AUCHITHYAM | Volume-4 | Issue-4 | April 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed
15. శ్రీనాథుని 'కాశీఖండం': 'తండ్రి' పాత్రల పరిశీలన

డా. రాంభట్ల వేంకటరాయ శర్మ
తెలుగు పరిశోధకులు, జ్యోతిష్కులు,
ప్రధానసలహాదారు, ఔచిత్యమ్- పరిశోధనమాసపత్రిక,
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 7989110805, Email: rvr87sarma@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
శ్రీనాథయుగసాహిత్యం విశేషమైన ప్రక్రియావైవిధ్యంతో విరాజిల్లింది. ఎందరో పోషకులు, కవుల వెన్నుదన్నులతో తెలుగు సాహితీకల్పవృక్షం ప్రవర్ధిల్లింది. యుగకర్త శ్రీనాథమహాకవి రచనల్లో కావ్యాలు, అందునా శ్రీకాశీఖండం విశేషాదరణ పొందిన ప్రసిద్ధక్షేత్రమాహాత్మ్యకావ్యం. ఇందులో మహాకవి చూపిన రచనావిన్యాసం, పాత్రచిత్రణావైభవం మాటల్లో చెప్పలేనిది. ఇంతటి ప్రాశస్త్యమున్న కాశీఖండంలోని తండ్రిపాత్రలను పరిచయంచేసి, సోదాహరణంగా విశ్లేషించడం ఈ వ్యాసప్రధానోద్దేశ్యం. కాశీఖండం, దానిపై వచ్చిన వ్యాఖ్యానాలు, ప్రస్తావనలు, విమర్శగ్రంథాలు, వ్యాసాలు, పరిశోధనలు ఈ వ్యాసానికి ప్రధానాకరాలు. ఆంధ్రవిశ్వవిద్యాలయం తెలుగుశాఖలో 2019లో పీహెడీ పట్టం కోసం సమర్పించిన "శ్రీనాథయుగసాహిత్యం- తండ్రిపాత్రల పరిశీలన" అన్న సిద్ధాంతగ్రంథం ఈ వ్యాసానికి ముఖ్యభూమిక. కాశీఖండంలో చోటుచేసుకున్న తండ్రిపాత్రలను, దైవ, ఋషి, మానవ సంబంధి పాత్రలుగా వింగడించి, కథానుగతంగా ఆయా పాత్రల ప్రాధాన్యాన్ని వివరించి, విశ్లేషణాత్మకపద్ధతిలో పాత్రల, చిత్రణల మేలుకీళ్ళను చర్చించడం ఈ వ్యాసపరమావధి.
Keywords: శ్రీనాథుడు, కాశీఖండం, తండ్రి, తండ్రిపాత్ర, తెలుగు సాహిత్యం.
1. ఉపోద్ఘాతం:
శ్రీనాథుడు ‘ప్రాయమింతకు మిగుల గై వ్రాలకుండ’1 రాసిన ప్రౌఢకావ్యం కాశీఖండం. దీన్ని రాజమహేంద్రవరాన్ని పాలించిన వీరభద్రారెడ్డికి అంకితమిచ్చాడు. స్కాందపురాణాంతర్గతమైన కాశీఖండానికి ఇది అనువాదం. ద్వాదశ సహస్ర గ్రంథ పరిమితి గల సంస్కృత కాశీఖండాన్ని శ్రీనాథుడు ఏడాశ్వాసాల కావ్యంగా రాశాడు. తెలుగు కాశీఖండంలో 1,777 గద్య, పద్యాలున్నాయి.
వింధ్యపర్వతవిజృంభణం, అగస్త్యుడు కాశీపట్టణాన్ని విడిచి పెట్టి, దక్షిణాపథ తీర్ధ సేవనం చేయడం, కుమారస్వామి కాశీమాహాత్మ్యాన్ని వర్ణించడం, వ్యాసుడు కాశీని విడిచిపెట్టడం మొదలైనవి కాశీఖండంలోని ప్రధాన కథా విషయాలు. కాశీఖండంలో రెండు, మూడు ఉపాఖ్యానాల్లో ‘కుబేర వృత్తాంతం’ అనే పేరుతో ‘గుణనిధికథ’ను శ్రీనాథుడు రమణీయంగా తీర్చిదిద్దాడు.
సంస్కృత కాశీఖండం పురాణైకదేశం. సులభ గ్రాహ్యమైంది. ‘‘శ్రీనాథుడు ప్రౌఢతరమైన కావ్యశైలిలో జాతివార్తాచమత్కార విలసితంగా శైవతత్త్వ ప్రతిపాదకంగా, సాముద్రిక, పాతంజల యోగశాస్త్ర, మంత్ర శాస్త్రాలను పొందుపరచి, ఆంధ్రతా ముద్రను అచ్చొత్తించి’’ కాశీఖండాన్ని రచించాడు.
‘‘కాశీ ఖండమయ: పిండమ్’ అను ఆభాణకము తెలుగు కాశీఖండమును బట్టి ఏర్పడినది’’2 అని నిడుదవోలు వేంకటరావు గారి అభిప్రాయం. కానీ ‘‘శ్రీనాథుని కాశీఖండ మిట్టి నానుడికి గురికాదగినంత కఠిన శైలిలో లేదనుట నిక్కుపము’’3 అని బండారు తమ్మయ్య తెలియజేశారు.
బహుభాషాప్రావీణ్యం శ్రీనాథుడి రచనల్లో తొణికిసలాడుతుంది. ఈ విషయం కాశీఖండంలో కూడా స్పష్టంగా తెలుస్తుంది. ‘‘ఇందలి శైలి కావ్యశైలి గావున సంస్కృతాంధ్ర సాహితీ పారగుడగు శ్రీనాథుడు పూర్వకవుల రచనా రీతులనెట్లు జీర్ణించుకొన్నదియు దెలసి కొనుటకు నీ గ్రంథమెంతేని యుపయోగపడును’’4 అని నిడదవోలు వెంకటరావు పునరుద్ఘాటించారు.
సంస్కృతంలో మయూరుడి సూర్యశతక అనువాదాలు, వాల్మీకి రామాయణం, భవభూతి ఉత్తరరామచరిత్ర, విశాఖదత్తుడి ముద్రారాక్షసం, భట్ట గోపాలుడి సాహిత్య చింతామణి (కావ్యప్రకాశిక వ్యాఖ్య) అవతారికారచనల అనువాదాలిందులో ఉన్నాయి. అగస్త్యుడు కాశీ వియోగానికి పరితపించడం (కాశీఖండం-2-104), దాక్షారామ వేశ్యావర్ణన (కాశీ ఖండం-3-23), అగస్త్యుడు కొల్లాపురానికి వెళ్తూ దారిలో వీరభద్రేశ్వరుడ్ని దర్శించడం (కాశీఖండం-3ఆ-28-35 పద్యాలు), కంచి ద్రావిడ స్త్రీ వర్ణన (కాశీఖండం 3-109) మొదలైన అమూలకాలైన భావాలను శ్రీనాథుడు సందర్భోచితంగా కూడా కాశీఖండంలో ప్రవేశపెట్టాడు.
2. కాశీఖండం- తండ్రిపాత్రలు:
ఎన్నో విశేషాలున్న ప్రౌఢకావ్యం కాశీఖండంలోని తండ్రిపాత్రల్ని ఇప్పుడు పరిచయం చేసి కథానుగుణంగా విశ్లేషిస్తాను. కాశీఖండంలో వివిధ కథల్లో చోటుచేసుకున్న తండ్రిపాత్రలను దైవ, ఋషి, మానవ సంబంధులుగా మూడు రకాలుగా ఉండడాన్ని పరిశీలించవచ్చు.
2.1 విశ్వానరుడు: (మానవ సంబంధి తండ్రి)
ఈ విశ్వానరుడి గురించి కాశీఖండంలో తృతీయాశ్వాసంలో ‘వైశ్వానర మాహాత్మ్యం’ అనే వృత్తాంతంలో ఉంది. విశ్వానరుడు శాండిల్య గోత్రంలో పుట్టిన బ్రాహ్మణుడు. సమస్తశాస్త్రార్ధాలూ తెలుసుకున్నాడు. బ్రహ్మచారిగా ఉన్న ఆ విశ్వానరుడు అన్ని ఆశ్రమాలలో ఏ ఆశ్రమం ఉత్తమమో? అని ఆలోచించాడు. దేవయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞం, బ్రహ్మయజ్ఞం అనే పంచమహా యజ్ఞాలను చేసి గృహస్థుడు ముక్తుడవుతాడు కాబట్టి నేను గార్హస్థ్య ధర్మాన్ని అవలంబించి ముక్తుణ్ణవుతాను’ అని ‘శుచిష్మతి’ అనే కన్యను పెళ్లి చేసుకుంటాడు. సకల గుణ శోభిత అయిన భార్య లభించినందుకు విశ్వానరుడు పొందే ఆనందం క్షణానికొక చందంగా ఉంటుంది. ఆ ఇల్లాలి సాహచర్యంలో విశ్వానరుడికి ఇల్లే స్వర్గధామమైంది!
