమ కూతుర్లకు పెళ్లిళ్లు చేసే క్రమంలో పడే ఇబ్బందులను ఉమామహేశ్వరరావు పాత్ర ద్వారా మనకు కళ్ళకు కట్టినట్టుగా చిత్రీకరించారు. వసంత లక్ష్మి చనిపోవడానికి తన అల్లుడు భానుమూర్తే కారణం అని తెలిసినా మనుమరాలు గురించి ఆలోచించి ,విధి లేక అతనికే రెండవ కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయడం సాధారణంగా అనేక మధ్యతరగతి కుటుంబాల్లో జరుగుతున్నదే. ఈ సంఘటన ఆధారంగా సామాజికమైన అంశాలనే రచయిత నవలలో సన్నివేశాలుగా మలుచినట్లు స్పష్టం అవుతుంది. ఉమామహేశ్వరరావు తప్పని పరిస్థితుల్లో మందాకిని భానుమూర్తి కి ఇచ్చి పెళ్లి చేసినప్పటికీ తన కూతుర్ని చెప్పిన జాగ్రత్తలు ప్రతి మనిషికి తన జీవితంలో ఏర్పడిన బంధాలను నిలుపుకోవడానికి ఎంతగానో ఉపయోగపడే విధంగా ఉంటాయి."అమ్మాయి గిల్లటం అంటే ఏమిటో నీకు తెలుసు. అకస్మాత్తుగా అనుకోకుండా శరీరంలో సున్నితమైన ప్రదేశంలో కలిగే తీవ్రమైన బాధ. గిల్లగానే దూరంగా జరగాలనిపిస్తుంది. ఇది భౌతికమైన అనుభూతి అలాంటి మానసిక అనుభూతే కోపం అంటే. అలాంటి అనుభూతి ఇష్టాన్ని భంగపరిచే చర్యవల్లో, బాధ కలిగించే తిట్టు లాంటి మాట వల్లో కలిగి ఆ వ్యక్తికి దూరంగా వెళ్లాలని లేదా తిరిగి అలాంటి బాధ కలిగించాలని అనిపిస్తుంది. అందుకే చాలామంది మొగుళ్ళు పెళ్ళాలను ఉట్టినే కొట్టరు. మాటల ద్వారానో, చర్యల ద్వారానో మొగిడిని మానసికంగా గిల్లి అతని చేత దెబ్బలు తింటారు. కోపం కలిగించడం ఎలాంటి బాంధవ్యంలో కూడా మంచిది కాదు ముఖ్యంగా భార్యాభర్తల సంబంధం లో ఇది అసలు మంచిది కాదు శాశ్వతంగా గుర్తించుకొమ్మ ఈ సంగతి."(14)
ఈ మాటలు ఉమామహేశ్వరరావు అతని కూతురు మందాకినికి చెప్పినవే అయినప్పటికీ రచయిత ఈ సంభాషణల ద్వారా గొప్ప సందేశాన్ని అందించారు.
4. ముగింపు:
ఈ నవల లోని సన్నివేశాలు, పాత్రలు కల్పితాలే అయినప్పటికీ రచయిత సంభాషణల ద్వారా ఎన్నో గొప్ప సందేశాలనే పాటకు ప్రపంచానికి అందించారు. సమాజంలో అయినా కుటుంబంలో అయినా స్త్రీ ఎంతటి ముఖ్యపాత్ర పోషిస్తుదో చెప్తారు. అప్పారావు గారు దిద్దుబాటు కథానిక ద్వారా చదువుకున్న మహిళ కుటుంబాన్ని ఏ విధంగా చక్కదిద్దుకుంటుంది అన్న విషయాన్ని చెప్పారు. అదేవిధంగా అదేవిధంగా ఒక చదువుకున్న తెలివైన యువతి తన కాపురాన్ని ఏ విధంగా చక్కదిద్దుకోగలదు ఈ నవల ద్వారా పాఠకులకు స్పష్టం చేశారు.
ఈ నవలలో పాత్రల మద్యం జరిగిన సంభాషణలు కేవలం ఒక కుటుంబానికి మాత్రమే వర్తించేవిగా కాక మొత్తం సమాజానికి అన్వయించగలిగేవి మలిచి రచయిత సంఘం పట్ల తనకున్న బాధ్యతను స్పష్టం చేశారు.
5. పాదసూచికలు:
- మల్లాదితో ఇంటర్వ్యూ
- నవల వెనుక కథ మల్లాది వెంకట కృష్ణమూర్తి పుట 10
- నవల వెనుక కథ. వెంకట కృష్ణమూర్తి. మల్లాది. పుట.18
- నవలా శిల్పం . వెంకటసుబ్బయ్య. వల్లంపాటి.పుట. 33
- తెలుగు నవలా వికాసము. నాగభూషణ శర్మ. మొదలి. పుట.37
- మందాకిని. వెంకట కృష్ణమూర్తి. మల్లాది. పుట.26
- పైదే. పుట.94
- పైదే. పుట.123
- పైదే. పుట.92
- పైదే. పుట.93
- పైదే. పుట.94
- పైదే. పుట.184
- పైదే. పుట.72
- పైదే. పుట.80
6. ఉపయుక్త గ్రంథసూచిక:
- నాగభూషణ శర్మ, మొదలి..తెలుగు నవలా వికాసము. నాట్య కళా ప్రెస్ ,, హైదరాబాదు, తెలంగాణ, 1971.
- వీరభద్రయ్య, ముదిగొండ..నవలా- నవలా విమర్శకులు. మూసీ, కాచీగూడా,హైదరాబాదు, 2000.
- వెంకట కృష్ణమూర్తి, మల్లాది..అద్దెకిచ్చిన హృదయాలు. ప్రిజమ్ బుక్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాదు, 2018.
- వెంకట కృష్ణమూర్తి, మల్లాది.నవల వెనుక కథ. గోదావరి ప్రచురణలు, కరప మండలం,తూ.గో.జి,ఆంధ్రప్రదేశ్, 2020.
- వెంకట సుబ్బయ్య, వల్లంపాటి.నవలా శిల్పం. నవచేతనా పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు, తెలంగాణ, 2021.
- వెంకటేశ్వర్లు, పుల్లాబొట్ల. తెలుగు నవలాసాహిత్య వికాసము. కర్షక్ ఆర్ట్ ప్రింటర్స్, హైదరాబాదు, 1994.
- వెంకట కృష్ణమూర్తి, మందాకిని. పుష్ప ప్రింటర్స్, హైదరాబాదు,1985.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "May-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-April-2025
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "MAY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి
బాధ్యత వహించరు.