కానీ, ఆ దంపతులకు ఎంత కాలానికీ సంతానం కలగలేదు. ఎన్నో నోములు నోచినా ప్రయోజనం కనిపించదు. దాంతో ఆమె విచారంతో ఓ రోజున ఏకాంతంగా ఉన్న సమయంలో భర్తనిలా అడిగింది-
‘‘మనకు సమస్త సంపదలూ ఒక ఎత్తూ, సంతాన సంపద ఒక ఎత్తూ కదా! వంశానికి గానీ మరిదేనికి గానీ సంతానమే ముఖ్యం కదా! సంతానమే లేకపోతే గృహస్థాశ్రమం వల్ల ప్రయోజనం ఏమిటి? జీవితంలో ముద్దు ముచ్చటలు ఎలా ఉంటాయి? పితృఋణం ఎలా తీరుతుంది. ముసలితనంలో చేయూతగా ఉండి దిగులు లేకుండా చూసేవాళ్ళెవరు? సంతానం కంటె గృహస్థులకు సంతోషం ఏది? కాబట్టి సంతానం ఎలా కలుగుతుందో ఆలోచించి చూడండి’ అన్న భార్య శుచిష్మతి మాటలు శ్రద్ధగా విని. విశ్వానరుడు చిరునవ్వు నవ్వి, ‘‘ఉమాపతి, విశ్వేశ్వరుణ్ణి ఆశ్రయిస్తాను. దాంతో చిరకాల వాంఛ ఫలిస్తుంది. విచారపడకు’’ అని ఊరడిరచి కాశీకి వెళ్తాడు.
విశ్వానరుడు ఆహారనియమాలతో ఒక్కో నెలా ఒక్కో వ్రతదీక్షతో సంవత్సర కాలాన్ని గడుపుతాడు. ఏకాహారం, నక్తం, అయాచితాహారం, నిరశనం, జలవ్రతం, శాకఫలాశనం, అష్టతిలాహారం, కేవలపానీయం, పంచగవ్యాలు, చాంద్రాయణం, కుశాగ్ర జలపానం, వాయు భక్షణం ఇలా... సంవత్సరం గడిపేశాడు. పదమూడో నెల మొదటిరోజు వచ్చింది. ఈశ్వరుడు, బాలుడి రూపంలో వస్తాడు.
‘‘బ్రాహ్మణోత్తమా! నీ కోరిక తీర్చడానికి శుచిష్మతీ దేవికి కొడుకుగా పుడతాను. నువ్వు మరేమీ విచారించకుండా ఇంటికి వెళ్ళి సుఖంగా ఉండు!’’ అని చెప్పి ఆ దివ్య బాలుడు అదృశ్యమౌతాడు. విశ్వానరుడు ఇంటికి వెళ్తాడు. కొన్నాళ్ళకు శుచిష్మతీ దేవి నెల తప్పి, తొమ్మిది నెలలు నిండుతాయి. లగ్నంలో శనీ, కేంద్రంలో గురుడూ ఉండగా అగ్ని అంశతో, దివ్య తేజశ్శాలి అయిన కొడుకు పుట్టాడు.
కం॥ ద్రుహిణుండు కైటభారియు,
నహి కటకుడు గూడి యిచ్చి, రక్కొడుకునకున్,
గృహపతి యనియెడు నామము
మహనీయ కృపావిధేయ మానసులగుచున్. (కా. ఖం. 4వ ఆశ్వా. 11వ పద్యం)
పదకొండో రోజున త్రిమూర్తులు కలిసి వచ్చి, ఎంతో దయతో ఆ శిశువుకు ‘గృహపతి’ అని పేరు పెడతారు. ఎదుగుతున్న బిడ్డకు తల్లిదండ్రులు అన్నప్రాశన, చూడాకర్మ, కర్ణవేధ, ఉపనయన విధి యధాశాస్త్రంగా నిర్వహించి, గురువు దగ్గరకు వేదాధ్యయనానికి పంపుతారు.
అంతలో అతిథిగా నారదుడు వాళ్ళింటికి వచ్చి పుత్రుడికుండాల్సిన గుణాలను చెబుతూ ఇలా అంటాడు- ‘విశ్వోపకారీ... విశ్వానరా! పుణ్యవతీ శుచిష్మతీ! ఈ పిల్లవాడు మీరు చెప్పినట్లు వింటున్నాడా! చిత్తశుద్ధితో మిమ్మల్ని సేవిస్తున్నాడా! తల్లిదండ్రుల ఆజ్ఞను ధిక్కరించకుండా వినడం కదా పుత్రుడి ముఖ్యధర్మం, దైవమన్నా! గురువన్నా, ధర్మమన్నా, అర్ధమన్నా, కుమారుడికి తల్లిదండ్రులకంటే మరెవరూ లేరు.
కం॥ జననీ జనకుల గొలుచుట
తనయునకును ముఖ్యమైన ధర్మము, జననీ
జనకుల గొల్చుట కంటెను
దనయునకభ్యధికమైన ధర్మము కలదే? (కా. ఖం. 4వ ఆశ్వా.17వ పద్యం)
మాతాపితలసేవ పుత్రుడికి విడిచిపెట్టరాని ధర్మం. అంతకు మించిన ధర్మం ఇంకేముంటుంది? తొమ్మిది నెలలపాటు గర్భంలో భరిస్తుంది. ప్రసవబాధను సహిస్తుంది. బిడ్డ మల మూత్రాలను ఎత్తి సంరక్షిస్తుంది. జ్వరపడినా, లంకణాలు చేస్తున్నదయినా బిడ్డకు కడుపునిండా పాలిచ్చి నిద్రపుచ్చుతుంది. ఇలా పడరానిపాట్లు పడి పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళను చేసిన తల్లిని దేవతగా భావించి సేవించిన కుమారుడికి వంశాభివృద్ధి కలుగుతుంది.
తెల్లవారగానే స్నానం చేసి, కొడుకు తల్లి పాదపద్మాలకు నమస్కరించాలి. తల్లి కాళ్ళను కడిగిన నీటిని దివ్యతీర్ధంగా భావించి సేవించినట్లయితే అతనికి ఆయస్సు పెంపొందుతుంది.
తే.గీ॥ సర్వతీర్ధాంబువులకంటె సమధికంబు
పావనంబైన జనయిత్రి పాదజలము
వర తనూజునకఖిల దేవతల కంటె
జనని యెక్కుడు సన్నుతాచారనిరత! (కా. ఖం. 4వ ఆశ్వా. 20వ పద్యం)
‘పావనమైన తల్లి పాదజలం సర్వతీర్థాలకంటే పవిత్రమైంది. కుమారుడికి దేవతలందరికన్నా ఎక్కువైనది కన్న తల్లి’. అని చెప్తాడు. వర్తమాన సమాజంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ‘అమ్మకు వందనం’ పేరుతో విద్యార్థులు తమ తల్లిని గౌరవించాలనే గొప్ప సంకల్పంతో ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రూపొందించింది. ప్రతి సంవత్సరం ‘వసంతపంచమి’ నాడు విద్యార్థులు తల్లి పాదాలను పువ్వులతో పూజించి, వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని గౌరవించడం ఈ కార్యక్రమం ప్రధానోద్దేశం. శ్రీనాథుడు మొదలైన కవుల వాక్కు ఆధునిక సమాజంలో కూడా ఆచరణయోగ్యం కావడం విశేషం. గమనార్హం. ఈ విధమైన భావాన్నే నారదుడినోట శ్రీనాథుడు పలికించాడు. వెంటనే నారదుడు ‘గృహపతిని’ పిలిచి సాముద్రికాశాస్త్రం ప్రకారం ఆపాదమస్తకం పరిశీలించి ఇలా అంటాడు-
‘విశ్వానర! నీ కుమారుడు అసాధారణ శుభలక్షణ సంపన్నుడు. కానీ ఎందుచేతనో ‘విధి’ ఇతడి పట్ల కాఠిన్యంగా ఉంది. చెప్పటానికి నోరు రావడం లేదు. తెలిసిన విషయం దాచి ఉంచటమూ చేతకావడం లేదు. ‘ఈ పిల్లవాడికి పన్నెండో ఏట గండం ఉంది’ అని చెప్పి నారదుడు వెళ్ళిపోతాడు. శుచిష్మతీ విశ్వానరులు తమ మీద పిడుగు పడ్డట్టు అరచి, మూర్ఛపోతారు. తల్లిదండ్రుల దు:ఖాన్ని పోగొట్టడానికి, వైశ్వానరుడు వారిని ఓదార్చుతూ ఇలా అన్నాడు. ‘‘అమ్మా! నాన్నా! దేనికంత భయపడుతున్నారు. మీ పవిత్ర పాద ధూళే నాకు రక్ష ! ఇక మృత్యువు నన్ను ఎలా సమీపించగలడు? అలా సాహసించి నా మీద పడినా, పిడుగు కన్నా క్రూరంగా ఎడమకాలితో ఒక్క తన్ను తన్ని, దాని పళ్లు రాలగొట్టి తీరుతాను. మీరు అనుమతిస్తే కాశీ విశ్వేశ్వరుణ్ణి ఆశ్రయించి మృత్యువు ప్రాణాలు తీస్తాను’’ అని గృహపతి అంటాడు. అందుకు తల్లిదండ్రులు మహాశ్చర్యం పొందుతారు.
‘‘ఏమిటేమిటీ? మృత్యువు ప్రాణాలే తీస్తావా? మృత్యువును జయిస్తావా? ఏ ధైర్యంతో అన్నావు. నాయనా అంతమాట? నీకీ ఉపాయం ఎలా తోచింది తండ్రి?’ అని వారు అడిగిందే మళ్ళీ అడిగి అతడి జవాబు తిరిగి తిరిగి విని సంతోషపడి, శివుడి గొప్పదనాన్ని గుర్తు చేసుకుని కుమారుణ్ణి దీవించి కాశీ పంపిస్తారు.
బాలుడు తిన్నగా వారణాసికి వెళ్ళి, గంగాతీరంలో మణికర్ణికా ఘట్టంలో స్నానం చేసి, విశ్వేశ్వరుణ్ణి దర్శించి, పుణ్యాశ్రమం కల్పించుకొని, శుభ ముహుర్తంలో లింగస్థాపన చేసి రెండు సంవత్సరాలు ఘోరతపస్సు చేస్తాడు. కొన్నాళ్లకు దేవేంద్రుడు ప్రత్యక్షమై వరమిస్తాను కోరుకోమంటాడు. ‘దేవేంద్రా! నువ్వు నాకే వరమూ ఇవ్వనక్కర్లేదు. కాశీ విశ్వేశ్వరుడి గురించి తపస్సు చేస్తున్నాను. దయచేయమంటాడు. ఇంద్రుడు కోపంతో వజ్రాయుధాన్ని విసిరితే వైశ్వానరుడు స్పృహ తప్పి మూర్ఛపోతాడు. విశ్వేశ్వరుడు సాక్షాత్కరించి మృత్యువు నుండి తప్పించి అతణ్ణి ఆగ్నేయ లోకాన్ని పాలిస్తూ దిక్పాలకులలో ఒకడిగా ఉండమని వరమిస్తాడు. గృహపతి ఇంటికి తిరిగి వచ్చి తన తల్లిదండ్రులకానందం కలిగిస్తాడు. ‘విశ్వానరుడు’
ఒక తండ్రిగా, తన కొడుకుకు ప్రమాదం పొంచి ఉందన్నప్పుడు ముందు ఆందోళన పడినా, కొడుకు చెప్పిన మాటలకు ధైర్యం తెచ్చుకుని, కుమారుణ్ణి తన గమ్యం వైపు వెళ్ళడానికి అనుమతిస్తాడు విశ్వానరుడు. పిల్లలు చేస్తామన్న పనుల్లో మంచి జరుగుతుందని తెలిస్తే, ఆ పనులకు అభ్యంతరం చెప్పక్కర్లేదని ‘విశ్వానరుడి’ పాత్ర ద్వారా తెలుసుకోవచ్చును.
2.2 కర్దమప్రజాపతి: (ఋషి సంబంధి తండ్రి)
కాశీఖండం నాలుగో ఆశ్వాసంలో ఈ పాత్ర కనిపిస్తుంది. సుశీలుడు, పుణ్యశీలుడు అనే విష్ణుభటులు ‘శివశర్మ’కు ‘వరుణలోక’ వృత్తాంతాన్ని చెబుతున్న సందర్భంలో కర్దమ ప్రజాపతి ప్రస్తావ వస్తుంది. కర్దమప్రజాపతి కుమారుడు ‘శుచిష్మంతుడు’. అచ్ఛోద’మనే సరస్సులో తన ఈడు పిల్లలతో కలిసి ఆడుకుంటున్న ఆ బాలుణ్ణి ఒక మొసలి పట్టుకుంటుంది. అతడి స్నేహితులు భయపడి పరుగు పరుగున వచ్చి దేవతార్చనలో సమాధినిష్ఠుడై ఉన్న కర్దమప్రజాపతికి ఆ విషాద వార్త వినిపిస్తారు. దివ్యదృష్టితో కుమారుడి కోసం బ్రహ్మాండం మొదలు అన్ని లోకాల్లోనూ వెతుకుతాడు.
ఒక సరస్సులో తన కొడుకును మొసలి పట్టుకొని తీసుకుపోతుండటం కనిపించింది. అయితే ఆ మొసలి తన కోరలవల్ల ఏ మాత్రం అతడికి నొప్పి కలగకుండా జలాధిదేవత దగ్గరకు తీసుకుని వెళ్లింది. జలాధి దేవత ఆ బాలకుణ్ణి సముద్రుడి ఎదుట నిలబెట్టడం అంతకన్నా అద్భుతం.
అంతలో, చేతిలో త్రిశూలం పట్లుకున్న ఒక దివ్య పురుషుడు సముద్రుణ్ణి తీక్షణంగా చూసి, కోపంతో -
‘‘ఓయీ సముద్రుడా నువ్వెంత కఠినాత్ముడివి! కర్దమ ప్రజాపతి కుమారుడూ, శివభక్తుడూ అయిన చిన్నవాణ్ణి మొసలితో కరిపించి తెప్పించావు. పరమేశ్వరుడి ప్రభావం నీకు తెలియడం లేదు.’’ అని మందలిసస్తాడు. అప్పుడు సముద్రుడు ఆ కుర్రవాణ్ణీ అమూల్య భూషణాలతో అలంకరించి, మొసలిని కట్టి ఈశ్వర కింకరుడికి అప్పగించి, అతడి వెంట తాను కూడా పరమేశ్వరుణ్ణి దర్శించుకుని, తన అపరాధం క్షమించమని ప్రార్ధిస్తాడు. శివుడు, సముద్రుణ్ణి క్షమించి, మొసలితో సహా కుర్రవాణ్ణి తండ్రికి అప్పగించమని, తన కింకరుణ్ణి ఆదేశిస్తాడు. అతడు కర్దమ ప్రజాపతి దగ్గరకు పిల్లవాణ్ణి, మొసలినీ కూడా తీసుకువస్తాడు.
ఇదంతా దివ్యదృష్టితో గమనిస్తున్న కర్దమప్రజాపతి, శివకింకరుడు తనను సమీపిస్తున్నంతలో ధ్యానం చాలించి కళ్ళు విప్పి చూస్తాడు. నిట్టూర్పులు విడుస్తున్న కొడుకు, పక్కనే శివకింకరుడు, చేతిలో పెద్ద మొసలి నిసిస్తారు. ఎదురుగా నమస్కరించి నిలబడిన ముద్దుల కొడుకుని చూసి కౌగిలించుకొని అంతులేని ఆనందం అనుభవిస్తాడు కర్దముడు. తరువాత శుచిష్మంతుడు, తండ్రి ఆజ్ఞను తీసుకుని, వారణాసి వెళ్ళి, శివలింగప్రతిష్ఠ చేస్తాడు. శివుడతడికి ‘వరుణపదం’ అనుగ్రహిస్తాడు.
ఈ కథలో కర్దమప్రజాపతి పాత్రలో అమితమైన శివభక్తి తత్పరత అనుషంగికంగా కనిపిస్తోంది. ప్రమాదానికి గురైన కొడుకుని ఆ భక్తివైభవంతోనే రక్షించుకోగలిగాడు. ప్రకృతిలో భాగమైన సముద్రుడు, మొసలి, శివకింకరుడు, చివరకు ఆ పరమేశ్వరుడు కూడా కర్దముడి భక్తిపారీణతను తెలిసినవారే. అతడి కుమారుడైన శుచిష్మంతుణ్ణి సురక్షితంగా తిరిగి అతడికి అప్పగించడమే కర్దముడి భక్తి ఔన్నత్యానికి ప్రతీక. అలాంటి భక్తిప్రపత్తులతో కొడుకును రక్షించుకున్న పరమభక్తుడిగా శ్రీనాథుడు కర్దమప్రజాపతి పాత్రను ఈ కావ్యంలో చిత్రించాడు.
2.3. యజ్ఞదత్తుడు: (మానవసంబంధి తండ్రి)
కాశీఖండం నాలుగో ఆశ్వాసంలో ‘కుబేర వృత్తాంతం’లోని గుణనిధి కథ ఎంతో ప్రాచుర్యంపొందింది. ఇందులో వైదికనిష్ఠాగరిష్టుడైన తండ్రి ‘యజ్ఞదత్తుడు’.
కాంపిల్యనగర వాసి. వేద, వేదాంగాలు నేర్చుకుంటాడు. వేదార్థం తెలిసినవాడూ, యజ్ఞవిద్యలో పండితుడు. అతడి కొడుకు ‘గుణనిధి’. అందంలో మన్మథుడి సాటి. యుక్త వయస్సులో ఉపనయం చేసి, గురువుల దగ్గర వేదాధ్యయనానికి అతణ్ణి యజ్ఞదత్తుడు పంపిస్తాడు.
కం॥ ‘‘ద్యూత క్రీడారతుడై
యాతడు కితవులును దాను నాసాయం బా
ప్రాతస్సమయము తిరుగు న
పేత నిజాచారుడగుచు నెల్లెడ వీటన్’’. (కా. ఖం. 4వ ఆశ్వా. 80వ పద్యం)
సంప్రదాయానుసారంగా భయభక్తులతో విద్య నేర్చుకొని తన పేరు నిలుపుతాడని ఆ తండ్రి ఆశ. ఆ ఆశ అడియాస అయింది పాపం. ధూర్త వ్యాపారాల్లో పడి గుణనిధి అపభ్రష్ట నామకుడయ్యాడు. జూదం, పానం, వెలది పొత్తు-ఈ మూడు అలవాటయ్యాయి. స్నాన సంధ్యలు, అగ్నిహోత్ర జపాదులు గుణనిధికి అపహాస్య విషయాలయ్యాయి. మేజువాణీలూ, మేళతాళాలూ అంటే పడిచస్తాడు. ఆకలి దప్పులు కూడా మరచిపోతాడు. గుణనిధికి నాస్తికులు, పాషండులూ నచ్చిన చుట్టాలు. ద్యూత గృహాలే విశ్రాంతి మందిరాలు. కల్లుపాకలే భజన గృహాలు, వెలయాళ్ళే ఇష్టదేవతలు.
తండ్రి ఎంత శిష్టాచారపరుడో కొడుకంత దుష్టాచారపరుడు అయిపోతాడు. పైగా ఒకే ఒక్క కొడుకు! తల్లిముద్దు చెయ్యడం, పనిపాట్ల ఒత్తిడిలో తండ్రి పరామర్శించకపోవడం గుణనిధి దారి తప్పడానికి కారణాలయ్యాయి. ‘సిగ్గు’ అనేది లేకపోవడం అన్ని అవగుణాలకైనా మూలం అవుతుంది.
‘‘లజ్జా మేకాం పరిత్యజ్య త్రిలోకవిజయీ భవేత్’’ సిగ్గు ఒక్కటి విడిచిపెడితే ముల్లోకాలనూ గెలిచినవాడు అవుతాడు- అనే పెద్దల మాటకు ప్రథమ సాక్షి గుణనిధి. ఆ విధంగా వాడి పేరు నేతిబీరకాయ చందమయ్యింది. జూదంలో తానోడిపోయి చెల్లించాల్సిన డబ్బు కోసం, తల్లి ఒంటిమీద నగలమ్మి డబ్బు కడుతుండేవాడు.
జూదం రెండు రకాలు. ‘సజీవ జూదం’ అంటే కోళ్ళ పందాలు, గొఱ్ఱెల పందాలు. ‘నిర్జీవ జూదం’. అంటే పాచికలాట. పాపం..! తల్లి వాడిని ఎంతో బుజ్జగించి మంచి మార్గంలోకి తిప్పడానికి - ‘‘నాన్నా! మీ నాన్న చెప్పినట్లు చేద్దూ. తుంటరుల వెంట తిరగకు. మంచివాళ్ళతో చెలిమి చేసుకో!’’ అని ఎన్నో మాటలు చెప్పేది. యజ్ఞదత్తుడికివేవీ తెలియవు. ఇంటి పనులు చూసుకోవడంతోనే ఆయనకు సమయం గడిచిపోయేది.
ఎప్పుడో ఓసారి ‘‘అబ్బాయి ఎక్కడే! కనబడ్డేం? అని అడిగితే.. ‘అయ్యో! ఇప్పటి దాకా నా దగ్గర ఉన్నాడండీ! ఇప్పుడే చదువుకోడానికి వెళ్లాడు’ అనేదావిడ. ‘స్నానం చేశాడా? సంధ్య వార్చాడా? అగ్ని కార్యం చేశాడా? అనే వాడు భర్త. అన్నీ చేశాడని అబద్ధాలు చెప్పేది. లేకలేక కలిగిన ఒక్కగానొక్కవాడనీ ఆ తుంటరి చేసే దౌర్భాగ్యపు పనులు తెలియనివ్వకుండా దాచిపెట్టేది. ఇలాగే పదహారేళ్ళ వాడయ్యాడు. గుణనిథికి తల్లిదండ్రులు పెళ్లి చేశారు. అప్పటికైనా వాడికి వివేకం కలుగుతుందేమో, తెలియకపోతే చెబితేనైనా గ్రహించుకోగలడేమో అని ఆశపడి తల్లి రోజూ వాడికి బుద్ధులు చెప్పేది.
‘‘నువ్వు చేసే పాడుపనులన్నీ తెలిస్తే మీ తండ్రికెంత కోపమొస్తుందో తెలుసునా? ఇన్నాళ్ళూ అడిగినప్పుడల్లా ఏదో చెప్పి కప్పిపుచ్చుతున్నందుకు ముందు నా మీద చంపేంత కోపం వస్తుంది. పట్టణంలో నువ్వు విఱ్ఱవీగి చేస్తున్న సిగ్గుమాలిన పనులు చూసి లోకులు నవ్వుతారు. ‘ఆ దీక్షితుడి కొడుకులింటా వాడా’ అని మీ తండ్రిని నానావిధాలుగా అపహాస్యం చేస్తారని ఇలా బ్రతిమాలుతుంది. ఈ సన్నివేశం యజ్ఞదత్తుడి ఆచారనిష్ఠను, అనాచారులపట్ల వ్యక్తం చేసే కోపతీవ్రతను తెలుపుతోంది.
కం॥ ‘‘అవినయ నిధానమగు నీ
నవయౌవన శైశవముల నడిమి వయసునన్
గవిసిన వ్యసనోద్రేకం
బవగాఢము, దీని మానవయ్య తనూజా’’! (కా.ఖం. 4వ ఆశ్వా. 97వ పద్యం)
దుర్గుణాలు యవ్వనారంభంలోనే కలిగితే వాటి నుంచి మరలించడం ఎవరికీ సాధ్యంకాదు. ఇలాంటి మాతృబోధ గుణనిధికి బాధకమే అయ్యింది గాని, సాధకం కాలేదు. వాడి నడత - ఇంకా హద్దు మీరిందే గాని అదుపులోకి రాలేదు.
ఇలా కొన్నాళ్ళు గడిచింది. ఒకరోజు యజ్ఞదత్తుడు వీధిలో వెళ్తూ ఒక జూదరి చేతిని తళుక్కున మెరుస్తున్న ఉంగరాన్ని చూస్తాడు. అది తనదే! ఒక వర్తకుడు కొత్తగా రాజుగారిని చూడటానికి వచ్చి ఆయనకు కానుకగా ఇచ్చాడు. రాజుగారు ఒక శుభసమయంలో ఆ ఉంగరాన్ని దానంగా, ధారాపూర్వకంగా యజ్ఞదత్తుడికిస్తారు. దాన్ని తన సంతోష సమయంలో ముద్దుగా ఇల్లాలికిస్తాడు. తల్లి దగ్గర్నుండీ గుణనిథి ఆ ఉంగరాన్ని చేజిక్కుంచుకుంటాడు. అది వట్టి ఉంగరం కాదు. నవరత్నాలు పొదిగింది. తండ్రి యజ్ఞం చివర్లో చేసిన అవబృధ స్నానానికి సాక్ష్యమది.
అలాంటి మహోన్నతమైన ఉంగరం జూదరి చేతికి ఉండటాన్ని చూసి ఆయనకు ఆశ్చర్యం కలిగింది. పట్టరాని కోపం వచ్చింది. జూదరిని అడ్డగించి... ఆ ఉంగరం తనకెలా వచ్చిందో చెప్పకపోతే రాజుగారికి చెప్పి శిక్ష వేయిస్తానని నిలదీసి అడుగుతాడు యజ్ఞదత్తుడు.
కాని జూదగాడు భయపడలేదు. ‘సోమయాజుల వారూ! మీ అబ్బాయి నాతో జూదమాడి ఓడిపోయాడు. పందెం కింద నాకు ఇచ్చాడిది. ఇదొక్కటేమిటండీ? బంగారపు చెంబులు, గిన్నెలు, పళ్ళాలు, వెండివి, రాగివి, ఇత్తడివి ఎన్నెన్నో తాకట్టు పెట్టి ఊరంతా జూదాలాడుతున్నాడు. అయ్యా! ఉన్నమాట చెబుతున్నాను. జూదగాళ్ళలో మీ కుమారుడి వంటి జూదపు పిచ్చివాడు లేడు. యజ్ఞదీక్షితులలో మీ మాదిరిగా ప్రసిద్ధికెక్కిన యజ్ఞ దీక్షితుడూ లేడు’’ అని అంటాడు.
యజ్ఞదత్తుడీ మాటలు వినీ వినడంతోనే ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడలేకపోయాడు. కొడుకంత అవినీతుడైనందుకు భరించరాని సిగ్గేసింది. వాడి దుష్కార్యాలన్నీ తనకు తెలియనివ్వకుండా దాచిపెట్టిన భార్య మీద... పట్టరాని కోపం వచ్చింది. ఒక్క విసురున ఇంటకొస్తాడు. ‘‘సోమి దేవమ్మా! ఏం చేస్తున్నావు? ఏడీ నీ కొడుకు? ఎక్కడికి దయచేశాడు? వాడెక్కడికి పోతే ఏం కానీ ముందిది విను!’’ అని తీక్ష్ణ దృష్టితోనూ, తీవ్ర స్వరంతోనూ -
‘‘ఆనాడు నాకు తలంటి నీళ్ళు పొయ్యడానికి నలుగు పెడుతూ... నా వేలికున్న ఉంగరాన్నడిగి పుచ్చుకున్నావే! అది ఏదీ? ఎక్కడుంది ? ఇలా ఇవ్వు? అది పెట్టుకొని గాని ఇవాళ నేను హోమం చెయ్యను’’ అని అంటాడు.
అప్పుడావిడ- ‘‘చూడండి! మధ్యాహ్న సంధ్యాసమయమయ్యింది. ముందు స్నానం చెయ్యండి! సంధ్యావందనం కానివ్వండి! అగ్ని కార్యం పూర్తి చెయ్యండి! శివార్చన జరపండి! పంచమహాయజ్ఞాలు ముగించండి! బ్రాహ్మణులెంతమందో అతిథులై వచ్చి ‘‘అన్నం ఎప్పుడు పెడతారా!’ అని ముందు చావడిలో కాచుకొని కూర్చున్నారు. ఉడికిన అన్నం, కూరలూ చల్లారిపోతే తినడానికి బాగుండవు. ఉంగరానికేం? నా పెట్టెలో ఒక భరిణలో భద్రంగా దాచి ఉంచాను. ఇప్పుడది వెతికి ఇవ్వాలంటే సమయం పడుతుంది. భోజనాలైన తర్వాత తీసి ఇస్తా గదా! అందాకా కాస్త ఆగుదురు?’’ అని దాటవేస్తుంది.
మరింత కోపంతో యజ్ఞదత్తుడు స్పష్టంగా మాట్లాడను కూడా మాట్లాడలేకపోయాడు. ‘‘ఓహోహో! సత్పుత్త్ర మాతా! యథోచిత కార్యాలు చెయ్యకుండానే అన్నీ చేశాడని బద్దాలాడిన నువ్వు సంపాదించిందేమిటి? ఎప్పటి కప్పుడు నువ్వేదో చెబుతుంటే నిజమేనని నమ్మి నా వంశోద్దారకుణ్ణి చక్కదిద్దుకోలేక సర్వభ్రష్టుణ్ణి చేసుకొన్నాను. ఇప్పుడేమనుకొని ఏం ప్రయోజనం?’’ అని ఎంతో పశ్చాత్తాపపడతాడు.
ఇప్పటి వరకూ, యజ్ఞదత్తుడు మాట్లాడిన మాటల్లో, కొడుకు అప్రయోజకుడిగా మారడానికి, తల్లే కారణమనే కోపంతో కూడిన బాధ కనిపిస్తోంది. నిజానికి ఆ స్థితిలో ఎవరికైనా అలా అనిపించడం మానవ సహజం. అయితే దీక్షితుడై ఉండి, కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోవడమే కాకుండా, కొడుకుని మార్చాకోవాలనే తలంపు అతనికి రాలేదు. విలువైన, అపురూపమైన తన వస్తువులన్నీ గుణనిధి వీథిపాలు చేశాడని బాధపడతాడు.
మితిమీరిన కోపంతో.. ‘‘వాడు బతికివున్నా నాకు చచ్చినవాడే! కొడుకేమో గుణనిధి! మొత్తమంతా విషం. ఇప్పుడే నువ్వులూ, దర్భలూ తెచ్చి వాడికి నీళ్ళు వదులు కొంటాను. చెడిపోయిన కొడుకు ఉండటం కంటే కొడుకులు లేకపోవడమే మంచిది.’’ అని విపరీతధోరణితో ప్రవర్తిస్తాడు. ఇందులో యజ్ఞదత్తుడి తీవ్రమైన అసహనం ద్యోతకమౌతోంది.
తే.గీ॥ ‘‘చాలునింక నాపాలికి జచ్చినాడు
కొడుకు గుణనిధి యనువాడు కులవిషంబు
తిలలు దర్భయు నుదకంబు దెత్తుగాక
యే నివాపాంజలులువాని కిత్తునిపుడు’’ (కా. ఖం. 4వ ఆశ్వా. 109 పద్యం)
‘‘కుపుత్త్రత్వంబుకంటె నపుత్త్రత్వంబు మేలు’’5 అని యజ్ఞదత్తుడు దు:ఖాన్ని, క్రోధాన్ని నిగ్రహించుకోలేకపోయాడు. పళ్ళు పటపట నూరుతూనే ఉన్నాడు. రెండురోజులు గడిచినా కోపం ఎక్కువయ్యిందే గానీ తగ్గలేదు. ఆ వేడి ఆయనను ద్వితీయ వివాహానికి పురికొల్పింది. కొద్ది రోజులలో సంబంధం కుదిరింది.
కొడుకు దుండగాలను మొదటి నుంచి కప్పిపుచ్చి భర్తను వంచించి, కడుపు తీపితో వాడిని తగు విధంగా శిక్షించి దారిలో పెట్టే అవకాశం భర్తకు ఇయ్యని, తెలివి తక్కువ ఇల్లాలు అటు కొడుకు అండకూ, ఇటుపతి అండకూ కాకుండా మిగిలింది. తండ్రికి తన విషయం తెలిసినట్టు గ్రహించిన గుణనిధి మళ్ళీ ఇంటికి వెళ్ళలేదు. ఊరువిడిచి వెళ్ళిపోతాడు.
‘కుబేర వృత్తాంతం’లో గుణనిధికథలో యజ్ఞదత్తుడి పాత్ర ఇంత వరకే ఉంది. యజ్ఞ దత్తుడి ప్రవర్తనను బట్టి తండ్రిగా ఎలా ప్రవర్తించాడో ఈ క్రింది వాక్యాలలో డా॥ ద్వా.నా. శాస్త్రి వివరించారు.
‘‘కుటుంబానికి పెద్ద తండ్రి. అటువంటి తండ్రి తన కొడుకును గురించి పట్టించుకోలేదు. అప్పుడప్పుడు భార్యను వాకబు చేసేవాడు. చివరికి అతని దుర్మార్గాలు తెలుసుఒని ఉగ్రుడయ్యాడు. కానీ లాభమేమిటి? జరగాల్సినదంతా జరిగిపోయిన తర్వాత ఏమనుకుంటే ప్రయోజనం ఏముంది? ఎన్ని పనులున్నా తన సంసారాన్ని గురించి, తన పిల్లలను గురించి పట్టించుకోని తండ్రిని తండ్రి అనవచ్చా? అని ప్రశ్న. ఇవాళ సమాజంలో సంపాదనలో, అధికారంలో పడిపోయి తమ పిల్ల బాగోగుల్ని పట్టించుకోని యజ్ఞదత్తుని వారసులు చాలా వున్నారు. ఎవరికో బాధ్యతను అప్పగించి తాను తన పనుల్లో, తన వినోదాల్లో మునిగిపోతూ-పిల్లలను గాలికి వదిలేసే బాధ్యతారహితులైన తండ్రులకి ఈ పాత్ర ఒక ప్రతీక.’’6
గుణనిధి, ఈశ్వరానుగ్రహం వల్ల తర్వాతి జన్మలో ‘అరిందముడి’కి కుమారుడిగా పుట్టి, ‘దముడ’నే పేర కళింగ దేశాన్ని పరిపాలించి, దీప కళికాదాన మహిమ వల్ల ఆ తర్వాత జన్మంలో కుబేరుడై ఈశ్వరుడికి ప్రియసఖుడౌతాడు. మేఘవాహన కల్పంలో యజ్ఞదత్త కుమారుడు గుణనిధి కుబేరుడయ్యాడు. ‘‘కల్పాలు మూడు. అవి: - 1) బ్రహ్మ కల్పం 2) శ్వేత వరాహ కల్పం 3) పద్మకల్పం. ఇప్పుడు నడుచుచున్నది శ్వేత వరాహ కల్పము.’’7
2.4 ఆదిత్యుడు (సూర్యుడు) (దైవసంబంధి తండ్రి):
విష్ణు కింకరులు శివశర్మకు కుబేర లోక, ఈశాన లోక, చంద్రలోక, నక్షత్రలోక, బుధలోక, శుక్రలోక, అంగారకలోక, బృహస్పతి లోక వృత్తాంతాలను చెప్పి, ‘శనైశ్చర లోక వృత్తాంతం’ చెప్పే సందర్భంలో వచ్చిన పాత్రే సూర్యుడిది. ‘అన్ని గ్రహాలలో విశిష్టుడైన వాడు శని. ఈ మహాత్ముని చరిత్ర విను’ అని చెబుతున్నారు.
శ్రీమన్నారాయణ మూర్తి నాభికమలం నుంచి బ్రహ్మ దేవుడు, అతడికి మరీచి, ఆ మహర్షికి కశ్యపుడు జన్మిస్తారు. కశ్యప ప్రజాపతికీ అదితికీ ‘ఆదిత్యుడు’ పుట్టాడు. ‘త్వష్ట’ పుత్రికైన సంజ్ఞాదేవిని ఆదిత్యుడికీ మనువూ, యముడూ అనే కొడుకులు, యమున అనే కూతురు పుడతారు.
సంజ్ఞాదేవి పరమ సుకుమారి. ఉగ్రతేజుడైన సూర్యుడి వేడిని భరించలేకపోతుంది. తనను పోలిన ఛాయ అనే కన్యను సృష్టించి, ఆమెతో ఇలా సంజ్ఞాదేవి ఇలా చెబుతుంది. -
‘ఛాయా! నేను మా పుట్టింటికి వెళ్లొస్తాను. నా ఆజ్ఞ ప్రకారం నువ్వు నాకు మారుగా భర్తకి పరిచర్యలు చేస్తూ ఉండు. మనువూ, యముడూ, యమునలను నీ పిల్లలగానే చూస్తూ ఉండు. ఈ రహస్యం గొంతు మీదకి వచ్చేటంత కష్ట సమయంలో గాని ఎవరికీ చెప్పకు.’’ అని చెప్పి సంజ్ఞాదేవి పుట్టింటికి వెళ్తుంది.
ఛాయాదేవి ఎంతో జాగ్రత్తగా మెలుగుతూ సూర్యదేవుడి వల్ల సావర్ణి మనువూ, శనైశ్చరుడూ, భద్రా అనే బిడ్డల్ని కంటుంది. ఆదిత్యుడు ఛాయను సంజ్ఞగానే నమ్ముతాడు. అయితే కొంత కాలానికి ఛాయ అందరి స్త్రీల్లాగానే తన బిడ్డల్ని ఎక్కువ మక్కువతోను సవతి బిడ్డల్ని చిన్నచూపుతోనూ సంరక్షణ చేస్తుంది. యముడు విధివశంతో తనను నిరాదరిస్తున్న ఛాయాదేవిని తన్నటానికి పాదం ఎత్తుతాడు. దానితో ఛాయాదేవికి ఎక్కడిలేని కోపం వస్తుంది. ఆమె కోపం ఆపుకోలేక యముణ్ణి కాల్చేట్టు చూసి, ‘నీ పాదం తెగిపడుతుంది గాక!’ అని శపించింది. తల్లీ కొడుకుల మధ్య వచ్చిన కలహం విని భాస్కరుడు, ఛాయను చూసి ఇలా ప్రశ్నిస్తాడు.
తే.గీ॥ ఎట్టి యపరాధ మొనరించెనేని దల్లి
కొడుకు శపియింప దిబ్భంగి గ్రూర బుద్ధి
నతివ! సత్యంబు చెప్పు మెవ్వతెవు నీవు?
నావుడును! శాపభీతి న న్నలిననేత్రి! (కా. ఖం. 4వ ఆశ్వా. 269వ పద్యం)
‘‘ఏతల్లీ కూడా కొడుకుని ఇంత క్రూరంగా శపించదు. నిజం చెప్పు! ఎవరు నువ్వు?’’ అని ఆదిత్యుడంటాడు. ఛాయాదేవి భర్త ఆగ్రహం గమనించి ఆయన తనను శపిస్తాడేమో అని వణికిపోతూ రహస్యం బయటపెడుతుంది. ఆయన లోకజ్ఞుడు కాబట్టి ఆమె చేసిన తప్పు దండనీయం కాదని, కుమారుడైన యముణ్ణి ‘‘నాయనా! ఏ శాపాన్నైనా మళ్ళించవచ్చుగానీ, తల్లి శాపాన్ని మళ్ళించడానికి అవకాశం లేదు. క్రిమి కీటకాదుల లోపల చేరి తినివేయడం వల్ల నీపాదం తెగిపడుతుంది. అంతేకాని ఎవరో నరికివెయ్యడం వల్ల కాదు’’. అని ఓదార్చి మామగారి ఇంటికి వెళ్ళి తన భార్య విషయమై ప్రశ్నించాడు. ఆమె తపస్సు చేసుకోవడానికి వెళ్ళిందని తెలుసుకుని తాను కూడా అక్కడికి వెళ్తాడు.
సంజ్ఞా దేవి ఆడ గుర్రం రూపంలో తపస్సు చేస్తున్న సంజ్ఞాదేవిని సూర్యుడు మగ గుర్రంగా మారి సమీపిస్తాడు. ఆప్పుడామె కవలలకు జన్మనిస్తుంది. వారే అశ్వనీ దేవతలు.
ఈ విధంగా, సూర్యుడు మొదటే సంజ్ఞకు, ఛాయకు తేడా తెలుసుకోగలిగితే, యముణ్ణి శాపం నుండి తప్పించే వాడేమో? తండ్రిగా తర్వాతనైనా యముణ్ణి ఓదార్చి, తగిన విధంగా ఔదార్యం చూపించాడు.
2.5 ఉత్తానపాదుడు (మానవ సంబంధి తండ్రి):
‘సప్తర్షిలోకవృత్తాంతం’ తర్వాత శివశర్మకు, విష్ణుభటులు ‘‘ధ్రువపదవృత్తాంతం’’ చెప్పే సందర్భంలో ఈ పాత్ర ప్రస్తావన వస్తుంది.
14 మన్వంతరాలున్నాయి. ఒక్కో మన్వంతరానికి ఒక్కో మనువు పాలకుడు. ‘‘ఆ మనువులు: 1) స్వాయంభువ, 2) స్వారోచిష, 3) ఉత్తమ, 4) తామస, 5) రేవత, 6) చాక్షువ, 7) వైవస్వత, 8) సూర్య సావర్ణిక, 9) దక్ష సావర్ణిక, 10) బ్రహ్మ సావర్ణిక, 11) రుద్ర సావర్ణిక, 12) ధర్మ సావర్ణిక, 13) ధౌచ్య, 14) విష్ణు సావర్ణిక. ఇప్పుడు నడుస్తున్నది వైవస్వత మన్వంతరం’’8 సుప్రసిద్ధుడైన స్వాయంభువమనువుకు కుమారుడు ‘ఉత్తానపాదుడు’. అతడికి సురుచీ, సునీతీ అని ఇద్దరు భార్యలు. సురుచికి ఉత్తముడనే కొడుకూ, సునీతికి ధ్రువుడనే కొడుకూ పుడతారు. రాజుకు ఉత్తముడంటే ఆదరమెక్కువ.
ఒకరోజు కొలువు తీర్చి ఉన్న ఉత్తానపాదుడి, తొడ మీద ఉత్తముడు కూర్చున్నాడు. అంతలో ధ్రువుడక్కడికి వస్తాడు. ఉత్తముడు కూర్చున్న తొడమీదనే తానూ కూర్చోవడానికి ప్రయత్నిస్తాడు. సురుచి అతనిని తోసేస్తుంది. రాజు చూస్తూ ఊరుకుంటాడు. ధ్రువుడికి ఉక్రోషంతో వెనుక్కు తిరిగి తల్లి అంత:పురానికి వెళ్ళిపోతాడు. జరిగిందంతా ఆమెతో చెప్తాడు. ఆ పరాభవం సహించ-లేనంటాడు. రాచబిడ్డ కదా! చిన్నవాడైతేనేం? అడవికి పోయి తపస్సు చేసి, ఉత్తముడు కూర్చున్న చోటికంటే ఉన్నతమైన పదం అలంకరించి తీరుతానంటాడు. తల్లి దీవిస్తుంది. దారిలో సప్తర్షులు ఎదురవుతారు. వాళ్లు అతనికి ద్వాదశాక్షరమంత్రోపదేశం చేస్తారు. రాజపుత్త్రుడు ఏకాగ్రతతో నారాయణమూర్తిని ఉద్దేశించి తపస్సు చేసి, భగవంతుడి అనుగ్రహం వల్ల విశ్వంలో ఉన్నతమైన ఈ పదం పొందాడు’’ అని ధ్రువపద వృత్తాంతాన్ని విష్ణుభటులు శివశర్మకు వివరిస్తారు.
పిల్లలందర్నీ సమానంగా చూసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత. అయితే ధ్రువుడి విషయంలో ఉత్తానపాదుడు విముఖతను చూపించాడు. ధ్రువుణ్ణి తొడమీద కూర్చోనివ్వకుండా తోసినప్పుడైనా తండ్రిగా చేరదీయాలి. కానీ ఆ విషయంలోనూ ఉత్తానపాదుడు సరిగ్గా నడుచుకోలేదు. పిల్లల మనస్తత్త్వం తెలుసుకొని అందుకు తగ్గట్టుగా తల్లిదండ్రులు మెలగాలి అన్న విషయం ఈ ఇతివృత్తం ద్వారా తెలుసుకోవచ్చును.
2.6 శ్రీకృష్ణుడు (మానవ/దైవసంబంధి తండ్రి):
కాశీఖండం ఆరో ఆశ్వాసంలో ‘‘సాంబాదిత్య మాహాత్మ్యం’’ లో శ్రీకృష్ణుడి గురించి ప్రస్తావన ఉంది. ద్వాపర యుగంలో భూభారం తొలగించడం కోసం గోవిందుడు - దేవకీ వసుదేవులకు శ్రీకృష్ణుడు అనే పేర పుత్రుడిగా అవతరిస్తాడు. అతడు అంత:పురంలోని వేలకొలది రాణులవల్ల లక్ష ఎనభై వేల మంది పుత్రులను కంటాడు. పట్టపు రాణుల్లో జాంబవతికి ‘సాంబుడు’ అనే కుమారుడు పుడతాడు. చిన్న వయస్సులో వీధిలో స్నేహితులతో సాంబుడు ఆడుకుంటున్నప్పుడు, నారదమహర్షి వస్తాడు. ఆట ధ్యాసలో మునీశ్వరుణ్ణి గౌరవించలేకపోతాడు. అతని తోడి పిల్లలందరూ ఆ మహర్షిని అంతదూరం నుంచే చూసి నమస్కరిస్తారు. ‘‘పుట్టదొకవేళ వివేకము దొడ్డవారికిన్’’9 ఎంతటి వారికైనా ఒకప్పుడు వివేకం పుట్టదన్నట్లు... సాంబుడు ఆడుతూనే ఉన్నాడు గానీ, తోటివాళ్ళని చూసైనా నారదమహర్షికి నమస్కరించలేదు.
మహర్షి సాంబుడి అవినయం మరచిపోలేకపోయాడు. శ్రీకృష్ణుణ్ణి సందర్శించినపుడు, ఆ సమీపంలోనే ఉన్న సాంబుణ్ణి సాభిప్రాయంగా చూస్తూ, ‘‘స్త్రీలను నమ్మి ఏమరపాటుగా ఉంటే మోసం చేస్తారు సుమా!’’ అని హెచ్చరిస్తున్నట్లుగా చెప్పి, ఆ సందర్భంలో ధూర్తుడిగా సాంబుడి పేరు చెప్తాడు.
శ్రీ కృష్ణుడికి, కుమారుడి నడవడిక మీద అనుమానం కలిగింది. కాని ఎంత జాగ్రత్తగా గమనిస్తున్నా ఆ పిల్లవాడితో ఏవిధమైన దోషమూ కనిపించలేదు. కానీ, సాంబుడికి తగినశాస్తి జరపాలనే పట్టుదలతో నారదుడుంటాడు. కొన్నాళ్ళకు మళ్ళీ ద్వారకకు వస్తాడు. శ్రీ కృష్ణుడు అంత:పురంలో ఉన్నట్లు తెలుసుకొని ఆయనకు తన రాక తెలియజేయమని సాంబుడితో చెప్తాడు. అంత:పుర ప్రవేశం చేస్తే తప్పు. చెయ్యకపోతే తప్పు. ఆ వేళలో అంతిపురిలోకి వెళితే ఆగ్రహిస్తాడు తండ్రి. వెళ్ళి తన రాక వినిపించకపోతే అలుగుతాడు ముని. ఆ కుమారుడు కొంతసేపు కర్తవ్యమూఢుడై, చిట్ట చివరకు ముని కోరికను తీర్చదలచుకొన్నాడు. తండ్రి దగ్గరకు వెళ్ళి వెళ్ళడంతోనే రాకూడని వేళలో వచ్చావేమని కోపిస్తాడు తండ్రి. ‘‘ఈ మర్యాదోల్లంఘనం వల్ల నువ్వు కుష్టు వ్యాధి పీడితుడివౌవుతావుగాక’’! అని శపిస్తాడు.
నిరపరాధి సాంబుడు కన్నీరు కారుస్తూ, బ్రహ్మను కన్న తన తండ్రికి, బ్రహ్మ కన్న నారదమునికీ నమస్కారాలు పెట్టి శాపమోక్షం అర్ధిస్తాడు. కాశీకి వెళ్ళి ఆదిత్యారాధన చేస్తే శాపవిముక్తి అవుతుందన్నాడు జడధారి. ‘‘అలా చెయ్యి నాయనా! అన్నాడు చక్రధారి.
కొడుకుని క్రమశిక్షణతో పెంచాల్సిన బాధ్యత కన్నవాళ్ళదే. వాళ్ళలో ఎలాంటి అవలక్షణాలు కలుగుతున్నాయని గ్రహించినా వెంటనే చక్కదిద్దాలి. ఒకవేళ పిల్లల ప్రవర్తన గురించి ఎవరైనా ఆరోపిస్తే, ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవడం ఎంతో అవసరం. సాంబుడి తప్పిదాన్ని మొదట్లోనే గుర్తించి, పునరావృతం కాకుండా తగిన బుద్ధిని చెప్పుంటే శ్రీకృష్ణుడికి మళ్ళీ మళ్ళీ సాంబుడు భయపడాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు. కానీ నారదుడి ఆదేశాన్ని పట్టించుకోకపోతే ముని శపిస్తాడనే భయంతో తండ్రి తనను అర్థం చేసుకుంటాడనే ఆత్మీయతతో సాంబుడు హద్దుమీరి ప్రవర్తిస్తాడు. చిన్నపిల్లల తత్త్వాన్ని అర్థం చేసుకోలేని పాత్రగా శ్రీకృష్ణుణ్ణి శ్రీనాథుడు ఈ కావ్యంలో చూపించాడు.
2.7 దక్షప్రజాపతి (దైవసంబంధి తండ్రి):
కాశీఖండంలో ఏడో ఆశ్వాసంలో ‘దక్షేశ్వర లింగప్రాదుర్భావ’ సందర్భంలో ‘దక్షుడి’ పాత్ర ఉంది. ఒకప్పుడు సమస్తదేవతలతో కైలాసంలో పరమేశ్వరుడు కొలువు దీర్చాడు. సభ ముగిసాక, అందర్నీ సముచిత ప్రకారంగా వీడ్కొలిపాడు. కానీ తనకు మామగారైన దక్షప్రజాపతిని యధోచితంగా సాగనంపడం మరచిపోయాడు. దక్షుడు చాలా అవమానపడ్డట్టు భావించుకొంటూ తన నివాసానికి వెళ్ళి మనస్సులో ఇలా ఆలోచిస్తాడు-
‘‘ఈ రుద్రుడి వంశం, గోత్రం, దేశం, శీలం ఎలాంటివో ఎవరెరుగుదురు? ఎద్దునెక్కుతాడట? విషం తిన్నాడట! ఆహా ఏం చెప్పాలి వీడి కథలు! ఆయుధం విడవడం! తపస్సు చేస్తాడట! అని ఇలా చాలా రకాలుగా దక్షుడు అనుకున్నాడు. మామనే! పంచ గురువులలో ఒకణ్ణే.. బ్రహ్మదేవుడి కుమారుణ్ణే! అసలు తల్లిదండ్రులే ఎరుగని వీడికి నేను పిల్లనివ్వడమేమిటి? అది నా తప్పుగానీ వీడి తప్పు కాదు.’’ అని దక్షుడు ఎన్నో విధాలుగా అవమానభారాన్ని సహించలేకపోతాడు.
తే. గీ॥ ‘‘పేదలయ్యును గడు బిఱ్ఱ బిగిసి యుండ్రు
వట్టి యభిమానములను గర్వముల బట్టి
యల్లు వారికి నెల్ల నీ యవగుణంబు
వెన్నతో బెట్టినది యింత విసువ నేల?’’ (కా. ఖం. 7వ ఆశ్వా. 50వ పద్యం)
‘‘పేదవాళ్ళయినా తెగనీలుగుతారు. ఎక్కడలేని టెక్కూ వీళ్ళదే. కళ్ళు ఎక్కడో ఉంటాయి. అల్లుళ్ళందరూ ఇంతే. ఇంతకు ముందు చంద్రుడు భార్యలను సరిగా ఏలుకోకపోతే క్షయవ్యాధి పొందేట్టు శపించాను కదూ! అంతమంది దేవతలలో ‘‘అయ్యో! మమగారే!’’ అని అయినా చూడకుండా నన్ను తిరస్కరించాడు. కాబట్టి అల్లుడని నేను చూడను. వీణ్ణి పిలవకుండా నేను మహాయజ్ఞం చేస్తాను’’. అని దక్షుడు మనస్సులో శపథం చేసుకుంటాడు.
‘నిరీశ్వరయజ్ఞం’ తలపెట్టి, ఒక్క ఈశ్వరుణ్ణి తప్పించి అందరినీ దక్షుడు. ఆహ్వానిస్తాడు. దధీచి మహర్షి దక్షుడితో ‘‘అయ్యా! దక్షా! నీ శ్రేయస్సు మరీ మరీ కోరి చెబుతున్నాను. ఒక్క మాట విను! క్రతుఫలాధీశుడైన నాగ కంకణుణ్ణి యజ్ఞానికి రప్పించు. శివహీనాలైన సర్వకర్మలూ నిరర్ధకాలు సుమా!’’ అని అనగానే, దక్షుడు కోపదగ్ధుడై, ‘‘ఈ బ్రాహ్మణుణ్ణి వాకిట్లోకి ఈడ్వండి!’’ అన్నాడు. దధీచి తనంతట తాను యజ్ఞశాల విడిచి వెళ్ళాడు. దుర్వాసుడు మొదలైన వాళ్ళు ఆయనతో కలిసి వెళ్ళిపోతారు.
ఇదంతా నారదుడి వలన విన్న సతీదేవి తండ్రికి మంచి చెప్పాలని కైలాసం నుంచి తిన్నగా తండ్రి యజ్ఞం చేస్తున్న చోటికి శివానుమతితో వెళ్తుంది. కూతురి అభిప్రాయం తెలుసుకుని దక్షుడిలా అన్నాడు. ‘‘అమ్మాయీ! శివుడు పరమ దౌర్భాగ్యమూర్తి కదమ్మా? తెలియక నిన్ను ఇచ్చి పెళ్లి చేశాను. అతనికి గర్వం కూడానూ. నా అల్లుళ్ళతో సాటిగా శుభరూపం కలవాడే కాదు గదా? ఇక అతనిని నేనెలా ఈ యాగానికి పిలుస్తాను? నువ్వు వచ్చావు చాలును. అతను రాకపోతే ఇక్కడేమీ చిన్నపోదు. వాడు పుర్రె పుచ్చుకొని ఇక్కడికి రాకుండా ఉంటేనే మంచిది.’’ అని ఘోరంగా నిందిస్తాడు.
దక్షుడు ఇలా అనగానే తండ్రితో సతీదేవి ఇలా అంది. ‘‘శివుడే దాత. పరమ శివుడు నీ హవిస్సు కాంక్షిస్తున్నాడా? ఆయన్ను విడిచి ఇక్కడ తినిపోదామని వచ్చానా? అజ్ఞానంలో పడి శివద్రోహం చేయవద్దని చెప్పడానికే వచ్చాను. శివుడే దాత. శ్రీ మన్మహా దేవుడే భోక్త. హరుడే శాశ్వతుడు. ఆ శంభుణ్ణి బహిష్కరించి ఏ కార్యం చెయ్యగలం! నీకింత వెర్రితనం ఎలా అబ్బింది? అని ఆమె కన్నులు మూసుకొనగానే ఎడమకాలి బొటన వేలి నుంచి పుట్టిన యోగాగ్ని భగ్గుమంది. బంధువర్గం హా హా కారాలు చేసింది. సతీదేవి వెంట వచ్చిన పారిషదులు వెళ్ళి శివుడికా ఆ ఘోరవార్త విన్నవిస్తారు. భర్గుడు కోపంతో కనుబొమలు ముడివేసినంతలో మహా తేజస్సు పుడుతుంది. అందులోంచి వీరభద్రుడు పుడతాడు. దక్ష యజ్ఞాన్ని నాశనం చేస్తాడు. ఒక్క అర్ధచంద్రబాణంతో యజ్ఞమృగం తల ఆకాశం మీద వేలాడుతుంది. దక్షుడి తల తెగిపడుతుంది. తర్వాత బ్రహ్మాది దేవతలు వేడుకొన్నాక శివుడు కరుణించడంతో వీరభద్రుడు దక్షుడికి మేకతల పెట్టి బ్రతికిస్తాడు.
బ్రహ్మ దేవుడి కుమారుడని, ప్రజాపతిననే గర్వంతో, సతీదేవి మాటలు పెడచెవిని పెట్టి పీకల దాకా తెచ్చుకున్నాడు దక్షుడు. అహంకారిగా, అవమానభారాన్ని సహించలేని మూర్ఖుడిగా, బలాబలాల్ని అంచనా వెయ్యలేని అవివేకిగా దక్షుడు ఈ కావ్యంలో కనిపిస్తాడు. సంప్రదాయాను-సారంగా కన్యనిచ్చి పెళ్ళి చేసిన అల్లుళ్ళను ఎంతో గౌరవంగా చూసుకోవడం ఆడపిల్ల తండ్రిగా దక్షుడి కనీసబాధ్యత. శివుడినే కాకుండా వివిధ సందర్భాల్లో చంద్రుడు మొదలైన వాళ్లను కూడా తూలనాడుతూ దక్షుడు శివకుటుంబిగా చెప్పుకోడానికి తన అర్హతను కూడా కోల్పోయాడు. అహంకారభంగంతో యోగిగా, శివభక్తుడిగా, పరమజ్ఞానిగా తరువాత ప్రశస్తికెక్కాడు.
3. ముగింపు:
కాశీఖండం కావ్యంలోని ప్రధానమైన తండ్రి పాత్రలను తరచిచూస్తే, కథానుగుణంగా ఆయా పాత్రల మనస్తత్త్వాన్ని కవి తీర్చిదిద్దిన విధానం స్పష్టమౌతోంది.
కాశీఖండంలో వివిధ కథల్లో చోటుచేసుకున్న తండ్రిపాత్రలను దైవ, ఋషి, మానవ సంబంధులుగా మూడు రకాలుగా ఉండడాన్ని గమనించవచ్చు. కొన్ని మిశ్రమపాత్రలుగా చెప్పుకోవచ్చును.
తగిన పద్యోదాహరణల బట్టి శ్రీనాథుడు ఉపయోగించిన భాష, అభివ్యక్తికౌశలం అర్థమౌతున్నాయి. ఈ కాశీఖండంలో శ్రీనాథుడు సృష్టించి, వైవిధ్యంగా చిత్రించిన తండ్రిపాత్రలు తదుపరి కావ్యపరంపరలకు ఆదర్శంగా నిలిచాయి.
4. పాదసూచికలు:
- కాశీఖండం, 1వ ఆశ్వా. 7వ పద్యం
- కాశీఖండం, పీఠిక, వావిళ్ళ ప్రతి, పుట.VII
- రెడ్డి సంచిక-1947, పుట. 300
- కాశీఖండం, పీఠిక, వావిళ్ళ ప్రతి, పుట. VII
- కాశీఖండం, 4వ ఆశ్వాసం, 110 వచనం.
- ప్రాచీన కవిత్వంలో వ్యక్తిత్వ వికాసం, పుట. 48
- ఆర్షవిజ్ఞాన విశిష్టత, పుట.27
- ఆర్షవిజ్ఞాన విశిష్టత, పుట.27
- శ్రీనాథుడు, కాశీఖండం, ఆరో ఆశ్వాసం, 5వ పద్యం.
5. ఉపయుక్తగ్రంథసూచి:
- అప్పారావు, వడ్డాది (సంపా.) రెడ్డి సంచిక. ఆంధ్రేతిహాసపరిశోధకమండలి, రాజమహేంద్రవరము, 1947.
- వేంకట సోమయాజులు, రాంభట్ల. ఆర్షవిజ్ఞానవిశిష్టత. ద్వితీయముద్రణ, ఆర్.సి. శాస్త్రి (ప్రకాశకులు), హైదరాబాద్, 2007.
- శరభేశ్వరశర్మ, మల్లంపల్లి (వ్యాఖ్య. మణికర్ణికావ్యాఖ్యానం) రెండుసంపుటాలు, శ్రీనాథుడు. శ్రీకాశీఖండం, శ్రీపొట్టిశ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2012.
- శాస్త్రి, ద్వా.నా. ప్రాచీనకవిత్వంలో వ్యక్తిత్వవికాసం. సూర్యప్రచురణలు, హైదరాబాద్, 2010.
- శ్రీనాథమహాకవి. శ్రీకాశీఖండము. వావిళ్ళ రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్, చెన్నపురి, 1958.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "May-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-April-2025
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "MAY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి
బాధ్యత వహించరు.